1966వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కలిమికొండ బసవయ్య-దేవకమ్మల ఐదవ సంతానంగా జన్మించిన నా పూర్తి పేరు కలిమికొండ సాంబశివరావు. ‘కలిమిశ్రీ ‘ నా కలం పేరు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలోనే హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న నేను గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చేశాను. హైస్కూలు స్థాయిలోనే సాహిత్యంపై ఆసక్తి కలిగింది. పదవ తరగతి చదువుతుండగానే తొలి కవితకు, తొలి కార్టూన్‌కు శ్రీకారం చుట్టాను. అప్పటిలో కవులందరికీ ఓ కలం పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వుండేది. ఆ వరుసలోనే కలిమికొండ సాంబశివరావునైన నాకు ‘కలిమిశ్రీ’గా నామకరణం చేశారు, మా గురుతుల్యులు రాపోలు పరమేశ్వరరావు గారు. అప్పటి నుండి ఆ పేరుతోనే నేను పిలవబడుతూ, గుర్తింపు పొందాను.
ఇప్పివరకూ నేను దాదాపు 5000 కార్టూన్లు గీశాను. ఇంకా కవితలు, కొన్ని కథలు, అనేక వ్యాసాలు, 150కి పైగా సంపాదకీయాలు రాశాను. నా తొలి కార్టూన్ 1983లో ఆంధ్రప్రభలో అచ్చయింది. ఆ తర్వాత ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, విజయ, యువ, ఆంధ్రభూమి, ఆదివారం, మయూరి, పల్లకి, స్రవంతి, క్రోక్విల్ హాస్యప్రియ వంటి పలు పత్రికల్లో అచ్చయ్యాయి.
1988లో ఆంధ్రపత్రికతో మొదలైంది నా పత్రికారంగ జీవితం…అటు తర్వాత ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, విద్య, ధ్యానమాలిక, సహస్రార, వందేగోమాతరం, మహోదయ,రేపటికోసం పత్రికలకు సంపాదకునిగా పనిచేశాను. జ్యోతిచిత్ర సినిమా పత్రికకోసం అక్కినేని నాగేశ్వరరావు మొదలు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను.
సంపాదకుడిగా: నా భార్య ప్రచురణకర్తగా వ్యవహరిస్తున్న ‘నవమల్లెతీగ’ సాహిత్య మాసపత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్నాను.
ఉత్తమ జర్నలిస్టుగా 2008 ఆగస్టు నెలలో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి గారిచే సత్కారం పొందాను. 2018లో సాహిత్యసేవా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి చేతులమీదుగా అందుకున్నాను.
కార్టూనిస్టుగా: ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ శీర్షికలకు వ్యాసాలకు కార్టూన్లు గీశాను. ప్రజాశక్తి దినపత్రికలో రెండు సంవత్సరాలపాటు పాకెట్ కార్టూన్లు గీశాను.
మల్లెతీగ పురస్కార వ్యవస్థాపకుడిగా: మంచి సాహిత్యాన్ని రికార్డు చేయాలన్న సత్సంకల్పంతో ‘మల్లెతీగ’ పురస్కారాన్ని నెలకొల్పి గత ఎనిమిది సంవత్సరాలుగా మల్లెతీగ పురస్కారాన్ని కవులకు ఇస్తున్నాను. ‘మల్లెతీగ’ మాసపత్రిక ద్వారా గత పన్నెండేళ్ళుగా కార్టూన్లపోటీలు నిర్వహిస్తూ కార్టూనిస్టులతో మమేకమై వున్నాను.
మల్లెతీగ ముద్రణల రూపశిల్పిగా: ‘మల్లెతీగ ముద్రణలు’ పేరుతో సాహిత్య పుస్తకాలు అచ్చేస్తున్నాను. కవులకు సరసమైన ధరలకు వారి సాహిత్యాన్ని పుస్తకంగా రూపొందించి వారికి అందజేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 350 సాహిత్య పుస్తకాలు అచ్చేశాను.
వివిధ సంఘాలకు సారధ్యం: తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా, మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ అధ్యక్షుడిగా, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సిటీ కమిటి అధ్యక్షుడిగా ప్రస్తుతం సేవలందిస్తున్నాను.
-కలిమిశ్రీ
కలిమిశ్రీ గారికి హార్దిక అభినందనలు…
కలిమిశ్రీ కి శుభాకాంక్షలు
మిత్రుడు కలిమిశ్రీ పరిచయం చాలా బావుంది.
మిత్రులు కమిటీ శ్రీ గారు మీ పరిచయం చాలా బాగుంది …మీకు శుభాకాంక్షలు
కార్టూనిస్టుగా, మల్లెతీగ సంపాదకుడిగా కలిమిశ్రీ గారి సాహిత్యసేవ గురించి పరిచయం బాగుంది. కలిమిశ్రీ గార్కి శుభాకాంక్షలు. పరిచయం అందించిన 64 కళలకు థాంక్స్. –బొమ్మన్