
కొంతమంది వే(గీ)సిన కార్టూన్లన్నీ ఓ ‘బొత్తి’గా, ఓ ‘పొత్తం’గా వస్తే బావుంటుందని, కొందరు కార్టూనిస్టుల విషయంలో సరదా పడతాం, ఉవ్విళ్ళూరతాం!
అది వారి ప్రతిభకీ, మన అభిరుచి (!)కీ అద్దం పడుతుంది. అలా నేను అభిరుచితో ఆశపడ్డ కార్టూనిస్టుల్లో ‘కృష్ణ’ ఒకడు. నేనే కాదు నాలా ఎంతో మంది ఆశపడివుంటారు కూడా. మన కోరిక “జయదేవ్ రాజలక్ష్మి కార్టూన్ అకాడెమీ” ద్వారా తీరింది. వారు ప్రతీ ఏటా ఎన్నుకునే కార్టూనిస్టులలో అదృష్టం ఈ సంవత్సరం కృష్ణను వరించింది.
ప్రసిద్ధ చిత్రకారులు, ప్రఖ్యాత చలన చిత్రకారులు, జీవితమంతా చిత్రకళకీ, చలన చిత్రకళకీ అంకితం చేసిన కళాతపస్వి శ్రీబాపుగారికి కృష్ణ ఆప్తుడు. అంతే కాదు, బాంధవ్యం కలవాడు.
‘కార్టూన్’ ని ‘కళ’గా ఎలా అభ్యసించాలో, ఆరాధించాలో సాక్ష్యాత్తూ బాపు గారి నుంచే మెళకువలు నేర్చుకున్న అదృష్టవంతుడు. బాపుగారు కృష్ణకి అతని భవిష్యత్ గురించి వ్యక్తిగత సూచనలు ఇస్తూ… కార్టూన్లు గీసే ప్రక్రియకి సంబంధించి సలహాలు ఇస్తూ రాసిన లేఖలు చూసినపుడు (అతను చూపించలేదు… చూపించడు… బొత్తిగా మొహమాటస్తుడు కదా… తన కార్టూన్లయినా చూపిస్తున్నాడు… సంతోషం), బాపు గారికి కృష్ణ పట్ల ఎంత వాత్సల్యమో అర్థం చేసుకున్నాను. ఆ లేఖల్ని కృష్ణ తన జీవిత కాలపు అమూల్య జ్ఞాపకాలుగా భద్రంగా దాచుకునే ఉంటాడు…
ఇంగువ కట్టిన గుడ్డ కదా!
సెన్సాఫ్ హ్యూమర్ పరిమళం అబ్బింది… తెలుగుదనం అబ్బింది… స్వయంకృషి అబ్బింది… ఆ మేలు కలయిక అతని కార్టూన్లలో మనకి గిలిగింతలు పెడుతుంది.
ఒరిజినల్ థాట్, కీన్ అబ్జర్వేషన్ అతని సొంతం! నేటివిటీ, సహజత్వం అతని ఎస్సెట్స్! క్లుప్తత, స్పష్టత అతని కార్టూనిజం!
బహుశా అతను కిలకిలా నవ్వుకుంటూనే కార్టూన్ గీస్తాడు అనుకుంటాను… గీసాక, ముసిముసిగా నవ్వుకుంటాడనుకుంటా… మనం చూసి నవ్వుకుంటుంటే మళ్ళీ గలగల నవ్వుతాడు… ఆ నవ్వుని చూసి మనం మళ్ళీ ఫెళ్ళున నవ్వుకుంటాం…!
నవ్వు అతని సంతకం… నవ్వించటం (కార్టూన్స్ లో) అతని వ్యసనం..!!
మిత భాషి, అమిత ‘హాసి’ (అతిగా అని కాదు.. ‘ఎక్కువగా నవ్వేవాడు’ అని అర్థం అనుకుంటా), నిత్య దరహాసి, మనోల్లాసి మన కృష్ణ…!!
లబ్ధ ప్రతిష్టులైన శ్రీజయదేవ్ గారు కార్టూనిస్టులెందరికో గురుతుల్యులు… కాదు గురువే! జయదేవ్ గారి ప్రోత్సాహాన్ని, అభినందల్ని, ఆశీసుల్ని పొందిన కృష్ణ ధన్యుడు!!
కృష్ణ కార్టూన్లన్నీ ఒక చోట చేరి నవ్వుల సందడి చేయబోతున్నాయి… మనందరికీ నవ్వుల విందు చేయబోతున్నాయి…
మరిక ఆలష్యం ఎందుకూ మీరూ ‘కృష్ణ కార్టూన్లు’ సంకలనాన్ని కొనుక్కొని నవ్వుకోండి.!
ఈ పుస్తకంలో వున్న ‘రెండొందల కార్టూన్లు’… మీకు మిమ్మల్ని నవ్విస్తాయని నేను వంద శాతం మీకు హామీ ఇస్తున్నాను.
–డా. సుదర్శన్
పేజీలు : 110 వెల: రూ. 150/-
ప్రతులకు: వి. కృష్ణ కిషోర్ (92471 92410)
Thank you so much kalasagar garu..