మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

నాపేరు జిందం రాంమోహన్, పుట్టింది 23 సెప్టెంబర్ 1970, వరంగల్ జిల్లా నెక్కొండ లో. చదివింది ఇంజనీరింగ్ డిగ్రీ.  ప్రస్తుతం హైదరాబాద్లో అధ్యాపకనం వృత్తి లో వున్నాను.

చిన్నప్పుడు మా నాన్నగారు ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ తెప్పించేవారు. చందమామ కథలన్నీ నాతో చదివించి వినేవారు. అలా రీడింగ్ అలవాటుగా మారింది.
ఇంట్లో ఈనాడు పేపరులో కార్టూన్ గురించి చర్చించుకొని నవ్వుతుండేవారు. ఆ పాకెట్ సైజు బొమ్మల్లో ఏముంటుందని పరిశీలించేవాడిని. ఓసారి మా నాన్నగారిని అడిగా ఈ బొమ్మల్లో ఏముందని మీరు గొప్పగా మాట్లాడుకుంటున్నారని? రోజూ పేపర్ చదివితే తెలుస్తుందని అన్నారు. అలా దిన పత్రికల ద్వారా కార్టూన్ల పరిచయం జరిగింది. ఆ తరువాత అన్ని రకాల కార్టూన్లు పరిశీలించడంతో నాకూ కార్టూన్లు గీయాలన్న ఆలోచన మొదలైంది. పెన్సిల్ తో ప్రింట్ సైజులో కార్టూన్లు గీసి పంపితే తిరిగొచ్చేవి.

కార్టూన్లు గీయటానికి ప్రత్యేక సైజు, ఇండియన్ ఇంక్ అనేవి ఉంటాయని చెప్పింది నా క్లాస్ మేట్ అక్బర్ (ఆంధ్రజ్యోతి చీఫ్ ఆర్టిస్ట్). నా మిత్రుడు జి.యస్.వాసు (న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ చీఫ్ ఎడిటర్) నా కార్టూన్లని ఆంధ్రజ్యోతి వీక్లీ విజయవాడ ఆఫీసులో ఇవ్వడంతో నా తొలి కార్టూన్ 29-3-1985 సంచికలో ప్రింటయింది. దాదాపు అన్ని తెలుగు పత్రికలలోనూ ఇప్పటి వరకు 3000 కార్టూన్లు గీయగలిగాను. నేను గీసిన కార్టూన్లతో 2014లో “గిలిగింతలు ” పేరుతో పుస్తకం ప్రచురించాను.

చదువుకుంటూ ఇంట్లో ట్యూషన్లు చెప్పేవాడిని. ఇంజనీరింగ్ డిప్లొమా కోసం వరంగల్ పాలిటెక్నిక్ హాస్టల్లో ఉండాల్సి వచ్చినపుడు ట్యూషన్లు చెప్పడం కుదరక, పాకెట్ మనీ కోసం రెగ్యులర్ గా కార్టూన్లు గీసాను. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయ్యే వరకు టెక్స్ట్ బుక్స్ కి, పాకెట్ మనీకి కార్టూన్లే ఆధారమయ్యాయి.  నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు నన్ను బాగా ప్రభావితం చేసారు. ఒకరు యండమూరి వీరేంద్రనాథ్ తన రచనల ద్వారా అయితే, మరొకరు తన టీచింగ్ ద్వారా శ్రీరామా చంద్రమౌళి (రచయిత, కవి) వరంగల్ పాటెక్నిక్ కాలేజీలో అధ్యాపకులు.

ఎన్నో అంశాలపై కార్టూన్లు గీసిన నాకు నా అభిమాన కార్టూనిస్ట్ జయదేవ్ గారు విశ్వనాథ వారి వేయిపడగలు పుస్తకం పై  నేను గీసిన కార్టూన్ ను మెచ్చుకోవడం ఓ గొప్ప అనుభూతి.
“మన కార్టూనిస్టులు ” ఫీచర్ ద్వారా కార్టూనిస్ట్ మిత్రులకు, సోషల్ మీడియా పాటకులకు పరిచయం కావడం సంతోషం గా వుంది, ఎడిటర్ కళాసాగర్ గారికి థాంక్స్.

-రాంమోహన్

1 thought on “మూడువేల కార్టూన్లు గీశాను – రాంమోహన్

  1. మీ కార్టూన్లు చాలా కాలంగా చూస్తున్నాను . బాగుంటాయి. మీ గురించి వివరాలు తెలుసుకోవటం సంతోషంగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap