నా పూర్తి పేరు నాయుడు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ కలం పేరుతో కార్టూన్లు గీస్తున్నాను. నేను సామాన్య వ్యవసాయ కుటుంబములో జనవరి 14, 1973. జన్మస్థలం వేటపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా లో జన్మించాను.. నాన్న నాయుడు చంద్రారెడ్డి, అమ్మ శారదాంబ. మేము ఒక అక్క, ఆరుగురు అన్నదమ్ములం. నేను మూడవ సంతానం. మా నాన్న వడ్రంగం ప్రధాన జీనవనోపాధిగా ఎంచుకొని, దారుశిల్పంలో నిష్ణాతులుగా ఎదిగారు. నాకు ఉహ తెలిసేటప్పటి నుండే మా నాన్న పెన్నిల్ తో బొమ్మలు గీస్తుండటం చూశాను. చెక్కలపై రకరకాల లతలు, పూవులు, దేశ నాయకులు బొమ్మలు చెక్కేవాడు. అలాగే మా అమ్మ కూడా ఇంటి ముందు రోజూ పెద్దపెద్ద ముగ్గులు వేసి, రంగులతో నింపేది.
అందుకేనేమో.. నాకు చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం ఇష్టంగా మారింది. బడికి వెళ్లినా తరగతిలో ఎప్పుడూ బొమ్మలు గీచుకుంటూ కూర్చునే వాడిని. ఈ అలవాటు రెండో తరగతి నుండే మొదలైనది. అలా పదవ తరగతి వరకూ డ్రాయింగ్ పోటీలలో వివిధ స్థాయిలలో బహుమతులు అందకున్నాను.
కొన్ని అనివార్య కారణాలతో నా చదువు ఇంటర్ తోనే ఆగిపోయింది. మొదట సైన్ బోర్డు ఆర్టిస్టు గా జీవితం ప్రారంభమైయ్యింది. తరువాత ఇలస్ట్రేటర్గా గ్రాఫిక్ డిజైనర్గా మారాను. నేను మొదటి నుండి కరుణాకర్ గారి, బాలి గారి బొమ్మలు ఎక్కువగా సాధన చేసేవాడిని.
తరువాత లైన్ కింగ్ రాజు గారి “లింగా ది గ్రేట్” కథలో బొమ్మలు నన్ను బాగా ఆకర్షించాయి.
1995లో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించ ఫ్రీ హేండ్ అవుట్ లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్ లో హయ్యర్ గ్రేట్ పూర్తి చేశాను. 1997లో హైదరాబాద్ గోషమహల్ హైస్కూల్ నందు టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ పూర్తిచేశాను. 2004 నుండి 2007 వరకు డ్రాయింగ్ టీచర్ గా చేశాను. 1996న హైదారాబాద్ లో మొదట రాజు గారి పరిచయం, వారి సహకారం, సూచనలతో నా కార్టూన్ల సాధన జరిగింది. కానీ ముద్రణకు ఎప్పుడూ పంపలేదు. 2003లో మొదటి సారే రాష్ట్రస్థాయి రాజకీయ కార్టూన్ల పోటీలలో ప్రధమ బహుమతి అందుకొని ప్రింట్ మీడియా కెక్కాను.
2008లో జూన్ 14 నుండి ఆంధ్రజ్యోతి పత్రిక నందు 2016 జూన్ 14 వరకు ఆర్టిస్టుగా “రాజశేఖర్” కలం పేరుతో కెరీర్ కొనసాగింది. 2008లో బాల భవన్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలలో రెండవ బహుమతి, 2014లో “హాస్యానందం” వారు నిర్వహించిన పోటిలలో మూడవ బహుమతి పొందాను.
2016 జూన్ 15 నుండి ఆంధ్రభూమి పత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా కెరీర్ కొనసాగిస్తున్నాను. 2017 ఉత్తమ కార్టూనిస్టు పురస్కారం అందుకున్నాను. ఇప్పటి వరకు నేను దాదాపు 1200 ల కార్టూన్లు వేశాను. అనేక మంది ప్రముఖుల కేరికేచర్లు గీసాను.
తెలుగు కార్టూనిస్టులందరి వివరాలు ఎంతో శ్రమతో సేకరించి పుస్తక రూపంలో తెస్తున్న కళాసాగర్ గారికి ధన్యవాదాలతో…
–రాజశేఖర్, కార్టూనిస్ట్, ఆంధ్రభూమి.
రాజశేఖర్ గారు మీ ప్రస్థానం బావుంది.మీ కార్టూన్లు బాగుంటాయి. మీ బొమ్మలలో మీ కృషి కనపడుతుంది. విజయోస్తు.