ప్రముఖ చిత్రకారులు, రచయిత, కార్టూనిస్టు వడ్డాది పాపయ్యతో నాకు ఒక దశాబ్దంపాటు స్నేహం కొనసాగింది. అంటే చాలామంది ఆయన అభిమానులు అతిపెద్ద జోక్ గానో, అబద్దంగానో కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఆయన ఎవ్వరికి ఇంటర్వూలు ఇవ్వరు, ఎవ్వరితోనూ మాట్లాడరు అనే అసత్యవార్త ఎక్కువ ప్రచారంలో వుంది కాబట్టి. ఈ ప్రచారం అంతా తప్పని వారితో నాకున్న అనుబంధంతో చెప్పగలను. వపా గొప్ప స్నేహశీలి. ఆయన బాల్యంలో టి.వి.రామశాస్త్రి, ప్రత్తి గజపతిరావు, తదితరులతో కలసి, వారి ఇంటికి సమీపంలో వున్న ఆటలాడుకోవడం, అల్లరి చేయడం చేసేవారు. ఆయన ‘చందమామ’లో పనిచేసిన మూడు దశాబ్దాల పాటు, శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో వున్న ఆయన స్వగృహ వ్యవహారాలన్నీ రామశాస్త్రి చూస్తుండేవారు. గజపతిరావు రైల్వేలోను, రామశాస్త్రి చిత్రకళోపాధ్యాయునిగా పనిచేసేవారు. వారిరువురు కూడా చిత్రకారులు కావడానికి వపా ప్రభావం ఎంతో వుంది. వపాకు సంబంధించిన ప్రచురితమైన కథలు, కార్టూన్లు, చిత్రాలు, ముద్రితం కాని చిత్రాలు కూడా వారు సేకరించి భద్రపర్చారు.
అలాగే ఆయన మద్రాసునుండి కశింకోట వచ్చాక, అనకాపల్లి శారదా గ్రంధాలయంలో పనిచేసే చిన్నారావు, ఇంకా ప్రముఖ వైవ్యులు జి.బి.ఇ. నరసింహరావు, ప్రముఖ కధారచయిత ఇచ్చాపురం రామచంద, ప్రముఖ కార్టూనిస్టు బాలి, ప్రముఖ జ్ఞాపికల తయారిదారు గుప్తా తదితరులతో సన్నిహిత సంబంధాలు వుండేవి. ఆయన ఎప్పుడు తనదైన కలల లోకంలో వుండేవారు. ఆయన అంత గొప్ప చిత్రకారుడైన గ్రామంలో ఒక సామాన్యుని మాదిరి వ్యవహరించేవారు. ఇంట్లోకి కావాల్సినవన్నీ అనకాపల్లి నుండి కొనుగోలు చేసి రిక్షాలో వేసుకొని తెచ్చేవారు. ఆయన పనులన్నీ స్వయంగా చేసుకొనేవారు. తన కళాసృజనకు ఆటంకం కలగ కూడదన్న ఉద్దేశ్యంతో తనను గురించి తెలియకుండా జాగ్రత్త పడేవారు. వ్యక్తి ఆరాధనను ప్రోత్సహించకూడదనే, తనను కలువవచ్చిన వారితో నిర్మొహమాటంగా మాట్లాడేవారు. కాలం విలువ తెలిసిన వారు కావడం వల్ల తన వద్దకు వచ్చిన వారితో జాగ్రత్తగా క్లుప్తంగా మాట్లాడేవారు. తనకు నచ్చింది, తోచిన విధంగా గీస్తున్నానని దాన్ని ఆదరించేవారు ఆదరిస్తున్నారని, ఇతరుల అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని వారి అభిప్రాయం. తన చిత్రాలు చూడటానికి నిజాయితీగా వచ్చేవారిని, ఆయన తిరస్కరించిన దాఖలాలు లేవు. ఆయన ఏకాంతంగా చిత్రాలు గీయడానికి ఇష్టపడేవారు. అభిమానులకు అనుమతిస్తే, తన కళాసృష్టికి ఆటంకం ఏర్పడుతుందని అందువల్ల ఎక్కువమందిని కలవడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. ఇవేవి తెలియని ఆయన అభిమానులు ఆయనకి గర్వమని, ఎవ్వరితో మాట్లాడరని ప్రచారం చేసారు.
ఈ విషయాలన్నీ ఆయన్ని కలిసినాక తెలుసుకోవడం జరిగింది. అసలు వారితో నాకు పరిచయమే చిత్రంగా జరిగింది. అది 1979 సం. మే నెల ఒకరోజున విశాఖ నౌక నిర్మాణ కేంద్రంలో పనిచేస్తూ, ఛాయా చిత్రకారుడైన నా మిత్రుడు శరగడం అప్పారావు నా వద్దకు వచ్చి మనం కశింకోట ఆదివారం వెళ్తున్నాం, అక్కడ చందమామ చిత్రకారుడు వడ్డాది పాపయ్య నివశిస్తున్నారు. వారిని కలసి మాట్లాడి, వారి చిత్రాలు చూసి వద్దాం అన్నారు. వపా మద్రాసులో కదా వుండేది, కశింకోట ఎప్పుడు వచ్చారు అన్నా, దానికి ఆయన చందమామ కథలు రాసే ఎం.వి.వి.సత్యనారాయణ, వపా మద్రాసు నుండి కశింకోట వచ్చి నివశిస్తున్నారని చెప్పాను. ఇప్పటివరకు వపాని ఎవ్వరూ ఇంటర్వూ చెయ్యలేదట. మనం ఎలాగైనా వారితో మాట్లాడి, ఫొటోలు తీసుకొని వద్దాం అంటే… సరే ప్రయత్నం చేద్దాం అన్నాను. అప్పటికే నాకు పలు తెలుగు చిత్రకళాసంస్థలు, చిత్రశిల్పులతో పరిచయం వుంది. పత్రికల్లో చిత్రకారుల గురించి, చిత్రకళా ప్రదర్శనల గురించి తరచు వ్యాసాలు వ్రాసేవాడ్ని. ఆంధ్రచిత్ర శిల్పులు అనే ఒక గ్రంధం కూడా ప్రారంబించడం జరిగింది. వపాని కలిసి వారి వివరాలు సేకరించి ఆ గ్రంధంలో ప్రచురించవచ్చునన్నది నా ఆలోచన!
ముందుగా అనుకొన్నట్టుగానే ఒక ఆదివారం ఉదయాన్నే మేమున్న సింధియా నుండి అనకాపల్లి బస్సులో వెళ్లి, అక్కడనుండి కశింకోట రిక్షాలో వెళ్లాం. అది చిన్న పల్లె కావడంతో వపా ఇల్లు పావని నిలయం పట్టుకోవడం మాకు పెద్ద కష్టం కాలేదు. శరదానది ఒడ్డున, ఊరి శివారు ప్రాంతంలో వేణుగోపాలస్వామి ఆలయం ఎదురుగా చిన్న మేడ మీద హనుమంతుని రూపం వున్న కాషాయం రంగు జండా ఎగురుతున్నది. అంతేకాక మేడ ముందుపై భాగంలో 010 లోగో, హనుమంతుడు లంఘిస్తున్న దృశ్యం సిమ్మెంట్ తో నిర్మించారు. ఇల్లు చిన్నదైనా, ప్రశాంత వాతావరణంలో చక్కగా వుంది. ఇంటిముందు గేటుకు, తలుపులకు చిలకపచ్చరంగు పూసివుంది. ప్రహరిగోడను ఆనుకొని సన్నజాజి, మల్లెచెట్టు, పందెరపైకి వుంది. ఇంటి ప్రవేశద్వారం ప్రక్కన గోడపై బృందావనం- రాధాకృష్ణుల చిత్రం చిత్రించబడివుంది. ఇన్ని ఆధారాలు దొరికాక అది వపా ఇల్లుకాక మరెవ్వరిది అవుతుంది. మేము వెళ్ళే సమయానికి ఒక నడివయస్సు స్త్రీ సన్నజాజులు తుంచుతున్నది, ఆమెను చూసి మేము పాపయ్యగారు కావాలన్నాం. ఆమె సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వెళ్లిపోయింది. కొద్దిసేపు అయ్యాక ఒక వ్యక్తి అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చి, ఎవరుకావాలని అడిగారు. పాపయ్యగారని మేము చెప్పాం. ఎందుకన్నారు? చిత్రాలు చూడాలని వచ్చామని చెప్పాం. పత్రికల్లో చూస్తున్నారు కదా? ఇంకా ఏమి చూస్తారని అన్నారు. ఒరిజినల్ చూడాలనుకొంటున్నాం అన్నాను. ఎక్కడనుంచి వచ్చారని అడగ్గా మేము షిప్ యార్డ్ ఉద్యోగులం విశాఖ నుండి వచ్చామని చెప్పా. ఆయన మాతో ఏమి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళారు. కొద్దిసేపు అయ్యాక బట్టలు ధరించి వచ్చారు. ఇంకా మీరు వెళ్లలేదా అని ప్రశించగా, మేము మౌనంగా గేటు వద్ద నిలబడ్డాం. ఆయన ఏమనుకొన్నారో. సరే రండి అని మమ్మల్ని గేటు తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. మేడపైన వున్నా తన స్టూడియోలాంటి గదికి దారితీశారు పరుగులాంటి నడకతో.
గది తలుపులు తెరవగానే అది వారి ప్రత్యేక గది అని మాకు అర్ధం అయ్యింది. తలుపు వద్ద ఒక బల్ల, ప్రక్కన ఒక స్టాండ్, దానికి సగం పూర్తి అయిన మాత చిత్రం బిగించబడి వున్నాయి. బల్లపై అనేక బ్రషులు, పోస్టర్ కలర్స్ వున్నాయి. గదిలో రాజారవివర్మ చిత్రించిన శ్రీరామ పట్టాభిషేకం పటం కట్టి వ్రేలాడుతూవుంది. గదిలో ఒక ప్రక్కన రెండు పెద్ద చెక్కపెట్టెలు వున్నాయి. ఇంకా కొంచెం దూరంలో పాత చందమామలు, యువలు వున్నాయి. మీరు చూడాలనుకొంటున్న చిత్రాలు, ఈ పెట్టెల్లో చూడమని చెప్పి, ఆయన క్రిందికి వెళ్లిపోయారు.
మేము ఆనందంతో, ఆశ్చర్యంతో ఒక పెట్టెను తెరిచాము. అంతే ఒక్కసారిగిగా దిగ్ర్భాంతి చెందాము. ఒక్కొక్క పెట్టెలో వందవరకు వర్ణ చిత్రాలు వున్నాయి. చందమామ, యువలో ప్రచురింపబడినవి, ఇంకా అంతకుముందు అభిసారిక, రేరాణి, ఆంధ్రపత్రిక, భారతిలలో ప్రచురింపబడ్డ చిత్రాలు. చిత్రం గీయడం పూర్తి అయ్యాక ఆ పత్రిక లోగోను ఆయన అంటించడం జరిగింది. కొన్నిటిపై పత్రిక పేరును కుంచెతో వ్రాయడం జరిగింది.
మేము చూసిన చిత్రాల్లో వాల్మీకి రామాయణం, వ్యాసభారతం, పోతన భాగవతం దృశ్యకావ్యాలుగా కనిపించాయి. ప్రాచీన ఇతిహాసాల్లోని అన్ని ముఖ్య ఘట్టాల్నీ వపా రంగుల్లో చూపించారు. మధ్యలో ఒకసారి మంచినీటి చెంబు, గ్లాసుతో పైకొచ్చారు. మేము టైం మిషన్ ద్వారా రామాయణ, భారత కాలంలోకి వెళ్లి, రంగుల త్రీడి చూస్తున్న అనుభూతిలో వుండటంవల్ల, సమయాన్ని గమనించలేదు. సాయంత్రం ఐదుగంటల సమయంలో ఆయన మళ్లీ మేడమీదకు వచ్చారు. ఇప్పటికీ చాల సమయం గడిచింది. మరోసారి చూద్దురు గాని అన్నారు. అప్పుడు మేము మామూలు ప్రపంచంలోకి వచ్చాం. తర్వాత కొద్దిసేపు మా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన చెప్పినవి వ్రాయడానికి ప్రయత్నించగా వద్దని వారించారు. అప్పుడు వారి మాటల్ని మనస్సులోనే రికార్డు చేసి, ఇంటికి వచ్చాక డైరీలో వ్రాసుకొన్నాను. ఆ తర్వాత వారికి ఉత్తరం వ్రాసి వారి సమ్మతితో అనేకసార్లు, నేను, నా మిత్రులు, వెళ్లి చిత్రాలు చూసి, వారితో సంభాషించడం జరిగింది. కొన్ని అంశాలకు సంబంధించి నేను వారికి ఉత్తరాలు వ్రాయగా, వెంటనే ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేసేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో పోస్టు కార్డుపై ఏదో ఒక చిత్రం గీసి, రెండో ప్రక్కన సమాధానం వ్రాసేవారు. అలా మా స్నేహం వారు అమరులు అయ్యేవరకు కొనసాగింది.
– సుంకర చలపతిరావు
మంచి వ్యాసం అందించారు. వపా గారితో అంత సన్నిహితంగా మెలిగిన మీరు గొప్ప అదృష్టవంతలు…అభినందనలు…చలపతిరావు గారికి…..వారి వివరణకు వపా గారిపై చాలా మందిలో ఉన్న అపప్రద తొలగించినందుకు..
…… శ్రీనివాస్ బీర.
ఆర్టిస్ట్
గొప్ప చిత్రకారుడి గురుంచి ఆసక్తికరమైన సమాచారం ! 💐
అవునండి చలపతిరావుగారితో నే నేనూ ఓ సారి వారిని సందర్శించాను. గొప్పచిత్రకారులు…కీర్తి, కనకం కాంక్షలేనివారు.శ్రీనాథుడు, పోతనామాత్యులు, యింకా…యింకా …ప్రముఖుల రూపాలు చిత్రించిన గొప్పకళాకారులు వ.పా.గారు. నన్నుచూసేదేముంది నా సృజనను ఆశ్వాదించండి అనేవారు. మహామనీషి. మంచి వ్యాసాన్ని అందించారు శ్రీ చలపతిరావుగారు.
ఒక గొప్ప చిత్ర కారునితో మీ పరిచయ బంధంతో కూడిన మీ వ్యాసం చాలా బాగుంది సర్ .అభినందనలు
Thanks for you responce Ventapalli garu