తొలిసినీ గేయరచయిత, తెలంగాణా బాషా, యాసను నూట పదేళ్ళ క్రితమే “కనక్తార” అనబడే నాటకంలో వ్యక్తం చేసిన మహారచయిత. సాహితీ వినీలఆకాశంలో అణగారిన వర్గం నుండి ఉద్భవించిన అరుంధతీ నక్షత్రం లాంటి పవిత్ర ధృవతార ఆయన. మన కమ్మనైన తెలుగు భాష లోఎన్ని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో అగ్ర గణ్యుడు కేశవదాసు. ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చారిత్రిక గ్రామం అయిన జక్కేపల్లి నివాసి. ఖమ్మంలో ఆయన నివాసాన్ని రజాకార్లు దాడిచేసి ధ్వంసం చేయడంతో అవసానకాలంలో ఆయన అదే మండలంలో నాయకుని గూడెంలో కూడా నివశించారు. చందాల కేశవదాస్ తొలిసినీగేయ రచయితగానేచాలా మందికి తెలుసు. కానీ, నాటకాల్లో తెరలేవక ముందు కళాకారులు పాడుకునే “పరబ్రహ్మ పరమేశ్వర -పురుషోత్తమాసదానంద” అన్న నాంది గీతం ఆయనరచనే. నేడు పత్రికా రంగంలో వినియోగిస్తున్న “భలే మంచి చౌకబేరము “ లాంటి నుడికారాల సృష్టి కర్త ఆయనే. ఇప్పటికీ సురభి కళాకారులు చే ప్రదర్శించబడుతున్న “కనక్తార” నాటకకర్త ఆయనే. ఇప్పుడు కనక్తార నాటకానికి 115 ఏళ్ళు! అంటే ఇంచుమించు గురజాడ కన్యాశుల్కం నాటక కాలంలోని రచన. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన విశిష్టత పెరిగింది.తెలంగాణా మలిదశ ఉద్యమం సమయంలో నేను రాసిన “మరుగున పడ్డ మణి మకుటం చందాల కేశవదాసు” అన్న పుస్తకం తెలంగాణా రాష్ట్రం లో విశేష ఆదరణ పొందింది. ఇప్పుడది తెలంగాణా రాష్ట్రం లోని ప్రతి పాఠశాల గ్రంథాలయంలో లభ్యం అవుతుంది.వాస్తవానికి చందాల కేశవదాసు గురజాడ, గిడుగు, వీరేశలింగం లాంటి సంస్కర్తల సరసన చోటు వహించాల్సి ఉన్నప్పటికీ తెలంగాణా బాషా, యాసకు జరిగిన అన్యాయమే తెలంగాణా రచయితల కు జరిగింది. ఆకోవలో తొలివరసలో ఉన్న రచయిత చందాల కేశవదాసు.
1931లో తొలితెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” చిత్రంలో హిరణ్యాక్షుడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదునికి విషం ఇచ్చి చంపమనే సన్నివేశంలో ప్రహ్లాదుని తల్లి లీలావతి పడ్డ వేదన ఆనాటి సారాంశం. పరితాపబారంబు భరియింప తరమా/కటకటావిది గడవంగ జాల/పతిఆజ్నను దాటగలనా/ఈవిషము నేనెట్లు,తనయునకుత్రావింపగలను/ధర్మమును కాపాడుదునా/తనయుని కాపాడగలనా?/అంటూ ప్రహ్లాదుని తల్లి లీలావతి వగచిన, ఏడ్చిన సన్నివేశం లో పాటనే తొలి సినీ గేయంగా గణుతికెక్కినది. అంతేకాదు.కేశవదాస్ భక్తప్రహ్లాద(1931,1942), సతీ సక్కుబాయి (1935,1954) శ్రీకృష్ణ తులాభారం (1935,1955,1966), సతీ అనసూయ (1935), లంకాదహనం(1936) కనక్తార (1937, 1956), రాధాకృష్ణ (1939), బాలరాజు (1948)చిత్రాలకు ఆయన పాటలు రాశారు. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో “భలే మంచి చౌకబేరమూ” మీరజాలగలరా నాఆనతి!” గజ్జెలందియలు గల్లు గల్లుమన “లాంటి ఎన్నో సూపర్ హిట్స్ పాటలు రాశారు.
సినిమాలకు ముందు నాటకరంగం కు ఆయన విశిష్ట సేవలందించారు.ఆయన రాసిన కనక్తార(1911), బలిబంధనం (1935) నాటకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.’కన్యాశుల్కం’నాటకానికి ఇచ్చిన ప్రాదాన్యత కేశవదాసు “కనక్తార” నాటకానికి ఇవ్వకపోవడం సైతం ఆయన ప్రాంతీయ, పుట్టిన కులం అడ్డం వచ్చిందనే విమర్శలు లేకపోలేదు? కన్యాశుల్కం నాటకం లో వస్తువు ఏనాడో మారిపోయింది. కానీ, కేశవదాసు “కనక్తార “నాటకం ఈనాటికీ సురభీ కళాకారులు ప్రదర్శించడం నాటకం యోక్క జవసత్వాన్ని,అక్షర జీవనాన్ని బహిర్గతం చేస్తుంది. ఒకరకంగాస్త్రీహింసనుఎత్తిచూపే,వివక్షతను ఎలుగెత్తే, తొలి ఫెమినిస్ట్ రచనగా సైతం దాన్ని తీసుకోవచ్చును.రాసిన15ఏండ్ల తర్వాత 1926 లో అచ్చులో కి వచ్చిన ఈ కనక్తార నాటకం అత్యధికం గా 30 సార్లు పునర్ముద్రణ పొందింది.రెండుసార్లు సినిమాగా వచ్చింది. అంటే ఆయన నాటకం ఎంతో చారిత్రక పాత్ర నిర్వర్తించింది అర్థం అవుతుంది. అన్నింటికంటే ముఖ్యం తెలుగు భాష లో తొలి తెలంగాణా యాసను అక్షరబద్ధం చేసిన అరుదైన రికార్డు కూడా కేశవదాసు కు దక్కుతుంది.ఆయన కనక్తార ప్రసిద్ద నాటకంలో ఆయన చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడే భాషను ఆయనవాడారు. గ్రాందిక రచనే సాహిత్యంగా తులతూగుతున్న కాలంలో వ్యవహారం బాషా, అందునా తెలంగాణా యాసకు ఆయన ఇచ్చిన ప్రాదాన్యత తెలంగాణా ఆణిముత్యాలలో అగ్ర పీఠం దక్కుతుంది. ఆయన నాటకాలు, సినిమా రచనలన్నింటా తెలంగాణా ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఆయన కనక్తార నాటకంలో వాడిని” మాపిటేళ నిను సూస్తే! మాలచ్చోలిగ ఉంటావే!!” అనే పాటలో పల్లెటూరి నుడికారం ఆయన ఆరోజుల్లోనే వాడి మెప్పించారు.” భలే మంచి చౌక బేరం” సక్కనిగుంటారాయో నాయెంట -సరసాలడుకుంటా” తెలంగాణా చక్కని యాసలో ఆయన పాటలు రాశారు.”నాలుగేళ్ళు మంటెత్తుతాది అబ్బ/దెబ్బ మీద దెబ్బ నన్నుగొట్టకే” ఆయనపాటఅచ్చ తెలంగాణ యాసలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. శ్రీకృష్ణ తులాభారం సినిమా లో నారధ మహారుషి శ్రీకృష్ణని అమ్మజూపిన సన్నివేశంలో “కొట్టు కొట్టండి బుర్రపగల/జుట్టూడ లాగండి-సెవులు మెలేయండి/నారదుడంట -సన్నాసిగాడంట/దొరగారి నమ్ముకుంటే, తనబాబు సొమ్మంట/” అంటూ జనం తిరుగుబాటు సన్నివేశంలో తెలంగాణ గొల్లకూర్మలు వాడుక భాషను ఆయనవాడడం చందాల కేశవదాసు స్ఫురద్రూప దృష్టి, ఆనాడే తెలంగాణా విశిష్టత ఆయన రచనల్లో వ్యక్తం చేయడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
1948లో రజాకార్ మూకలు ఆయన ఇంటిపై దాడిచేసి దోచుకున్న సమయం లో ఆయన రచనలు సైతం ధ్వంసం చేయబడ్డాయి. చందాలకేశవదాస్ రచనలు సేకరణలో డా. పురుషొత్తమాచార్యులు లాంటి పరిశోధకులు కొంత కృషి చేశారు. ఆయన రామభక్తుడు.తనకు సినిమా పాటల రచన ద్వారా వచ్చిన రెన్యూమరేషన్ తో కోదాడ సమీపంలోని తమ్మరలో ఆలయం నిర్మించాడని ఆప్రాంత ప్రజలు చెబుతారు. ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో అంతిమ శ్వాస విడిచారు. ఆయన సమాధి కూడా సూర్యాపేట-ఖమ్మం రహదారి ప్రక్కనే కనిపిస్తుంది. ప్రతి ఏటా ఆయన కుటుంబం, తెలంగాణా సాహిత్య కారులు ఆయనవర్థంతి, జయంతి జరుపుతుంటారు.
తెలంగాణా సాధించుకున్నప్పట్టి కీ తెలంగాణాకవి, రచయిత గా చందాల కేశవదాసు ప్రాదాన్యతను గడచిన పన్నెండేళ్ళు గా పాలకుల గుర్తింపు కు నోచుకోలేదు. కోట్లరూపాయలు అవార్డులు, ఉత్సవాలు పేరుతో తగలేస్తున్న ప్రభుత్వాలు ఆయన పేర కనీసం ఒక్క అవార్డుకూడా ప్రవేశపెట్టక పోవడం, కనీసం ఆయన కుటుంబం ను గుర్తించకపోవడం పాలకులు అల్ప ఆలోచన దొరణులను సూచిస్తుంది. తెలంగాణా రాకముందు నిర్లక్ష్యం కు గురైన చందాలు కేశవదాసు, త్రిభాషా కవి రచయిత హిరాలాల్ మోరియా లాంటి కవులు, రచయితల చరిత్రలు తెలంగాణా యూనివర్సిటీలు ఏనాడో పాఠ్యాంశాలు గా స్వికరించాలి. కానీ, ఇంకా సాహిత్య రంగంలో వ్యక్తం అవుతున్న సంకుచిత ధోరణులు అలాంటి చర్యలకు అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఇలాంటి త్యాగధనులైన రచయితల, కవులు విశిష్ట చరిత్ర భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం గా స్థిరీకరించాలసిన అవసరం ఉంది.
(చందాల కేశవదాసు 150వ జయంతి 20-6-2026 సందర్భంగా ఈ వ్యాసం)
–ఎన్. తిరుమలరావు
సెల్: 9441864514
