నన్ను లేడీ కార్టూనిస్ట్ అనుకునేవారు-ప్రేమ

నా పేరు ప్రేమ రామచంద్రరావు. నేను వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడను ప్రవృత్తిగా కార్టూన్లు గీస్తుంటాను. నేను మండల పరిషత్ స్కూల్ కంటకాపల్లి RS అనే గ్రామం, విజయనగరం జిల్లా లో SGT గా పనిచేస్తున్నాను. నేను పుట్టిన గ్రామం శృంగవరపుకోట(ఎస్. కోట). మా నాన్న గారు ప్రేమ నిర్మలానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. తల్లి ప్రేమ సూర్యకాంతం గృహిణి. నా విద్యాభ్యాసం అంత S. కోట లోనే జరిగింది. నా ఉపాధ్యాయ శిక్షణ రాజమండ్రి బొమ్మూరులో జరిగింది. 2010 లో నాకు టీచర్ జాబ్ వచ్చింది. భార్య ప్రశాంతి గృహిణి, పిల్లలు పాప అన్షి ఆనంద్, బాబు నిర్మల్ ఆనంద్.

నాకు చిన్నప్పటినుండి బొమ్మలు గీయడం ఇష్టం. తోటి విద్యార్థులు గీస్తుంటే నాకు గీయాలనిపించి దానిపై ఇష్టం పెంచుకున్నాను. కానీ కొందరు ఇవేమీ మనకు తిండిపెట్టవు చదువుకోవడం మంచిది అనేవారు..అయినా నా ఇష్టాన్ని వదులుకునేవాడిని కాదు. ఇప్పుడు ఆ ఇష్టమే నాకు వృత్తి పరంగా మరియు కార్టూనిస్ట్ గా ఎంతో సహాయపడింది.నేను గొప్ప చిత్రకారుడిని కాకపోయినా పిల్లలకు సహ పాఠ్యాంశాలలో భాగంగా నాకు వచ్చిన దాంట్లో కొద్దో గొప్పో నా స్కూల్ పిల్లలకు నేర్పించి వారిని అనేక చిత్రకళ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించి వారికి అనేక బహుమతులు గెలుచుకునేలా కృషిచేసినందుకు సంతోషంగా ఉంది.

నా కార్టూన్ ప్రస్థానం ఎలా జరిగిందంటే…చిన్నప్పుడు నాకు కార్టూన్ అంటే ఏమిటో తెలియని వయసులో మా నాన్న గారు కార్టూన్ చూసి ఆ హాస్యానికి పెద్దగా నవ్వుతూ మా అమ్మకు చెబుతూ ఆనందించేవారు. అప్పుడు అందులో ఏముంది ఆనందించడానికి అని వాటిని నేను పరిశీలించడం ప్రారంభించాను. లైబ్రరీ కి కథలు చడవడానికివెళ్లే నాకు వాటిని చదవడం,ఆనందించడం నేర్చున్నాను..అప్పటికి కార్టూన్లు పరిశీలించే నాకు దాన్ని ఎవరు గీసేవరో వారిగురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు..కానీ ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉన్నది. అప్పట్లో అచ్చయిన కొన్ని కార్టూన్లు నేను గీస్తూ ఆనందించేవాడిని. చదువు కోవడం వలన మరియు కార్టూన్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేకపోవడం వలన తర్వాత పెద్దగా పట్టించులోలేదు. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక పుస్తకాల దుకాణంలో కార్టూన్స్ గీయడం ఎలా? అనే పుస్తకం చూసాను. దాన్ని చదివాక కార్టూన్లు గీయడం అంత సులువేమి కాదని అర్థమైంది. దానిలో ఒక కార్టూనిస్ట్ ఎలా ఉండాలి?,ఎలా ఉండకూడదు?..ఎలా గీయాలి?..లాంటి అనేక విషయాలు చదివి తెలుసుకున్నాను. 2014 నుండి కార్టూన్లు గీయడం ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదట్లో నా కలం పేరు “P. Ramachandrarao” అని రాసే వాడిని. అది పెద్దదిగా ఉందని “ప్రేమ” అని నా ఇంటి పేరు కలం పేరుగా మార్చాను. కొందరు ఆ కలం పేరు చూసి లేడీ కార్టూనిస్ట్ అనుకునేవారు. అందుకని మరలా నా కలం పేరును “ప్రేమ్” గా మార్చుకున్నాను.. ఇప్పటికీ అదే కొనసాగుతుంది.

Prem Cartoon

2015 లో నా కార్టూన్ ఒకటి ఫేస్బుక్ లో పోస్ట్ చేసాను.ఆ తర్వాత కాలంలో నేను సాంఘిక అవగాహనకు, సమయ సందర్బంగా ముఖ్యమైన దినములలో (స్వచ్ఛభారత్ పై, ఎయిడ్స్, దోమల పై) అనేక కార్టూన్ల్ వేసే వాడిని. వాటిని మా స్థానిక విలేకరులు గుర్తించి వాళ్ళ (ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, విశాఖటుడే, సూర్య ) స్థానిక పేపర్లలో ప్రచురించేవారు. అవి నాకు చాలా మంచి పేరు తీసుకువచ్చాయి. అప్పటికి నాకు కార్టూన్ ప్రపంచం, కార్టూనిస్టులు గురించి నాకు తెలియదు. ఒకరోజు హాస్యానందం మ్యాగజైన్ pdf దొరికింది. అందులో కార్టూన్స్ ప్రచురిస్తారన్న విషయం తెలుసుకుని ఒక రోజు హాస్యానందం ఎడిటర్ గారికి ఫోన్ చేసాను. మీరు కార్టూనిస్టా అని అడిగారు. కాదు సర్ నేను టీచర్ ని.. ఇప్పుడిప్పుడే కార్టూన్స్ వేస్తున్నాను అని చెప్పాను. సరే పంపించండి అని అనేసరికి సెప్టెంబర్ 2016 న వారికి మెయిల్ చేసాను. ఆతృతతో ఉన్న నాకు 2016 అక్టోబర్ లో నా మొదటి కార్టూన్ మ్యాగజైన్ లో పబ్లిష్ అవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. 200/-బహుమతి కూడా వచ్చింది. అప్పటికి నాకు ఏ ఒక్క కార్టూనిస్టుతోను పరిచయం లేదు.ఇలా హాస్యానందం లో కార్టూన్స్ వేస్తున్న రోజుల్లో ఒకరోజు బాచి గారు నాకు ఫోన్ చేశారు. అప్పటికి ఆయన కార్టూన్స్ చూసాను కాని.. ఆయన నాకు పరిచయం లేదు.ఆ పరిచయంతో ఒక్కసారిగా నన్ను కార్టూనిస్టుల ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి బాచి గారు. ఆ పరిచయంతో చాలా విషయాలు తెలుసుకున్నాను. అప్పటికే నిర్వహిస్తున్న కార్టూన్ వాట్సాప్ గ్రూపులకు నన్ను బాచి గారు చేర్పించారు. అందులో నేను చాలా జూనియర్ ని. ఎంతోమంది సీనియర్ కార్టూనిస్టులతో పాటు కొద్దిగా జూనియర్స్ కూడా ఉండేవాళ్ళం. ఆ గ్రూపుల్లో ఒకసారి శ్రీ జయదేవ్ బాబు గారు ఒక కార్టూన్ పోటీ (వంపు-సొంపు) నిర్వహించారు. అందులో అనేకమంది పాల్గొన్నారు. నేనుకూడా పాల్గొన్నాను. అనూహ్యంగా నా కార్టూన్ ఆయనికి నచ్చడం, మెచ్చుకోవడంతో…నేను కూడా కార్టూన్స్ వేయగలను అనే బరోసానిచ్చారు శ్రీ జయదేవ్ గారు.. అవిషయం ఎప్పటికి మర్చిపోలేను…అలా రాను రాను కార్టూనిస్టుల ఆలోచనలు, ఎలాగీస్తున్నారు? అన్న విషయాలను పరిశీలిస్తూ.. ఇప్పటికీ నేర్చుకుంటూ కార్టూన్స్ గీస్తున్నాను. నా కార్టూన్లు దాదాపు అన్ని పేపర్స్ (జిల్లాలో) లోను అలాగే హాస్యానందం, విపుల, జాగృతి, మల్లెతీగ, హ్యూమర్టూన్స్, గోతెలుగు, విశాఖ సంస్కృతి, కౌముది, అచ్చంగా తెలుగు, తెలుగుతల్లి కెనడా, కన్నడ సుధ(కన్నడ), నయన్ (కన్నడ), అనుభూతి (మరాఠీ), కార్టూన్ వాచ్ (హిందీ), BirKitapBinDosT (టర్కీ), 2017 తెలుగు ప్రపంచ మహాసభల కార్టూన్ పుస్తకం వంటి పత్రికలలో నా కార్టూన్స్ ప్రచురించబడ్డాయి.

కొన్ని కార్టూన్ పోటీలలో బహుమతులు కూడా వచ్చాయి.
1. స్పెషల్ జ్యూరీ అవార్డ్ – 2016 (కోనసీమ చిత్రకళ పరిషత్-అమలాపురం)
2. స్పెషల్ ప్రైజ్ (శ్రీమతి ఘంటా ఇందిరా స్మారక పోటీ 2019)
3. శ్రీమతి ఘంటా ఇందిరా స్మారక అవార్డ్ రెండవ బహుమతి
4. గుళ్లపల్లి అరుణకుమారి స్మారక పోటీ-2021
5. స్పెషల్ ప్రైజ్- 2021 (జాషువా సాంస్కృతిక వేదిక-విజయవాడ).

Prize winning cartoon

అదేవిధంగా నా వృత్తి పరంగా చూస్తే ఈ మధ్యకాలంలో AP స్టేట్ గవర్నమెంట్ ముద్రించే పాఠ్యపుస్తకాలలో కొన్ని బొమ్మలు (3 నుంచి 6 తరగతులకు) వేసే అవకాశం రావడం నా అదృష్టం.. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో రాబోయే అంగన్వాడీ పిల్లల పాఠ్యపుస్తకం లోను బొమ్మలు వేసాను.. అది రావలసి ఉంది.
అదేవిధంగా కరోన వలన లోక్డౌన్ కాలములో కరోన పై అనేక కార్టూన్లు వేసాను. వాటిని AP గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమీస్నర్ వారు వాళ్ల ఒక వెబ్సైట్లో నా కార్టూన్స్ పబ్లిష్ చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను. అదేవిధంగా నేను వేసిన AP గవర్నమెంట్ పథకం “జగనన్న విద్యాకానుక” కు వేసిన కార్టూన్ నాకు మంచి పేరు తీసుకువచ్చింది.

Jagan Anna Vidya Kaanuka

నాకు కార్టూన్స్ గీయడంలో మా నాన్నే ఇన్స్పిరేషన్. నాకు తక్కువ వాక్యం ఉన్న కార్టూన్స్,వాక్యరహిత కార్టూన్స్ గీయడమంటే చాలా ఇష్టం. ఇవి ఒక కార్టూనిస్ట్ కి మంచి పేరు, గుర్తింపు తీసుకువస్తాయనడంలో సందేహమే లేదు. కార్టూన్స్ అనేవి నా దృష్టిలో పెద్దవాళ్ళకి మాత్రమే కాదు పిల్లల్లో పఠనాశక్తి, వ్యాఖ్య నిర్మాణం, కొత్తపదాల పరిచయం, వాళ్లకు కార్టూన్స్ వేయాలన్న తపన పెరుగుతుందనడంలో సందేహం లేదు. కార్టూన్స్ అనేవి చాలా గొప్పవి.. అందునా తెలుగు కార్టూన్స్ ఇంకా గొప్పవి.. తెలుగు కార్టూన్ వర్ధిల్లాలి.. తెలుగు కార్టూనిస్టులు వర్ధిల్లాలి..ఈ మంచి అవకాశం ఇచ్చి నన్ను గుర్తించిన గొప్ప వ్యక్తి కళాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదములతో.

మీ “ప్రేమ్”

Prem with his Prize winning students
Prem Cartoonist
Education now and then
Baahubali 2021

14 thoughts on “నన్ను లేడీ కార్టూనిస్ట్ అనుకునేవారు-ప్రేమ

  1. 64 కళలు అనే ఈ గొప్ప పత్రికలో నన్ను పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు కళాసాగర్ గారు…

  2. ప్రేమ్ గారు మీ కార్టూన్ ప్రస్థానం బాగుంది.తక్కువ సమయంలో చక్కటి కార్టూనిస్టుగా పేరు తెచ్చుకున్నారు.విజయోస్తు.

  3. చాలా బాగుంది ప్రేమ్ గారు మీ కార్టూన్ ప్రయాణం.చక్కటి పేరు తెచ్ఛుకున్నారు కార్టూనిస్టుగా తక్కువ సమయంలో. మీ బొమ్మలు బాగుంటాయి.వ్యాఖ్య చిన్నగా ఉండటమే నిజమైన కార్టూన్.అలా మీ కార్టూన్లు సందేశంతో, కొన్నిసార్లు హాస్య పూరితంగా ఉంటాయి.విజయోస్తు.

  4. వర్ధమాన కార్టూనిస్టుల్లో ప్రేమ్ గారు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. కార్టూన్ అంశం, గీత-రాత లో మంచి శైలి గల కార్టూనిస్ట్. ప్రేమ రామచంద్ర రావు గారికి నా అభినందనలు…… రామశర్మ, కార్టూనిస్ట్. విశాఖపట్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap