క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

పుట్టింది, పెరిగింది ఒడిశా రాష్ట్రం రాయగడలో డిశంబర్ 25 న 1963లో. చదువు కొంత ఒడిశాలోని.. కొంత ఆంధ్రాలోని వెలగబెట్టాను. నా కార్టూన్ ప్రస్థావనం 1978లో మొదలయ్యింది.
రాయగడ (ఒడిశా) నుంచి రచయిత, కవి, విమర్శకులు, రంగస్థల నటులు అయిన జీఆర్ఎన్ టాగూర్ గారు సంపాదకీయంలో వెలువడే ‘గండ్ర గొడ్డలి’ అనే తెలుగు మాసపత్రికను ప్రచురణ జరిగింది. ఆంధ్రా నుంచి వెలువడే తెలుగు పత్రికల్లో అయితే నా మొదటి కార్టూను 1980లో ప్రగతి, విశాలాంధ్ర ఏ దినపత్రికలో వచ్చిందో గుర్తులేదు. అప్పట్లో మా నాన్నగారు ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ వారపత్రికలు తెప్పించే వారు వాటిలో బాపు, బాబు, జయదేవ్, శ్రీనివాస్, శశిధర్ వంటి కార్టూనిస్టుల కార్టూన్లు చూస్తూ కార్టూన్ బొమ్మలు వెయ్యాలనే ఆలోచన పుట్టింది. కనిపించిన ప్రతీ కాగితం, పలక మీద పిచ్చి పిచ్చి బొమ్మలు గీసేస్తుండే వాడ్ని.

1980లో మొదటి సారిగా స్వాతి మాసపత్రికకు కొన్ని కార్టూన్లు గీసి పంపించాను అవి స్వాతి బలరాం గారు చెత్తబుట్టలో పడేస్తుంటే అప్పుడు ఆయనతో పాటు మాట్లాడుతున్న ఆర్వీ సుబ్బారావుగారు (ఈయన అప్పట్లో ప్రగతి, విశాలాంధ్రలోనో ఫ్రూప్ రీడర్గా పనిచేసేవారు సరిగా గుర్తు లేదు) ఆయన వాటిని బలరాం గారి అనుమతితో తీసుకుని కార్టూన్ అంటే ఎలా వుండాలి, ఏ పేపర్ మీద వేయాలి, ఏ ఇంకుతో వెయ్యాలో వివరిస్తూ మంచి కార్టూన్లు గీసి తనకు పంపించమని నా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాకో లెటర్ రాసారు. ఆయన రాసిన లెటర్ నాలో వెయ్యి టన్నుల ఉత్సాహాన్ని నింపింది. ఒక విధంగా ఆయనే నా గురువు. ఆయన రాసిన లెటర్ చూసిన మా నాన్నగారు కూడా నన్ను ప్రోత్సహించారు వెంటనే కార్టూన్లు గియ్యడానికి కావల్సిన మెటీరియల్ అంతా సమకూర్చుకుని ఓ ఆరడజను కార్టూన్లు గీసి ఆయనకి పంపించడం ఆయన ద్వారా వాటిలో మూడు కార్టూన్లు ప్రగతి, విశాలాంధ్రాలోనో ప్రచురణ జరిగాయి (బహుసా ప్రగతే అనుకుంటా సరిగా గుర్తు లేదు). అది మొదలు పత్రికలపై కార్టూన్లతో గజినీలా దండయాత్ర మొదల పెట్టా. మొదట్లో పెద్దగా ప్రోత్సాహం లేకపోయినా తర్వాత తర్వాత అన్ని తెలుగు పత్రికలో అడపా దడపా నా కార్టూన్లు ప్రచురిస్తూ ప్రోత్సహించాయనే చెప్పాలి. అయితే 1987లో ఆంధ్రజ్యోతి తిరుపతి ఎడిషన్లో దేవీప్రియ గారి రన్నింగ్ కామెంట్రీ ఛల్తే.. ఛల్తేకు పాకెట్ కార్టూనుతో పత్రికా ప్రవేశం చేసాను.

Jenna cartoons

విజయవాడ నుంచి ఈవీఆర్ గారు, హైదరాబాద్ నుంచి శ్యామ్ మోహన్ గారు దేవీప్రియ గారి రన్నింగ్ కామెంట్రీకి పాకెట్ కార్టూన్లు వేసే వాళ్లం. అప్పటి నుంచి నేను విశాఖలో ఆంధ్రజ్యోతి మినీ ఎడిషన్లో రాజకీయ కార్టూన్లు గీస్తునే విశాఖ నుంచి భాను, ఆంధ్రవాయిస్, సూర్యప్రభ, నేడు, ఈ రోజు వంటి సాయంకాలం దినపత్రికలకు, పాకెట్ కార్టూన్లు వేయడం ప్రారంభించాను. ఏకకాలంలో మూడు దినపత్రికలకు పాకెట్ కార్టూన్ గీసిన ఏకైక కార్టూనిస్ట్ నేనే అనుకుంటా. అంతే కాదు తెలుగు పత్రికల్లో అత్యధికంగా క్యాప్సన్ లెస్ కార్టూన్లు గీసింది కూడా నేనే, అలాగే 1997లో అనుకుంటా మయూరి వారపత్రికలో మొట్టమొదటి క్యాప్షన్ లెస్ కార్టూన్ సీరియల్ 6వారాల పాటు గీసా, అలాగే వైజాగ్ నుంచి వెలువడే కిడ్స్ అనే ఆంగ్ల మాసపత్రికలో విక్కీ, నిక్కీ అనే క్యాప్షన్ లెస్ కార్టూన్ స్ట్రిప్ రెండేళ్ల పాటు గీసా, అలాగే విజయభానులో జెన్నాస్ జిమ్మిక్స్ సూర్యప్రభలో జనాంతికం అనే డైలీ క్యాప్షన్ లెస్ కార్టూను శీర్షికలు రెండు, మూడేళ్లు నిర్వహించాను.

Jenna Corona Vaccin cartoon

చాలా తెలుగు పత్రికల్లో నిర్వహించే కార్టూన్ల పోటీలో బహుమతులు గెలుచుకోవడంతో పాటు, పలు ఆంగ్ల పత్రికలు, ఇంటర్నేషనల్ కార్టూన్ మ్యాగజైన్లో కూడా నా కార్టూన్లు ప్రచురణ జరగడం, ప్రశంసా పత్రాలు అందుకున్నాయి. అన్ని తెలుగు దిన, వార, మాసపత్రికల్లో ఎన్ని వేల కార్టూన్లు వేసానో గుర్తు లేదు. విశాఖ నుంచి వెలువడే కోకిల మాసపత్రిక వారు వారి వార్షిక పత్రికతో పాటు ‘జెన్నాస్ జిమ్మిక్స్‘ అని 50 క్యాప్షన్ లెస్ కార్టూన్లతో ఒక పుస్తకం వేసి పాఠకులకు ఉచితంగా అందించిన వారికి ఎప్పుడూ రుణ పడే వుంటాను. అలాగే 1997, 98 మధ్య కాలంలో గీతా సుబ్బారావు గారు (గీతా పేరిట కార్టూన్లు వేసే సీనియర్ కార్టూనిస్ట్, కాలమిస్ట్) ఆంధ్రజ్యోతి వారపత్రికలో పలువురు సీనియర్ కార్టూనిస్టులు, బాపు, బాబు, జయదేవ్ వంటి వారిపై రాసిన వ్యాసంలో విశాఖలో మినీ కార్టూన్ ఇండస్ట్రీ నడుపుతున్న జెన్నా అని నా గురించి ఆ వ్యాసంలో ప్రస్తావించడమే నాకు పెద్ద ప్రశంన. వారితో పాటు నా కార్టూన్లు ప్రచురించిన ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు.

-జెన్నా

Jenna Police station cartoon
Jenna Caption less cartoon
Jenna Isolation cartoon

6 thoughts on “క్యాప్సన్ లెస్ కార్టూన్లు ఎక్కువ గీసాను-జెన్నా

  1. రాయగడలో పరిచయం అయిన మిత్రులు జెన్నా గారికి అభినందనలు! చక్కటి లైన్ తో అద్భుతమైన ఐడియాలతో మంచి కార్టూన్లు‌వేస్తున్నారు.
    Best wishes.
    చక్కటి పరిచయం అందించిన 64కళలు.కామ్ కళాసాగర్ గారికి ధన్యవాదాలు

  2. జెన్నా గారు మీ అనుభవాలు బాగున్నాయి.మీ కార్టూన్లు చాలా బాగుంటాయి.

  3. జెన్నా గారి పరిచయం ఆసక్తికరంగా ఉంది. మంచి లైనింగ్, పంచ్ ఉన్న కార్టూన్లు వేయడం లో జెన్నా గారు నిష్ణాతులు. ఇటీవలికాలంలో, అనేక కార్టూన్ల పోటీలలో వరుసగా బహుమతులు గెలుస్తూ, తోటి కార్టూనిస్టులకు మంచి స్ఫూర్తి నిస్తున్నారు. వారికి నాఅభినందనలు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link