భక్తి, కరుణ స్వరం చక్రవాకం

(కర్ణాటక, హిందూస్తానీ రాగాల మేళవింపుతో సినిమా పాటలు)

సినిమాల విషయానికి వస్తే, కరుణ, భక్తి రసాలను పలికించేందుకు సంగీత దర్శకులు సాధారణంగా చక్రవాక రాగాన్ని ఆశ్రయిస్తూ వుంటారు. ఇది కర్నాటక సాంప్రదాయంలో 16 వ మేళకర్త రాగంగా గుర్తింపు పొందింది. హిందూస్తానీ సంగీతంలో చక్రవాక రాగానికి దగ్గరలో వుండే రాగం ‘అహిర్ భైరవి’. ఉదాహరణకు విజయావారు నిర్మించిన ‘పెళ్ళిచేసిచూడు’ (1952) చిత్రంలో పింగళి రచనలో ఘంటసాల స్వరపరచగా పి. లీల ఆలపించిన “ఏడుకొండలవాడా వెంకటారమణా సద్దు సేయక నీవు నిదురపోవయ్యా” పాట చక్రవాక రాగానికి ప్రబల ఉదాహరణ. ఈ పాటను ఘంటసాల జంపె తాళంలో స్వరపరచారు. ఇక నటుడు చలం నిర్మించిన ‘తులాభారం’ (1974) చిత్రంలో సంగీత దర్శకుడు సత్యం స్వరపరచగా సుశీల ఆలపించిన రాజశ్రీ గీతం “రాధకు నీవేర ప్రాణం… ఈ రాధకు నీవేరా ప్రాణం… రాధా హృదయం మాధవ నిలయం” అనే పాటలో హిందుస్తానీ రాగం ‘అహిర్ భైరవి’ ఛాయలు కనిపిస్తాయి. అహిర్ భైరవి రాగానికి ప్రబల ఉదాహరణ 1963లో వచ్చిన ‘మేరీ సూరత్ తేరీ ఆంఖే’ అనే చిత్రంలో శైలేంద్ర రచించగా సచిన్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో మన్నా డే ఆలపించిన “పూఛో న కైసే మైనే రైన్ బితాయీ… ఏక్ పల్ జైసే ఏక్ జుగ్ బీతా… జుగ్ బీతే మొహే నీంద్ న ఆయీ” అనే పాట. ఈ పాట పూర్తి క్లాసికల్ అహిర్ భైరవి రాగానికి ప్రతీకగా భావించవచ్చు. కరుణ రసానికి ఈ పాట మంచి ఉదాహరణ. ఇక నిర్మాత కె. రాఘవ నిర్మించిన ‘తూర్పు పడమర’ (1976) చిత్రంలో డాక్టర్ సి. నారాయణరెడ్డి రచించిన “స్వరములు ఏడైనా రాగాలెన్నో” అనే సుశీల ఆలపించిన రాగమాలికలో పంతురావళి, హిందోళం, సిందుభైరవి రాగాలతోబాటు చక్రవాకారాగాన్ని మిళితంచేస్తూ రమేశ్ నాయుడు స్వరపరచిన పాట కూడా వుదహరించవలసిందే. ఈ పాటలోని రెండవచరణం “జననంలోన కలదు వేదన మరణంలోనూ కలదు వేదన, ఆ వేదనలోనే ఉదయించే నవ వేదాలెన్నో, నాదాలెన్నో, నాదాలెన్నెన్నో” ను సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు చక్రవాక రాగంలో స్వరపరచారు. చక్రవాక రాగానికి ఆరోహణ, అవరోహణ రెంటిలోనూ ఏడు స్వరాలను వాడుతారు.

ఆరోహణ: సరిగమపదని
అవరోహణ: సానిదపమగరి

అహిర్ భైరవి హిందూస్తానీ రాగంలో కూడా ఇవే ఆరోహణ, అవరోహణ స్వరాలను వాడుతారు. అయితే రాగాలాపనలో, ఆ రాగానికి ఇచ్చే ట్రీట్మెంట్ లో చక్రవాక, అహిర్ భైరవి రాగాలలోని తేడాలను గమనించవచ్చు.

కళావతి, మలయమారుత రాగాలకు చక్రవాక రాగంతో దగ్గర పోలికలున్నాయి. మానవతి (1952) చిత్రంలో ఎం.ఎస్. రామారావు, రావు బాలసరస్వతి పాడిన “ఓ మలయపవనమా నిలునిలుమా”, ఉయ్యాల జంపాల చిత్రంలో ఘంటసాల ఆలపించిన “కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది”, అలాగే విప్రనారాయణ చిత్రంలో ఏ.ఎం. రాజా పాడిన “మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా మేలుకోవయ్య మమ్మెలుకోవయ్యా” అనే రాగమాలికలో ఒక చరణం ‘మలయమారుత రాగం’ లో స్వరపరచినవి. అయితే మలయమారుత రాగంలో సినిమా పాటలు చాలా తక్కువే. మలయమారుత రాగం చక్రవాక రాగానికి జన్యరాగం. హిందూస్తానీ రాగాలలో మలయమారుత రాగానికి దగ్గరగా వుండే రాగం లేదు. విశేషమేమంటే ఈ రాగాన్ని వాద్యకారులు హిందూస్తానీలో యధాతధంగా ప్రవేశపెట్టడం! ఇక కళావతి రాగ విషయానికి వస్తే… మా వదిన చిత్రంలో సుశీల ఆలపించిన “మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా” అనే పాట, బుద్ధిమంతుడు చిత్రంలో సుశీల ఆలపించిన “తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా, గడసరి తుమ్మెదా”, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ చిత్రంలో మంగళంపల్లి బాలమురళి కృష్ణ, జానకి ఆలపించిన యుగళగీతం “వసంత గాలికి వలపులు రేగా” పాటలు ఈ రాగానికి ప్రతీకలు. కళావతి రాగం మాత్రం హిందూస్తానీ సాంప్రదాయానికి సంబంధించినది. కర్ణాటక సాంప్రదాయంలోని ‘వలజి’ (ప్రేమించి చూడు చిత్రంలో వెన్నెల రేయి ఎంతో చలి చలి పాట గుర్తు తెచ్చుకోండి)రాగానికి కళావతికి స్వరస్థానాలు ఒకటే కానీ రాగాలు వేరువేరు.

చక్రవాక రాగచట్రంలో అమరిన కొన్ని పాటలను గుర్తుచేసుకుందాం. అవి…

1.ఏడుకొండల వాడ వెంకటారమణా సద్దు సేయక నీవు నిదురపోవయ్యా (పెళ్ళిచేసి చూడు)
https://www.youtube.com/watch?v=I5sbke7Utuc
2.ఈ రాధకు నీవేర ప్రాణం రాధా హృదయం మాధవ నిలయం ప్రేమకు దేవాలయం (తులాభారం)
3.‘స్వరములు ఏడైనా’ అనే పాటలో రెండవ చరణం… జననంలోన కలదు వేదన…(తూర్పు పడమర)
4.విధివంచితులై విభవము వీడి అన్న మాటకోసం అయ్యో అడవి పాలయేరా (పాండవ వనవాసము)
5.చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏ దరికో ఏ దెసకో (మనుషులు మారాలి)
6.వీణలోనా తీగలోన ఎక్కడున్నదీ నాదము (చక్రవాకం)
7.జగమే రామమయం (కథానాయిక మొల్ల)
8.పిబరే రామరసం (బాలమురళీకృష్ణ – ప్రైవేట్ పాట)
9.నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో ( ఘంటసాల ప్రైవేట్ పాట)
10.పూఛో నా కైసే మైనే రైన్ బితాయీ… ఏక్ పల్ జైసే ఏక్ జుగ్ బీతా.. (మేరీ సూరత్ తేరీ ఆంఖే- మన్నా డే)
11.అబ్ మేరా కౌన్ సహారా (బర్సాత్-లతా మంగేష్కర్)
12.వఖ్త్ కర్తా జో వఫా (దిల్ నే పుకారా- ముఖేష్)
13.హోఠోమ్ మే ఐసీ బాత్ మే దబాకే చాలీ ఆయీ (జ్యూవెల్ తీఫ్- లతా మంగేష్కర్)

కళావతి రాగంలో హిందీ పాటలు కొన్ని…

1.హై అగర్ దుష్మన్ దుష్మన్ (హమ్ కిసీ సే కమ్ నహీ – రఫీ, ఆషా భోస్లే బృందం))
2.కోయీ సాగర్ దిల్ కో బెహతాతా నహీ (దిల్ దియా దర్ద్ లియా- రఫీ)
3.మేరే సంగ్ గా గున్ గునా కొయీ గీత్ సుహానా (జాన్వర్- సుమన్ కళ్యాణ్ పుర్)
4.హాయే రే వో దీన్ క్యో నా ఆయే (అనూరాధ-లతా మంగేష్కర్)

ఆచారం షణ్ముఖా చారి
(94929 54256)

SA: