మొదటి కార్టూన్ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో – సురేన్

నేను పుట్టింది 1951 డిసెంబర్ 26 వ అనంతపురం లో. నా పూర్తి పేరు అప్పరాస చెఱువు సురేంద్రనాథ్. శ్రీమతి రుక్మిణి శ్రీరామారావు దంపతుల నాల్గవ సంతానం. నా సతీమణి పేరు శ్రీమతి వసంతలక్షి. సురేన్ కార్టూనిస్ట్ గా నా కలం పేరు. 1971 లో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నాను. ఎమ్.యస్.డబ్ల్యూ., డిగ్రీ ఇండోర్ స్కూల్ ఆఫ్ సోషియల్ వర్క్ నుండి 1974 లో పొందాను. నా వృత్తి హ్యూమన్ రిసోర్సస్ మేనేజ్మెంట్ మరియు డెవెలప్మెంట్. ప్రస్తుతం బెంగళూరులో 2011 నుండి కార్పొరేట్ ట్రెయినర్ గాను హెచ్.ఆర్. కన్సల్టెంట్ గా స్వేచ్ఛా వృత్తి నిర్వహిస్తున్నాను. అంతకు పూర్వం, 35 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసాను. వృత్తి లో చేరిన తర్వాత పని వొత్తిడి వలన కార్టూనింగ్ మీద కేంద్రీకరించ లేకపోయాను.

స్కూల్/కాలేజిలో చదువుకునే రోజుల్లో నాకు ఇష్టమయిన ప్రవృత్తి కార్టూనింగ్. చిన్ననాటి నుండి చిత్రలేఖనంలో ఆసక్తి ఉండేది. ఒకటో తరగతి లో ఉండేటప్పుడో యేమో, కొక్కిరిగీతలతో బొమ్మలువేసి ఇంట్లోని పెద్దవారి పేర్లను వ్రాశాను. అందరూ చూసి నవ్వి మందలించారు. అలా పేర్లు పెట్టరాదని. కార్టూన్లంటే ఏమిటో తెలియకుండానే అలా మొదలయింది నా కార్టూనింగ్.

మా చిన్నన్నయ్య ‘గోపు’ పేరుతోను, తన స్నేహితుడు గౌరి శంకర్ అప్పుడే పత్రికలలో కార్టూన్లు గీస్తూండేవాడు. అప్పుడే నేను కూడ ఎందుకు కార్టూన్లు వేయరాదని నాలో పట్టుదల పెరిగింది. వారిని గమనిస్తూ ఉండే వాన్ని కాబట్టి ఎలాంటి పేపర్, ఇంకు, పెన్ను వాడాలో? తెలిసింది. కాని, కార్టూనింగ్ లో శిక్షణ లేదు. మా అన్నయ్య ‘రేబర్న్స్ స్కూల్ ఆఫ్ కార్టూనింగ్’ లోనూ, గౌరి శంకర్ గారు ‘శంతనూ స్కూల్ ఆఫ్ కార్టూనింగ్’ లోను పోస్ట్ ద్వారా కార్టూనింగ్ నేర్చుకున్నారు. నేను బొంబాయి లోని ఐ.సి.యస్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ ద్వార నేర్చుకోవడానికి వివరాలు తెప్పించుకున్నాను. అయితే ఫీజు ఎనిమిది వందల రూపాయలు అవడం తో నాన్న గారు ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వనని చెప్పి చదువు మీద శ్రద్ధ వుంచమని చెప్పారు. నాలో ఎలాగైనా కార్టూనిస్ట్ కావాలని పట్టుదల పెరిగింది. ఇదంతా నేను పదవతరగతి (1966 లో) చదువుతున్నప్పుడు జరిగిన విషయం. సెలవుల్లో ఆంగ్ల దినపత్రికలలోను, తెలుగు వార పత్రికలలోను ప్రచురింపబడే కార్టూన్లను చూసి స్వంతంగా చిత్రాలు గీయడం ప్రారంభించాను. ‘బాపు’ గారి రాతకు ఆకర్షితులై అలానే అభ్యాసం చేయసాగాను. రోజులు గడుస్తున్నాయి. కార్టూన్లు వేయడం ప్రాక్టీసు చేస్తూనే వున్నాను. 1966 లో మా అన్నయ్య ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆయన కార్టూనింగ్ నేర్చుకున్న ‘రేబర్న్స్ స్కూల్ ఆఫ్ కార్టూనింగ్ పాఠ్య పుస్తకాలు నాకు ఇవ్వడం జరిగింది. కార్టూనింగ్ లోని మెళుకువలు, పర్స్పెక్టివ్ లాంటివి తెలుసుకోవడానికి అవి చాలా ఉపయోగపడ్డాయి నాకు.


1967 లో పదకొడవ తరగతి చదివేప్పుడు మొట్టమొదటి సారిగా నా కార్టూన్ ఒకటి ‘అపరాధపరిశోధన’లో ‘అనురాధ’ (నా జన్మ నక్షత్రం) అనే కలం పేరు తో ప్రచురితమయ్యింది. ఆ కార్టూన్ని దాచుకోలేకపోయాను. మొదటి కార్టూన్ ప్రచురితమవడంతో నాలో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. కార్టూన్లు పత్రికలకు పంపేవాన్ని, కాని అన్నీ తిరుగు టపాలో వచ్చేసేవి. అయినా నేను ఏ మాత్రం కార్టూన్లు వేయడం కాని, పత్రికలకు పంపడం కాని మాన లేదు. 1969 లో మా పిన్ని ప్రమీలకు అబ్బూరి గోపాలకృష్ణ గారితో హైద్రాబాద్ లో వివాహమయింది. విడిది ఇంట్లో వుంచే వస్తువుల మీద చిన్న కార్టూన్ల తో వస్తువు వివరాలు రాసి అతికించాను. అందరూ మెచ్చుకున్నారు. ముఖ్యంగా వధూవరుడైన అబ్బూరి గోపలకృష్ణ గారు ఎవరీ ఆర్టిస్ట్ అని వాకబు చేసి నాకు సన్నిహితులయ్యారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం లో థియేటర్ ఆర్ట్స్ లో అధ్యాపకులుగా చేరి అక్కడే ఆచార్యులుగా రిటైర్ అయినారు. ఆయన మెచ్చుకోవడంతో, కార్టూన్లు వేయడానికి నాలో మరింత ఉత్సాహం పెరిగింది. అలా విసుగు చెందని విక్రమార్కుడిగా కార్టూన్లు వేస్తూ పత్రికలకు పంపుతూ వుండే వాన్ని.


1971 లో ఒక సాయంత్రం మా చెల్లెలు శైల నా కార్టూన్లు ‘ఆంధ్రజ్యోతి’ వార పత్రికలో ప్రచురితమయ్యాయని మా ఇంటి దగ్గరే ఉన్న తన స్నేహితురాలు సౌమ్య చెప్పి చూపించిందని అలా… ఆ శుభవార్త కాస్తా నా చెవిలో వేసింది. ఇంట్లో వారందరికీ సంతోషమయింది. అప్పట్నించి వరుసగా ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో నా కార్టూన్లు ప్రచురితమవడం మొదలయ్యింది. అలా నాన్ను ఒక కార్టూనిస్ట్ గా చేసిన ఆంధ్రజ్యోతి’ వారపత్రిక ఎడిటర్ గారికి మరియు ఎడిటోరియల్ స్టాఫ్ వారికి ఎప్పటికీ ఋణ పడి ఉంటాను. 1972 లో ఆనాటి సుప్రసిద్ధ ఆంగ్ల కార్టూన్ వారపత్రిక శంకర్స్ వీక్లీ లో నా కార్టూన్ ఒకటి ప్రచురితమయింది. ఆ రోజుల్లో శంకర్స్ వీక్లీ లో కార్టూన్ ప్రచురితమవడం అంటే ప్రతిష్టాత్మకమయిన విషయం. అలా నా కార్టూన్ కు ఒక స్టాండర్డ్ ఉందని తృప్తి చెందాను. కార్టూనిస్ట్ ‘రేణుశ్రీ’ నా చిన్ననాటి మిత్రులు. నాకు వ్యక్తిగతంగా పరిచమయిన రెండవ కార్టూనిస్ట్ శ్రీ శంబంగి గారు. మేమిద్దరం వరంగల్ లోని ఏ.పి.రేయాన్స్ లో సహ ఉద్యోగులం. ఫేస్ బుక్ లో నా కార్టూన్లు చూసి కార్టూనిస్ట్ చక్రవర్తి గారు తెలుగు కార్టూనిస్ట్ల గ్రూప్ లో చేర్చడంతో, తోటి కార్టూనిస్టులతో పరిచయం మొదలయింది.
-సురేన్

Suren Cartoon

5 thoughts on “మొదటి కార్టూన్ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో – సురేన్

  1. Great effort and passion to keep up your creative skills ! I am always impressed with your out of box approach !

  2. చాలా బాగుంది సురేన్ గారు మీ కార్టూన్ ప్రయాణం.ఇప్పుడు మళ్లీ మొదలెట్టండి.ఆదివారం కార్టూన్ వారం అనుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap