సత్యమూర్తి – కార్టూన్ కళాస్ఫూర్తి

(ఎందరో కార్టూనిస్టులకు స్ఫూర్తి నింపిన ఆ కలం ఆగిపోయింది. 84 ఏళ్ళ సత్యమూర్తి గారు గత రాత్రి (25-05-23) హైదరాబాద్ లో కన్నుమూశారు. )

వృత్తి, ప్రవృత్తి ఒకటే అయినపుడు ఇకవారికి తిరుగేముంటుంది. అలాంటివారు ఏకళలో ఉన్నా మేటిగానే ఉంటారు. అలాంటి వారిలో గడచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితులైన కార్టూనిస్టు, రచయిత సత్యమూర్తి గారొకరు.
1939 జనవరి 1, కాకినాడ లో జన్మించిన సత్యమూర్తి గారు హైదర్రాబాద్ ఒస్మానియా యూనివర్సిటి నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రులైనారు. వీరి పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. ప్రముఖ మెజీషియన్, రచయిత ప్రొ. బి.వి. పట్టాభిరామ్ వీరి సోదరులే. బాల్యంనుండి చిత్రకళలో ప్రవేశం ఉండడంతో స్వయంకృషితో కార్టూనిస్టు కాగలిగిన వీరుచదువులావు నుండి కార్టూనిస్టుగా పేరు, క్రేజ్ తెచ్చుకున్నారు. ఆంధ్రభూమి వీక్లీలో వీరు నిర్వహించిన కార్టూన్స్ వేయడం ఎలా అనే ఫీచరు తెలుగులో ఎందరో యువకార్టూనిస్టులు పుట్టుకొచ్చేలా చేసింది. తెలుగులో కార్టూన్ ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. నిబ్ తో గీసే వీరి బొమ్మల శైలి విలక్షణమైనది.

ఆంధ్రసచిత్ర వారపత్రికలో “చదువుల్రావు’, ‘అల్లాటప్పయ్య’ అనే కార్టూన్ ఫీచర్స్, ఆంధ్రప్రభ వీక్లీలో బొమ్మల కథలు, కార్టూన్ వేయడం ఎలా? అనే ఫీచర్స్ నిర్వహించారు. వీరు ప్రచురించిన కార్టూన్స్ వేయడం ఎలా? అనే పుస్తకం తెలుగులో కార్టూనింగ్ నేర్చుకునే వారికి మార్గదర్శిగా నిలిచింది. కార్టూనిస్టుగా లక్షలాది పాఠకుల అభిమానం పొందిన వీరు 1986లో వంశీ బర్కిలీ అవార్డు, 1997లో ఢిల్లీ తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కార్ అవార్డులు అందుకొని, 1998లో ఢిల్లీ తెలుగు అకాడమీ వారి సన్మానం పొందారు. 2002 లో ఏ.పి. ప్రెస్ అకాడెమి అవార్డ్ అందుకున్నారు.
కార్టూన్స్ వేయడం ఎలా? అనే పుస్తకాన్ని వీరు తెలుగులో సొంతంగా ప్రచురిస్తే, ఇంగ్లీషులో హోటు డ్రా కార్టూన్స్…? పేరుతో పుస్తక మహల్, ఢిల్లీ వారు ప్రచురించారు. సుడిగుండాలు, నర్తనశాల, ఆత్మబలం, చిలుకగోరింక, చదువుకున్న అమ్మాయిలు మొదలగు సిన్మాలకు పబ్లిసిటీ డిజైన్స్ గీస్తారు. బంగారు నంది బహుమతి పొందిన ‘సుడిగుండాలు ‘ సినిమాకి కళా దర్శకుని గా పనిచేసారు. శ్రీసత్యసాయి బాబా జీవితచరిత్రతో వెలువడిన పుస్తకాలకు బొమ్మలు గీసారు. 1987 ఢిల్లీలో కార్టూన్ ఎగ్జిబిషన్ నిర్వహించిన వీరు హైదరాబాద్లో యువకార్టూనిస్టుల కోసం అనేక సార్లు వర్కుషాప్స్ కూడా నిర్వహించారు. గతంలో లలిత కళా అకాడమీలో ఐదేళ్ళ కౌన్సిల్ మెంబరుగా ఉన్నారు. కార్టూనిస్టుగానే కాకుండా శ్రీసత్యసాయి డిజైనింగ్ స్టూడియోను స్థాపించి ముద్రణా రంగంలో ఎంతో సేవచేసారు.

1984లో జరిగిన ఒక సర్జరీ వలన సత్యమూర్తిగారికి పెరాలసిస్ వచ్చినా దాని ”నుంచి ‘ఫిజియోథెరపీ’తో పట్టుదలతో కోలుకుని, మునుపటిలా బొమ్మలు వేయగల గడం నిజంగా ఆయన ఆత్మవిశ్వాసానికీ, పట్టుదలకీ, కృషినీ దాఖలా! చివరి రోజుల్లో కూడా బొమ్మలు వేస్తూ, పనులు చేస్తూ, పుస్తకాలు చదువుతూ, సంగీతం వింటూగడిపిన సత్యమూర్తిగారు మన మధ్య లేకపోయినా వారి కార్టూన్ల ద్వారా మనందరి మదిలో చిరకాలం వుంటారు. 64కళలు పత్రిక తరపున వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

కళాసాగర్

Satyamurty Chaduvularrav

8 thoughts on “సత్యమూర్తి – కార్టూన్ కళాస్ఫూర్తి

  1. ప్రఖ్యాత కార్టూనిస్ట్ సత్యమూర్తి గారి గురించి వ్రాసిన ఆర్టికల్ విపులంగా చాలాచక్కగా ఉంది. కళాసాగర్ గారికి అభినందనలు.

  2. ఇలాంటి కార్టూనిస్టు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం విచారకరం ఆయన బొమ్మలు ఆంధ్రభూమిలో చూశాను ఏది ఏమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలి

  3. కార్టూన్ లలో విలక్షణమైన శైలి తో కార్టూన్ఎం రంగానికి ఎంతో సేవ చేసి ఎందరో కార్టూనిస్టులకు స్ఫూర్తి గా నిలిచిన శ్రీ సత్యమూర్తి గారి గురించిన మంచి ఆర్టికల్ ప్రచురించిన మీకు ధన్యవాదములు.-బొమ్మన్ ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్

  4. ఆయన కార్టూన్లు వేయడం ఎలా పుస్తకం నాకు కూడా ఇన్స్పిరేషన్

  5. ఈ తరం వారికి సత్యమూర్తి గారి గురించి సమగ్రంగా పరిచయం చేశారు. ధన్య వాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap