నా మూడో కార్టూన్ స్వాతిలో వచ్చింది – ప్రసిద్ధ

 నాలుగు దశాబ్దాల క్రితమే కార్టూనిస్ట్గా పరిచయమై, కొంత విరామమం తర్వాత ఇటీవలే మళ్ళీ కలం పట్టిన వరప్రసాద్ గారి స్వపరిచయం ఈ వారం ‘మన కార్టూనిస్టులు ‘.

ప్రసాద్ పేరుతో నా కార్టూన్లు 1975 నుండి 1982 వరకు అన్ని తెలుగు పత్రికలలోనూ, కారవాన్, ఉమెన్స్ ఎరా వంటి  ఇంగ్లీషు మేగజైనులలోను ప్రచురింపబడ్డాయి. ఈనాడు పెట్టిన మొదట్లో నా కార్టూన్లు పబ్లిష్ అయ్యాయి.  స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరనివాసం. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బాబు, జయదేవ్, రామకృష్ణ, శంకు గార్ల కార్టూన్లు బాగా ఫాలో అయ్యేవాడిని. ముఖ్యంగా బాబు గారి కార్టూన్లు, ఉన్నదున్నట్లుగా కాపీ కొట్టి నా దగ్గర భద్రపరుచుకునేవాణ్ణి. మా ఇంటి దగ్గర ఉండే  తెలిసిన ఒక పత్రికా ఉద్యోగి, అవి చూసి, కార్టూన్లు వేసేది అలా కాదు, సొంత ఐడియాలతో వేసి, పత్రికలకు పంపించవచ్చు అని సలహా ఇచ్చాడు. అదీకాక మేము విజయవాడ, గాంధీనగరులో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు, ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చి మీ పక్క పోర్షను ఖాళీగా ఉంది కదా అని ఎంక్వైరీ చేసారు. నా కప్పుడు 15 సం.లు. మీరెవరు అని ఓనరులాగా  అడిగాను. వెంటనే ఒకాయన నువ్వు పత్రికలు చదువుతావా అని అడిగారు. ఓ.. మా ఇంట్లో ప్రభ, పత్రిక, జ్యోతి వీక్లీలు, విజయచిత్ర రెగ్యులర్ గా తెప్పిస్తాము అని చెప్పాను. అయితే స్వాతి మంత్లీ తెలుసా? అని అడిగితే లోపలినుంచి పాత స్వాతి తెచ్చి చూపించాను. ఆయన మెచ్చుకొని తన పేరు వేమూరి బలరాం, స్వాతి పబ్లిషరు తనే అని, తన పక్కనున్నాయన బాలి, ఆర్టిస్టు అని పరిచయం చేసారు.స్వాతి వాళ్లు మా పక్క పోర్షనులో దిగిన తర్వాత, మాకు ఫామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏదో విధంగా కార్టూను వేసి మీ పత్రికలో వేయండి అని వెంటపడ్డాను. కార్టూన్ గీయడం ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి.. అప్పుడేస్తాలే అని హామీ ఇచ్చారు. కానీ మొత్తానికి కొంచం ప్రాక్టీస్ చేసి,అలా స్వయంగా వేసిన నా మొదటి కార్టూన్, ఆంధ్రపత్రికలో 02.05.1975 సంచికలో చోటు చేసుకుంది.

తర్వాత నా మూడో కార్టూన్ స్వాతిలో పడింది. బలరాంగారి, కొడుకు అనిల్, వాళ్ల సొంత ఊరు కొడాలిలో నేలబావిలో పడి చనిపోయాడు. ఆ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకుండానే విజయవాడ వచ్చి, మా అన్నయ్య పెళ్లి నిశ్చితార్థానికి హాజరై, కడుపులో దుఃఖం దాచుకొని, మా అన్నను ఆశీర్వదించారు. ఆ తర్వాత వాళ్లు కృష్ణలంకకి మారిపోయారు. అయినా, నేను వాళ్లను కలుస్తూండేవాడిని. నా అభిరుచి గమనించి, నవలల పోటీలో వచ్చిన మాన్యుస్క్రిప్టుల పైన రచయిత పేరు కట్ చేసి నాకు ఇచ్చి చదవమని, అసలు ఏ మాత్రం బాగాలేనిది, బాగున్నవి గ్రేడింగులు ఇవ్వమని చెప్పారు. అంతిమంగా, స్వాతి జడ్జిల ప్యానెల్ సెలెక్ట్ చేస్తాయని చెప్పారు. మా ఇంట్లో నాతో పాటు అక్కాచెల్లెళ్ళు అందరూ చదివి ఆయనకు లిస్టు ఇచ్చాము. అందులో యండమూరి వీరేంద్రనాథ్ లాంటి పెద్ద రచయితల నవలలు కూడా ఉన్నాయని తర్వాత తెలిసింది. బలరాం గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. దానితో నేను కొత్త బట్టలు గవర్నరు పేట సెంటరుకి వెళ్లి కొనుక్కున్నాను. నా కార్టూన్ పారితోషికం  7-10 రూపాయల సంపాదనతోనే కాలేజ్ ఫీజు కట్టుకున్నాను. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీజులు తక్కువ. విజయవాడలోని ఎస్సారార్ & సి.వీ.ఆర్. కళాశాలలో నా బి.కాం. డిగ్రీ 1978 లో పూర్తి చేసాను. 40 ఏళ్ల తర్వాత మా బి.కాం. బ్యాచ్ వాళ్లందరం,హైదరాబాదులో ఈ మధ్య ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఎంతో ఆనందంగా గడిపాము. అందరూ ఉన్నత పదవుల్లో రిటైర్ అయ్యారు. నన్ను కార్టూనిస్టు ప్రసాద్ గానే నా క్లాస్ సహచరులు ఈ నాటికీ గుర్తు పెట్టుకున్నారు. 1978 లో జయదేవ్ గారు తన ఫ్రెండుతో (ఆయన పేరు తెలియదు.. చాలా జోవియలుగా ఉండేవారు) విజయవాడ వచ్చినప్పుడు లోకల్ కార్టూనిస్టులందరమూ ఆయనను కలిసి చాలా సరదాగా గడిపిన దినం నాకు మధురానుభూతి. అలాగే బాపుగారు విజయవాడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషనుకు వచ్చినప్పుడు ఆయనను కలుసుకొని ఫోటో దిగడం మర్చిపోలేని సంఘటన. డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక ప్రైవేటు కంపెనీలో చేరాను. కార్టూన్లు వేయడంలో స్పీడు పెంచాను. తర్వాత 1980 లో రైల్వేలో కమ్మర్షియల్ క్లర్కుగా విజయవాడ స్టేషనులో పనిచేసాను. అయిదేళ్లు రైల్వే ఉద్యోగం,పిదప బ్యాంకులో చేరి ఉద్యోగంలో బిజీ అవడం వలన 1982 నుంచి కార్టూన్ రంగానికి దూరమయ్యాను. దాదాపు నావి 500 కార్టూన్లు ప్రచురితమయ్యాయి. ఆ కార్టూన్లన్నీ చాలా మటుకు ఆల్బంగా తయారు చేసి భద్రపరిచాను.

గత సంవత్సరం ఆగస్టులో దేనా బ్యాంకులో ఛీఫ్ మేనేజర్ గా రిటైరయ్యాను. నా పూర్తి పేరు సిద్ధవరం వరప్రసాద్. ఆ పేరులోని అక్షరాలు తీసుకొని, “ప్రసిద్ధ” పేరుతో, 24-28 ఏప్రిల్ 2019న, TCWA వారు, హైదరాబాద్ లో నిర్వహించిన కార్టూన్ ఎగ్జిబిషనులో నా కార్టూన్ ప్రదర్శన ద్వారా నా పునరాగమనం జరిగింది. ప్రస్తుతం ఉత్సాహంగా కార్టూన్లు వేస్తున్నాను. ప్రముఖ కార్టూనిస్టు బాచిగారు తన తల్లిగారి సంస్మరణార్థం ప్రతి ఏటా నిర్వహించే కార్టూన్ పోటీల్లో, 2019  సంవత్సరానికి గానూ  నాకు మొదటి బహుమతి వచ్చింది. మంచి కార్టూన్లు వేయడానికి సర్వధా నా ప్రయత్నం. కార్టూనిస్టులు  కాజ ప్రసాద్, శేఖర్, అరుణ్, రాజు, విద్యా, ఎమ్వీయార్ లు నా సమకాలికులను చెప్పుకోవడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ప్రస్తుత నా అభిమాన కార్టూనిస్టులు, సరసి, వర్చస్వి, లేపాక్షి గార్లు. బాగున్న అందరి కార్టూన్లు చూసి నేను ఎంజాయ్ చేయడమే కాకుండా మనసులో గుర్తుపెట్టుకొని నలుగురితో షేర్ చేసుకోవడం నా అలవాటు.

నా శ్రీమతి పద్మలత, గృహిణి. నా కొడుకు దుష్యంత్ హైదరాబాదులోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచెస్తున్నాడు. రిటైరైన తర్వాత ప్రస్తుతం ఒక కోపరేటివ్ బ్యాంకులో బ్రాంచి మేనేజరుగా, మనసుకు నచ్చిన ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటమే కాకుండా, మానవతావాద ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నాను. వాటిప్రభావం వల్ల నేను కులమతాలకు దూరంగా ఉండటమే కాకుండా, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగుతున్నాను. నన్ను మీ ముందుకు 64 కళలు పత్రిక ద్వారా తీసుకొచ్చిన కళాసాగర్ గారికి సర్వధా కృతజ్ఞుడిని.

– వరప్రసాద్ ( ప్రసిద్ధ )

7 thoughts on “నా మూడో కార్టూన్ స్వాతిలో వచ్చింది – ప్రసిద్ధ

  1. చాలా బాగుంది ప్రసిద్ద గారు.మీ కార్టూన్లు బాగుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap