నా మొదటి కార్టూన్ “స్వాతి” లో – విజయ్

విజయ్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పురం విజయ కుమార్. మా స్వగ్రామము సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రము. పుట్టింది 1965 లో. పెరిగింది సుల్తానాబాద్ లోనే అమ్మ పురం సుజాత, నాన్న రాజవాహన్ రావు వృత్తిరీత్యా వైద్యుడు. చదివింది బి.యస్సీ.
నా చిన్నతనంలో మా ఇంటికి చందమామ మాసపత్రిక వచ్చేది. ఆ పత్రిక వచ్చినపుడు మా ఇంట్లో ఎంతో ఉత్సాహం. అందులోని కథలు ముఖ్యంగా ‘శంకర్’, చిత్ర గారి బొమ్మలు ఎంతో ఆకర్షించేవి. నెలలో 10, 15 రోజులు చందమామ కోసం ఇంటిల్లిపాది ఒకరికొకరు కొట్లాడుకుంటూ చదువుకునేవాళ్లం. అప్పట్లో నేను 7 తరగతిలో ఉన్నాను. ఆ బొమ్మలు ఆకర్షించి, అలాగే గీసేవాన్ని. అలా బొమ్మల మీద ఆసక్తి పెరిగింది. ఆ కాలంలో మా ఇంటికి ఆంధ్రజ్యోతి వార పత్రిక కూడా వచ్చేది. అందులో ‘బాలి’, బాపు, జయదేవ్, శంకర్, బాబు గారి కార్టూన్లు వారం వారం వచ్చేవి. వాటిని చూసి ఆకర్షితుడనై వాటిని కూడా కాపీ చేసేవాన్ని. ఇలా ఉండగా ఒక రోజు మా కజిన్ నేను కార్టూన్లు అలా ప్రాక్టీస్ చేస్తుంటే.. అరే విజ్జు నువ్వు బాగా వేస్తున్నాపు వీటిని పత్రికలకు పంపు అన్నాడు. అలాగా ! ఎలా పంపడము? ఏ అడ్రస్ కు పంపాలో.. తెలియక వారపత్రికలో ఉన్న సైజులోనే కార్టూన్లు గీసి పోస్టల్ కవర్ లో పెట్టి జ్యోతి వార పత్రిక పంపించేవాడ్ని. వారం-వారం ఎదురు చూపులు. కార్టూన్లు రాకుండా పోయేవి. ఇలా మళ్లీ, మళ్లీ ప్రయత్నించడం జరిగేది. ఐడియాలు బాగాలేకనో, బొమ్మలు బాగా లేకనో కార్టూన్లు ప్రచురితం కాకపోయేవి.

Vijay cartoons

నాకు సరైన సైజు తెలియక కార్టూన్లు తిరిగి వచ్చేవి. ఇలా సమస్యలతో ఉండగా ఆంధ్రభూమి వారపత్రికలో అప్పట్లో స్నేహలత(కలం స్నేహం) శీర్షిక ఉండేది. అందులో నేను పాల్గొని అడ్రస్ ఇచ్చాను. పేరు ‘విజ్ఞు’ హబీలు చిత్రలేఖనం, కార్టూన్లు గీయటం, పోటోగ్రఫీ అంటూ ప్రచురితమైంది. ఇక చూడండి అసంఖ్యాకమైన ఉత్తరాలు వచ్చేవి.. అందులో చాలా మంది కాలేజి విద్యార్థులు, ఉద్యోగులు, కార్టూనిస్టులు, వ్యాపార వేత్తలు రోజు 15, 16 ఉత్తరాలు వచ్చేవి. అప్పట్లో కమ్యూనికేషన్ ఏమి లేవు. ఉత్తరాల ద్వారానే సమాచారం తెలిసేది. నేను అందరికి ఓపికగా ప్రత్యుత్తరం పంపేవాడిని. ఇలాండ్ లేటర్ లెఫ్ట్ సైడ్ అంతా ఆర్ట్ వేసి (చందమామ కథలోని ఇష్టమైన) బొమ్మల్ని వేసి కలరింగ్ చేసి రైట్ సైడ్ లో సమాచారాన్ని వ్రాసి కచర్ మూసేసి దానికి తాళం బొమ్మ వేసి తాళం చెవి పోస్టమాన్ అడిగి తీసుకోండి అంటూ సదాగా వ్రాసేవాడిని. నా బొమ్మలు చూసిన వారికి నా లెటర్స్ బాగా నచ్చేవి. ఈ లెటర్స్ లో బాగంగా కార్టూనిస్ట్లు మిర్యాలగూడకు చెందిన ‘గోపి’, ‘గాంధీ’ (అనంతపూర్ కదిరి), ఆకుండి సాయిరాం వంటి కార్టూనిస్టులు పరిచయమయ్యారు.

వారు కార్టూన్లు పోస్టుకార్డు సైజులో ఉండాలని చెప్పడంతో… నేను ఆ పైజులో కార్టూన్లు వేసి మళ్లీ పత్రికల మీద విరుచుకు పడ్డాను. రోజుకు పదేసి కార్టూన్లు గీసి తిరుగు చిరునామా కవర్ పెట్టి మరీ పత్రికలకు పంపేవాడ్ని. అలా పంపుకుంటూ పోతుండగా “స్వాతి ” మంత్లీ 1985లో అక్టోబర్ మాసపత్రికలో మొదటిసారిగా కార్టూన్ వచ్చింది. కార్టూన్ తో పాటు రూ.20/- పారితోషికం యం.ఓ., కాంప్లిమెంటరీ బుక్ పంపించినారు. ఇక చూడండి ఆనందం. ఆ కార్టూన్ ఎంత మందికి చూపించానటే కాలేజి మిత్రులకు, బంధువులకు, ఆ పారితోషికం 20/- ఇప్పటికి దాచుకున్నాను.

ఉత్తరాల ద్వారా కార్టూనిస్ట్ గోపి గారు, గాంధీ గారు నాతో ఎంతో స్నేహంగా ఉంటూ నా అభివృద్ధిలో ఎంతో తోడ్పడ్డారు. కార్టూన్స్ కు సంబంధించిన ఎన్నో సందేహాలు తీర్చేవారు. ఇంకా ఉత్తరాల ద్వారా ఎంతో మంది మిత్రులు కూడా ప్రశంసలు గొప్ప “బూస్ట్” లాగా ఉండేది. బందు మిత్రులు “విజ్జు కార్టూనిస్ట్ అయ్యాడు ఆంటూ ఎంకరేజ్ చేసే వారు. గాంధీ గారు నాకు యాసెడ్ ఇట్స్, ఆర్.కె. లక్ష్మణ్ కార్టూన్స్ బుక్స్ అన్ని కొని పంపించినారు. అవి ఇప్పటికి మెమారీగా ఉంచుకున్నాను. గోపి గారు యు.యస్.ఎ.కి వెళ్లిపోయాక స్నేహం వెనుకపడింది. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకున్నాను. పత్రికలు నిర్వహించిన కార్టూన్లు పోటీలలో పాల్గొని బహుమతులు పొందాను. హైద్రాబాద్ లో కార్టూన్ల ప్రదర్శనలు జరిగినపుడు వెళ్లి అక్కడ డక్కన్ క్రానికల్ సుభాని గారిని, మోహన్ గారిని, శంకర్ గారిని, నర్సింహ గారిని, శ్యాంమోహన్ గారిని, శంకు గారిని, బాలీ గారిని, జయదేవ్ గారిని కలిసి నా యొక్క సందేహాలు తీర్చుకునేవాడిని. ఎన్ని కార్టూన్లు గీసిన నేను ఇంకా విద్యార్థినే. ఈ మహసముద్రంలో నేనొక చిన్న నీటి చుక్కనే.

Vijay cartoon

ఒకప్పుడు కార్టూన్లు గీయాలంటే ఇండియన్ ఇంక్, నిబ్ పెన్, బ్లేడు (నిబ్ ఆరి పోయినపుడు గీకటానికి), పేపరు వుండాలి. కాని ఇపుడు టెక్నాలజీ మారింది. ఇప్పటి కార్టూనిస్టు అదృష్టవంతులు జెల్ పెన్త్ కార్టూన్లు వేయొచ్చు, లేదా ఫోన్లో యాప్ ద్వారా, కంప్యూటర్ లో బొమ్మలు గీస్తూ అలరిస్తున్నారు. నా కార్టూను కలర్ లో ‘నవ్య వీక్లీతో ప్రారంభమైనది. ప్రతి వారం కలర్స్ లో కార్టూన్లు వచ్చేవి. 1990 లో మా తండ్రి గారు స్వర్గస్తులవటంతో నేను వైద్య వృత్తిలోకి వచ్చాక ఇక నాకు తీరిక లేకుండా పోయింది. పగలంగా హస్పిటల్. సమయం దొరికేది కాదు. రాత్రిళ్లు వేసి మర్నాడు పోస్ట్ చేసేవాడ్ని, ఉత్సాహం ఉన్నా వృత్తిలో సమయం చాలటం లేదు. కార్టూన్లు వేశాక మొదట నా దగ్గరున్న పేషంట్లకు చూపిస్తాను. వాళ్లకు అర్ధమయి కాస్తంతా నవ్వుకుంటే మన కార్టూన్లు బాగున్నాయి అనుకోవచ్చు – సామాన్యులకు కార్టూన్లు అర్ధమయితేనే అందరికి నచ్చినట్లు. నాకు కూతురు వైష్ణవి, (యం.పార్మసి), కుమారుడు రాజ వెంకట్ శాండిల్య (ఇంజనీరింగ్), భార్య ప్రమీల గృహిణి వీళ్లు కార్టూన్లలో ప్రోత్సాహమిస్తారు, సలహలిస్తారు.

best Cartoonist award receiving from Tanikella Bharani

బహుమతులు:
2004 – రచన మాస పత్రిక ఉగాది కార్టూన్ పోటీల్లో బహుమతి.
2007 – మళ్ళ జగన్నాదం స్మారక కామిక్ కథల పోటీల్లో బహుమతి.
2020- హాస్యానందం-తలిశెట్టి రామారావు కార్టూన్ పోటీల్లో విశిస్థ బహుమతి

“నలుగురిని నవ్వించు కాని, నల్గురిలో నవ్వులపాలు కాకూడదు” వరల్డ్ తెలుగు కార్టూనిస్ట్ (డబ్లు.టి.సి.) గ్రూపు ద్వారా గురుతుల్యులు జయదేవ్ గారు కార్టూనిస్ట్ ను ప్రోత్సాహిస్తు ప్రతివారం ఒక టాపిక్ ఇస్తు, కార్టూనిస్ట్ ద్వారా కార్టూన్లు వేయిస్తున్న గురువు గారి ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాము. ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అందరి కార్టూన్లు చూస్తుంటాను. కార్టూన్లు పరిశీలిస్తుంటాను. నిరంతరం పరిశ్రమ అవసరం ఖాళీగా ఉంటే బొమ్మల ప్రాక్టీస్ చేస్తునే ఉండాలి. ఇపుడు మది నిండా ఐడియాలు పొంగిపొర్లుతున్నాయి. సమయం దొరకడం లేదు.

64 కళలు పత్రిక ద్వారా మీ అందరికి పరిచయం కావడం సంతోషకరం, చక్కని అవకాశాన్ని ఇచ్చిన కళాసాగర్ గారికి అభిమానించే కార్టూనిస్ట్ లకు, కార్టూన్ ప్రియులకు కళాభివందనములతో…
-విజయ్ పురం

7 thoughts on “నా మొదటి కార్టూన్ “స్వాతి” లో – విజయ్

  1. విజయ్ గారికి అభినందనలు….. గుండు రమణయ్య…

  2. విజయ్ గారు మీ కార్టూన్లకి నేను అభిమానిని. మీ ప్రయాణం బాగుంది.అన్ని కార్టూన్లు నవ్వుపుట్టిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap