చక్రపాణి అమరజీవి – చందమామ చిరంజీవి
ప్రారంభం జులై 1947 లో తెలుగు, తమిళ భాషల్లో
విజ్ఞాన వినోద వికాస మాసపత్రిక ఆబాల గోపాలాన్ని అలరించే పత్రిక చక్రపాణిగారి మానస పుత్రిక – చందమామ.
చూపుల్ని తిప్పుకోనివ్వకుండా ఆకట్టుకొని, కట్టిపడేసే, జీవం ఉట్టిపడే రంగురంగుల బొమ్మలు.
కళ్ళకు ఆహ్లాదం కలిగించే సైజులో కుదురైన పెద్ద అక్షరాలు.
ఆరంభించింది మొదలు ఆసాంతం.. మనసును పరుగెత్తిస్తూ లాక్కొని వెళ్ళిపోయే సరళ వ్యవహార భాషాశైలి.
చదువరిని అద్భుత ఊహాలోకాలకు కొనిపోయి కాసేపు తమతో సహజీవనం చేసే అలౌకిక పాత్రలు.
చిక్కని కథ-దానితో పోటీపడే కథనం.
ప్రతి కథలో విశ్లేషణాత్మక సంఘర్షణ-అంతర్లీన సందేశం. ప్రతి కథలో పాఠకుల్ని ఆహ్లాదపూరిత తుళ్ళింతకు గురిచేసే మెరుపు (ఫ్లాష్). రోమాలు నిక్కబొడుచుకునే ఉత్కంఠను కలిగించే సంఘటనలతో కూడిన జానపద సీరియల్స్,
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పౌరాణిక సీరియల్స్ వెరసి … చందమామ
బాలసాహితీ ఆకాశంలో చల్లని కథాకిరణాలను వెదజల్లిన అందమైన చందమామ.
నెల నెలా వెన్నెల రువ్విన వన్నెల ‘చందమామ’ మాసపత్రిక ప్రారంభించి నేటికి 73 సంవత్సరాలు పూర్తయ్యింది.
చందమామ జులై 1947లో తెలుగు, తమిళ భాషల్లో, రెండు రంగుల్లో, అరవై నాల్గు పేజీలతో, ఆరణాల వెలతో ఆరువేల కాపీలతో వెలువడింది.
చందమామ ప్రారంభించే నాటికి తెలుగులో చాలా పిల్లల పత్రికలు వున్నై. కానీ చక్రపాణిగారు దేనినీ అనుకరించలేదు. తన ఆలోచనల మేరకు, తన లక్ష్యం మేరకు ఒక వినూత్న పద్ధతిలో, విలక్షణమైన ఒరవడితో చందమామను తీర్చిదిద్దాడు.
చందమామ తెలుగూ, తమిళం రెండు భాషల్లో వెలువడినా, ముందు తెలుగు చందమామ తయారయ్యేది. దాన్నుండి తమిళ చందమామ ‘కాపీ’ తయారయ్యేది.
అక్షరాల పని చక్రపాణిగారిది – అచ్చుపని నాగిరెడ్డి గారిది. ఒకరి పనిలో మరొకరు కలుగజేసుకునేవారు కొడవటిగంటి కుటుంబరావు, దాసరి సుబ్రహ్మణ్యం, రాజారావు, ముద్దా విశ్వనాథం, బైరాగి మొదలైన వారు సంపాదక విభాగంలో పనిచేస్తే, టి. వీరరాఘవన్ (చిత్రా), కె.సి. శివశంకరన్ (శంకర్), వడ్డాది పాపయ్య (వపా) మొదలైనవారు తమ చిత్రకళా నైపుణ్యంతో ‘చందమామ’కు జీవం పోశారు. పిల్లల కళ్ళముందు అద్భుతమైన రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
పిల్లల మనసులను ఆకర్షించి, ఆకట్టుకునే సమ్మోహన శక్తిగా, వారిని ఒక క్రమపద్ధతిలో అలరిస్తూ, ఆలోచింపజేస్తూ… పరిపూర్ణ వ్యక్తిత్వంతో విలసిల్లే దిశగా ప్రయాణం కొనసాగించే దిక్సూచిగా… వారిలో మానవతా విలువలను పెంపొందింపజేసి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉదాత్త ఆశయంతో… వన్నెల చందమామ నెలనెలా వెన్నెల విరజిమ్మింది.
1992 లో F.I.I. వారు జాతీయ అవార్డ్ ప్రకటించారు. ఆ సందర్భంలో వారు చందమామ గురించి ఏమి రాసారో ఇక్కడ చదవచ్చు.
Good Gathering Sir, Very Nice.
చందమామ ఓ అద్భుత పత్రిక. మంచి కథలు, పురాణసీరియళ్ళు శ్రీ వపా, చిత్ర, శంకర్ గార్ల అద్భుతమైన చిత్రాలు, మంచి రంగులు ఇప్పటికీ మరచిపోలేము. చందమామ మాయమైపోడం పెద్ద విషాదం. మరలా ఉదయిఇస్తే బాగుణ్ణు. –బొమ్మన్