కళల గని  – చలసాని

చలసాని ప్రసాదరావు గారు శారీరక, ఆర్థిక, ప్రతిబంధకాలను అధికమించి ఉన్నత ప్రమాణాలు సాధించిన పాత్రికేయుడు, చిత్రకారుడు, రచయిత, కడదాకా కమ్యూనిస్టు అభిమాని ఉన్న వారి వర్థంతి సందర్భంగా…!

ప్రముఖ రచయిత, చిత్రకారుడు, కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో అక్టోబరు 27 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు.
1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయాడు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించాడు.

వెల్లంకి సుగుణభూషణరావు గారి ప్రోత్సాహంతో చలసాని ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు. 1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఇతడు 1956 నాటికి వరంగల్లు చేరుకున్నాడు. కాకతీయ పత్రిక అనే వారపత్రికలో అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫైనార్ట్స్‌ కళాశాలలో కమర్షియల్‌ ఆర్ట్‌లో అయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు పూర్తిచేశాడు.

ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు తీర్చాడు. 1961లో ఇతడి సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించాడు. ఈ ఆరు సంపుటాలు ఆణిముత్యాలని విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం. ‘కళ’ తొలి సంపుటం వచ్చేనాటికి ఇతడు విద్యార్థి మాత్రమే!
యునెస్కోసంస్థ 1964లో ‘బుక్‌ ఇలస్ట్రేషన్ల’ మీద ఢిల్లీలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచారపౌర సంబంధశాఖలో స్టాఫ్‌ ఆర్టిస్టుగా చేరాడు. అప్పట్నించీ ఆయన ఎన్నో కోర్సులు పూర్తిచేశాడు. లండన్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోటెక్నాలజీ సంస్థ డిప్లొమా పూర్తిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందాడు.

1971లో వసుధ అనే పత్రికకి సంపాదకుడయ్యాడు. 1974లో ఈనాడులో తొలుత ‘ఆదివారం అనుబంధం’ పార్ట్‌ టైమ్‌ సంపాదకుడిగా చేరి 1975నాటికి పూర్తిస్థాయి సంపాదకుడయ్యాడు. దాని తర్వాత “విపుల’, “చతుర” మాస పత్రికలతో పాటు అడపా తడపా వచ్చే ప్రత్యేక సంచికలకు ఆయనే సంపాదకత్వం వహించాడు.

కబుర్లు :
“””'”””””””””””””‘”””””””””””””””””””””'”””””””””””””””””‘
ఈనాడు పత్రికలో చలసాని ప్రసాదరావు కబుర్లు అనే శీర్షికని వెయ్యివారాలకు పైగా నిర్వహించాడు. ఆ శీర్షిక జిగి, బిగి తగ్గకుండా చూశాడు. ఈ శీర్షిక గురించి ఆయన మాటల్లోనే ”కబుర్లు రచయితగా నా లక్ష్యం పాఠకుల్ని కాసేపు నవ్వించే హస్యగాడుగా ఉండిపోవడం కాదు. ఒక అంశం గురించి నేను ఫీలయినదాన్ని నా పాఠకులు కూడా ఫీలయ్యేలా నా రచన కొనసాగాలనేది నా లక్ష్యం. అందుకే కబుర్లలో హాస్యం పాలుకంటేవ్యంగ్యం పాలు ఎక్కువ.” నిజానికి కబుర్లు శీర్షికని వసుధ అనే మాసపత్రికలో 1971లో ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి అనే మరో మాసపత్రికలో కొనసాగింది. చివరికి 1982 అక్టోబరు 22న ఈనాడు దినపత్రికలో వాటికి శాశ్వత చిరునామా కల్పించాడు. నిరాఘాటంగా తన జీవితాంతం ఈనాడులోనే కబుర్లాడాడు.

చలసాని ప్రసాదరావు గారి గురించి నరిశెట్టి ఇన్నయ్య గారి మాటల్లో :
“””””‘”‘””””””””””””””””””””””””‘””‘””””””””””””””””””””””
చనిపోయే వరకూ మిత్రులుగా గడిపిన మేము, తొలుత ఎలా పరిచయస్తులమయ్యామో చెప్పలేను. అప్పట్లో ప్రభుత్వ సమాచార శాఖలో ఆర్టిస్టుగా పని చేస్తూ, సైదాబాద్ కాలనీ (హైదరాబాద్) నుండి బస్సులో వస్తుండేవారు. ప్రసాదరావు మాట్లాడటమే గాని వినడం లేదు. 8 ఏళ్ళ ప్రాయం నుండీ ఆయనకు చెముడు వచ్చింది. నా వంటి వారికి ఆయన మాటలు విని, అర్థం చేసుకోవడం అలవాటుగా మారింది.

1972లో ఈనాడు పత్రిక విశాఖపట్టణం నుండి వెలువడినప్పుడు, ప్రసాదరావు ఆదివారం సంచిక చూచేవారు. అందులోనే ఆయన కోరికపై వ్యాసాలు రాశాను. ఎ.బి.కె. ప్రసాద్ అప్పుడు ఎడిటర్. ఈనాడు హైదరాబాదు కు తరలిన తరువాత ప్రసాదరావు ప్రభుత్వ ఉద్యోగం నుండి ఈనాడుకు మారారు. నేను అడపదడపా వ్యాసాలు రాశాను.
కమ్యూనిస్టుగా ఆరంభమైన ప్రసాదరావు, విజయవాడ వరంగల్లు, హైదరాబాద్ లో అనేక మంది కమ్యూనిస్టుల గోత్రాలు, లోతు పాతులు తెలిసినవాడు. ఆ అనుభవంతో ‘ఇలా మిగిలేం’ అని పుస్తకం రాశాడు. అందులో కమ్యూనిస్టులు కొందరు ఎలా దిగజారారో రాశాడు. చలసాని ప్రసాదరావు అలారాయడం కమ్యూనిస్టులకు మింగుడు పడలేదు. రావి నారాయణరెడ్డి ఎన్.ఆర్. దాసరి మెదలు గజ్జల మల్లారెడ్డి మొదలైన వారిని దుమ్ముదులిపేశాడు. వ్యక్తుల్ని పసిగట్టి బాగా అంచనా వేసేవాడు.

చలసాని ప్రసాదరావు ఈనాడులో చేరి, పెట్టుబడిదారీ పత్రిక అధిపతి రామోజీరావు గులాం అయ్యాడన్నారు. కాని అలా విమర్శించిన మార్క్సిస్టులు కొందరు ప్రసాదరావు దగ్గరకు వచ్చి, తమ పిల్లలకు ఉద్యోగాలిప్పించమని అడిగారు. ప్రసాదరావు నవ్వుకున్నాడు. ఆయన హాస్యప్రియుడు. కళాభిమాని, రచయిత, ఆర్టిస్టు. మిత్రులతో కలసి క్లబ్ లో హాయిగా రెండు పెగ్గులు వేసుకొని, సిగరెట్లు తాగి, ఆనందించిన ప్రసాదరావు జీవితంలో రంగులు చూచాడు.

ఈనాడు పత్రికలో ఆదివారంతో బాటు, విపుల, చతుర పత్రికలు జయప్రదంగా నిర్వహించారు. అవి పడిపోతున్నప్పుడు, ఆపేయమని సలహా యిచ్చాడు. కాని రామోజీరావు పంటి బిగువుతో నడిపాడు.
ప్రసాదరావుకు నాకూ తాత్విక రాజకీయ భావాలలో పొసిగేది కాదు. నన్ను రాయిస్టు అని పరిచయం చేసేవాడు. ఏ రాయి అయితేనేం, తలపగల గొట్టుకోడానికి అని వెక్కిరించేవాడు.

తనకు గుండె పోటు వచ్చితట్టుకున్నా, సిగరెట్లు మానలేకపోయాడు. చివరి వరకూ ఈనాడు కబుర్లు రాశాడు.
ప్రసాదరావుకూ నాకూ కామన్ మిత్రులన్నారు. సంజీవదేవ్, రవీంద్రనాథ్ ఆలపాటి, సి. భాస్కరరావు, వెనిగళ్ళ వెంకట రత్నం, దండమూడి మహీధర్. నార్ల అంటేనూ, ఎ.బి.కె. ప్రసాద్ పట్లా ప్రసాదరావుకు సదభిప్రాయం లేదు. నార్ల గురజాడపై విమర్శలు చేసినప్పుడు, అవసరాల సూర్యారావు పరిశోధనను దుయ్యబట్టినప్పుడు, ప్రసాదరావు మెచ్చలేదు. అయితే ఆ రంగంలో ప్రసాదరావుదే దోషం. రంగనాయకమ్మపై కూడా తీవ్ర విమర్శలు చేస్తుండేవారు.

చలసాని ప్రసాదరావు అమెరికా పర్యటనలో న్యూయార్క్ వెళ్ళి మారుమూల వున్న నికలస్ రోరిక్ కళాకారుని మ్యూజియం సందర్శించాడు. ఆయన ఆసక్తి, ప్రత్యేకంగా పనిగట్టుకుని రావటం చూచి అభినందించిన మ్యూజియం డైరెక్టర్, ప్రసాదరావుకు వారి ఆల్బమ్ బహూకరించి సత్కరించారు. ఆ తరువాత మరొకసారి నేను అదే మ్యూజియంకు వెళ్ళినప్పుడు ప్రసాదరావు రాకను గురించి చెప్పారు. సంజీవదేవ్ – రోరిక్ లు మిత్రులు. వారి ఉత్తర ప్రత్యుత్తరాలు నేను సంజీవదేవ్ నుండి స్వీకరించి మ్యూజియంకు బహూకరించాను.
ప్రసాదరావు నాకు కుటుంబ మిత్రుడు కూడా. నా పిల్లలతో కూడా సన్నిహితంగా వుంటూ, అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మాయి నవీన దగ్గర గడిపాడు. చక్కని బొమ్మలు వేసి పిల్లలకు యిచ్చేవాడు.

2000: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.
మరణం : జూన్ 12 2002న చలసాని ప్రసాదరావు మరణించారు.

మహ్మద్ గౌస్

2 thoughts on “కళల గని – చలసాని

  1. చలసాని ప్రసాదరావు గారి గురించి మీరు రాసిన ఈ వ్యాసం చదివి నాకు చాలా సంతోషం వేసింది. ఆయనకీ నాకూ నా కార్టూన్ల ద్వారా చక్కటి సంబంధం ఉంది. ఇక్కడ రాయడం భావ్యం కాదుగానీ.. చాలా మంచి మనిషి ఆయన. నాకు మొట్టమొదట ఈనాడు (న్యూస్ టైం) లో ఉద్యోగం ఇచ్చారు. తెలియని విషయాలు చాలా తెలియచేసారు. థాంక్యూ.

  2. 1978లో నాకు విపుల చతురలో చిత్రకారుడిగా పరీక్షలో చలసాని వారి ఇంటర్వ్యూ లో ఎన్నికై కన్ఫర్మ్ అయినా… నేను చేరలేదు…కానీ వారి ఎంపిక విధానాన్ని మరువలేను. వారి పరిచయం మరువలేనిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap