విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 33
మనసులో మహిళకు గుడి కట్టిన వనితా జనోద్దార కుడు గుడిపాటి చలం తెలుగు సాహిత్యంలో నూతన శైలిలో రచనలు కొనసాగించి అబలకు అండగా నిలిచిన అక్షర యోధుడు. 20వ శతాబ్దపు ఆధునిక భావాల సామాజిక శ్రేయోభిలాషి వనితా హితైషి అయిన ఈయన చిన్ననాటనే తన ఇంట తన తల్లి, సోదరి పడిన కష్టాలు, కడగండ్లు కళ్ళారా చూసిచలించిపోయి, మహిళల పట్ల సానుభూతి పెంచుకొని స్త్రీ జాతికి ధైర్యం నూరిపోయాలని నిర్ణయించుకుని రచనలు కొనసాగించి, స్త్రీలకు మనోబలం కలిగించాడు. ఆడవారి బ్రతుకుల్లో అలుముకున్న ఆనాటి అర్థంలేని సామాజిక అమావాస్యల చీకట్లను చీల్చి, వారి బ్రతుకుల్లో వేనవేల శశిరేఖల వెలుగులు ప్రసరింపచేసి, స్త్రీ జాతికి కొత్త జీవితాలను ప్రసాదించాడు. ఈయన పిఠాపురం మహారాజా కాలేజీలో చదివేరోజుల్లో సాంఘిక సంస్కర్త, ఆంధ్రదేశాన బ్రహ్మసమాజ స్థాపకుడైన రఘుపతి వెంకటరత్నం నాయుడి సాహచర్యంలో తన జీవితానికి ఓ గమ్యం ఏర్పరచుకున్నాడు. ఆనాటి ఛాందస్సులందరినీ ఎదిరించి మరీ తన భార్యను చదివించాడు. ఈయన ప్రముఖ నవలలు మైదానం, శశిరేఖ, దైవమిచ్చిన భార్య, బుజ్జిగాడు వంటివి తెలుగునాట ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాయి. చలం తన మనసు విప్పి విశదీకరించాడు. జీవిత చరమాంకంలో రమణమహర్షి ఆశ్రమంలో గడిపిన అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగిన మహిళా మార్గదర్శి, దార్శనికుడు గుడిపాటి వేంకటచలం నేటికీ మన ధృవతార.
(గుడిపాటి చలం జన్మదినం 18 మే 1894)