పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

పెండేల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పెండేల వెంకట సుధాకర రావు. 1958 లో నెల్లూరు లో జన్మించాను. బి.కాం., సీ.ఏ.ఐ.ఐ.బి. నేను చదివిన డిగ్రీలు. 1980 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో క్యాషియర్ గా ప్రవేశించి 2018 లో మేనేజర్ గా బయటకు వచ్చాను. నాలుగు దశాబ్దాల క్రితం పెళ్ళయింది. ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం నివాసం హైదరాబాద్ లో.
చెన్నయ్ లో ఒక సంస్థ ద్వారా(పోస్ట్ ద్వారా) బొమ్మలు గీయడం, ముంబయి లో మరో సంస్థ ద్వారా బొమ్మలు చెడగొట్టడం (వ్యంగ్య చిత్రాలు) నేర్చుకున్నాను.
నలబై ఏడు సంవత్సరాల క్రితం నా మొదటి కార్టూన్ ఆంధ్రపత్రిక (దిన పత్రిక) లో అచ్చయింది. అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను. అయితే నా అచ్చయిన కార్టూన్ల సంఖ్య సుమారు 500 మాత్రమే. దానికి కారణం నా వృత్తి నా ప్రవృత్తిని అణచి వేయడమే.

నా కార్టూన్ల ద్వారా మా యింటి పేరు నిలబెట్టాను. అంటే ఇంటి (పెండేల) పేరే కలం పేరు. నా కార్టూన్లు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, స్వాతి, బుజ్జాయి, హాస్య ప్రియ, హిందూ, కార్టూన్ వాచ్, హాస్యపు హరివిల్లు, జాగృతి, గో తెలుగు మొదలగు పత్రికలలో  పడి దెబ్బలు తిని నన్ను నవ్వించాయి (సంతోష పెట్టాయి).

నావూరు శ్రీధర్ నాయుడు నా ఆప్త మిత్రుడు.  శ్రీధర్, నేను కలిసి బుజ్జాయి లో ఏకధాటిగా ఐదు సంవత్సరాలు ఒకే పేజీ ని పంచుకున్నాము. అంటే ప్రతి నెలా ఒకే విషయం మీద చెరి మూడు కార్టూన్లు వేసే వాళ్ళం. ఇది ఒక ఫీచర్ లా నడిచింది. బుజ్జాయి సంపాదకులు మమ్మల్ని ఎంతో యిష్టపడేవారు.

హిందు, ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్, జాగృతి, హాస్యానందం, కెనడా తెలుగు తల్లి మొదలగు వారి నుండి కార్టూన్ పోటీల్లో బహుమతులు కూడా అందుకున్నాను. జయ జగత్ 2020 అంతర్జాతీయ కార్టూన్ పోటీలో ఇండియా నుంచి ముగ్గురు కార్టూనిస్టుల కార్టూన్లు ఏడు దేశాల్లో ప్రదర్శన కు ఎంపిక చేశారు. ఆ ముగ్గురిలో నేను ఒకడిని అవడం ఒక వింత అనుభవం.

పదవీ విరమణ తరువాత “దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరిక లేదు” అన్నట్లు కార్టూన్లు గీస్తున్నాను. ఎందుకంటే పగటి నిద్ర నివారించడానికి, మెదడు తుప్పు పట్టకుండా వుండడానికి మరియు మా యింటావిడకి ఖాళీగా దొరకకుండా వుండడానికి. కార్టూనింగ్ ఒక మంచి అభిరుచి. ఎందుకంటే ఒత్తిడి విడుదల చేసుకోవచ్చు. ఆనందం అనుభవంలోకి వస్తుంది.
64కళలు.కాం ద్వారా పాఠకులకు పరిచయం అయినందుకు సంతోషిస్తూ…
మీ పెండేల

5 thoughts on “పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

  1. శ్రీ పెండేల గారితో కొద్ధి కాలం కలసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బాహ్యానికి గంభీరంగా కనిపించినా, అంతరంగంలో చాలా సున్నితమైన వ్యక్తి. ఈ వేదిక ద్వారా ఆయన గురించి చదవటం చాలా సంతోషంగా ఉంది.

  2. 64 కళలు ద్వారా నా “తొలి కార్టూన్ గురువు” పరిచయం చదివడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా “pen” డే ల గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన అక్షరాల “అరవై లలో… ఇరవై” మనిషి. ఇలాగే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరిన్ని వందల కార్టూన్లతో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత వెలిగే ట్లు ఆయన్ని దీవించ మని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను.

  3. పెండేల గారు మీ కార్తవ్వబ అభిమానుల్లో నేనో ఒకణ్ణి . మీ గురించి చాలా విషయాలు తెలిసాయి.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap