సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ

ఐదు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న ఎం.ఎస్.రామకృష్ణ గారు ఈ రోజు(19-12-20) ఉదయం కేన్సర్ వ్యాధితో హైదరాబాద్లో కన్నుమూసారు.

ప్రముఖకవి శ్రీమునగపాటి విశ్వనాథ శాస్త్రి-విశాలక్ష్మి దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించిన ‘రామకృష్ణ’ పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ, స్వస్థలం తెనాలి తాలూకా ప్యాపర్రు. విద్యాభ్యాసం ఇంటూరు, బాపట్ల హైస్కూళ్ళలో, గుంటూరు హిందూ కాలేజి హైస్కూలు, బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ ఆండ్ సైన్సెస్, ఉస్మానియా యూనివర్సిటీల్లో. తదుపరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (హైదరాబాదు) ఉద్యోగంలో చేరారు. నాన్నగారి వద్ద నేర్చుకున్న పద్యకవిత్వం వంటపట్టించుకుని, స్కూలు-కాలేజీ రోజుల్లో వున్న నాటకాల అనుభవానికి పదునుపెట్టుకుంటున్న తనకు సడెన్‌గా ‘బాపు కార్టూన్’ అనే బగ్ కుట్టింది. అప్పట్లో యువ, జ్యోతి మాసపత్రికలు, ఆంధ్రపత్రిక వగైరాలలో బాపు గారు వేసే బాణసంచాల్లాంటి కార్టూన్లు, ఆ బొమ్మల్లోని హావభావాలు, నవ్వించి కవ్వించే డైలాగులు తను కార్టూన్ రంగంలో అడుగుపెట్టడానికి పెద్ద స్ఫూర్తిగా నిలిచాయంటారు రామకృష్ణ.

MS Ramakrishna

దేశంలో చాలామంది చదువురానివారు. వచ్చినవాళ్ళల్లో చాలామందికి చదవటానికి బద్దకం. ఈ రెండు వర్గాలకీ పనికొచ్చేది కార్టూన్! ఈ కార్టూన్ అనే సాధనం ద్వారా, ఒక విషయంమీద లేదా వ్యవస్థమీద మనకుండే అసహనాన్నీ, ఏవగింపునీ పాఠకుడికి ఇఫెక్టివ్ గా చెప్పొచ్చు. అయితే, కార్టూనింగ్ చాలా క్లిష్టమైన కళ. కార్టూనిస్టు ఎందరో కళాకారుల సమ్మేళనం. ఓ విమర్శకుడు, రచయిత, ఫోటోగ్రాఫర్, నటుడు, మేకప్ మాన్, చిత్రకారుడు, … ఇందరి కలయికే కార్టూనిస్ట్! ఈ ఆలోచనలతో కార్టూన్ రంగంలో అడుగుపెట్టిన రామకృష్ణకు, 1968లో ఆంధ్రప్రభ వీక్లీ ‘లోకోక్తి చిత్రిక’ కార్టూన్ పోటీకి గీసిన తన మొట్టమొదటి కార్టూన్ తెచ్చిపెట్టిన ప్రధమ బహుమతి ప్రోత్సాహం, ఉత్సాహంగా మారి నాటినుంచి దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోను, ఇంగ్లీషు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ పత్రికల్లోను కార్టూన్లు వేశారు. ముఖ్యంగా, ఇంగ్లీష్ పత్రికలు ‘కారవాన్’, ‘విమెన్స్ ఎరా’లలో తను ఓ దశాబ్దం పైగా గీసిన ‘హబ్బీ’, ‘రజిత’ ఫుల్ పే కలర్ కార్టూన్ ఫీచర్లు, శంకర్స్ వీక్లీ కార్టూన్లు తనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అలా ఇంగ్లీషులో శంకర్స్ వీక్లీ, కారవాన్, విమెన్స్ ఎరా, వైజ్ క్రాక్, సన్, స డే, భవన్స్ జర్నల్, యూ టైమ్స్, న్యూమ్, సైబర్‌హుడ్, వగైరా ప్రముఖ పత్రికలకు గీసే అవకాశం కలిగింది. ప్రఖ్యాత కార్టూనిస్ట్ అబూ అబ్రహామ్ ఎడిట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా సర్కులేట్ అయిన పెంగ్విన్ బుక్ ‘ది ఇండియన్ కార్టూన్స్’లో దేశంలోని ప్రముఖ కార్టూనిస్టుల సరసన ఆంధ్రప్రదేశ్ నుంచి రామకృష్ణకు ఒకింత చోటు దొరికింది. నేటి సామాజిక స్థితిగతులకు వేమన పద్యాలను జోడిస్తూ నాగార్జున ఫైనాన్స్వరి సౌజన్యంతో స్వాతి, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో ఏడాది పైగా వేసిన ‘మీకోసం’ కార్టూన్లు ఎంతో పాపులర్ అయ్యాయప్పట్లో ! తరువాత ఎన్.ఎఫ్. వారే ఆ కార్టూన్లను పుస్తకరూపంలో ప్రచురించారు. తెలుగు వారపత్రికల్లో ‘మిసెస్ అవతారం’, ‘గొడుగు’, ‘సింగినాదం’, వగైరా కామిక్ స్ట్రిప్స్, కొన్ని బొమ్మలకథలూ, ఆంధ్రభూమి దినపత్రిక్కి ఫ్రంట్ పేజ్ లో రెగ్యులర్ పాకెట్ కార్టూన్లు వేశారు. కేవలం నవ్వించే కార్టూన్లేకాక, సమాజంలోని అన్యాయాల్నీ, అక్రమాల్నీ, అవకతవకల్నీ వ్యంగ్యంగా ఎత్తిచూపుతూ ఛెళ్ళుమనిపించే కార్టూన్లన్నా, అలాగే సైలెంట్ (క్యాప్షన్లెస్) కార్టూన్లన్నా రామకృష్ణగారికి చాలా ఇష్టం. అలా గీసిన తన మూకీ కార్టూన్లు కన్నడ, తమిళ భాషాపత్రికలలో ఎన్నో అలరించాయి.

జనరల్ గా పత్రికల్లో ఏదైనా ఒక అంశంమీద విమర్శిస్తూ వ్యంగ్యంగా వేసే నెగెటివ్ కార్టూన్లకంటే, ఒక కంపెనీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని కన్సూమర్ కి అర్ధమయ్యేలా చెప్పి, కన్విన్స్ చేసే పాజిటివ్ యాడ్ కార్టూన్లు వేయటం కొంతవరకు కత్తిమీద సామే! ఈ ఒరవడిలోనే, నాగార్జున సిమెంటు, విష్ణు సిమెంటు పబ్లిసిటీ కార్టూన్లు, ‘మిడాస్’ మెన్స్వర్ కంపెనీకి దక్కన్ క్రానికల్ లో యాడ్ కార్టూన్లు, హెచ్ఎఎపిపిటీ వారికి కండోమ్-ఎయిడ్స్ మీద కలర్ కార్టూన్లు వేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ వారి హౌజ్-జర్నల్, తెలుగు పంచాంగం క్యాలెండర్ డిజైన్ చేసి అందులో ఓ పదేళ్ళపాటు బ్యాంకవారి వివిధ పథకాలమీద పబ్లిసిటీ-ఓరియెంటెడ్ కార్టూన్లు వేశారు. టెలీకమ్యూనికేషన్స్ వారికి (తెలుగు-హిందీ-ఇంగ్లీష్) టెలిఫోన్ ‘డూస్ అండ్ డోర్ట్స్’, నేషనల్ సేవింగ్స్ వారికి చిన్నమొత్తాల పొదుపు మీద కలర్ కార్టూన్ బుక్స్ చేశారు ఎ.పి.ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సోషల్ ఫారెస్ట్రీ మీద పబ్లిసిటీ కార్టూన్లేకాక లోగోలు, లీలెట్లు, పోస్టర్లు డిజైన్ చేశారు. శాటెల్లెట్-బేస్డ్ ఇంటరాక్టివ్ నెట్వర్క్ లెక్చర్స్ కోసం ‘స్టెస్ మేనేజ్మెంట్’ మీద గీసిన కలర్ కార్టూన్లు అహ్మదాబాద్ ఇస్రో స్టుడియోస్ నుంచి ప్రసారమయ్యాయి. హైదరాబాద్ దూరదర్శన్, జెమినీ టీవీలు ఆయనతో ఇంటర్వ్యూలు ప్రసారం చేశాయి. 1986లో ప్రొఫెసర్ మధుదండావతే నేత్రుత్వంలోని పార్లమెంట్ సభ్యుల బృందం, తను బ్యాంకింగ్ మీద వేసిన కార్టూన్‌షోని తిలకించి ప్రత్యేకంగా ప్రశంసించింది. లేటెస్ట్ ప్రొఫెసర్ సుఖ్ బీర్ సింగ్ రచించగా, ప్రముఖ ఢిల్లీ సంస్థ రూపా పబ్లిషర్స్ ప్రచురించిన ‘హ్యూమర్ ఫ్రమ్ హైదరాబాద్’ ఇంగ్లీష్ బుక్ కి రామకృష్ణ వేసిన కార్టూన్లు ప్రముఖుల మన్ననలు పొందాయి.

Ramakrishna garu with Bapu -Ramana garu

కార్టూనిస్ట్గా పలువురి అభినందనలు అందుకుంటున్న రామకృష్ణలోని మరో పార్శ్వం – కవిత్వం. వారి నాన్నగారి నుంచి వారసత్వంగా అందిన పద్యకవిత్వం, గేయాలు, రచనల ప్రభావంతో, నేటి సమకాలీన సమాజ స్థితిగతులపై కవిగా తాను రచించిన హాస్య, వ్యంగ్య పద్యసంకలనాలు హైదరాబాద్లో తరచూ నిర్వహించబడే వివిధ కవిసమ్మేళనాల్లో ప్రముఖకవులనుంచి ప్రశంసలు పొందుతూనే ఉన్నాయి. వారి కార్టూన్-కవిత్వ విన్యాసాలు మనం తరచూ ఫేస్ బుక్ లోనూ చూస్తూనే ఉన్నాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన రామకృష్ణ, తనకు ఇష్టమైన కార్టూన్లు, కవిత్వం, మల్టీమీడియాలో కృషి చేస్తున్నారు. శ్రీమతి సుగుణ రామకృష్ణ దంపతులకు ఒక కుమార్తె. వివాహమై కూతురు, అల్లుడు ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు – ప్రణవ్, ప్రణీత్. .

బాపు గారి చిత్రకళావిన్యాసమన్నా, అలనాటి క్లాసిక్ సినిమాలన్నా, ఆ పాటలన్నా ఎంతో ఇష్టపడేవారు రామకృష్ణ! ఎన్నో పురస్కారాలు అందుకున్న రామకృష్ణ గారు తన కార్టూన్లతో రెండు కార్టూన్ పుస్తకాలు ప్రచురించారు.
-కళాసాగర్

______________________________________________________________________________

Lepakshi Reddy with Ramakrishna

నాకు మంచి మిత్రుడు, సహృదయుడు, ప్రముఖ కార్టూనిస్ట్ రామకృష్ణ గారు ఇకలేరు… prostate cancer. చాలా చాలా బాధగా ఉంది. ఈ రోజు ఉదయం 4.30 కి స్వర్గస్తులయ్యారని తెలిసింది.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
లేపాక్షి, కార్టూనిస్ట్

Rama krishna cartoons

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap