నడిచే సరస్వతి … మన చాగంటి…

ఆయన మాట్లాడినా, వద్యం చదివినా.. ఆబాలగోపాలానికి శ్రవణాలలో అమృత ధారకురిసినట్లు ఉ oటుంది. అలవోకగా చెప్పే ఆ ప్రవచన ధార… ఆ విశ్లేషణా, ఆ వివరణలు నదీ ప్రవాహాన్ని సెలయేళ్ళని, జలపాతాలను, ఉప్పొంగుతున్న తరంగాలను జ్ఞప్తికి తెస్తాయి. యువజనంలో సైతం ధార్మికచైతన్యం, భక్తి ప్రవత్తులు పొంగిపొర్లుతాయి. సంస్కృతి సంప్రదాయం మూర్తీభవించిన వ్యక్తిగా… స్వచ్ఛమైన అచ్చ తెలుగు పంచకట్టుతో నిరాండబరునిగా పురాణ, వేదోపనిషత్తులకు చిరునామాగా ఉంటూ నేటి ధార్మిక జనులకు గురువుగా కీర్తిని సొంతం చేసుకున్న సాధారణమైన అసాధారణ వ్యక్తి, ఆయనే శారదా జానపుత్ర, ప్రవచనా సార్వభౌమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు,

ఫలాపేక్ష రహితంగా చాగంటి ప్రవచనం…
ప్రవచనం చెప్పి ఏ విధమైన ఫలాపేక్షాన్ని ఆశించని ధార్మిక పయణాన్ని సాగిస్తున్న చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసం చేయటంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఏనాడు, చాగంటి వారు ప్రసంగాలు చేసినందుకు ఏమాత్రం ధనం ఆశించకపోవడం విశేషం. తనతల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి తన ధార్మిక ప్రచారాన్ని నిస్వార్ధమైన అవిశ్రాంతంగా సాగిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రవచన శిరోమణి, నిష్కలమైన వ్యక్తిత్వం వీరిది.

నిరాండబర జీవితం…
కాకినాడ పట్టణంలో ఒక చిన్న ఫ్లాట్లో ఉంటూ, ఉ ద్యోగానికి స్కూటర్ పై వెళ్ళటం ఆయన సాధారణ జీవితానికి అద్దంపడుతుంది. రోడ్డుపైకి వెళ్లే భక్తుల కూడికతో ఇబ్బంది కలగకూడదనే భావనతో వస్త్రాధారణ మార్చి హెల్మెట్ పెట్టుకుని చాకచక్యంగా ఆఫీస్ కు వెళ్ళటం ఆయనకు అలవాటైపోయింది. కారు వంటి వాహనాలను కనీసం కొనుగోలు చేయలేదు వారు. ప్రవచనాలు చెప్పేందుకు మాత్రం నిర్వాహకులు ఏర్పాటు చేసిన కారులో ప్రయాణిస్తారు. తనకంటూ ఒక స్వంత కారును ఏర్పాటుచేసుకోవాలనే కోరికను పూర్తిగా వదిలేశారు.

సత్కారాలకు దూరం…
సన్మానాలు, బిరుదు ప్రధానాలకు ఆయన బహుదూరం. నిర్వాకులు ఇచ్చిన బిరుదులను మరుసటి రోజు ఈశ్వరునికి అర్పిస్తూ సంధ్యా వందనంలో వదిలేస్తానని చెప్పుకొచ్చారు. ఇది వారి ఐహిక వాంఛా విముకతకు తార్కాణం. టీటీడీ అగమశాస్త్ర ప్రధాన సలహాదారునిగా నియమిస్తూ పంపిన అధికార లాంచనాలను ఆశించకపోవటం వారి నిబద్దతకు దర్పణం.

సముద్రయానం వేద విరుద్దం…
సముద్రయానం వేద విరుద్ధమని, అందుకే ప్రవాసాంధ్రుల ప్రవచనాలు చెప్పేందుకు రావాలని “లక్షలాది రూపాయలు ఆఫర్ చేసినా” నిరాకరించారు. వేదం చదివిన వ్యక్తి సముద్ర ప్రయాణం చేయకూడదనే నియమాన్ని పాటించటం వారి దర్మబద్దమైన జీవితాన్ని ఉదహరిస్తుంది.

పిబ్లిసిటీ… ప్రకటనలకు దూరం..
ఒక ప్రముఖ వ్యక్తి వచ్చి కలిస్తే పదేపదే పబ్లిసిటీతో సొమ్ము చేసుకుంటున్న బాబాలున్న నేటి సమాజంలో నిత్యం ఆయన్ని సినీ, రాజకీయ, పారిశ్రామిక, వేత్తలెందరో, జనసామాన్యులతో సమానంగా కలిసి సందేహాలను నివృత్తి చేయటం వారి సమదర్శన దృష్టికి నిదర్శనం.

మాటే మంత్రం… యువతలోనూ ధార్మిక చైతన్యం…
చాగంటి మాటే మంత్రంగా సాగుతోంది యువతలోనూ ధార్మిక చైతన్యం ఉప్పొంగుతుంది. విద్యాలయం, దేవాలయం, సభ ఎక్కడైనా “పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం” అని మనస్ఫూర్తిగా భావించి ప్రవచించే చాగంటి సభకు భక్తుల ప్రవాహం విపరీతం. వాక్కు అత్యంత విలువైనదని, అది వ్యక్తిని అమాంతం ఉన్నత స్థాయికి చేర్చగలదు. లేదా అతల పాతాళానికి తొక్కెయగలదని హెచ్చరిస్తూ మాట విలువని, మాట్లాడే విధానాన్ని ఉదహరిస్తూ సుందర కాండలో హనుమంతుని వ్యక్తిత్వాన్ని వివరిస్తారు. పాశ్చాత్య మోజులోపడి రామాయణం గురించి నేటి జనానికి తెలియటం లేదనేది వారి ఆవేదన. నీతి, నియమాలు వావివరుసలు, భావోద్వేగాలు, బంధాలు, బంధుత్వాలు వెర్రితలలు వేస్తున్న ఈ సమాజానికి పురాణాలే శరణ్యంగా భావించారు. అందుకే తాను ఏ ప్రవచనం చేస్తున్నా కేవలం కథలా కాకుండా అందులోని సారాంశాన్ని మానవ జీవితానికి దగ్గరగా స్ఫురింపచేస్తూ ఎన్నెన్నో నీతి బోధనలు గుర్తుచేస్తూ దురాచారాలను ఖండిస్తూ, ప్రమాదాలను హెచ్చరిస్తూ ఆదర్శప్రాయమైన ప్రసంగాన్ని ప్రవాహంలా సాగిస్తారు. పురాణాలను మార్గదర్శకంగా, వేదమార్గమే శిరోధార్యంగా ప్రవచనాలే దిక్సూచిగా చేస్తూ పరాకుగా, పరధ్యానంగా పరవాలేదన్నట్లుగా ఉన్న జాతిని జాగృతపరిచే ప్రతి ప్రవచనం ఆణిముత్యమే. మరుగున పేర్చుకుంటున్న విలువలు, పరుగులో మర్చిపోతున్న సంప్రదాయాలను మేల్కొల్పుతున్న చాగంటి ప్రవచనాలు విని యువజనంతో సహా తమ జీవన విధానం మార్చుకున్న వారెందరో ఉన్నారు.

ప్రవచనంలో ఏమి ఉంటాయి?
అచ్చమైన, స్వచ్చమైన తెలుగులో మాట్లాడేవారే కరువవుతున్న ఈ రోజుల్లో అచ్చ తెలుగులో అనర్గళంగా ప్రవచనం చేయటం ఆయన ప్రత్యేక శైలి. శాస్త్రీయ, సంప్రదాయ, సాంసృతిక, సమస్త పురానాధి, వేదోపనిషత్తులు సదురు చరిత్రలు, మహనీయ జీవిత గాధలు మహరులు రచించిన సర్వవాంగ్మయంలో విలువలను లలితమైన తెలుగు ధారగా మనకు రుచి చూపిస్తున్నారు. ఉదయాన్నే వచ్చే ఆయన ప్రవచనాలు వినేందుకు ఎన్ని పనులున్నా ఆ కాసేపు పక్కన పెట్టి మరీ వింటారు. మనసంతా ధార్మికత్వాన్ని నింపేసి భగవంతునిపై దృష్టి పెట్టించగల శక్తి ఆయన వాక్కుల్లో ప్రకాశిస్తుంది. కేవలం మాటలకి మనుషులు మారతారా అనే వారికి ఒక్కసారి ప్రవచనం వినిపిస్తే చాలు ఇట్టే చాగంటివారికి ఏకలవ్య శిష్యుడవుతాడన్న సందేహంలేదు. అలా పెరిగిన భక్త అభిమానులు తెలుగునాట కోకొల్లలు. అది ఇంతింతై వటుడింతై అన్న చందంగా దేశ, విదేశీ వ్యాప్తంగాంచింది. చాగంటి ప్రవచనం ఏదేని చానల్లో వచ్చినా ఆ అరగంట సమయంలో ఆ ఛానల్ ‘టి. ఆర్పీ’ రేటింగ్ శిఖరస్థాయికి చేరుకుంటుంది. శివకేశవ అభేధము పొంగిపొర్లే భక్తి రసంతో సాగే ప్రవచనాల వల్ల చాలామంది ఇళ్ళలో తలబొప్పిగట్టే సీరియల్స్ కి స్వస్తి పలుకుతున్నారన్నది వాస్తవం. అమ్మ భోజనం వడ్డించేటప్పుడు నాన్నకెందుకు తొలి వడ్డన చేస్తుంది. తాతయ్య తిన్న ఆకులోనే అమ్మమ్మ అన్నం ఎందుకు తింటుంది? పుట్టిన రోజు దీపం ఎందుకు ఆర్పివేయకూడదు. బోటు, జడ తప్పనిసరి ఎందుకు, తల్లి, తండ్రి, గురు భక్తి ఇలా… ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిత్య జీవన విధానాలన్నిటిని వేద ప్రమాణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్తారు. అరిషడ్వర్గాలను ఉత్తేజింపజేయగల సాహిత్యం, సినిమాలు, అంతర్జాలంలో వీడియోలు అందుబాటులో ఉన్నంతగా మంచిని చెప్పే గురువుల మరింత మంది నేటి కాలానికి అవసరమంటారు చాగంటి వారు. అప్పుడే ప్రజల్లో నేర ప్రవృత్తి తగ్గుతోందని నొక్కినొక్కానిస్తారాయన.

ప్రవచనాలు పుస్తక రూపంలో…
చాగంటివారు చెప్పిన ప్రవచనాలు ప్రస్తుతం పుస్తక రూపంలో రూపొందుతున్నాయి. జన సామాన్యానికి అర్ధమయ్యే సరళమైన భాషలో సాగే ప్రవచనాలు వందలకు పైగా చేశారు. అవి వినాలంటే 2వేల గంటలకు పైనే పడుతోంది. ఈ ప్రవచానాలలో శివపురాణం, శ్రీ మహా భాగవతం, శ్రీరామాయణం, కార్తీకపురాణంలు పుస్తక రూపలో వచ్చాయి. వచనాలు, పుస్తకాలు అందరికి అందుబాటులో ఉంచేందుకు ఆయన శిష్యగణం, “గురువాణి” పేరిట ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి సీడీలు, పుస్తకాలు తక్కువ ధరలో అమ్మకాలు చేస్తున్నారు. అంతర్జాలంలో ప్రవచనాలు వినేందుకు చూసేందుకు Sri Chaganti.com ఏర్పాటు చేశారు. ఇవి కాక బ్రహ్మశ్రీ. కామ్, మరికొని వెబ్ సైట్లు, ఫేస్బుక్లో గ్రూపులు చాలానే ఉన్నాయి. ఈ అభిమాన వెళ్లువ దేశంలో మరే ప్రవచన కర్తకు లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రవచనం వైపుకు సాగిందిలా …
కాకినాడకు చెందిన చాగంటి కోటేశ్వరరావు 1959వ సంవత్సరం జూలై 14వ తేది స్వాతి నక్షత్రం న చాగంటి సుందర శివరావు, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఆండియాలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి సతీమణి సుబ్రమణ్యేశ్వరి, వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. కాకినాడలో సూర్యకళామందిర్ లో జరిగిన ఓ ప్రవచనం చూసిముగ్గులైన చాగంటి కోటేశ్వరరావు తన దృష్టంతా ఆధ్యాత్మిక ప్రవచనంవైపు పయనం సాగించారు. ఆ తరువాత పెద్దాపురంలో ఓ ఆధ్యాత్మికసభలో మాతా చిన్మయాదేవి” ఓ రోజు ఉపన్యసించి, తరువాత ఎవరైనా భాగవతం గురించి మాట్లాడమంటే కోటేశ్వరరావు ప్రసంగించి ఆమె ప్రశంసలు అందుకున్నారు. అదే మొదటి ఉపన్యాసం. ఆ తరువాత చాగంటి గురువగారైన అమరేశ్వర ప్రసాద్ ప్రోత్సాహంతో ప్రవచనాలు చేయటం కొనసాగించారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గత ఏడాది వ్యాసపూర్ణిమకు గురుపాదాలకు “గండ పెండేరం తొడిగి గురుభక్తిని చాటుకున్నారు. ఇప్పటి వరకు 200 అంశాలపై వందలాది ప్రసంగాలు చేశారు. అవి వినాలంటే 2500 గంటలపైనే సమయం వెచ్చించాల్సిఉంటుంది. మండల దీక్షలో 42 రోజులపాటు సంపూర్ణ రామాయణం, 42 రోజులపాటు భాగవతం, 30 రోజులపాటు శ్రీలలితా సహస్రనామ స్తోత్రం అనర్గళంగా ప్రవచించి అవ్యక్తానుభూతిని అందించిన జ్ఞానిగా ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మశ్రీగా పిలువబడుతున్నారు. ప్రశంసలు అనేకం… చాగంటి ప్రవచనాలు విని పులకించని వారుండరు. నేరుగా వేలు పరోక్షంగా వేలాది మంది అభిమానం చూరగొంటున్న చాగంటి కోటేశ్వరరావు ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. నడిచే సరస్వతి, శారదా జ్ఞానపుత్ర, ధార్మిక ప్రవచన బ్రహ్మ వంటి బిరుదులతో అభిమానులు ప్రశంసలు జల్లు కురిపిస్తుంటారు. జగద్గురు ఆది శంకరులు అధిష్టించిన కంచి కామకోటి ప్రస్తుత పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి ఆయనను ప్రవచన చక్రవర్తి బిరుదుతో, విజయవాడలో తాళ్ళాయిపాలెం శివపీఠాధిపతి శివస్వామి “ప్రవచనా సార్వభౌమ’ బిరుదునిచ్చి సత్కరించారు.

 నా ఆత్మ సంతృప్పి కోసమే ప్రవచనాలు చేస్తున్నాను- చాగంటి కోటేశ్వరరావు…
“ఈ ప్రవచనం ఎందుకు ఎంచుకున్నాను అంటే ఒక్కటే కారణం. ఏ విభూతి నాకు ఈశ్వరుడిచ్చాడో ఆ విభూతిని ఈశ్వరునిక నైవేద్యంగా పెట్టాలనే ఎంచుకున్నారు. ఈశ్వరుడు మాట్లాడే శక్తినిచ్చాడు. నా జీవితంలో నేను పొంగిపోయే క్షణాలేవంటే రెండుగంటలపాటు భగవంతుని గురించి చెప్పి నా బనియన్ చెమటతో తడిచి ముద్దయిపోయే ఇంటికి వెళ్ళి విప్పి ఆ బనియన్ చూసుకుని పొంగిపోతుంటాను. ఈశ్వరా… రెండు గంటలు నీ గురించి మాట్లాడి చెమట పట్టింది. చాలు నా జన్మకు ధన్యత. ఇలా నీ గురించి ఆలోచిస్తూ మాట్లాడుతుండగా నా ఆఖరిశ్వాస ఆగిపోవాలని కోరుకుని ఈ ప్రవచనం చెప్పుతున్నానే తప్పా, ఇందులో ఎన్నడూ భించిత్ ప్రతిఫలాన్ని ఆపేక్షించలేదు. ఒకానొక నాడైతే పైఊరు వెళ్ళేప్పుడునా సొంత డబ్బులు తోటే ప్రవచనానికి వెళ్ళాను. కొన్ని వందల ప్రసంగాలు చేసినా నయాపైసా తీసుకోలేదు, దాని వల్ల నేనేదో పోగొట్టుకున్నానని నేనువిచారించలేదు. భగవంతుడి గురించి చెప్పుకోవటం కన్నా నా జీవితంలో ఐశ్వర్యం నాకింకోకటి లేదు. ఆ తృప్తి కోసం నేను ప్రవచనం చెప్పుకుంటున్నాను. ఆ తృప్తి నా జీవితాంతం భగవంతుడు నాపై ఉంచుతారనే పరిపూర్ణమైన విశ్వాసం ఉంది.’

ఆశ్చర్యకరమైన విషయాలు నాకు తెలిసినవి కొన్ని…
గురువర్యులు చాగంటి వారు ప్రవచనం చెప్తుంటే ఆనాడు శుకమహర్షి, పరిషత్ మహారాజుకు సూతుడు శౌనకాది మహరులకు చెప్పిన భాగవతంలోని ఘట్టాలు మనకు స్ఫురిస్తాయి. అంతలా ఉంటుంది. ఆయన ప్రవచనం. ఎంత ఉపాసనా బలం లేకపోతే వారు ఆబాల గోపాలాన్ని ఏకలవ్య శిష్యులుగా మార్చి ఇట్టే కట్టిపడేస్తున్నారు. సాక్షాత్ అమ్మవారు. ఆయన నాలుకపై కాలీదాసును అనుగ్రహించిన రీతిగా బీజాక్షరాలు రాసిందా అనుకోని భక్తుడు లేడు. రెండు గంటలపాటు మంచి నీళ్ళు కూడా తాగకుండా ప్రవచనం ధారావాహికంగా చెప్పే వారిలోకి “సరస్వతీ దేవి” యే ప్రవేశించి చెప్తుందన్న సందేహం రాకమానదు. ఒక్కో మారు శివుడు అమ్మవారి గురించి, నరసింహ, హనుమంతుడు, రామాయణం, భాగవతం వంటివి చెప్పే సమయంలో ఆయన పొంగిపోతూ భగవంతున్ని మనకళ్ళముందు సాక్షాత్కరింపజేస్తాడు. శ్రోతలందరికి ఒంటిపై రోమాంచితమై ఉంటుంది. గంగా ప్రవాహం లా సాగిన ప్రవచనం సమయంధాటి ఇంటికెళ్ళి నప్పటికి ఆవేశం తగ్గక గురువర్యులు అక్కడి వారిని కూర్చోబెట్టి రెండు గంటల వరకు ఉ ప్పొంగుతూ ప్రవశిస్తారట.

రాజమండ్రిలో గత ఏడాది హనుమంత ప్రవచనాలు (సుందరకాండ) ప్రవచిస్తున్నా సమయంలో … నిర్వాహకులు తీసిన కొన్ని ఫొటోల్లో ఆవరణం అంతా “సింధూర వర్ణంలో” సాక్షాత్కరించింది. అంతేకాదు రామాయణం ఎక్కడ, ఎప్పుడు చెప్పినా ఓ సింహాసనం హనుమంతునికోసం ఏర్పాటు చేసి ఉ ంచాలన్న నియమంను పాటిస్తూ అక్కడ ఏర్పాటు చేసినా వేదిక హనుమంతుని రూపంలో మాత్రమే తెల్లటి వెలుగు రూపుదిద్దుకుంది. వేదికపై ఒక్క హనుమంతుని వెలుగు మాత్రమే కనిపించటం అందరిని ఆశ్చర్యాలకు గురిచేసింది. ఇలాటివి బోలెడు మచ్చుకకు కొన్ని మాత్రమే.

– శ్రీనివాస రెడ్డి సారెడ్డి

8 thoughts on “నడిచే సరస్వతి … మన చాగంటి…

  1. గురువు గారి గురించి ఎంతో విలువైన సమాచారం అందించినారు….ధన్యవాదములు సర్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap