బాలసాహివేత్త, బహుముఖ గ్రంథ కర్త డా. బెల్లంకొడ నాగేశ్వరరావు నిర్యహిస్తున్న ఫీచర్ ‘వేదిక నుండి వెండి తెరకు’. ఇందులో నాటకరంగం నుండి సినిమాకు వచ్చిన అలనాటి నటీ-నటులను మనకు పరిచయం చేస్తారు.
తొలి సినీ తరం కథానాయకుడు చదలవాడ నారాయణరావు కర్ణాటక లోని బెంగుళూరు-హుబ్లి మార్గంలో ఉన్న ‘మధురగిరి’లో 1913 సెప్టెంబర్13 న జన్నించారు. వీరి తల్లి గారి బంధువులు మైసూర్ దివాణంలో పనిచేసేవారు.
వీరితండ్రి లక్ష్మినరసింహారావు రెవెన్యూ ఉద్యోగి.నారాయణరావు అసలు పేరు ‘అనంతపద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు.వీరి బాల్యమంతా ఏలూరులో గడచింది. అనంతరం గుంటూరు ఏ.సి. కాలేజిలో డిగ్రీ పూర్తి చేసారు. కొంతకాలం వెంకట్రామ అండ్ కో లోపనిచేసారు. అనంతరం రైల్వేవర్కర్స్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒకరోజు రైల్లో ప్రయాణిస్తుండగా నారాయణరావు పరిచయం కావడంతో సినీ దర్శకుడు ద్రోణంరాజు చినకామేశ్వరరావు, మీర్జాపురం రాజావారు తీస్తున్న’జీవనజ్యోతి’ (1940) చిత్రంలో నారాయణరావుకి కథానాయకుడిగా అవకాశం కలిగించారు. అలా మీర్జాపురం రాజా వారిభార్య కృష్ణవేణి సరసన నటించారు. నారాయణరావు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడేవారు. అనంతరం ‘దీనభంధు’ (1942)చిత్రంలో లాయరు పాత్ర పోషించారు. ఈయన తన పాటలు తానే పాడుకునే వారు. అలా ‘స్వర్గసీమ’ (1946) చిత్రంలో ఘంటసాల తొలి సినీ గీతం వీరికి పాడటం జరిగింది. ‘దేవత'(1946) భావకవిగా, ‘చెంచులక్ష్మి’ (1943) ‘తాసీల్దార్ ‘(1944) ‘భక్తపోతనా’ (1942)’జీవితం'(1950) ‘తిరుగుబాటు'(1950) ‘ముగ్గురుమరాఠీలు’ (1946)’పేరంటాలు’ (1951)’మానవతి'(1952) ‘బాలభారతం'(1972) ‘కలెక్టర్ జానకి'(1972) ‘రహస్యం'(1967) దేశోధారకుడు'(1973) ‘రాణికాసులరంగమ్మ'(1981)’ పులిబిడ్డ'(1981) వంటి పలు చిత్రాలలో నటించారు. విపరీతంగా సిగరెట్లు కాలుస్తూ ఉండేవారు.
‘మంజరి'(1953) చిత్రం నిర్మించి ఆర్ధికంగా దెబ్బతిన్నారు. ‘కృష్ణవేణి,కమలాకోట్నీస్, ఋష్యేంద్రమణి, భానుమతి, పుష్పవల్లి, జి.వరలక్ష్మి, శాంతకుమారి’ ‘షావుకారుజానకి’ ‘కృష్ణకుమారి, ‘రుక్మిణి’ (నటి లక్ష్మి తల్లి) వంటి నాటి అగ్ర కథానాయకి మణులతో నటించాడు.
1949 విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. 1951 లో వీరిని ఆంధ్ర విశ్వవిద్యాలయం సత్కరించింది. ఒక సినిమా నటుని విశ్వవిద్యాలయం సత్కరించడం ఇదే ప్రధమం. ప్రముఖ సినీ గాయకుడు యం.ఎస్. రామారావుగారు (హనుమాన్ చాలీసా ఫేం) వీరికి ఎక్కువపాటలు పాడారు. ఆయన నారాయణరావుగారి ఇంట్లోనే ఉండే వారు. నారాయణరావుగారి తోనే అభిమాన సంఘాలు ఏర్పడటం ఆరంభం అయింది.
1951 లో దక్షణ భారత-ఉత్తరభారత నటుల క్రికెట్ పోటీలకు దక్షణాది టీంమ్కు నారాయణరావే కెప్టన్. ఉత్తరాది నటులు ఎవరు వచ్చినా నారాయణరావుని కలవకుండా వెళ్ళే వారుకాదు.
చివరి రోజుల్లో మూత్రపిండాల వ్యాధికి లోనై చెన్నయ్ రాయపేట లోని ఓవైద్యశాలలో 1984 ఫిబ్రవరి 14న శాశ్వత నిద్రలో ఒరిగి పోయారు.