నా మొదటి కార్టూన్ గోతెలుగు పత్రికలో – విఠల్

నా పూర్తి పేరు మూటుపూరు విఠల్ చందర్ రావు, దానిని చిన్నగా చేసుకొని ‘మూవి’ కలం పేరుతో కార్టూన్స్ వేస్తుంటాను. పుట్టింది 9 సెప్టెంబర్ 1974, నా స్వస్థలం నల్లగొండ, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రొజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాను. నాన్నగారి పేరు కృష్ణమూర్తి ట్రెజరి ఆఫీసర్ గా పదవీ విరమణ చేశారు. అమ్మ గారి పేరు ప్రమీల. నాకు వివాహాం జరిగి 15 సంవత్సరాలు, నా భార్య పేరు గాయత్రి, ఇద్దరు పిల్లలు బాబు మిహిత్ కాశ్యప్, పాప శ్రద్ధ.

ఇక బొమ్మలు, కార్టూన్ల్న విషయానికి వస్తే నాకు ఊహ తెలిసి 5వ తరగతినుండి బొమ్మలు వేస్తున్నాను, 7 వ తరగతిలో మొదటి సారి పోటీలలో బహుమతి గెల్చుకున్నాను. ఆ తర్వాత నుండి నేను ఎక్కువగా బాపు గారి బొమ్మలు, చంద్ర గారి బొమ్మలు చూసి వేసేవాడిని, మా నాన్న గారికి బాపు గారంటే పిచ్చి అభిమానం, అందరూ బాపు బొమ్మలు ఫ్రేము కట్టించి పెట్టుకుంటే మా ఇంట్లో మాత్రం బాపు గారి ఫోటొనే ఫ్రేము కట్టించి పెట్టుకున్నారు . ఆ రోజుల్లొ ఒకసారి వెల్లటూరు పూర్ణానంద శర్మ గారు మా ఇంటికి వచ్చారు, నా బొమ్మలు చూసి మెచ్చుకొని వేసవి సెలవుల్లొ తన దగ్గరికి పంపమని మా నాన్నగారిని అడిగారు కూడ. 9 వ తరగతి చదువుతున్నప్పుడు నేను మా నాన్న, వారి స్నేహితులతో కలిసి తెనాలి దగ్గర తుమ్మపూడి గ్రామంకి డా. సంజీవదేవ్ గారింటికి వెళ్ళాము, వారి ఆతిధ్యం ఆ ఇంటి భోజనం ఇప్పటికీ మర్చిపోలేను. పచ్చటి పొలాల మధ్య వారి ఇల్లు నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు వాళ్ళు హిమాలయాలు, గంగొత్రి, రాహుల్ సాంకృత్యన్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నేను అలాగే నిద్ర లో జారుకున్నా ఆరాం కుర్చిలో, నన్ను చూసి ఈ అబ్బాయిలో వైష్ణవ పోలికలు వున్నాయి ఎవరి తాలూకా అని అడిగారు. ఆ విషయం మా నాన్నగారు ఎంతమంది తో చెప్పే వారో.

Vithal cartoon

కాని నేను ఇంటర్ అయ్యాక ఫైనార్ట్స్ చేస్తా అంటే మాత్రం నాన్న ఒప్పుకోలేదు. ఆర్టిస్ట్ గా జీవితం లో సెటిల్ కాలేవు, మంచిగా చదువుకో అని, అందరిలాగే నా చదువు కంటిన్యూ చేసాను.
ఎందుకంటే అప్పటికే మా దగ్గరి బంధువులు కీ.శే. కొండపల్లి శేషగిరి రావు గారు, ఆ రోజుల్లోనే శాంతినికేతన్ లో చదువుకున్న గొప్ప చిత్రకారులు, అలాంటి వారికే తగిన గుర్తింపు రాలేదని మా నాన్నగారి అభిప్రాయం. అందుకే నన్ను ప్రొఫెషనల్ అర్టిస్ట్ గా ప్రోత్సహించలేదు. చదువుల్లో పడి ఇంక నా ఆర్ట్ ని ఒక నాలుగు సంవత్సరాలు వదిలేశాను. మళ్ళీ డిగ్రీలో ప్రదర్శన కోసం ఒకసారి పాల్గొన్నాను. నా మొదటి కార్టూన్ గోతెలుగు పత్రికలో 2016 లో వచ్చింది.

Vithal cartoon

నా చిన్ననాటి మిత్రుడు దుర్గా ప్రసాదు ప్రొత్సాహాం వల్ల మళ్ళీ కార్టూన్లు వేయడం సోషల్ మీడియా వేదికగా ఐరానికల్ కార్టూన్స్ పేరుతో ఒక పేజీ క్రియేట్ చేసి వేయడం మొదలు పెట్టాము. మొట్టమొదటి సారి పబ్లిక్ గార్డెన్ లో జరిగిన కార్టూన్ ప్రదర్శనలో నావి రెండు కార్టూన్స్ ప్రదర్శనకి అవకాశం కల్గింది. అప్పుడే మన తెలుగు కార్టూనిస్ట్స్ అందరినీ చూసే భాగ్యం కల్గింది, తర్వాత ప్రపంచ తెలుగు మహసభలో కూడ పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత హాస్యనందం గోతెలుగు.కాం సంయుక్తంగా నిర్వహించిన కాప్షన్లెస్స్ కార్టూన్ పోటీలో న్యాయనిర్ణేత గా డా. జయదేవ్ బాబు నన్ను రెండవ బహుమతికి ఎన్నుకోవడం ఇంకా నాకు ప్రోత్సాహం లభించినట్టు అయ్యింది. Heartoonist వాట్సప్ గ్రూప్ ద్వారా అందరి పరిచయం, ఇంతలో జాకిర్ గారి, వేముల రాజమౌళి గారి ఆధ్వర్యం లో తెలంగాణ కార్టూనిస్ట్ అసోసియెషన్ ఏర్పాటు, నన్ను వైసు ప్రెసిడెంటు గా ఎన్నుకోవడం రవింధ్రభారతి లో ప్రదర్శన ఏర్పాటు అలా మొదలైంది నా ప్రయాణం.
-విఠల్

Vithal Mutupuri cartoon
SA:

View Comments (3)

  • It's your hardworking nature and passion towards art dear that moulded you.. awesome to see you here and would like to have more creative works from you 👍💐

  • మూవీ గారు మీ కార్టూన్లు బాగుంటాయి . మీ ప్రయాణం బావుంది . విజయోస్తు .