కోఠి మహిళా విశ్వ విద్యాలయంకు చాకలి ఐలమ్మ పేరు పెడతాం- ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
సంచలన చైతన్యం చాకలి ఐలమ్మ నృత్య రూపకం…
తెలంగాణ ఏర్పాటుకు పోరాట వీర మహిళ చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. గడీ కంచెను బద్దలుగొట్టి ప్రజా భవన్ కు జ్యోతిరావు పూలే పేరు పెట్టామని, హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతను త్వరలో తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తొలిసారిగా సాంప్రదాయ కూచిపూడి, జానపద శైలిలో నృత్య రూపకం ప్రదర్శించి ఉత్తేజితులను చేశారు. అభినయ కళాతపస్వి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం ఈ సంచలన ప్రదర్శన చేసి రాజకీయ దిగ్గజాలు, కళాప్రియుల ప్రశంసలు అందుకున్నారు. చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను నాట్య రూపంలో తిలకించి జోహార్ ఐలమ్మ, జై తెలంగాణ అంటూ రవీంద్రభారతి ఆడిటోరియం మార్మోగిపోయింది. పోరాట ధీశాలి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం చాకలి ఐలమ్మ నృత్య రూపకం ప్రదర్శించి ఘన నివాళులు అర్పించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆద్యంతం నృత్య రూపకం తిలకించి అభినందించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ, పి.వి. నరసింహారావు భూ సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. భూమి పేదల ఆత్మ గౌరవం అని, పేదల జీవన ఆధారమని, ఐలమ్మ స్ఫూర్తి తో ధరణిని కట్టుదిట్టంగా అమల్లోకి తెచ్చి పేదల భూములు కాపాడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, విప్ ఆది శ్రీనివాస్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, సీనియర్ నేతలు వి. హనుమంతరావు, ఎ. కోదండ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజ, పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, సాంస్కృతిక సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, డా. కంచె ఐలయ్య, ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత తదితరులు ఆద్యంతం తిలకించి అలేఖ్య పుంజాల బృందాన్ని అభినందించారు. తెలంగాణ ముద్దు బిడ్డ చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.
ఈ తరానికి రానున్న తరానికి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలియచేసేందుకు ఈ నృత్య రూపకం రూపొందించి ప్రదర్శించినట్లు డా.అలేఖ్య పుంజాల తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప శాస్త్రీయ నృత్య రూపకం అని డా. కంచె ఐలయ్య అభివర్ణించారు. డా. అలేఖ్య పుంజాల ప్రధాన ఐలమ్మ పాత్రను పోషించి రక్తి కట్టించారు. ఆ పాత్రలో ఆమె అభినయం, వీరోచిత పోరాటం అద్భుతమే అని చెప్పాలి. 40 మందికి పైగా అలేఖ్య బృందం ఐలమ్మ జీవిత చరిత్రను సాక్షాత్కరింపజేశారు. బెంగళూరు కు చెందిన సూర్యారావు బృందం రంగోద్దీపనం, హరిణి ఇవటూరి, చరణ్ ఇవటూరి గాత్రం ఆకట్టుకుంది.
దివంగత రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన చాకలి ఐలమ్మ నృత్య రూపకం కాన్సెప్ట్, నృత్య దర్శకత్వం డా. అలేఖ్య పుంజాల నిర్వహించగా, వి.బి.ఎస్. మురళి బృందం సంగీత సహకారం అందించి రక్తి కట్టించారు. వరంగల్ జిల్లా కృష్టాపురంలో చాకలి కుటుంబంలో జన్మించిన ఐలమ్మ, పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో బాల్య వివాహం, విస్నూర్ లో రజాకార్ల, దేశ్ ముఖ్ ల అరాచకాలను ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్న తీరు, భూమి నాది, అందులో పండిన పంట నాది, మధ్యలో దొర ఎవ్వడు అంటూ పోరాట బాట పట్టి, ఆంధ్ర మహాసభ లో చేరి, కూలీలను కూడగట్టి పోరాటం చేసి విజయం సాధించిన ఐలమ్మ ను తెలంగాణ గడ్డ ఎన్నటికీ మరవదని ఈ నృత్య రూపకంలో కళ్ళకు కట్టేలా ప్రదర్శించారు. ఐలమ్మ ఇంటిని కాల్చినా, కుమార్తె పై అత్యాచారం చేసినా, ఇంటిని చదును చేసి దౌర్జన్యంగా మొక్క జొన్న పంట వేసినా ఐలమ్మ బెదరలేదు, వెనకడుగు వేయలేదు, ఎర్రజెండా దించకుండా పోరాటం చేసిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం అని చాటి చెప్పారు. ఐలమ్మ భూపోరాటం, సాయుధ పోరాటంతో పేద కూలీలకు భూపంపిణీ చేయించడం, చివరకు ఆమె అనారోగ్యంతో చనిపోవడం వరకు ఆసక్తికరంగా ఉద్యమస్పూర్తితో నృత్య రూపకం కొనసాగింది. బోనాలు, బతుకమ్మ, పోతరాజు సంప్రదాయాలతో ఆనాటి తెలంగాణ బతుకు చిత్రాన్ని ఈ నృత్య రూపకంలో ఆవిష్కరించారు. సినీ నటుడు మురళీకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించగా డాక్టర్ పి. వినయ్ కుమార్, ఆర్. వినోద్ కుమార్ పర్యవేక్షించారు. టెంపుల్ బెల్స్ కౌశిక్ రామ్ మద్దాలి నిర్వహణా సహకారం అందించారు.
–డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : సతీష్ కుమార్