కార్టూన్ గీస్తే కొత్త ఉత్సాహం వస్తుంది-‘వందన శ్రీనివాస్’

‘వందన శ్రీనివాస్’ పేరిట కార్టూన్లు వేస్తోన్న నా పూర్తి పేరు ‘కర్రి శ్రీనివాస్’ అంతస్థులూ, ఐశ్వర్యాలూ అందివ్వకపోయినా ఉ న్నంతలో భార్యకి సముచిత స్థానం ఇచ్చినట్టువుందని నా పేరుకి ముందు ఆమె పేరు వుంచానంతే.
23 జులై 1966న కర్రి భీమలింగాచారి, సరస్వతి దంపతులకు మూడో సంతానంగా పుట్టిన నా చదువు ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది.
ఏడు, ఎనిమిది తరగతుల్లో వున్నప్పుడే పత్రికల్లో కార్టూన్లు చూసి ముగ్ధుడిని అయ్యేవాడిని. ఎంతో కొంత బొమ్మలు వేసేవాడిని కనుక కార్టూన్స్ వెయ్యాలనే దృక్పథం వుండేది. అయితే ఎలాంటి పెన్ను వాడాలి, ఏ కొలతల్లో వేయాలో తెలిసేదికాదు. అయినా నాకు తెలిసినట్టు వేసి పంపేవాడిని. ఇంటర్ చదువుతున్నప్పుడు తొలి కార్టూన్ 1981 లో ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చింది. రూ. 20/- M.O కూడా వచ్చింది. తొలిసారిగా డబ్బుకూడా సంపాదించానన్న థ్రిల్ కలిగింది. ఫ్రెండ్స్ అంతా నాపట్ల ప్రత్యేక అభిమానం చూపేవారు, నఖచిత్రాలు కూడా వేసేవాడిని. అప్పట్లో అందరికీ నఖచిత్రాలతో గ్రీటింగ్ కార్డులు పంపేవాడిని కొత్త సంవత్సరం, పండగలు, పబ్బాలకి. నా గోటి బొమ్మలు చూసి ఫ్రెండ్స్ అంతా మురిసిపోయేవారు. ఇప్పటికీ వారికి నేను గుర్తే ఎక్కడున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగవేటలో విశాఖపట్నం వచ్చిఫ్రెండ్స్ తో అక్కయ్యపాలెం రూంలో వుండి ప్రయత్నాలు చేసి ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ పత్రిక అడ్వర్టైజ్ మెంట్ విభాగంలో క్లర్క్ గా జాయిన్ అయిన నేను తదనంతర పదోన్నతులతో ప్రస్తుతం అకౌంట్స్ మేనేజర్‌గా వున్నాను. చేసేది అడ్మిన్ జాబ్ అయినా పత్రికాఫీసు కనుక జర్నలిస్టు మిత్రులు, ఆర్టిస్టులూ, కార్టూనిస్టులతో మంచి సంబంధాలున్నాయి. అది నా అదృష్టంగా భావిస్తాను. వారంతా కూడా నన్ను ఆదరించి గౌరవిస్తారు.

అప్పట్లో ప్రతి పండక్కి డెక్కన్ క్రానికల్ పేపరు మొదటిపేజీలో నా నఖచిత్రంతో పాఠకులకూ ప్రకటనకర్తలకూ శుభాకాంక్షలు చెప్పేవారు. అది నాకు ఇప్పటికీ తీపి గుర్తు. వీక్లీస్, మంత్లీలో ఫుల్ పేజీ కార్టూన్లు ఎక్కువగా వచ్చాయి. ఫుల్ పేజీ కార్టూనిస్ట్ అని పేరు కూడా వుండేది. ప్రత్యేకించి కార్టూన్స్ పోటీల్లో ఎప్పుడూ పాల్గొనలేదు గానీ కార్టూన్లు హాబీగానే వేస్తూ వచ్చాను. ఒకసారి మాత్రం విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో కార్టూన్స్ పంపంగా ద్వితీయ బహుమతి ఇచ్చి సత్కరించారు. చాలా రోజుల తర్వాత ఇటీవలే అదే గ్రంథాలయంలో NCCF వారు కార్టూనిస్ట్ గా సత్కరించడం నా అదృష్టం ! వృత్తిరీత్యా ఎన్ని ఒత్తిళ్లున్నా తప్పనిసరిగా రోజూ ఒక కార్టూన్ వేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం అప్పటినుంచే చేస్తున్నాను. నా కార్టున్ చూసిన వారు పెట్టే లైకులు, కామెంట్లు, వారు చేస్తున్న షేరింగ్లు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడెక్కడో వున్నా ఫ్రెండ్స్ వేరే వేరే గ్రూపుల్లో నా కార్టున్ చూసి ఫోన్ చేస్తుంటారు. అదంతా థ్రిల్ గా వుంటుంది – ఫేస్ బుక్ వాట్సప్ లేని రోజుల్లో ఓసారి ట్రైన్ అప్పర్ బెర్త్ లో పడుకొని వుండగా, దిగువ బెర్త్ లో కూర్చుని కొందరు వీక్లీబుక్ లో నాఫుల్ పేజీ కార్టూన్లు చూసి నవ్వుకోవడం చూసి ఎంత ఆనందించానో నాకే తెలీదు. ఇంట్లో డ్రాయింగ్ రూంలో కూర్చుని నేను గీసిన కార్టూన్స్ అలా ట్రైన్ లో వారంతా చూసి నవ్వుకోవడం గొప్ప థ్రిల్లింగ్ ! బాపూ, మల్లిక్ కార్టూన్స్ ఎంతో ఇష్టం.. బాపూ లైనింగ్, మల్లిక్ క్యారికేచర్స్, క్యాప్సన్స్ భలే ఉంటాయి. సుభానిగారి మంచి లైనింగ్ తో చారిత్రక దృశ్యాలు, ప్రకృతి సౌందర్యాలూ చిత్రిస్తుంటారు, అవి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

Vandana Srinivas cartoons

కథలూ, కవితలూ కూడా వ్రాసాను. విశాఖరచయిత సంఘం వారు తమ సింగిల్ పేజీ కథల సంకలనంలో నా కథలకు చోటిచ్చి పుస్తకావిష్కరణ సందర్భంలో ప్రముఖ రచయితలు ద్విభాష్యం రాజేశ్వరరావుగారు, అడపా రామకృష్ణగారి చేతులమీదుగా నన్ను సత్కరించారు. నాకు లభించిన అరుదైన గౌరవం!
ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని కష్టాలెదురైనా ఒక కార్టూన్ గీస్తే అన్నీ మరిచిపోయి కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజం లభించడం కార్టూనిస్ట్ గా నా అదృష్టం! ‘చదరంగం’ కూడా ఆడతాను నేను. విశాఖపట్నం జర్నలిస్ట్ ఫోరం వారు ప్రతి యేడూ నిర్వహించే మీడియాటోర్నమెంట్స్ లో పాల్గొని నాలుగైదుసార్లు టైటిల్ కూడా గెలుచుకున్నాను.
గీతలూ, రాతలూ, ఆటలూ అన్ని ఎంజాయ్ చేస్తాను. ఇప్పటి వరకూ సుమారు రెండువేల కార్టూన్లు వరకు గీసిన నాకు, మీ ముందుకు వచ్చి పరిచయం చేసుకొనే అవకాశం కల్పించిన 64కళలు పత్రిక ఎడిటర్ కళాసాగర్ గారికి కృతజ్ఞతలు.
వందన శ్రీనివాస్

Vandana Srinivas Nail art

13 thoughts on “కార్టూన్ గీస్తే కొత్త ఉత్సాహం వస్తుంది-‘వందన శ్రీనివాస్’

  1. శ్రీనివాస్ గారి గురించి విశేషాలు బాగున్నాయి. వారి బొమ్మలు అలవోకగా గీచినట్లు చాలా బాగుంటాయి. వారికి అభినందనలు.

  2. చిన్న క్యాప్షన్ తో సింపుల్ బొమ్మలతో నవ్వించే కార్టూన్లు వందన శ్రీనివాస్ గారివి!..అభినందనలు 💐

  3. శ్రీనివాస్ గారు మీ బొమ్మలలో యాక్షన్ , వ్యాఖ్యలో క్లుప్తత , హాస్యం నాకు నచ్చుతాయి.

  4. శ్రీనివాస్ గారు మీ బొమ్మలలో యాక్షన్ , వ్యాఖ్యలో క్లుప్తత , హాస్యం నాకు నచ్చుతాయి. మీ గోటి చిత్రాలు కూడా చాలా బాగుంటాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap