తొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి మూడేళ్ళు పట్టింది!

ప్రభాకర్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కొల్లి ప్రభాకర్. పుట్టింది 20 మార్చి 1975, కృష్ణాజిల్లా, ‘పామర్రు’లో. సింహాచలం, రమణమ్మ అమ్మనాన్నలు.
కార్టూనిస్టులకు స్వర్ణయుగం అయిన 80 దశకంలోనే నేను కూడా కార్టూనిస్టుగా మారాను. కార్టూన్లు గీయడం ప్రాక్టీసు చేసిన తర్వాత నాతొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి నాకు ‘మూడేళ్ళు పట్టింది! ఎటువంటి సైజులో ఎలా గీయాలి? లాంటి మొదలైన టెక్నికల్ విషయాలు తెలియకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అది ! ఆ కష్టాలన్నీ చెప్పుకుంటూ పోతే చిన్న సైజు నవలవుతుంది. సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను..

మా అమ్మనాన్నలకు పెద్దగా చదువు లేకపోవడం, దిగువ మధ్యతరగతి నేపధ్యం వల్ల – నా చదువు మీద ఎక్కువ వత్తిడుండేది. నాకేమో చందమామ, బాలమిత్ర లాంటి కథల పుస్తకాలమీద ఆసక్తి. అప్పుడప్పుడు బొమ్మలేసే వాడ్ని.. వాటిని మెచ్చుకునే వాళ్ళు కానీ – అదే ధ్యాసలో ఉంటే మాత్రం ఒప్పుకునే వాళ్లు కాదు. నేను ఆరోతరగతి చదువుతున్నప్పుడు ఇంటి ప్రక్కనుండే ఓ అక్కచేతిలో వున్న ఓ పుస్తకం నన్ను ఆకర్షించింది.. అది ‘యువ’ అని దీపావళి ప్రత్యేక సంచిక ! దాంట్లో వున్న కార్టూన్లు నన్ను విపరీతంగా ఆకర్షించి ఇంకా ఇటువంటి పుస్తకాలు ఏవైనా వున్నాయా అక్కా అంటే వాళ్లింట్లో వున్న జ్యోతి, స్వాతి లాంటి మరికొన్ని వీక్లీలు ఇచ్చింది. వాటిని చూసిన తర్వాత నేను పొందిన ఆనందం ఇంతా – అంతా కాదు. వాటిని చూడంగానే ఖచ్చితంగా నేనూ కార్టూన్లు గీయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. అప్పట్లో ఆంధ్రప్రభలో రామకృష్ణగారి కార్టూన్లు నన్ను చాలా ఆకర్షించేవి. ఆ అందమైన బొమ్మలు, చక్కని చేతివ్రాత చూసి ఆయన్నే గురువుగా ఎంచుకున్నాను. ఆంధ్రప్రభలో వచ్చిన వారి కార్టూన్లు కత్తిరించి నా తెల్లకాగితాల నోట్ బుక్ లో అతికించుకుని వాటిని చూస్తూ ప్రాక్టీస్ చేశాను. ఓ రెండు నెలల ప్రాక్టీస్ తర్వాత సంతృప్తికరంగా బొమ్మలేయడం వచ్చిందని తీర్మానించుకుని ఓ సిగరెట్ పాకెట్ సైజు పేపర్ మీద చిన్న చిన్న బొమ్మలతో చిన్న చిన్న అక్షరాలతో ఓ నాలుగు కార్టూన్లు గీసి పత్రికకు పంపితే అవి గోడకొట్టిన బంతుల్లాగా వెనకొచ్చాయి.. ఐనా పట్టు వదలకుండా మళ్ళీ మళ్లీ ప్రయత్నించా! సరియైన సైజ్ కూడా ఇంపార్టెంటే అని తెలియక దాదాపు మూడేళ్ళు అలా టైం వేస్ట్ అయ్యింది. ఇటువంటి టైమ్ లో నాతోపాటు చదువుకునే ఓ మిత్రుడి కంట్లో నా తిరిగొచ్చిన కార్టూన్లు పడి.. ఆశ్చర్యంగా నావైపు చూసి నువ్వు పత్రికల్లో జోక్స్ రాస్తావా? నాకు కూడా నేర్పు అని వెంటపడడంతో… అసలు విషయం చెప్పాను. గీస్తాను గానీ ఒక్కటీ ప్రింట్ కాలేదురా అని! ..ఐనా సరే నాకూ నేర్పు, ఇద్దరమూ ప్రయత్నిద్దాం అంటే వాడికీ నేర్పాను! కానీ ఫలితం మామూలే. ఇలా రెండు మూడుసార్లు జరిగిన తర్వాత వాడికి విసుగుపుట్టి – అరే ఇలాకాదు విజయవాడ వెళ్ళి మనం డైరెక్టుగా పత్రిక ఆఫీసులో కార్టూన్లు ఇచ్చి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయో కనుక్కుందాం అన్నాడు. ఇద్దరం విజయవాడ లబ్బీపేటలో వున్న ఆంధ్రజ్యోతి ఆఫీసుకెళ్లాం. అప్పటికే కార్టూనిస్టుగా పేరున్న ‘ప్రసాద్ కాజ’ గారు అక్కడ ‘వనితాజ్యోతి’ సెక్షన్లో పనిచేస్తుండం, వారిని కలవడం జరిగింది. అప్పుడు ఆయన మా కార్టూన్లు పరిశీలించి ఓ నవ్వు నవ్వి ఐడియా, బొమ్మలు బావున్నాయి కానీ ఇంత చిన్న సైజులో గీయకూడదు. ప్రింటింగ్ కెళ్లినప్పుడు ఈ సైజు ఇంకా తగ్గిపోయి అక్షరాలు చదవడానికి వీలుకానంత చిన్నగా కన్పిస్తాయి. అందుకే మీవి రిజెక్ట్ అవుతున్నాయి, ఈ సైజులో గీయాలి అని ఓ శాంపుల్ కార్టూన్ చూపించారు. ఆ కార్టూన్ చూసి మేము షాక్!.. మేము గీసిన కార్టూన్ కి 4 రెట్లు పెద్దగా పెద్దగా వుంది అది..!

ఈ విధంగా ఆయన మాకు టెక్నికల్ గా గురువయ్యారు ప్రసాద్ కాజ గారు, బొమ్మల గురువు రామకృష్ణగారు. ఆ తరువాత మూడువారాలకి నా మొదటి కార్టూన్ వనితాజ్యోతి, భారతి మాసపత్రికలో 1986లో ఒకేసారి ప్రింటయ్యా యి ! తొలికార్టూన్ అచ్చులో చూసుకున్న ఆ అనుభూతిని ఇప్పుడు తలచుకున్నా గుండె జల్లుమంటుంది. ఇక అప్పట్నుంచి ఓ పదిహేను సంవత్సరాలు వెనుతిరిగి చూసింది లేదు. రెండువేల సంవత్సరంలో ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చి వారపత్రికలన్నీ మూతపడ్డాయో అప్పటినుంచి అందరి కార్టూనిస్టులతో పాటు నేనూ ఆయుధాలు ప్రక్కన పెట్టేశాను.

ఐతే అప్పుడప్పుడే పుంజుకుంటున్న యానిమేషన్ రంగంలో ఐతే ఆర్టిస్టులకు ఇటు-కార్టూనిస్టులకు మంచి భవిష్యత్తు వుంటుందని కొంతమందిచ్చిన సలహాతో 2001లో హైదరాబాద్ లో యానిమేషన్, మల్టీమీడియా డిప్లొమా కోర్సు చేసి కొంతకాలం యానిమేషన్ స్టూడియోలలో పనిచేశాను. 2000 నుండి 2014 మధ్య మళ్లీ పెద్దగా కార్టూన్లు జోలికిపోలేదు.

ఎలాగూ పత్రికలు కూడా లేవు అని నా ఉద్యోగ జీవితంలో బిజీగా వున్న టైమ్ లో.. 2014లో నాతో పనిచేస్తున్న ఓ మిత్రుడు ‘తెలుగు వెన్నెల’ అనే సైటును రన్ చేస్తున్నాం దానికోసం – కథలు గానీ, కవితలు గానీ ఏవైనా ఇవ్వగలరా అని అంటే.. అవి లేవుగానీ గీసి పక్కన పెట్టేసిన కొన్ని కార్టూన్లున్నాయి అని చెప్పి వాటిని ఇచ్చాను. అవి ఆ సైట్ నడిపిస్తున్న కార్టూనిస్టు ‘రామ్ శేషు’ గారి చేతిలో పడడం ఆయన వెంటనే నన్ను కాంటాక్ట్ చేసి మీరు ఎక్కడుంటారు? ఇన్నాళ్ళూ ఏమైపోయారు? ఒకానొక టైమ్ లో నేను కార్టూనిస్టుగా మారడానికి ఇన్ స్పైర్ చేసిన వ్యక్తుల్లో మీరూ ఒకరు. మళ్ళీ కార్టూన్లు గీయండి అని వెంటపడ్డారు. కానీ నేను ఇప్పుడు పత్రికలు లేవు ఉన్న వాటికి సర్కులేషన్ లేదు! ఇప్పుడు ఎవరు చూస్తున్నారండీ అని చప్పరించేశాను, ఐతే పట్టు విడవకుండా – ఆయన అప్పటికంటే ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియా face book గ్రూపుల్లో కార్టూన్లకి చాలా ఆదరణ వుంది – ఓసారి ఇటువైపు వచ్చి చూడండి. పైగా హాస్యానందం పత్రికవారు ప్రతి సంవత్సరం కార్టూన్ పోటీలు పెడుతున్నారు, మొదలెట్టండి అని పదే పదే చెప్పడంతో నా సెకండ్ ఇన్నింగ్సు మొదలై .. నా కార్టూన్లు face book లో post చెయ్యడం. అప్పటివరకూ పేర్లు తప్ప కార్టూనిస్టులతో పరిచయాలు లేని వాళ్లందరితో టచ్ లోకి రావడం – మీటింగుల్లో కలవడంతో మళ్ళీ ఉత్సాహం పుంజుకుని అంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ కార్టూన్లు గీస్తున్నాను. నా ఈ సెకండ్ ఇన్నింగ్ కి కారణం మాత్రం రామ్ శేషుగారే! ఈ సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఇ – లెర్నింగ్స్ & యానిమేటర్ గా ఫ్రీలాన్సర్ పనిచేస్తున్నాను. అలానే ‘ప్రజాతంత్ర’ అనే దినపత్రికకు కార్టూనిస్టుగా పనిచేస్తున్నాను.

1996లో వివాహం అయ్యింది. నా శ్రీమతి పేరు పద్మజ. ఓ చానల్ లో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తుంది. కార్టూన్లంటే బాగా ఆసక్తి! నేను కార్టూనిస్టుగా వుండడాన్ని నా కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది. మాకు ఇద్దరు సంతానం. బాబు పేరు అన్వేష్.. ప్రస్తుతం C.A. చదువుతూ హైదరాబాద్లో ఓ కంపెనీలో ఆర్టికల్ షిప్ చేస్తున్నాడు. అమ్మాయి – అఖిల అగ్రికల్చర్ బియస్సీ ఫైనల్ ఇయర్… డెహ్రాడూన్లో చదువుతుంది.

Cartoon award receiving from Senior cartoonist MS Ramakrishna


కార్టూనిస్టుగా పొందిన బహుమతులు – సత్కారాలు !
అన్ని తెలుగు పత్రికలు – వెబ్ మాగ్జై న్లతో పాటు తరంగ, సుధ లాంటి కన్నడ పత్రికలు, తమిళ పత్రికలతో పాటు Cartoon watch అనే ఇంగ్లీషు పత్రికల్లో నా కార్టూన్లు 5 వేల పైచిలుకు ప్రచురణకు నోచుకున్నాయి.
తొలిసారిగా 1987లో నాగార్జున సిమెంట్ వారి సహకారంతో బాపుగారు న్యాయనిర్ణేతగా స్వాతి వీక్లీ వారు నిర్వహించిన కార్టూన్ పోటీలో కన్సోలేషన్ బహుమతి పొందాను. అది మొదలు గతవారం హాస్యానందం పత్రిక వారినుంచి తీసుకున్న ప్రైజ్ వరకూ…వివిధ పత్రికలూ – సంస్థల నుండి 50 పైగా బహుమతులు, ప్రశంశా పత్రాలు పొందాను. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోతగ్గవి. గతసంవత్సరం – ‘వెర్సటైల్’ బైక్ వారు నిర్వహించిన దేశవ్యాప్త కార్టూన్ పోటీలో – మొదటి బహుమతి, ఎయిడ్స్ పై రాష్ట్రస్థాయి కార్టూన్ల పోటీలో రెండవ బహుమతితో పాటు అనేక సంస్థల నిర్వహించిన పోటీల్లో ప్రధమ – ద్వితియ బహుమతులున్నాయి. ఐతే నేను ఎవరినైతే ఆదర్శంగా తీసుకుని కార్టూన్లు గీశానో ఆ కార్టూనిస్టు ‘రామకృష్ణ’ గారి చేతులమీదుగా రెండుసార్లు బహుమతులు అందుకోవడం మరిచిపోలేని మధురానుభూతి!

ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రజాతంత్ర దినపత్రికకు ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా పనిచేస్తూ, ఒక ప్రముఖ ఛానల్ వారు ప్రచురిస్తున్న మేగజైన్ కు ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

ఈ సందర్భంగా 64 కళలు అనే తమ వెబ్ సైట్ ద్వారా ఎంతోమంది కళాకారులని పాఠకులని పరిచయం చేస్తూ సత్కరిస్తున్న శ్రీ కళాసాగర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రభాకర్

24 thoughts on “తొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి మూడేళ్ళు పట్టింది!

 1. మీరెన్నో మంచి కార్టూన్లు గీసారు. కాని ప్రభాకర్ అంటే నాకు గుర్తు వచ్చేది..
  ఒకరు పేకాట క్లబ్ నుండి మొత్తం పోగొట్టుకుని ఒక పేపర్ నడుముకు చుట్టుకుని వెళ్తుంటాడు.. అతడిని ఫాలో అవుతూ…నడుము వంచి ఆ పేపర్ చదువుతుంటాడు.
  ఒరేయ్ నీ అంత కక్కుర్తి వెదవని నేనెప్పుడూ చూడలేదు అని అంటాడు.
  వాళ్ళిద్దరి ఫేస్ ఫీలింగ్స్ .. ఆ caption గుర్తొచ్చి.. నవ్వుకుంటాను.
  పిల్లలిద్దరూ వృద్ది లోకి వచ్చారు. ఇక కావలిసింది ఏముంటుంది.. ఎప్పుడూ ఇలాగే మరిన్ని మంచి కార్టూన్లు గీయాలని …
  Ram Mohan Jindam, Cartoonist, Hyd.

 2. ఆసక్తి కరంగా చదివాను. అభినందనలు. కార్టూన్లు మరిన్ని గీసి నవ్వులు పెంచండి ప్రభాకర్. శుభాకాంక్షలు శుభాశీస్సులు.
  జయదేవ్ బాబు

  1. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారూ !

 3. ఈ మధ్యే కళాసాగర్ గారి వాల్ లో 64 కళల గురించి చదివాను. ఇంతలోనే నాకెంతో నచ్చిన మీ ఆర్టికల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ ఆర్టికల్ చదువుతుంటే ఆరోజు రాత్రి మనం మాట్లాడుకున్న అనేక అంశాలు కంటి ముందు పాత్రల రూపంలో కదులుతున్నాయి. మీరు ఎదురుగా ఉండి చెప్తున్నట్లే ఉంది సర్.. అభినందనలు సర్. అలాగే కళాసాగర్ గారికి కూడా ధన్యవాదాలు…
  Subbu RV

 4. పరిచయం చాలా బాగా వచ్చింది. శుభాభినందనలు.. with best wishes…

 5. తెలుగునాట నాటిన నవ్వులతోటలో నీ కార్టూన్ల నవ్వులపువ్వులూ విపరీతంగా విరబూస్తున్నాయి ప్రభా. నీగురించి వచ్చిన ఆర్టికల్ చాలా బాగుంది. అన్నీ వివరంగా అందించారు. నువ్విలాగే సదా నీకార్టూన్లతో అందర్నీ నవ్విస్తూ ఇంకా ఇంకా ఉన్నత నవ్వుల శిఖరాలని అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్యాసాన్నందించిన 64 కళలు కి ధన్యవాదాలు.

  1. ధన్యవాదాలు సుధా !… మీ పరిచయం మా కార్టూనిస్టులందరి అదృష్టం. ప్రతి కార్టూనిస్టుని అమితంగా ప్రోత్సహిస్తూ ఏంతో ఉత్తేజం కలిగిస్తుంటారు. అలాగే నన్ను కూడా !…ఈ సందర్బంగా మా కార్టూనిస్టులందరి తరపునా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ! 🙏

 6. నైస్ బాగుందండి మీ కార్టూన్ నేపథ్యం …అభినందనలు

 7. కంగ్రాచ్యులేషన్స్ ప్రభాకర్ గారు .మీ కార్టూన్ల లాగే మీ పరిచయమ్ చాలా బాగుంది. ఇప్పుడున్న కార్టూనిస్టులలో చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ లోనే గొప్ప కార్టూన్లు వేసారనుకుంటాను. మీరింకా ఎన్నో మంచి మంచి కార్టూన్లు వేయాలని కోరుకుంటున్నాను. 👍👍👍👍👍

 8. ప్రభాకర్ గారు ,మీ కార్టూన్లలో రాత ,గీత ,హాస్యం చక్కగా సమపాళ్లలో వుంటాయి . మీ పరిచయం బాగుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap