“మయూరి” పత్రికలో నా మొదటి కార్టూన్- రవి

రవి పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కొండా రవికుమార్. పుట్టింది 1960 సం. జూలై 24న. చదివింది ఇంజనీరింగ్. మా స్వగ్రామం తెలంగాణా రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లాలోని మండల కేంద్రం.. తాడూరు.

చిన్నప్పుడు… చందమామ పత్రికలో… “వడ్డాది పాపయ్య”, “చిత్ర”, “శంకర్ ” గార్ల కుంచె విన్యాసాలు చూసినాక, బొమ్మలంటే ఆసక్తి కలిగింది.
వారపత్రికలు తిరగేసే వయసు వచ్చే సరికి, శ్రీయుతులు బాపు, బుజ్జాయి, బాబు, జయదేవ్, శంకు, చంద్ర, బాలి, రామక్రిష్ణ, సురేఖ, రాగతి పండరి, ఏవీఎం, సుధామ, తులసిరాం గార్ల కార్టూన్లు చూడడం కోసం లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అలాగే, “ఇలెస్ట్రేటెడ్ వీక్లీ” లో “మెరియో ” గారి కార్టూన్లు కూడా విపరీతంగా ఆకర్శించేవి.

ఆంధ్రభూమి వారపత్రిక, మాసపత్రిక, ఉదయం, మయూరి, పల్లకి లాంటి పత్రికల ఆవిర్భావంతో, పై సీనియర్ కార్టూనిస్టులతో పాటు, మల్లిక్, ఎమ్మై కిషన్ మొదలైన వారు కూడా… విచ్చలవిడిగా కార్టూన్లు గీయడం ప్రారంభించారు.
నాకూ కార్టూన్లు గీయాలన్న కోరిక ప్రారంభమైంది కానీ, ఎలా గీయాలో తెలిసేది కాదు. అప్పుడే ప్రముఖ కార్టూనిస్టు బి.ఎస్. రాజు గారితో కలం స్నేహం కలిసింది. అప్పట్లోనే, ఆంధ్రభూమి వారపత్రికలో శ్రీ సత్యమూర్తి గారు, కార్టూన్లు ఎలా గీయాలో సచిత్రంగా, సవివరంగా నేర్పడం ప్రారంభించారు.

Ravi Kumar cartoon1

రాజు గారి సహకారంతో, మిత్రుడు ఐజాక్ ప్రోత్సాహంతో కార్టూనింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను.
అప్పట్లో, “రవి” అనే పేరుతో ఇద్దరు, ముగ్గురు కార్టూనిస్ట్ లు ఉండడంవల్ల, “టాం” అనే పేరుతో కార్టూన్లు వేసి..పత్రికలకు పంపడం ఆరంభించాను. అయితే ఆ కార్టూన్లన్నీ జాగ్రత్తగా తిరిగి వచ్చేవి.
ఎలాగైతేనేం చివరికి… నా మొదటి కార్టూన్ 1983లో “మయూరి” పత్రికలో ప్రచురితమయింది. ఇక అప్పటి నుండి దాదాపు అన్ని తెలుగు పత్రికలలోనూ నా కార్టూన్లు ప్రచురించబడ్డాయి.

1985లో “ఆంధ్రభూమి” వారపత్రిక నిర్వహించిన “కార్టూన్ కథల” పోటిలో.. నా కార్టూన్ కథ ” హియరీస్ మిస్టర్ స్వప్నకుమార్, M.A కు మొదటి బహుమతి వచ్చింది.
1991లో సంక్రాంతికి “ఉదయం” వారపత్రిక నిర్వహించిన కార్టూన్ల పోటీలో నా “రాజు గారు.. జూ” కార్టూన్ కు ద్వితీయ బహుమతి, 1993లో “ఆంధ్రభూమి” వారపత్రిక నిర్వహించిన కార్టూన్ల పోటీలో నా “సిందుబాద్..రాక్షసుడు” కార్టూన్ కు ద్వితీయ బహుమతి..(ఈ పోటీకి.. శ్రీ బాపు గారు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు).

మళ్ళీ ఈ మధ్యే “ఫేస్ బుక్” పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను.
2018 లో… కార్టూనిస్టు మిత్రులు బాచిగారు…వారి తల్లి గారి స్మారకార్థం…హాస్యానందంతో కలిసి నిర్వహించిన కార్టూన్ల పోటీలో నా కార్టూన్ కు ద్వితీయ బహుమతి లభించింది.

2019లో… తెలుగు కార్టూనిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకొని…హాస్యానందం మాసపత్రిక, సత్కళా భారతి సంస్థల వారు సంయుక్తంగా నిర్వహించిన కార్టూన్ల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందాను.
ఇప్పటి వరకు.. వివిధ పత్రికలలో రెండువేలకు పైగా కార్టూన్లు ప్రచురితమయ్యాయి. నా అర్థాంగి విష్ణు కళ నాకు అన్ని విధాలుగా సహరిస్తుంది. మాకు సింధు సమీర, వింధ్య వాసిని అనే ఇద్దరు అమ్మాయిలు. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పని చేస్తున్నాను.
-కొండా రవికుమార్

Ravi kumar 2
Ravikumar cartoon
Ravi kumar cartoon

1 thought on ““మయూరి” పత్రికలో నా మొదటి కార్టూన్- రవి

  1. రవిగారు మీ కార్టూన్ ప్రస్థానం బాగుంది. మీ కార్టూన్లు చాలా బాగుంటాయి.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap