సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా అనురాధ

సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (ఇంఛార్జ్) అయిన నర్తకీమణి జొన్నలగడ్డ అనురాధ!
నాట్య పరిశోధకురాలు

డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ గారు ప్రముఖ కూచిపూడి నర్తకీమణి, నాట్య గురువు, మరియు అద్భుతమైన ప్రతిభ గల నాట్య పరిశోధకురాలు (Dance Researcher). నాట్యరంగానికి ఆమె చేసిన సేవలు ప్రశంసనీయమైనవి. ఒక నాట్య గురు, ఒక నాట్య పరిశోధకురాలు తొలిసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ అయ్యారు! కూచిపూడి నాట్య చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. డాక్టర్ అనురాధ జొన్నలగడ్డ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ఉప కులపతి అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాట్య రంగంలో వున్న వారికి ఇదొక తీపి కానుక. ఏ నాట్య గురువుకు దక్కని హోదా ఆమెకు లభించింది. గతంలో అభినయ తపస్వి డా. అలేఖ్య పుంజాల తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి వచ్చి రిటైర్డ్ అయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీ డ్యాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా వున్న అనురాధ ఇప్పుడు ఇంచార్జ్ విసిగా బాధ్యతలు చేపట్టారు.


1996 లో నటరాజ రామకృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. నాకు నాట్యం పై ఆసక్తి పెరిగింది. ఆయనతో నాట్యం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు అనురాధ పేరు చెబుతుండే వారు. ఎవరూ అని ప్రత్యేకంగా ఆమెను చూశాను రవీంద్రభారతిలో ఒక నాట్య సదస్సులో. ఎంతో హంబుల్ గా ఎంతో ఒదిగి ఉంటారు. చక్కటి విశ్లేషణలు చేస్తారు. సమగ్ర నాట్య చరిత్ర గురించి చక్కగా వివరిస్తారు. ఆమె గొప్ప పరిశోధకురాలు. కట్ చేస్తే, శోభానాయుడు గారు చనిపోయినప్పుడు మహా న్యూస్ లో ఆమె గురించి జ్ఞాపకాలు అంటూ ప్రత్యేక లైవ్ కార్యక్రమం జరిగింది. అందులో అనురాధ, పద్మజారెడ్డి, నేను పాల్గొన్నాం.
జొన్నలగడ్డ అనురాధ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. నల్గొండలో తడకమళ్ల వారికి కోడలు అయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీలోనే 1988లో డాన్స్ లో మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టారు. తొలి బ్యాచ్ స్టూడెంట్ అనురాధ. 1976లో కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆమె 1993లో ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు. డాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ అయ్యారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి ఉప కులపతిగా పదోన్నతి పొందారు.
కూచిపూడి నాట్య టెక్నీక్స్ చెప్పడంలో, అభినయ ఉపన్యాసం చేయడంలో ఆమె గుర్తింపు పొందారు. నాట్యంలో నూతన ప్రక్రియలకు శ్రీకారం చుట్టి పేరు తెచ్చుకున్నారు. కూచిపూడి నృత్య సాహిత్యంపై పరిశోధనలు, కొత్త కోణాలు ఆవిష్కరించి అనేక గ్రంథాలు రాశారు. నాట్య గురువుల గురించి ఆమె రాసిన “కూచిపూడి డ్యాన్స్ హు అండ్ హు” పుస్తకం మంచి పేరు తెచ్చిపెట్టింది. వేదాంతం రాఘవయ్య గారి గురించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ నాట్యం పేరుతో ఆమె రచనను తెలంగాణ సంగీత నాటక అకాడమి ప్రచురించింది.

ప్రాచీనమైన ‘గురుకుల’ పద్ధతిలోని నాట్య విద్యను, ఆధునిక విశ్వవిద్యాలయ విద్యావిధానంతో (Institutional teaching) మేళవించి బోధించడంలో ఆమె అపార అనుభవం గడించారు. ఆమె పర్యవేక్షణలో ఎంతోమంది విద్యార్థులు పీహెచ్.డీలు (Ph.D) పూర్తి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో (ఉదాహరణకు దేవీ గిరీష్, లలితా సింధూరి తదితరులు) ఉత్తమ నాట్యకారులుగా, పరిశోధకులుగా స్థిరపడ్డారు.

జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు:
కూచిపూడి నృత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో కూచిపూడి విశిష్టతపై పరిశోధనా పత్రాలను సమర్పించారు.

గచ్ఛిబౌలి స్టేడియంలో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనంలో “మహాబృంద నాట్యం” గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన చారిత్రక సమయంలో, ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక సావనీర్‌ను (Souvenir) ఎడిట్ చేసే బాధ్యతను ఆమె అద్భుతంగా నిర్వర్తించారు.

అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు (TANA, NATS వంటివి) నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటారు. ఇటీవల నాట్స్ (NATS) నిర్వహించిన ‘నర్తనశాల’ సదస్సులో పాల్గొని కూచిపూడి గొప్పతనాన్ని భావితరాలకు ఎలా అందించాలో దిశానిర్దేశం చేశారు.

“ఏ రంగంలో వున్నా తృప్తి ఉండకూడదు. తృప్తి ఉంటే ఇక అంతటితో ఎదుగుదల ఆగిపోయినట్లే” అంటారు అనురాధ. అందుకే నాట్య రంగంలో ఆమె నిత్య విద్యార్థిని! డ్యాన్స్ అంటే మనో వాక్కాయ కర్మణ… మనసు, వాచకం, భంగిమలు కలిపితే నృత్యం అంటారు ఆమె. కళా ప్రక్రియ నిరంతరం సాగాలి అని చెప్పే అనురాధ సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కావడం నాట్య కళాకారులందరూ గర్వించాల్సిన సందర్భం. అభినందనలు అనురాధ గారు.

డా. మహ్మద్ రఫీ

Share via
Copy link
Powered by Social Snap