‘లేడీస్ టైలర్ ‘ తో ఓ కార్టూనిస్ట్

సీనియర్ కార్టూనిస్టు డా. జయదేవ్ బాబు గారు ‘గ్లాచ్యూ మీచ్యూ ‘ పేరుతో తన ఆత్మ కథను రాసుకున్నారు. అందులో డైరెక్టర్ వంశీ తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు…

స్రవంతీ మూవీస్, చిత్రకల్పన ఆఫీసు నుంచి రెండు వీధులు దాటితే, చాలా దగర్లో వుంది. రవికిషోర్, స్రవంతి మూవీస్ అధినేత. డైరెక్టరు వంశీతో లేడీస్ టైలర్ సినిమా సంకల్పించారు. ఒక పోస్టరు డిజైను చేయడానికి వంశీ నన్ను కలిశారు. హీరోయిను ఫోటో మీద చిన్న చిన్న కార్టూను బొమ్మలు గీయమన్నారు. మన తెలుగు సినిమా అడ్వర్టైజింగులో అది మొట్టమొదటి ప్రయోగం. అలాంటి ఐడియాలు వంశీకే తడతాయి. నా యిష్టమొచ్చిన బొమ్మల్ని గీసి పోస్టరును నింపేయమన్నారు. పోస్టరు బ్లాక్ అండ్ వైటు. నా చిన్ని చిన్ని కార్టూనులు ఆ పొస్టరును ఆకర్షణీయంగా చేశాయి. గోడమీద పోస్టరుని పెట్టి చూస్తే, మరోసారి చూడాలనిపించింది.
పోస్టరు రిలీజయిన మరుసటిరోజు పోస్టరు భలే క్లిక్ ఐందని, స్రవంతి మూవీస్ కి రిపోర్టులందాయి.
స్రవంతి మూవీస్ ఆఫీసులో ఒక చిన్న డిస్కషను రూములో వంశీ, వేమూరి సత్యనారాయణ, రవికిషోర్, తనికెళ్ళ భరణిగార్లు లేడీస్ టైలర్ కథ అల్లారు. డైలాగులు, స్క్రీన్ ప్లేలు రాశారు. ఏ పాత్రకి ఎవరు సరిపోతారో నిర్ణయించారు. ముఖ్యంగా హీరో రాజేంద్రప్రసాదు ఎలాంటి హాస్యభరితమైన డైలాగులు మాట్లాడాలో ఆచితూచి రాశారు. తనికెళ్ళభరణి గారికి ‘జ’ భాష బుర్రలో తట్టింది. డైలాగులు రాస్తూ పోతూవుంటే, ఆయనకి స్పాంటేనియస్ గా తట్టిన ఐడియా అది.

cartoonist Dr. Jayadev Babu with director Vamsee

ఒకరోజు స్టోరీ డిస్కషనులో నేనూ పాల్గొన్నాను. ఆ డిస్కషను వింటే నా ఐడియాలు వస్తాయని కూర్చున్నాను. ఒక పేపరు, పెన్సిలు పెట్టుకుని , పాత్రలని నోట్ చేసుకుంటూ పోయాను. పేపర్లు నిండి పోయాయి. మొదటి చివరి వరకు, ఆ సినిమా కథలో హాస్యం నిండి దొర్లింది.
ఆ రాత్రి స్రవంతి మూవీస్ ఆఫీసులోనే పడుకున్నాను. నా పక్కన తనికెళ్ళభరణి గారు, తను రాసిన డైలాగులు వల్లె వేసుకుంటూ, నవ్వుతూ, నవ్విస్తూ, ‘జ’ భాష అనర్గళంగా మాట్లాడేస్తూ వుంటే, రాత్రి యిట్టే గడిచిపోయింది. తనికెళ్ళ భరణి గారిని నేను కథారచయితగానే కాకుండా ఒక నటుడుగా కూడా చూశాను. ఒక కారెక్టరు యాక్టరుకాగల శక్తిసామర్థ్యాలు ఆయనలో కనిపించాయి. లేడీస్ టైలర్ సినిమాలో ఆయన వేసిన వేషం, (పోలీసు) చిన్నదైనా అద్భుతంగా చేశారు.

తనికెళ్ళ భరణి మాంచి హ్యూమరిస్టు మాత్రమే కాదు, పరమ బోళా హ్యూమరిస్టని కూడా తేలిపోయింది. హ్యూమరు బాగా పగలబడితేగానీ పేలదని తనకి “తొడమీద మచ్చ” ఐడియా ఎలా వచ్చిందో, ఆ ఐడియా సెక్సీగా వున్నా ఎంత పచ్చిగా పేలుతుందో విడమర్చి చెప్పారు. నిజంగా ఆ ఐడియా సినిమాకి ఒక పెద్ద హైలైటుగా తయారైంది. సూపర్ డూపర్ హిట్టయింది.

భరణిగారితో పడి పడీ నవ్వి, తెల్లారే చిత్రకల్పన ఆఫీసుకు వెళ్ళిపోయాను (అక్కడ యానిమేషన్ ప్రాజెక్టు చేస్తున్నాను). తిన్నగా బాత్రూమ్ లోకి నడిచి, నా తొడమీద మచ్చ ఏదైనా వుందా అని వెతికాను.

ఆ రోజు సాయంత్రం స్రవంతీ మూవీస్ ఆఫీసుకు వెళ్తే, అక్కడ భరణిగారు, వంశీగారు జోకులేసుకుని తెగ నవ్వులు నవ్వేస్తున్నారు. అట్లా నవ్వుకుంటూ ఆ సినిమా, డైలాగులు రాశారు గనకనే, “లేడీస్ టైలర్” ఈనాటికి రసరమ్యమైన హ్యూమం హిట్ గా మిగిలిపోయింది. నన్ను చూడగానే, “జయదేవ్ గారూ జతొ జడ జమి జర జమ జచ్చ” వెతికి చూశారు కదూ?” అని మళ్ళీ పగలబడినవ్వారు. నాకు సిగ్గేసి “భలేవారు” అని అక్కడ ఒక సోఫాలో కూలబడ్డాను. “ఈయనెవడయ్యా బాబూ?” అని మనసులో అనుకున్నాను.
వంశీ యిచ్చిన ఐడియాలతో నావీ కలిపి కార్టూన్లు పోస్టర్లు తయారయ్యాయి. అవి వాడవాడలా, గోడగోడలా జనాల్ని ఆకర్షించాయి. సినిమా డబల్ హిట్టవడానికి కారణం, ఆ కార్టూన్ పోస్టర్లే. వాటికి స్ఫూర్తి తనికెళ్ళ భరణిగారేనని ప్రత్యేకంగా చెప్పనఖ్ఖర్లేదు.
-డా. జయదేవ్ బాబు, కార్టూనిస్ట్

SA: