నన్ను ప్రోత్సహించింది చలసాని గారు – ‘మౌంట్ క్రిస్టో’

‘మౌంట్ క్రిస్టో’ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా అసలు పేరు చింతలచెరువు శ్రీనివాస్. పుట్టింది నెల్లూరుజిల్లాలోనే అయినా నాన్నగారి ఉద్యోగరీత్యా దాదాపు ప్రాధమిక విద్యాభ్యాసమంతా సికింద్రాబాద్-నల్గొండలలో సాగింది. కలం పేరు ‘మౌంట్ క్రిస్టో’ వెనుక చిన్నకారణం నన్ను విపరీతంగా ప్రభావితం చేయడమే. నెల్లూరుజిల్లా ఇందుకురుపేట- ఎం.కె.ఆర్. హైస్కూల్లో తొమ్మిదోతరగతి చదివే రోజుల్లో చదివిన ఆ నవల నాకు విపరీతంగా నచ్చేసింది. అసలు ఆ నవల పేరు కొంతమందికైనా తెలియాలనే ఉద్దేశంతోనే నేనీ రచనా వ్యాసంగాన్ని ఎన్నుకుని- ఆ కలం పేరు పెట్టుకున్న విషయం నాకు మాత్రమే తెలుసు. మరి ఆ ఉద్దేశం నెలవేరిందో లేదో అది పాఠకులే చెప్పాలి.
ఇక రచనా వ్యాసంగం ఎలా ప్రారంభమైందనే విషయానికొస్తే ఊహ తెలిసిందగ్గర్నుండీ పత్రికలతో సావాసం చేయడమే ఒక కారణమని నా నమ్మకం. అయిదారేళ్ల వయసులో అక్షరాలు కూడబలుక్కుని చదివే సమయానికి మా ఇంట్లో ఉన్న పత్రికలు-యువ, ఆంధ్రప్రభ, చందమామ, వాణి ఇంకా చాలా వుండేవి (కొన్ని పేర్లు గుర్తులేవు) అన్నిటితో పరిచయం ఏర్పడింది. మెల్లమెల్లగా కార్టూన్లు, కథలూ సీరియళ్ళు ఫాలో కావడం మొదలెట్టి ఆ తర్వాత అవే నా ప్రపంచంగా మార్చుకున్నాను.
అవి చూస్తూ చూస్తూ- ఎనిమిదో తరగతిలో కార్టూన్ వేయాలన్న కోరిక కలిగింది. బొమ్మలు దేనితో గీయాలో, ఏ పేపర్ మీద గీయాలో కూడా తెలియకపోయినా ధైర్యం చేసి పెన్సిల్ తో కొన్ని కార్టూన్లు గీసి ‘బాల’ పత్రికకి పంపాను. బొమ్మల కోసం ‘యువ’ పత్రికల్లోని శ్రీ ‘జయదేవ్’ గారి బొమ్మల్ని మక్కికి మక్కి కాపీ కొట్టి పంపాను. ఆ కార్టూన్లు ఏమై వుంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. ఆ కార్టూన్లు పడతాయోమోనని ఎదురుచూసీ చూసీ కళ్ళు కాయలు కాచాయిగాని, కార్టూన్ ని అచ్చులో చూసుకునే అదృష్టం కలగలేదు. అలా మొదలైన నా ప్రస్తానం అక్కడితో ఆగిపోయింది. (అంటే 1975 నుండి 1981 వరకూ) నేను మళ్ళీ వాటి జోలికి వెళ్లలేదు.
అప్పుడు (అంటే 1981 జూలైలో) జరిగిన ఒక సంఘటన నన్ను కార్టూన్ రంగంలోకి నెట్టింది. నేను కాలేజీలో వుండగా నా ఎడమకాలికి పెద్దగాయం అవడంతో కాస్త మేజర్ ఆపరేషన్ లాంటిదే జరగడం- ఆ కారణంగా దాదాపు మూడు నెలలు నేను పడకకే పరిమితం కావడం జరిగింది. ఆ తీరిక సమయంలో నాకు మళ్ళీ మరచిపోయిన ‘కార్టూన్లు’ గుర్తొచ్చి. మెల్లగా మొదలెట్టాను. నాకున్న ఒక మిత్రుడి కారణంగా కార్టూన్ గురించీ. అవి ‘ఇండియన్ ఇంక్’తో క్రోక్విల్ తో వేయాలని కాస్త అవగాహన వచ్చింది. అలా మొదలెట్టి నాకు తెలిసిన అన్ని పత్రికల మీద దాడి చేసినా- నా తొలి కార్టూన్ పడేసరికి దాదాపు సంవత్సరం పట్టింది.
తొలికార్టూన్ ఆంధ్ర సచిత్రవారపత్రిక 4-6-1982లో పడింది. కాని నాకు ఆ విషయం తెలియని నేను ఆగస్ట్ ‘1982-విపుల పత్రికలో పడినా నా కార్టూన్ నా తొలికార్టూన్ అని అనుకున్నాను. అది నా రెండవ కార్టూన్ అని ఆ తర్వాత తెలిసింది. నన్ను ఓ కార్టూనిస్టుగా ప్రోత్సహించి, నెలబెట్టి ఈ కాస్త స్థాయికైనా తీసుకొచ్చింది మాత్రం-గౌరవనీయులు ‘విపుల’ సంపాదకులు (అప్పటి) క్రీ|| శే|| శ్రీ చలసాని ప్రసాదరావుగారు. వారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేను.
అలా మొదలెట్టిన నా ఈ ప్రస్థానంలో ఇప్పటికీ దాదాపు ఎనిమిది వేల కార్టూన్లు గీయగలిగాను. మధ్యమధ్యలో కామాలు పెట్టినా నేటికీ కొనసాగిస్తూన్నాను.
చదువు- హైదరాబాద్ జే.ఎన్.టి.యూలో- బి.టెక్, ఎం.టెక్ చేశాను. ప్రస్తుతం డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ఎ.పి. పర్యాటకశాఖ, నెల్లూరులో డిప్యూటేషన్ మీద మాతృశాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖ. బహుమతులు వివరాలు : ఆంధ్రప్రభ (1986), ఆంధ్రభూమి (1990) ఆంధ్రభూమి వీక్లీ (2014) ప్రధమ బహుమతిని స్వాతి, బాలజ్యోతి, నది,
జాగృతి, హాస్యానందం, ఆంధ్రప్రదేశ్, గో తెలుగు, ఆంధ్రజ్యోతి, చేయూత పౌండేషన్ వగైరాలలో సమారు 40కి పైగా బహుమతులు పొందాను.
నా భార్య శ్రీమతి ప్రమీల గృహిణి, ఇద్దరు కుమార్తెలు. ఇదరూ డాక్టర్లే. పెద్దకుమార్తె (డా. లక్ష్మీమనోజ్ఞ) వివాహమై అమెరికాలోని కొలంబియాలో కేన్సర్ స్పెషలిస్టుగా, అల్లుడు వంశీకృష్ణ కూడా అక్కడే వైద్యుడిగా (నెఫ్రాలజిస్టు). చిన్న కుమార్తె (డా. నాగప్రణీత) ఎం.బి.బి.యస్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. శ్రీమతి ప్రమీల గృహిణి. మర్చిపోయిన ఈ విషయాలన్నిటికీ మరోసారి గుర్తుచేసుకుని మీతో పంచుకొనే అవకాశం కలిగించిన మిత్రులు 64 కళల.కామ్ శ్రీ కళాసాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మీ – మౌంట్ క్రిస్టో

3 thoughts on “నన్ను ప్రోత్సహించింది చలసాని గారు – ‘మౌంట్ క్రిస్టో’

  1. mount chrishto గారి పరిచయం ద్వారా వారి గురించి తెలుసుకున్నాను. సంతోషం. వారి కార్టూనులు బావుంటాయి.

  2. HEARATLY CONGRATULATIONS and Wishing u very HAPPY NEW YEAR.. …Mount christo garu..I learnt somuch about mitrama ..ur lining and caption are very good.. I like very much ur cartoons..All the best..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap