శరత్ బాబు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు సూరంపూడి శరత్ బాబు. పుట్టింది 15-12-1963 ఆరుతెగలపాడు కృష్ణాజిల్లా, హనుమంతరావు, స్వరాజ్యలక్ష్మి నాతల్లితండ్రులు, నాన్న గారి స్వస్థలం మల్లిపూడి, పశ్చిమగోదావరి జిల్లా, రెండవ తరగతి చదువుతున్నప్పటి నుండి సూర్యుడు, చంద్రుడు, కొండలు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు… ఇలా చూసినవి చూసినట్లుగా బొమ్మలు గీస్తుండేవాడిని. ఆ తరువాత ఏడవ తరగతికి వచ్చాక సైన్సు బొమ్మల పట్ల ఆసక్తి పెరిగింది. అక్కయ్య రాధిక, తమ్ముడు, శ్రీకాంత్, బందువుల పిల్లలకి పాఠ్యపుస్తకాలలోని బొమ్మలు గీసి ఇస్తుండేవాడిని.
తండ్రి ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో 6వ తరగతి నుండి హైదరాబాదులోనే నా చదువు కొనసాగింది. పదవ తరగతికి వచ్చాక కార్టూన్స్ పట్ల ఆసక్తి కలిగి రెండు కార్టూన్స్ గీసి ఆంధ్రభూమి వారపత్రికకు పంపించటం జరిగింది. అవి తిరుగుటపాలో వచ్చేసాయి. ఇలా రెండు సంవత్సరాలపాటు బోల్డన్ని కార్టూన్లు పత్రికలకు పంపటం అవి తిరిగి రావటం జరుగుతుండేది. 15 మార్చి 1983లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా మొట్టమొదటి కార్టూన్ ప్రచురించి కాంప్లిమెంటరీ కాపీ, 15 రూపాయలు పారితోషికం పంపించారు. అప్పటివరకు కార్టూన్ ఎలా గీయాలో ?తెలియక.. అనేక సంధిగ్దాలలో వున్న నాకు ఆ ఒక్క కార్టూన్ ప్రచురణ వూపిరి పోసింది. ఆ కార్టూన్ ప్రచురణ నా జీవితాన్ని మార్చివేసింది. అప్పటి నుండి దాదాపు అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికలలో నా కార్టున్స్ అచ్చు అయినవి. వెంకట్ అవార్డ్సు కార్టూన్ల ప్రదర్శనలో నా కార్టూన్ కూడా ప్రచురించబడింది. బాపు, చంద్ర, జయదేవ్ సత్యమూర్తి, శంకు, నా అభిమాన కార్టూనిస్టులు.
ఆ తరువాత బి.యస్సీ. పూర్తి చేసుకొని, పల్లకి వారపత్రికలలో ఆర్టిస్టుగా జీవితం ప్రారంభమైంది. తరువాత పల్లకి, మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి సంపాదకత్వంలో స్రవంతి, జ్యోతి మాసపత్రిక, యండమూరి వీరేంద్రనాద్ గారి సంపాదకత్వంలో వెలువడిన హారిక వారపత్రికలో ఉద్యోగం చేయటం జరిగింది. తరువాత కొంతకాలం ప్రీలాన్స్ ఆర్టిస్ట్ గా ఆంధ్రప్రభ మొదలైన పత్రికలకు చేస్తూ వుండగా… 1991 మే నెలలో నా అభ్యర్థన మేరకు సి. కనకాంబరరాజు గారు ఆంధ్రభూమిలో నాకు ఆర్టిస్ట్ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించారు. అప్పటినుండి ఆంధ్రభూమిలో ఉద్యోగం చేస్తున్నాను. నా మొదటి కార్టూన్ ప్రచురించి నన్ను ప్రోత్సహించిన ఎడిటర్ పురాణం గారికి, ఉద్యోగం ఇచ్చిన కనకాంబరరాజు గారికి ఎప్పటికీ ఋణపడివుంటాను. ఇప్పటివరకు సుమారు పదివేల కార్టూన్లు గీసాను.
1992 సంవత్సరం విజయవాడలో జరిగిన నాపెళ్ళికి సీనియర్ కార్టూనిస్టులు ఏవియం, టీవీ గార్లు వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు. నా సహధర్మచారిణి శ్రీదేవి. మాకు ఇద్దరు సంతానం. పెద్దబాబు శ్రావణ సాయికాంత్, ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని ఆస్ట్రేలియాలో M.S. చేస్తున్నాడు. చిన్నబాబు సాయి చంద్రకాంత్ B.A. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం చేస్తున్నాడు.
బహుమతులు సాధనా సాహితి స్రవంతి (హైదరాబాదు) నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. హాస్యానందం నిర్వహించిన కార్టూన్ పోటీలలో కన్సలేషన్ బహుమతి వచ్చింది.
మళ్ళ జగన్నాధం స్మారక భువన్ బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డు వచ్చింది. అనేక పోటీలలో పాల్గొనటంలో వివిధ బహుమతులు, ప్రశంసా పత్రాలు లభించాయి. వివిధ కార్టూన్ ప్రదర్శనలో నా కార్టూన్లు ప్రదర్శించాను.
నా మొట్టమొదటి కార్టూన్ తిరస్కరించిన ఆంధ్రభూమిలో గత 30 సంవత్సరాలుగా ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేయటం కాస్త గర్వంగా ఉంది.
ఈ సందర్భంగా 64 కళలు.కాం వెబ్ సైట్ ద్వారా ఎంతో మంది కళాకారులని పరిచయం చేస్తూ ప్రోత్సహిస్తున్న కళాసాగర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
–శరత్ బాబు
Proud of you Sarath
BL
Good interview. Mr. Sharath is a good artist and out standing cartoonist. Mohan rao duriki. writer
శరత్ బాబు గారు మీ ప్రయాణం బాగుందండీ. మీ కార్టూన్లు కోడా బాగుంటాయి.