మాది ఒక పల్లెటూరు. పేరు మార్కొండ పుట్టి,విజయనగరము జిల్లా, రైతు కుటుంబము అమ్మ పేరు శ్రీమతి కురుములమ్మ, నాన్నగారి పేరు శ్రీ జగనాధం నాయర్, నేను పుట్టింది 1జూన్ 1948లో. నాకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెల్లు. నా భార్య పేరు మహాలక్ష్మీ మాకు ఒక ఆడపిల్ల, ముగ్గురు మగపిల్లలు, నా ముద్దు పేరు శంబంగి, దానినే నా కలము పేరుగా పెట్టుకున్నాను. నా పూర్తి పేరు శంబంగి చిన్నంనాయుడు. నాకు చిన్నప్పటినుండి బొమ్మలు గీయడము అంటే సరదా. నేను 5వ తరగతి చదివిన దగ్గర నుండి, చందమామ మాసపత్రికలో వున్న బొమ్మలు కాపీ చేసేవాడిని. అంత చిన్న బొమ్మలు వేయడము కష్టంగా వుండేది. కార్బన్ పేపరు పెట్టి కాపీ చేసేవాడిని. కార్బన్ పేపరు దొరకకపోతే, తెల్లని కాగితానికి నూనె పూసి, బొమ్మ మీద పెట్టి కాపీ చేసేవాడిని.
నేను వేసిన మొదటి బొమ్మ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ది. నా అయిదో క్లాసు పుస్తకములో వున్న అతని బొమ్మను ఏ మాత్రము తేడా లేకుండా గీసేసరికి, “శభాష్” అని మా టీచరు అచ్చుదించేసావురా” అని మా క్లాసు పిల్లలు మెచ్చుకొనే సరికి ఏదో తెలియని ఆనందము కలిగింది. సంక్రాంతికి మా అమ్మ ఇంటికి సున్నాలు వేయించింది. మా ఇంటి గడప గోడ తెల్లని పెద్ద పేపరులా కనబడింది. పెన్సిల్ లో గోడమీద రవీంద్రుని వేసి దానిని చూసుకుంటూ మురిసిపోతున్న శుభవేళ, మా అమ్మ వచ్చి నా వీపు మీద దభి దభా వాయించింది. అప్పటినుండి దొంగ చాటుగా బొమ్మలు వేసుకునేవాడిని.
మా నాన్నగారి ఆకస్మిక మరణము వలన డిగ్రీ చేయలేకపోయాను.
1978 సం.లో వెంకట్ అవార్డు కార్టున్ల పోటీలో నా మొదటి కార్టూనుకు ఉత్తమ బహుమతి వచ్చిన దగ్గర నుండి కార్టూన్లు వేయాలనే కుతుహలము పెరిగింది. అవార్డు వచ్చిన సందర్భముగా క్రోక్విల్ క్లబ్, హైదరాబాద్ లో ఒక సంవత్సరం పాటు ఉచిత సభ్యత్వము యిస్తూ (కోక్విల్ పత్రికను నెల నెలా పంపించేవారు. శ్రీ శంకుగారు ఈ పత్రిక ద్వారా కార్టూనిస్టులకు మంచి సూచనలు యిస్తూ ప్రోత్సహించేవారు. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. అప్పుడు నేను M/s.JK – Paper Mills, Rayagada Orissaలో సీనియర్ ఆపరేటర్ గా పనిచేస్తుండేవాడిని.
మేనేజ్ మెంటు వారు Safety Poster competition పెట్టారు. నేను పాల్గొన్నాను. నాకు మొదటి బహుమతి వచ్చింది. safety manager ప్రైజుని అందజేస్తూ ఆఫీసుకి రమ్మన్నారు. ఒక సేఫ్టీ బుక్ ని యిస్తూ అందులో వున్న stamp size posters ని పెద్ద సైజుగా గీసి కలర్స్ వేయమన్నారు. మెటీరియల్ అంతా యిచ్చారు. వారం రోజుల్లో పని పూర్తిచేసి యిచ్చాను. ఒక్కొక్క పోస్టర్ కి వెలకట్టి పేమెంట్ చేసారు. ఇది నేను ఊహించలేదు. అప్పటి నుండి అదనపు ఆదాయమే కాదు. ఇష్టమైన part time దొరికింది. నాకు బొమ్మలు ప్రాక్టీసు చేసే అవకాశము దొరికింది.
విజయవాడలో క్రోక్విల్ క్లబ్ వార్షికోత్సవము జరిగింది. కార్టూనిస్టు రామశర్మగారు, నేను విజయవాడకు వస్తున్న ట్రైనులో కలుసుకున్నాము. రాయగడ రాంరావు, కార్టూనిస్టు రవిసార్ అప్పుడే శ్రీ జయదేవ్ గారిని కలవడము జరిగింది. వారి ద్వారా ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ శివలెంక రాధాకృష్ణగారిని కలవడం జరిగింది. వారి పత్రికకు కార్టూన్లను పంపిచుమన్నారు. అక్కడ నుండి నా కార్టూన్లు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, యువ మాసపత్రికలో ఎక్కువ వచ్చాయి. స్వాతి, ఉదయము, అపరాధ పరిశోధన జ్యోతి, వీక్లీ, జయము తేజ మొదలగు పత్రికల్లో వచ్చాయి. అప్పటిలో రూ. 8 నుంచి 20/- పారితోషంగా పత్రికలవారు యిచ్చేవారు.
M/s JK పేపరు మిల్లు (ఒరిస్సా) నుంచి, M/s. AP Rayans Ltd Kamalapuram మిల్లుకి వెళ్ళాను. అక్కడ కూడ safety day celetrations లో poster పోటీలు, స్లోగన్ పోటీలు, సేఫ్టీ డ్రామాలు పెట్టేవారు. అక్కడ కూడా చాలా బహుమతులు వచ్చాయి.
నేను నెయిల్ ఆర్ట్స్ వేసేవాడిని, సేఫ్టీ డ్రామాలు, వ్రాయడము అక్కడే ప్రారంభించాను. మొదటి సంవత్సరము స్కూటినీలోనే నేను వ్రాసిన డ్రామా సెలక్టు కాలేదు. నిరాశ చెందకుండా తరువాత సంవత్సరము నుండి ప్రతీ సంవత్సరము ఫస్ట్ లేక సెకండ్ ప్రైజులు వచ్చాయి. అప్పుడు ఆరు డ్రామాలు వ్రాసాను. ప్రదర్శించాను కూడ. ఒక డ్రామాలో స్త్రీ పాత్ర Safety Manager కూడ వేసాను.
నేను 1983 -1986 సం.లో Distance Education ద్వారా B.A. పాసయ్యాను.
AP రేయాన్లో జాబ్ వచ్చిన తరువాత సురేందనాధ్ కార్టూనిస్టుతో పరిచయము అయింది. ఆయన అక్కడ Personnel Manager అతను కూడా కార్టూనిస్టు అని తెలిసిన తరువాత చాలా చాలా కార్టూన్లు వేసేవాడిని.
ఎ.పి. రేయాన్స్ కొత్త మిల్లు, పని ఒత్తిడి ఉండేది. అయినా కార్టూన్లు వేయడము మానలేదు. ప్రతీ కార్టూన్ల పోటీల్లో పాల్గొనే వాడిని. నాకు అదో సరదా.. ఎందుకంటే – అవి నాలో ఉన్న బలాన్ని, బలహీనతల్ని తెలియజేస్తాయి. నా ప్రస్థానాన్ని ప్రగతి మెట్లుగా ఊహిస్తాను. అలాగే ప్రతీ కార్టూనిస్టుల కార్టూనులను పరిశీలిస్తూ వుంటాను. వారి థాట్స్ ని ఎలా ప్రెజంటు చేస్తారో చదువుతుంటాను. ఆనందిస్తాను.
బాపూ గారి తరువాత, గురు జయదేవ్, సరసిగారుల సున్నితమైన హాస్యాన్ని ఎంజాయ్ చేస్తుంటాను. అలాగే సుభాని(డి.సి.), సురేద్ర(హిందూ), శ్రీధర్ (ఈనాడు) గారి పొలిటికల్ కార్టూన్లను బాగా ఎంజాయ్ చేస్తుంటాను.
నేను సుమారు రెండు వేలకు పైగా కార్టూన్లలో గీసాను.
కార్టూనింగ్ లో నాకు వచ్చిన బహుమతులు:
1978, 1979 వెంకట్ అవార్డు
-హాస్యప్రియ పత్రిక 1982 Indian Telephone Century Award.
1983 రోటరీ క్లబ్, విజయవాడ.
1984 ఆంధ్రప్రభ వీక్లీ జన్మదిన అవార్డు
1993 ఇదీ జీవితము స్వాతి అవార్డు
2013, 2014 హాస్యనందము అవార్డు
2015 తలిశెట్టి రామారావు అవార్డు
CONGRATS to Sri Sambangi garu.
చాలా బాగుంది
సకల కళాభిరాముడు సంబంగి..
Sunkara Chalapatirao
Happy to see about you. Hearty Congrats!
It is pleasant that you mentioned our association at A. P Rayons.
Looking forward to more cartoons from you.
congrats sir
Very interesting sir…. congrats
కార్టూనిస్ట్ శంబంగి గారి పరిచయం చదివి చాలా ఆనందించాను.ఆయన తో కల్సి j.k.paper mills,Rayagada, (odisha)
లోకొన్నాళ్ళు తోటి ఉద్యోగిగా పనిచేసినందుకు ,ఆరోజుల్లో ఆయన తో కల్సి కార్టూన్ విషయాలు చర్చించుకోవడం
చాలా వినోదంగా,విజ్ఞానంగా ఉండేది.1980 లో అనుకుంటాను క్రోక్విల్ సమావేశాలకు నేను శంబంగి గారు వెళ్తున్న
బోగీలోనే రామశర్మ గారూ ఉండి మాతో కలవడం ,విజయవాడ వెళ్ళడం ప్రముఖ కార్టూనిస్ట్లను కలవడం శంకు గార్ని
గురువుగారు శ్రీ జయదీవ్ గార్ని,కాటూరి గార్ని మొదలగు వారిని చూసి సంతోషం పంచుకోవడం మర్చిపోలేని
అనుభూతి.శంబంగి గారు తన పరిచయ వాక్యాలలో నన్ను గుర్తుంచుకున్నంకు చాలా ఆనందంగా ఉంది.
సంబంగి గారు చాలా విషయాలు చక్కగా వివరించారు .అభినందనలు .మీరు ఇంకా మంచి కార్టూన్లు
వేయాలని ,బహుమతులు పొందాలని కోరుకుంటున్నాను .. .
రామారావు సింగిడి (రాంరావ్)
శoభంగి గారు మీ జీవిత సంగ్రహమంతా సోదాహరణంగా వివరించారు చాలా సంతోషం మీ కార్టూన్ మేము కూడా చూస్తూ ఉంటాం చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది మీరు మరెన్నో అవార్డులు రివార్డులు పొందాలని మీ ప్రియ మిత్రుడు శరత్ బాబు
మీ సహచర ఉద్యోగిగా, 6సంవత్సరాల పాటు (1987-92) మీ పొరుగున ఉన్న క్వార్టర్ లో నివాసం ఉన్న నేనూ అదృష్ట వంతుడినే. ఒక్క సారి ఆ జ్ఞాపకాలు మధురానుభూతి కలిగించాయి. ధన్యోస్మి 🙏