సృజనశీలి, కార్టూనిస్ట్, ప్రగతిశీల భావాలు కల్గిన కరుణాకర్ 52 వయసులో జూలై 18 న ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. నేను ప్రచురించబోయే ‘కొంటె బొమ్మల బ్రహ్మలు ‘ పుస్తకం కోసం పదిహేనురోజుల క్రితమే వారితో మాట్లాడాను. నాకు వివరాలన్నే అందజేసి ‘నన్ను కూడా ఈ కార్టూన్ పుస్తకంలో చేర్చినందుకు చాలా సంతోషంగా వుంది ‘ అన్నారు.
కరుణాకర్ యెనికపాటి పుట్టింది 1969 అక్టోబర్ 23 న ప్రకాశం జిల్లా, కొప్పెరపాడు అనే చిన్న గ్రామంలో. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఎం.ఏ., బి.ఈడి. చేశారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంగమూరులో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తండ్రి భాస్కరరావు ఉపాధ్యాయుడు, తల్లి ఈశ్వరమ్మ గృహిణి. చిన్నప్పటినుండి బొమ్మలు గీయడం అంటే ఇష్టం వుండేది. వీరు దివ్యాంగులు. వీరి చిన్నప్పుడు పోలీయో చికిత్సలో భాగంగా గోవాలో హాస్పిటల్లో ఎలా పడుకుని ఉన్నారో వివరిస్తూ వారు రాసిన ఉత్తరంలో వేసిన బొమ్మ అందరి మెప్పును పొందింది ఆరొజుల్లో. ఆ తర్వాత వీరి మామయ్య గారు టీవీ గారు నడిపే చిత్రసూత్ర పోస్టల్ కోచింగ్ లో చేర్పించారు. అలా పరోక్షంగా టీవీ గారి శిష్యుడయ్యారు. వీరి పంతొమ్మిదో ఏట వీరి మొదటి కార్టూన్ 1987 సంవత్సరం ‘నవతరం’ అనే డి.ఐ.ఎఫ్.ఐ. మాసపత్రికలో అచ్చయ్యింది. అప్పటి నుండి కరుణ కలం పేరుతో కార్టూన్లు గీయడం ప్రారంభించారు.
ఆ తర్వాత కొన్నాళ్ళు విశాలాంద్ర ఆదివారం సంచికలో, ప్రజాశక్తి పత్రికలలో పొలిటికల్ కార్టూన్లు గీశారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఉదయం, ఆంద్రపత్రిక, విపుల, ఆహ్వానం, రచన లాంటి పత్రికలలో కార్టూన్లు గీశారు. ఇంటర్నెట్ పరిచయం అయిన తరువాత అనేక అంతర్జాతీయ కార్టూన్ ప్రదర్శనలలో పాల్గొనడం పాల్గొన్నారు. 2006 సంవత్సరంలో ఇండియన్ ఇంక్.ఆర్గ్ మరియు సత్యం ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కార్టూన్ల పోటీలో అత్యుత్తమ కార్టూన్ బహుమతిని అందుకున్నారు. అనేక పిల్లల కథల పుస్తకాలకి ఇలస్త్రేషన్ లు వేశారు. చినుకు, మాతృక, అరుణతార వంటి పత్రికలకు కవర్ పేజీలు ఇలస్త్రేషన్ లు వేశారు. కార్టూన్లు నవ్వించడమే కాక అలోచింపజేయాలని భావించే వీరికి చిత్తప్రసాద్, మోహన్, సురేంద్ర, సతీష్ ఆచార్యలు అంటే ఇష్టం.
పిల్లలలో సృజనాత్మక భావాలుగల పౌరులుగా తీర్చిదిద్దేందుకు నిత్యం శ్రమించేవారు. వారికి చిత్రకళ, రచనలు చేయడం లో శిక్షణ ఇచ్చేవారు.
కరుణాకర్ గారి అకాల మృతికి 64కళలు.కాం నివాళులు అర్పిస్తుంది.
-కళాసాగర్
………………………………………………………………………………………………………………………..
చదువు మీద ఆసక్తి కలగాలంటే క్లాసు రూమ్ లు బాగుండాలి. ఏపీ ప్రభుత్వం బడులను బాగు చేయడం గొప్ప మార్పు. పిల్లల భవిష్యత్ కి ఢోకా లేదు అని ఒక సారి సంతోషంగా అన్నారు.
అలా తయారైన క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పకుండానే మనకు దూరమయ్యారు.
జీవిత మంతా సమాజ హితం కోసం పనిచేసిన కరుణాకర్ లాంటి కార్టూనిస్టుని ఏపీ ప్రభుత్వం గౌరవించడం సామాజిక అవసరం.
మనసున్న సలహాదారులు ఎవరైనా ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్పి మరణానంతరం ఇచ్చే అవార్డును ఆయనకు ప్రకటిస్తే సమాజం హర్షిస్తుంది. ఒక కుటుంబం నిలబడుతుంది.
–శ్యాం మోహన్,
రూరల్ మీడియా
వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ🙏🙏🙏
నాకు ఆత్మీయుడు కావడం గర్వకారణం
వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఓం శాంతి