‘పాప’ కార్టూనిస్ట్ మాత్రమే కాదు…!

ఆగస్ట్ 14, ప్రముఖ కార్టూనిస్ట్ ‘పాప’ జయంతి సందర్భంగా…

కార్టూనిస్ట్ ‘పాప’ గారి గురించి వినడమే… గాని, వారి కార్టూన్లు ఆరోజుల్లో చూడలేకపోయా! ఎందుకంటే…? ఆయన కార్టూన్లు గీసే రోజుల్లో నాది న్యూస్ పేపర్స్ చదివే వయసు కాదు. నేను న్యూస్ పేపర్స్ చదివే నాటికి ఆయన కార్టూన్లు గీయడం తగ్గించారు. ఈ సావనీర్లో ‘పాప’ గారి కార్టూన్లు గురించి రాసే ముందు… ‘పాప’ గారితో నా పరిచయం, వారితో నా అనుభవాలను మీతో పంచుకుంటాను.

తెలుగు కార్టూనిస్టుల పరిచయాలతో ‘కొంటె బొమ్మల బ్రహ్మలు’ పేరుతో పుస్తకం ప్రచురించే క్రమంలో కార్టూనిస్ట్ ‘పాప’ గారి గురించి రాయాలనుకున్నపుడు వారు ఇప్పుడు ఎక్కడ వున్నారు? వారిని సంప్రదించడం ఎలా? అని… ‘ఈనాడు’ ఛీఫ్ ఆర్టిస్ట్ రవికిషోర్ గారిని అడిగితే ‘పాప’ గారి నంబర్ ఇచ్చి, “ముందుగా వారికి నీ గురించి చెబుతాను. అప్పుడు ఫోన్ చెయ్యి” అన్నారు. సరే అని 2020 సంవత్సరం… ఆగస్ట్ లో ‘పాప’ గారికి ఫోన్ చేశాను. ముందుగా నా పరిచయం చేసుకొని… నా ప్రాజెక్ట్ గురించి చెప్పాను వారికి. విన్నాక… నెమ్మదిగా “కార్టూనిస్టుల జీవిత చరిత్రలతో పుస్తకం వేస్తే ఎవరు చదువుతారు? అన్నారు. తర్వాత మీరు ఏమి చేస్తారు? ఇంతకు ముందు ఏమైనా పుస్తకాలు రాసారా ? అని ప్రశ్నించారు. అయినా ఇప్పుడు నా దగ్గర నేను గీసిన కార్లూన్లు ఏమీ లేవు” అన్నారు. అలా మొదటి పరిచయం ఫోన్ ద్వారా జరిగింది. మళ్లీ ఆర్టిస్ట్ రవికిషోర్ గారికి కాల్ చేసి, సర్ ‘పాప’ గారు ఇలా అన్నారని చెప్పాను. డోన్ట్ వరీ.. నేను మాట్లాడతా అన్నారు. రవికిషోర్ గారు ఏ మాట్లాడారో తెలియదు కాని, రెండురోజుల తర్వాత ‘పాప’ గారి దగ్గరి నుండి ఫోన్. “మీకు కావలసిన వివరాలు చెబుతాను, ఒకసారి హైదరాబాద్ రావచ్చుగా… అన్నారు”. ‘కోవిడ్’ కారణంగా రిస్క్ ఎందుకని ఫోన్లోనే వివరాలన్నీ రాసుకున్నాను. కట్ చేస్తే సంవత్సరం తర్వాత ఓ రోజు ఉదయాన్నే ‘పాప’ కాల్ చేశారు. “నేను విజయవాడలో మంతెన సత్యనారాయణరాజుగారి ఆశ్రమంలో వున్నాను. షుగర్ లెవల్స్ పెరిగిన కారణంగా ఓ 20 రోజులుగా ఇక్కడే వుండాల్సివచ్చింది. ఇప్పుడు ఆరోగ్యం బానేవుంది. ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నీకు అవకాశం వుంటే కనకదుర్గమ్మ గుడికి వెళదాం వస్తావా ? అన్నారు.” షూర్ అన్నా. 2021 అక్టోబర్ 30న వారితో కలసి దుర్గ గుడికి వెళ్ళి, ఆంజనేయ విలాస్లో భోజనం చేసి, రైల్వేస్టేషన్ కి తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించాను. ఈ పేజీలో వున్న ఫొటో ఆరోజు తీసుకున్నదే. వారిని కలిసింది ఒక్కసారే అయినా… ఫోన్ ద్వారా సంభాషణల ద్వారా ఎంతో అనుబంధం ఏర్పడింది వారితో. వారి ఆదరణ, వాత్సల్యం ఎప్పటికీ మరువలేని తీపిగురుతులు.

“పాప” కలం పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పేరు శివరామరెడ్డి కొయ్య. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆగస్ట్ 14న 1944 సంవత్సరం. ఫోర్త్ ఫారం చదివేటప్పుడు ఓ సిగరెట్ కంపెనీ వారి కేలండర్లో నటి బొమ్మను పెన్సిల్తో గీశారు తొలిసారిగా. అది గమనించిన వీరి తండ్రి ఆర్ట్ మెటీరియల్ కొనిచ్చి ప్రోత్సహించారు. స్కూల్ ఫైనల్ చదివేటప్పుడే ఆంధ్రపత్రిక వారపత్రికలో మొదటి కార్టూన్ అచ్చయ్యింది. ప్రారంభంలో ‘ఆంధ్రపత్రిక’ వీక్లీ, జోకర్, వసుధ తదితర పత్రికల్లో కార్టూన్లు, కథలకు బొమ్మలు గీసేవారు.

కాలేజీ పూర్తయ్యాక విశాఖ టౌన్ ప్లానింగ్ సర్వేయర్గా కొంత కాలం పనిచేసి, మధ్యలో కర్ణాటకలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేశారు. తర్వాత హైదరాబాద్ ఎన్.జి.ఆర్.ఐ.లో ఆర్టిస్టుగా పనిచేశారు. 1973లో బాపు-రమణల సంపూర్ణ రామాయణం పుస్తక ఆవిష్కరణ సమయంలో కలిసినప్పుడు ‘మీరు కార్టూనిస్టుగా స్థిరపడితే మంచి భవిష్యత్తు వుంటుందని’ బాపుగారు సలహా ఇచ్చారట. 1972లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ‘బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఫర్ హేపీ అండ్ హెల్దీ లివింగ్’అనే పుస్తకానికి కార్టూన్లు గీశారు పాప.

‘ఈనాడు’లో కార్టూనిస్ట్ : 1975లో ఈనాడులో కార్టూనిస్టుగా చేరారు. ‘ఈనాడు’ అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రికగా అవతరిస్తున్న రోజులవి. ముఖ్యమంత్రి అంజయ్య మీదా, ఆయన జోకులమీదా, యాదగిరి మీదా పాప కార్టూన్లు సూపర్ హిట్లు కొట్టేవి. పాప అనగానే బొమ్మ హెలికాప్టర్ వెంటేసుకున్న అంజయ్యగారే అందరికీ గుర్తొస్తారు. తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై కూడా ఎన్నో గొప్ప కార్టూన్లు గీశారు. ‘ఈనాడు’ లో అయితే రాజకీయ కార్టూన్లు గీయడానికి మాత్రమే అవకాశం వుంటుంది కనుక, చతుర, విపుల మాసపత్రికలో సోషల్ కార్టూన్లు కూడా నెలనెలా గీసేవారు. అలా ‘చతుర’ మంత్లీలో గీసిన ఒక కార్టూన్ నాకు బాగా నచ్చింది… ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో లైఫ్ స్టడీ క్లాస్లో మోడల్ ముందు కూర్చొన్న ఒక విద్యార్ధి “ఇక్కడ మూడ్ లేదు, ఇంటి దగ్గర చేసుకొస్తాననడం’ భలే నవ్వు పుట్టిస్తుంది. ఎనిమిదేళ్ళు ఈనాడులో పనిచేశాక 1982లో ఆయన ఫ్రీలాన్సర్ అయ్యారు. ‘ఆంధ్రభూమి, సమయం, ఆంధ్రప్రభ’ పత్రికల్లో కార్టూన్లు గీశారు. మధ్యలో ఈ వారం వారపత్రిక నడిపారు. పాప తన చిత్రాలతో హైదరాబాద్, బెంగులూరు, విజయవాడలలో వన్మేన్ షోలు నిర్వహించారు, బెంగుళూరు రవీంద్ర కళాక్షేత్రలో గ్రూప్ షోలోనూ తన చిత్రాలను ప్రదర్శించారు. చిత్రకారుడిగా, కార్టూనిస్ట్ గా, ఫొటోగ్రాఫర్ గా బహుముఖ ప్రజ్ఞావంతులైన “పాప” గారు మీడియా దూరంగా వుండేవారు. అలాంటి పాప గారిని ఇంటర్వ్యూ చేశారు శ్యాంమోహన్ గారు ఏప్రిల్ 2002లో. ఈ అరుదైన ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్లో లభ్యమవుతుంది.

2000 సంవత్సరంలో కార్టూన్ వాచ్ పత్రికవారు వీరి కార్టూన్లను లండన్ నెహ్రు సెంటర్లో ప్రదర్శించారు. 2002 సంవత్సరం హైదరాబాదులో ఏ.పి. ప్రెస్ అకాడమీ, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్టూన్ ఉత్సవంలో బాపూగారి చేతుల మీదుగా సత్కారం, 2018లో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ కీర్తి పురస్కారం అందుకున్నారు. ఫోటోగ్రఫీలోనూ ఎన్నోప్రయోగాలు చేసిన వీర్ని నాలుగు అంతర్జాతీయ అవార్డులు వరించాయి.

కలం పేరు “పాప” నే ఎందుకు ? అని అడిగితే…. ప్రారంభంలో కె.యస్.రెడ్డి, శివరామ్ పేర్లతో కార్టూన్లు గీసేవాడినని…, కాని పత్రికలు ప్రచురించేవి కాదని… అందుకే ఆడపిల్లలను ముద్దుగా ‘పాప’ అని పిలుస్తారు కదా. ఆ ‘పాప’ నే నా కలం పేరుతో కార్టూన్లు గాయడం ప్రారంభించాను. పత్రికలు ప్రోత్సహించాయి. అదే పేరుతో కొనసాగాను అన్నారు.
కంప్యూటర్లో వివిధ డిజైనింగ్ సాఫ్ట్వేర్లలో కూడా వీరికి ప్రవేశం వుందని వారు నాతో మాట్లాడుతున్న పలు సందర్భాల్లో చెప్పేవారు. ఇప్పుడొస్తున్న యువతరం “సరైన కృషి చేయకుండానే గుర్తింపు కోసం, పేరు కోసం ఆరాటపడుతున్నారని, ఇది సరి కాదని” తను అభిప్రాయపడేవారు.

చివర్లో ఫోటోగ్రఫీలోను ఎన్నోప్రయోగాలు చేసి 77 ఏళ్ళ పాప (శివరామరెడ్డి కొయ్య) గారు కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఆయనకు వైద్యులు చేసిన సర్జరీ విఫలం కావడంతో 2022 జులై 23 న హైదరాబాదులో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కళాసాగర్ యల్లపు, ఎడిటర్: www.64kalalu.com
(పైన వున్న ఫోటో పాప గారితో నేను విజయవాడ లో తీసుకున్నప్పటిది.)

2 thoughts on “‘పాప’ కార్టూనిస్ట్ మాత్రమే కాదు…!

  1. పాప గారి ఇంటర్వూ చదవడం..
    వారిని ఫోటో లో చూడడం నా అదృష్టం.
    పరిచయం చేసిన కళాసాగర్ గారికి
    ధన్యవాదాలు…

Comments are closed.

Share via
Copy link
Powered by Social Snap