చిరునవ్వుల చక్రవర్తికి వందనం… అభివందనం

స్వతహాగా అతడు గాయకుడు. ధ్వన్యనుకరణ అతనికి హాబీ. ఎందుకో అతడికి సినిమా దర్శకుడు కావాలని అనిపించింది. అతడి సామర్ధ్యం తెలిసిన నిర్మాతలు దర్శకత్వం చేస్తానంటే ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా వున్నారు. అలాగే సంగీత దర్శకత్వం నెరపడానికి కూడా అతడికి అవకాశాలు మెండుగా వున్నాయి. “అటుచూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ.. యేదెంచుకొనుటో సమస్య తగిలిందొక ఉద్యోగికి” అని మహాకవి శ్రీశ్రీ సంధ్యాసమస్యలు చెప్పినట్లు అతడు ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. భార్య రోహిణితో ప్రస్తావించాడు. పరిష్కారం లభించింది. సంగీత దర్శకుడి అవతారమెత్తాడు. తొలి ప్రయత్నంగా కథకుడు సి.వి. రమణ రాసిన “నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే, నీటిలోన నిన్ను చూచి కొంగు జారిపోతుంటే, ఎంతో సిగ్గయిందిరో మామా” అంటూ సి.వి. రమణ రాసిన పాటను సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి చేత పాడించి రికార్డు చేశాడు. కర్ణాటక సంగీతంలో ప్రధానమైన మాయామాళవగౌళ రాగంలో స్వరపరచిన ఆ పాటను విని నిర్మాత ముగ్ధుడైపోయాడు. ఆ సంగీత దర్శకుడే అప్పారావు పేరుతో ఎన్నో సినిమాలకు పాటలు పాడిన చక్రవర్తి. ఆ నిర్మాతే సమతా ఆర్ట్స్ చటర్జీ పరిచయం చేసిన ఎన్.ఎన్.భట్. ఆ చిత్రమే శోభన్ బాబు, వాణిశ్రీ నటించగా గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన ‘మూగ ప్రేమ’(1971). అప్పారావు పేరు ‘చక్రవర్తి’ గా మారింది కూడా ఈ సినిమాతోనే. “ఈ సంధ్యలో కెంజాయలో, చిరుగాలుల కెరటాలలో, ఏ మల్లి మరుమల్లె ఎగబోసేనో, ఏ రాజు ఎదలోతు చవిచూసేనో” వంటి అద్భుతమైన పాటలున్న ఈ సినిమా, చక్రవర్తిని ఓ గొప్ప సంగీత దర్శకుడుగా నిలబెట్టింది. 1973లో వచ్చిన ‘శారద’ సినిమా చక్రవర్తి సోపానాన్ని సుస్థిరం చేసింది. సుమారు వెయ్యి చిత్రాలకు సంగీతం అందించి రికార్డు నెలకొల్పిన చక్రవర్తి వర్ధంతి సందర్భంగా చక్రవర్తి సంగీత దర్శకత్వ ప్రస్థానాన్ని మననం చేసుకుందాం…

తొలిరోజులు…
కొమ్మినేని అప్పారావు అనే ‘చక్రవర్తి’ పుట్టింది సెప్టెంబరు 8, 1937న గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బసవయ్య. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి రంగస్థల నటుడు కూడా. తల్లి మంచి గాయని. ఆమె ప్రభావం చక్రవర్తి మీద యెంతో వుంది. ప్రాధమిక విద్య తాడికొండలో పూర్తిచేశాక, గుంటూరు హైస్కూలులో చేరి ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా చక్రవర్తి అందులో పాటలు పాడేవాడు. క్రమంగా తబలా, బ్యాంగో డ్రమ్ములు వాయించడం అభ్యసించాడు. చిన్న ఆర్కెస్ట్రా బృందాన్ని తయారుచేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. కాలేజిలో చేరాక విజయవాడ రేడియో స్టేషన్ లో పాటలు పాడుతూ ఉండేవాడు. కాలేజి చదువు పూర్తిచేశాక ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో చక్రవర్తికి ఉద్యోగం వచ్చింది. అదేసమయంలో హెచ్.ఎం.వి. సంస్థ ఉన్నతోద్యోగి మంగపతి నుంచి ప్రైవేటు రికార్డులు పాడడానికి ఆహ్వానం అందింది. చక్రవర్తి మద్రాసు వెళ్లి పాటలు పాడడానికే మొగ్గుచూపి చెన్నపట్నం చేరుకున్నాడు. హెచ్.ఎం.వి వారికి చక్రవర్తి పాడిన మొదటి పాట “కన్నా నేనొక కల”అనే భావగీతం. విజయవాడ రేడియో స్టేషన్ లో పాడిన అనుభవం ఉండడంతో మద్రాసు రేడియో కేంద్రంలో పాటలు పాడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ స్టేషన్ లో పియానో వాయించే రాజన్-నాగేంద్ర జంటలో ఒకరైన నాగేంద్ర తో చక్రవర్తికి పరిచయం పెరిగి స్నేహంగా మారింది. కన్నడంలో రాజన్-నాగేంద్ర సంగీతం అందించిన ‘మాంగల్యయోగం’ అనే సినిమాలో నాగేంద్ర తొలిసారి పాటపాడే అవకాశాన్ని చక్రవర్తికి కలిపించారు. అది దర్శకనిర్మాత విఠలాచార్య సినిమా కావడంతో అతడే తెలుగులో నిర్మిస్తున్న ‘జయవిజయ’(1959) సినిమాలో చక్రవర్తి చేత హాస్యనటుడు బాలకృష్ణకు “ఆడాలి పెళ్ళాడాలి పిల్లా నను పెళ్లాడాలి”, “గిలిగింతల చక్కిలిగింతలతో” అనే రెండు హాస్యగీతాలు పాడించారు. తరవాత ‘బంగారు సంకెళ్ళు’ సినిమాలో రాజబాబు కోసం “తొలగండహో బాబు తొలగండహో” అనే పాటను పాడారు. ఘంటసాల సంగీత దర్శకత్వం నెరపిన ‘పరమానందయ్య శిష్యులు’ సినిమాలో “పరమ గురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా” అనే పాటను రాఘవులు, పిఠాపురం, కృష్ణమూర్తి, భద్రం లతో కలిసి పాడారు. ఎందుకో చక్రవర్తికి గాయకుడిగా స్థిరపడలేననే భయం పట్టుకుంది. ప్రత్యామ్నాయంగా డబ్బింగ్ రంగమయితే బాగుంటుందని, అటువైపు అడుగులు వేశాడు చక్రవర్తి. ఆ రంగం చక్రవర్తికి ఎంతగా కలిసి వచ్చిందంటే చెప్పరానంతగా బిజీ అయిపోయాడు. ఎం.జి. రామచంద్రన్, జెమినీ గణేశన్, నాగేష్, కమల్ హాసన్, రజనీకాంత్, హిందీ నటుడు సంజీవ్ కుమార్, కన్నడ రాజకుమార్ వంటి నటులకు గాత్రదానం చేశాడు. సంగీత దర్శకుడుగా వుంటూనే డబ్బింగ్ ఆర్టిస్టుగా 1978-85 మధ్యకాలంలో సుమారు మూడు వందల చిత్రాలకు పైగా చక్రవర్తి పనిచేశారు. వాటిలో కన్నెపిల్ల, సర్వర్ సుందరం, ఊర్వశి, కల్పన, మన్మధలీల వంటి చిత్రాలున్నాయి. తరవాత అతని దృష్టి దర్శకత్వం వైపు మొగ్గింది. గుత్తా రామినీడు, సి.ఎస్. రావు వద్ద సహాయకుడుగా పనిచేశారు. సి.ఎస్.రావు దర్శకత్వం వహించిన కంచుకోట, పెత్తందార్లు, నిలువు దోపిడీ, దేశోద్ధారకులు చిత్రాలకు సహాయ దర్శకుడు చక్రవర్తే. అయితే సంగీతం మీద వున్న ధ్యాస మరచిపోలేక కె.వి. మహదేవన్ వద్దకు వెళ్ళారు. పుహళేంది అందుబాటులో లేని సమయంలో ‘మామ’ కు సహాయకుడుగా కొంతకాలం పనిచేశారు.

సంగీత దర్శకుడై…
చక్రవర్తి ప్రతిభ ‘సమతా’ ఫిలిమ్స్ కె. చటర్జీకి ఎంతగానో నచ్చింది. ఎన్.ఎన్. భట్ నిర్మాతగా రూపొందిన ‘మూగప్రేమ’(1971) చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశం కల్పించారు చటర్జీ. పెద్ద తారాగణంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది. పాటలు బాగున్నా, సినిమా విజయవంతం కాకపోవడంతో చక్రవర్తికి గుర్తింపు రాలేదు. అదే సంవత్సరం చటర్జీ నిర్వహణలో నిర్మాత క్రాంతికుమార్ ‘తల్లీకూతుళ్ళు’ సినిమా నిర్మించారు. అందులో కూడా హీరో శోభన్ బాబే. ఆ చిత్రానికి సంగీతం అందించారు చక్రవర్తి. “మల్లెతీగ నడిచిందా, మెరుపుతీగ నిలిచిందా, తొలిసారిగా చెలి బుగ్గల చిలిపిసిగ్గు మెరిసిందా” వంటి మంచి పాటలున్నా ఆ చిత్రం కూడా విజయానికి నోచుకోలేదు. ముచ్చటగా మూడో చిత్రం ఎస్.కె.వి. రెడ్డి నిర్మించిన ‘జ్యోతిలక్ష్మి’ (1973) కూడా ఫెయిల్యూరే. అపజయం నుంచే జయం పుట్టుకొస్తుందనే సామెతను నిజంచేస్తూ అదే సంవత్సరం అన్నపూర్ణా సినీ ఎంటర్ప్రైజెస్ వారు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘శారద’ సినిమా విడుదలై డంకా బజాయించడంతో చక్రవర్తి ఊపిరి పీల్చుకున్నారు. అందులో పాటలు “శారదా నను చేరగా ఏమిటమ్మ సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా”(రామకృ-సినారె), “వ్రేపల్లె వేచేను, వేణువు వేచెను వనమెల్ల వెచేనురా” (సుశీల-సినారె), “కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి” (ఘంటసాల,సుశీల-సినారె), ‘’శ్రీమతిగారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ’’ (రామకృష్ణ, సుశీల-దాశరథి) జనం నోళ్ళలో మారుమోగాయి. ఘంటసాలతో పాడించాలి అనే చక్రవర్తి ఆశ కూడా నెరవేరింది. ‘సమతా’ చటర్జీ కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన “ఇదాలోకం” చక్రవర్తి ఇమేజిని ఇంకాస్త పెంచింది. “ఓ కోయిలా… రమ్మన్న రామచిలక బొమ్మలాగా ఉలకడు పలకదు” (బాలు,సుశీల-సినారె), “గుడిలోన నా స్వామి కొలువై వున్నాడు సేవకు వేళాయెనే” (ఎల్లార్ ఈశ్వరి, జానకి-వీటూరి), “నీ మనసూ నా మనసు ఏకమై, నీ నీడ అనురాగ లోకమై” (రామకృష్ణ, సుశీల-సినారె), “నిత్య సుమంగళి నీవమ్మా, నీ పసుపు కుంకుమ చెదరనిదమ్మా” (ఘంటసాల, వసంత-ఆత్రేయ) పాటలు జనంలోకి చొచ్చుకొని పోయి, ఒక నూతన సంగీత తేజం పుట్టుకొచ్చిందని చక్రవర్తికి ప్రశంసలు అందాయి. తరవాత రెండేళ్ళలోనే, హారతి, అనగనగా ఒక తండ్రి, సత్యానికి సంకెళ్ళు, తిరపతి, దీర్ఘ సుమంగళి, ఊర్వశి, ఇంటికోడలు, అభిమానవతి వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి చక్రవర్తి బాగా బిజీ అయిపోయారు. చక్రవర్తికి బాలు అనినా, అతని గొంతన్నా యెంతో ఇష్టం. తొలి ప్రయత్నంలోనే అతనిచేత పాటలు పాడించాలని ఆశించినా, శోభన్ బాబు రామకృష్ణ వైపే మొగ్గు చూపడంతో అది సాధ్యం కాలేదు. పైగా చక్రవర్తికి మొదట వచ్చిన అవకాశాలన్నీ హీరో శోభన్ బాబుతోనే కావడం ముఖ్య కారణం. మూడేళ్ళపాటు మహదేవన్, సత్యం, చక్రవర్తిల మధ్య సంగీత దర్శకత్వ పోరాటం నువ్వా నేనా అన్నట్లు సాగింది. అది చక్రవర్తికి ఘనకీర్తి తెచ్చిన అంశం. 1982-88 మధ్య కాలంలో అద్భుతమైన అవకాశాలు చక్రవర్తి వెంట నడిచాయి. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ నడుపుతున్న ఎన్.టి.రామారావు చిత్రాలు అన్నదమ్ముల అనుబంధం, యమగోల, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, ఛాలెంజ్ రాముడు వంటి చిత్రాలకు చక్రవర్తి అద్భుత సంగీతాన్ని సమకూర్చారు. హిందీలో గురుదత్ నిర్మించిన ‘ప్యాసా’ (1957) ను చటర్జీ ‘మల్లెపూవు’ (1978) పేరుతో పునర్నిర్మించినప్పుడు చక్రవర్తి సమకూర్చిన సంగీతం అబ్బుర పరచింది. హిందీ మాతృక లోనే పాటల బాణీలు అనుకరించకుండా “చిన్న మాటా ఒక చిన్న మాటా” (సుశీల), “చకచక సాగే చక్కని బుల్లెమ్మా”(బాలు, సుశీల), “మరుమల్లియకన్నా తెల్లనిది” (బాలు), “ఓహో లలితా, నా ప్రేమకవితా” (బాలు, సుశీల), “ఎవరికి తెలుసు చితికిన మనసు” (బాలు), “నువ్వు వస్తావని బృందావని” (వాణిజయరాం), “ఏమి లోకం ఏమి స్వార్ధం” (బాలు) వాటి పాటలకు స్వరాలల్లి సూపర్ హిట్లుగా మలచడం చక్రవర్తి సంగీత మకుటంలో కలికి తురాయిగా అమరింది. చక్రవర్తి కూడా ఇందులో గోపాలరావు కు “జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ జుమ్” అనే పాట పాడారు. హిందీ మాతృకలో ఒక్క పాటను కూడా అనుకరించకుండా పాటలను చక్రవర్తి స్వరపరచిన విధానం ఎందరో నిర్మాతలు, దర్శకులకు స్పూర్తి దాయకమైంది. హీరో చిరంజీవి వేగానికి, జయమాలిని, జ్యోతిలక్ష్మిల డిస్కో చిందులకి, ఎన్టీఆర్ స్టెప్పులకి అనుగుణంగా చక్రవర్తి పాటలు స్వరపరచి సినిమాలు హిట్లయ్యేందుకు సహకరించారు. కేవలం వ్యాపార చిత్రాలకే కాకుండా మాదాల రంగారావు నిర్మించిన ఎర్రమల్లెలు, విప్లవశంఖం, ప్రజారాజ్యం, మహాప్రస్థానం, టి. కృష్ణ నిర్మించిన నేటిభారతం, వందేమాతరం, రేపటి పౌరులు వంటి ప్రబోధాత్మక చిత్రాలకు కూడా అర్ధవంతమైన సంగీతాన్ని అందించడం చక్రవర్తి ప్రత్యేకత. రీరికార్డింగు చెయ్యడంలో చక్రవర్తిది మేటి చేయి. సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల్లో థీమ్ మ్యూజిక్ వంటి అంశాన్ని ప్రవేశపెట్టారు. ‘తీర్పు’ చిత్రంలో అతితక్కువ వాద్యాలతో పాటలు స్వరపరచి సినీ సంగీతానికి కొత్త అర్ధం తెచ్చారు. బాలు సోదరి ఎస్.పి. శైలజను ‘మార్పు’ చిత్రం ద్వారా గాయనిగా వెలుగులోకి తెచ్చింది కూడా చక్రవర్తే. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా”, “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” పాటలకు సంగీత సొబగులద్ది రికార్డులుగా విడుదలచేస్తే నేటికీ అవేపాటలను ఎన్నికల ప్రచారంకోసం ఆ పార్టీ పెద్దలు వాడుకుంటున్నారు.

రాఘవేంద్రరావు, దాసరి తో స్నేహం…
ఎ.వి.యం. సంస్థ సమర్పణలో మారుతీ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘బాబు’ (1975) చిత్రం కె. రాఘవేంద్రరావు కు దర్శకుడిగా తొలి చిత్రం. అందులో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. అందులో చక్రవర్తి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. “ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన” (బాలు, సుశీల, రామకృష్ణ), “ఓయమ్మా ఎంతలేసి సిగ్గొచ్చింది” (సుశీల, రమోల) వంటి యెంతో మంచి పాటలు ఈ సినిమా విజయానికి తోడ్పడ్డాయి. తరవాత ఎన్టీఆర్-రాఘవేంద్రరావు-చక్రవర్తి కాంబినేషన్ లో కొండవీటి సింహం, గజదొంగ, వేటగాడు, డ్రైవర్ రాముడు వంటి జనరంజకమైన సినిమాలు వచ్చాయి. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు చక్రవర్తి మధురమైన సంగీతాన్ని సమకూర్చారు. దాసరి ఎక్కువగా రమేష్ నాయుడు చేత సంగీతం చేయించుకున్నా చక్రవర్తికి కూడా మంచి సినిమాలు ఇచ్చారు. వాటిలో బలిపీఠం, శ్రీవారి ముచ్చట్లు, ఏడంతస్తుల మేడ, సర్దార్ పాపారాయుడు, బుచ్చిబాబు, దీపారాధన, ప్రేమాభిషేకం వంటివి కొన్ని మాత్రమే.

మరిన్ని విశేషాలు…
చక్రవర్తి శోభన్ బాబు చిత్రాలకు ఎక్కువగా సంగీతం అందించారు. మూగప్రేమ మొదలుకొని, శారద, ఇదాలోకం, బలిపీఠం, జేబుదొంగ, రాజా, ఖైదీ కాళిదాసు, దీపారాధన, ప్రేమమూర్తులు, ఊరికి సోగ్గాడు, చీకటివెలుగులు, మల్లెపూవు వాటిలో కొన్ని.

గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అంటే చక్రవర్తికి వల్లమాలిన ప్రేమ. చక్రవర్తి సంగీతం సమకూర్చిన మొత్తం చిత్రాల్లో తొంభై శాతం పాటలు బాలు పాడినవే అందుకు తార్కాణం. బాలు పెద్దన్నయ్యకు చక్రవర్తి పోలికలు వుండడంతో ‘’అన్నయ్యా’’ అని బాలు పిలిచేవారు. బాలసుబ్రహ్మణ్యాన్ని ‘మన్మధలీల’ సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టును చేసింది చక్రవర్తే. ప్రతిసంవత్సరం జనవరి 1 వ తేదీన బాలుతో చక్రవర్తి పాటను రికార్డ్ చెయ్యడం ఆనవాయితీగా మారింది. అలాగే బాలు పుట్టినరోజు … అంటే జూన్ 4 వ తేదీ న కూడా చక్రవర్తి తప్పకుండా బాలు తో పాటను రికార్డు చేసేవారు.

ముందుగా రాసిన పాటకు బాణీ కట్టడం అంటే చక్రవర్తికి ఇష్టం. కానీ ఎక్కువగా ట్యూనుకే పాటలు రాయించేవారు దర్శకులు, నిర్మాతలు. ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించిన ‘ప్రతిఘటన’ సినిమాలో వేటూరి రాసిన “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో“ పాటకు పావుగంటలో బాణీకట్టి హిట్ చేశారు చక్రవర్తి. ఎక్కువగా విజయా గార్డెన్స్ లోని డీలక్స్ రికార్డింగ్ థియేటర్ లో చక్రవర్తి పాటలు రికార్డింగ్ చేసేవారు. ఆ థియేటర్ అంటే చక్రవర్తికి మక్కువ ఎక్కువ.

చక్రవర్తిది అంతా సంచలనమే. ఒక గంటలోనే ఏడు పాటలకు బాణీలు కట్టి రికార్డింగ్ చేయించిన ఘనత చక్రవర్తిది. దాదాపు ఇరవై సంవత్సరాలు అవిశ్రాంతంగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఏడాదికి 40 కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రోజులున్నాయి. తెలుగు నిర్మాతలు, దర్శకులు హిందీలో సినిమాలు నిర్మిస్తే వాటికి రీరికార్డింగు చక్రవర్తే చేసేవారు.

మరుగున పడిపోయిన పాతతరం సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, ఎ.ఎ.రాజ్ (ఆకుల అప్పలరాజు), నిత్యానందం వంటివారికి పనికల్పించి పారితోషికం అందించి సాయపడేవారు. కృష్ణ-చక్ర చాలా కాలం చక్రవర్తికి సహాయకులుగా పనిచేశారు. తరవాత వారుకూడా సంగీత దర్శకులై మంచి సినిమాలకు పనిచేశారు.

రాజ్-కోటి, కీరవాణి, మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, మాధవపెద్ది రమేష్, సురేష్, మనో, సాలూరు వాసూరావు చక్రవర్తివద్ద శిష్యరికం చేసినవారే. మనో చక్రవర్తికి అభిమాన ట్రాక్ సింగర్. ఆయన ట్రూప్ కండక్టర్ గా, కంపోజింగ్ సహాయకుడుగా కూడా చక్రవర్తి వద్ద పనిచేశారు.

చక్రవర్తి సంగీత దర్శకత్వం అందించిన చిత్రాల సంఖ్య 959. ఆ మిగిలిన సంఖ్య కూడా పూర్తిచేసి 1000 చిత్రాల దర్శకుడిగా రికార్డు నెలకొల్పాలని చక్రవర్తికి ఆశగా వుండేది. కానీ, మణిపాల్ లో ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కుమారుడు రాజేశ్వర ప్రసాద్ మోటారు సైకిల్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ షాక్ నుంచి చక్రవర్తి కోలుకోలేకపోయారు. దాంతో సినిమాలు తగ్గించుకున్నారు. ఇంతలో ఇళయరాజా ప్రభంజనం అధికం కావడంతో చక్రవర్తి వెనకపడ్డారు. చక్రవర్తి సంగీతం అందించిన చివరి చిత్రం ‘అమ్మోరు’.

గాయకునిగా తల్లీ కూతుళ్ళు, దేవి లలితాంబ, నిలువుదోపిడీ, రామునిమించిన రాముడు, పక్కింటి అమ్మాయి, స్వరాజ్యం వంటి సినిమాలలో చక్రవర్తి పాటలు పాడారు. నటుడుగా ఆమెకథ, అల్లరిబుల్లోడు, సీతాపతి సంసారం, గజదొంగ, గోపాలరావు గారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి వంటి సినిమాలలో మంచి పాత్రలు పోషించి నటుడుగా కూడా పేరుతెచ్చుకున్నారు.

చక్రవర్తికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేటిభారతం (1983), ‘శ్రావణ మేఘాలు’ (1986) చిత్రాలకు నంది బహుమతులు లభించాయి.

చక్రవర్తి భార్య పేరు రోహిణీదేవి. వారికి నలుగురు కొడుకులు. పెద్దబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోగా మిగిలిన కొడుకుల్లో శ్రీనివాస చక్రవర్తి “శ్రీ” పేరుతో సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మూడవ వాడు రామకృష్ణ ప్రసాద్ కూడా సంగీత దర్శకుడే. చివరి సంతానం కళ్యాణ చక్రవర్తి అమెరికాలో వైద్యవృత్తిలో వున్నారు. చక్రవర్తి తన అరవై ఐదవ యేట ఫిబ్రవరి 03, 2002 న శివైక్యం చెందారు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “చిరునవ్వుల చక్రవర్తికి వందనం… అభివందనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap