వ్యంగ్య చిత్రకళలో ‘వపా’ శైలి వేరు…

(చిత్రకారుడు గా మనమెరిగిన వడ్డాది పాపయ్య గారు 1962 నుంచి 70 వరకు యువ మాస పత్రికలో ఎన్నో కార్టూన్లు గీసారన్న సంగతి చాలా తక్కువమందికే తెలుసు. అవన్ని ఒక పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కార్టూనిస్ట్ గా ‘వపా’ గురించి జగమెరిగిన కార్టూనిస్ట్ డా. జయదేవ్ గారి విశ్లేషణ చదవండి.)

దేవలోక పురుషులూ స్త్రీలూ, విహార యాత్రలు చేసి విలాసంగా కాలం గడిపి ఆనందమయమైన, విశ్రాంతి జీవనం జీవిస్తారట. వాళ్ళు అతీత శక్తి సంపన్నులూ, సమస్త కళల్లో ఆరితేరిన వారట. వాళ్ళు భూలోకానికి వచ్చినప్పుడు కొంతమంది మానవులని వెతికి పట్టి వాళ్ళ చేత కవితలు పలికించి, పాటలు పాడించి, శిల్పాలు చెక్కించి, చిత్రాలు గీయించి వాటిని వినీ కనీ ఆనందిస్తారట. మా నాయనమ్మ ఈలాంటి కధలు ఎన్నో చెప్పి నన్ను నిద్రపుచ్చేది. అప్పట్లో ఆవిడ్ని అడగాలనిపించలేదు గానీ, ఇప్పుడు అడగాలనిపిస్తుంది… ” నీ చేత ఆ దేవలోక వాసులు కధలు చెప్పించుకు విన్నారా ?” అని.
మా నాయనమ్మ సామాన్యురాలు. ఆవిడ గురించి తర్వాత చెప్పుకుంటాను.

నిన్నటి రోజున (26-11-2020) ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు డియగో మారడోనా మ్రుతి చెందాడు. అసాధారణ ప్రజ్ఞావంతుడైన మారడోనాకి బంతి ఇస్తే దానితో చిత్రలేఖనం చేస్తాడు అని అర్జెంటీనా పత్రికలు ప్రశంసించాయి. మారడొనా చాలా సార్లు తనకి దైవ హస్తం తోడుగా వుండి ఆట గెలిపించింది అని చెప్పుకునే వాడు. మా నాయనమ్మ చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది.

మన మహా చిత్రకారులు బాపూ, వడ్డాది పాపయ్య గార్ల చిత్రాలు చూస్తే అవి మానవాతీతమైనవే కదా.

వడ్డాది పాపయ్య గారిని దూరం నుండి చూసే భాగ్యం ఒక్క సారి కలిగింది, కొడవటిగంటి వారిని కలవడానికి చందమామ ఆఫీసు వెళ్ళాను, ఆ సందర్భంగా. వడ్డాదివారు తమ గదిలోకి ఎవర్నీ అనుమతించరని తెలిసి నిస్ప్రుహ చెందాను. వారు చిత్రలేఖనం ఎలా చేస్తారో తెలుసుకోవాలని మిత్రులు కొంతమందిని అడిగాను. తెలియదనే చెప్పారు. వారితో సన్నిహితంగా వుండే వాళ్ళ వ్యాసాలనుండి చదివిన కొన్ని అంశాలు విస్మయం గొలిపేవిగా వున్నాయి.

వడ్డాది వారు వాటర్ పెయింట్స్ మాత్రమే వాడారు. పేపర్ మీదే చిత్తరువులు చిత్రించారు. కాన్వాస్, ఆయిల్ పెయింట్స్ జోలికి వెళ్ళ లేదు. నలుపు తెలుపు బొమ్మలకి సిరా వాడరు. చైనా కేకును కుంచెతో అద్ది గీశారు.

VaPa cartoons from Yuva Monthly

స్వాతి బలరాం గారు వడ్డాది వారిని బాగా ఎరుగుదురు. వడ్డాది వారికి తీరిక సమయం అంటూ ఒకటుండేది కాదట. వుంటేగింటే బొమ్మలతోనే కాలం గడిపే వారట. స్వాతి సపరివార పత్రికలో” సంతకాలతో సరదా చిత్రాలు” శీర్షిక లో నేను వడ్డాది వారి సంతకం తో ఎనిమిది బొమ్మలు గీశాను. ఆ బొమ్మల గురించి వడ్డాది వారు రెండు మూడు సార్లు బలరాం గారితో చెప్పి మెచ్చుకున్నారని తెలిసి వారికి ఉత్తరం రాశాను. వెంటనే బదులు ఉత్తరం (ఇన్లాండ్) రాశారు. నా దురద్రుష్టం, అజాగ్రత కారణంగా ఆ వుత్తరం ఎక్కడో పోగొట్టుకున్నాను. ఆ వుత్తరంలో తమకి తీరిక సమయాల్లో వ్యంగ్య చిత్రాలు గీసుకున్నట్లు పేర్కొన్నారు.

మైకెలాంజెలో తీరిక వేళల్లో బంకమట్టి తో చిన్న చిన్న బొమ్మలు చేసి తనకి కలిగిన ‘వర్క్ స్ట్రెస్’ నుండి ఉపశమనం పొందే వారట. వడ్డాది వారూ అదే చేశారు. చక్కగా, ముచ్చట గా కార్టూన్లు గీసి తమ తీరిక సమయాన్ని ఆనందదాయకం చేసుకున్నారు. ఆ ఆనందాన్ని యువ పత్రిక ద్వారా పాఠకులకీ పంచిపెట్టారు.

VaPa cartoons from Yuva monthly

కార్టూన్ అంటేనే అది హాస్యరస ప్రధానమైన చిత్రం. దానికి వ్యంగ్యం తోడైతే తేనె కలిపిన పనస తొన తిన్న అనుభూతే కదా. ఆ లాంటి పనస తొనలే వడ్డాది వారి కార్టూన్లు. నాకు తెలిసి ఆయన చాలా కార్టూన్లు వివిధ అంశాలమీద గీశారు. మచ్చుకి ఈ పదీ పన్నెండు కార్టూన్లు వారి ఆలోచనా వైవిధ్యాన్ని మనకి వివరిస్తాయి. బొమ్మలకే ప్రాణమొస్తే, దేవతల పాట్లూ లాంటి సబ్జెక్టులు వడ్డాది వారికే తడుతాయి. పైగా వారిది ప్రత్యేక శైలి కూడా. గొప్ప చదువరి గనక బొమ్మల చిత్రీకరణ, వేషధారణ అంశాలు, భావాలు, వ్యాఖ్య రచన అన్నీ వారికి వారే చెల్లు అనిపించేలా వుంటాయి. జలస్తంభనం మీద కార్టూన్ అందుకు ఉదాహరణ. పోలికలు అనే అంశం మీద వారు గీసిన కార్టూన్లు బహుజనాదరణ పొందాయి. ఆ సబ్జెక్టు ఆయనకే ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.

VaPa cartoons from Yuva monthly

వడ్డాది వారికి విసుగు కలిగించిన అంశాల మీద ఆయన విరుచుకు పడ్డారు. బుద్ధుడు పారిపొయే కార్టూన్ అందుకు నిదర్శనం. తరువాతి రోజుల్లో ఇదే కార్టూన్ ను చాలామంది మరో రకంగా, గాంధీ గారు పారిపోయే కార్టూన్ గీశారు.
ఒక్క విషయం మనం చెప్పుకోవాలి. వడ్డాది వారిని ఎవ్వరూ అనుకరించలేక పొయారు. అనుకరించలేరు కూడా. ఎందుకంటే, మా నాయనమ్మ చెప్పినట్లు, ఎవరో దేవలోక పురుషుడు దిగివచ్చి వడ్డాది వారి చేత ప్రత్యేకంగా చిత్ర రచన చేయించి దివ్యానుభూతి పొంది వెళ్ళాడు. ఆ చిత్రాలని మనం చూసి తరించేలా చేశాడు.

-జయదేవ్, కార్టూనిస్ట్

Vaddadi Papaiah cartoon
SA:

View Comments (1)

  • వపా గారు ఒక దేవత. మానవ రూపంలో భూమ్మీద ఏదో శాప వశాన అవతరించారు మన అదృష్టవశాన. అందువల్లే కావచ్చు ఆయన ఎవరినీ కలవటానికి ఇష్టపడేవారు కాదు అనిపిస్తుంది. ఆయన చిత్రాలు చూసినప్పుడు నా చిన్నతనంలో ఇలాగే అనిపించేది. ఎవరైనా దేవలోకం నుంచీ వేస్తున్నారేమో ఈ బొమ్మలు అని.