విలక్షణ వ్యక్తి చక్రపాణి

(24 సెప్టెంబర్ చక్రపాణి గారి 44 వ వర్ధంతి సందర్భంగా)
చక్రపాణిగారికి బాల్యం నుంచీ సాహిత్యం పట్ల అభిమానం ఎక్కువ. హైస్కూలు విద్య పూర్తయ్యాక హిందీ పాఠశాల ప్రారంభించారు. తదుపరి హిందీలోంచి తెలుగులోకి కథలను అనువదించారు. అప్పట్లో ఉత్తరాది పండితులు ప్రజనందశర్మ ఆ పాఠశాలను దర్శించి, సుబ్బారావు రచనా కౌశలాన్ని అభినందించి ‘చక్రపాణి’ అనే కలం పేరుతో రచనలు చేయమని సూచించారు. నాటినుంచీ ఆయన ‘చక్రపాణి’గా స్థిరపడి పోయారు.
“దేవదాసు షూటింగ్ జరిగే రోజుల్లో నేను తరచూ చక్రపాణిగారిని కలిసేవాణ్ని. దేవదాసు పాత్ర స్వభావాన్ని ఆయన విశ్లేషించి, విపులీకరించేవారు. అవి దేవదాసు పాత్ర పోషణకు ఎంతగానో సహకరించాయి” అని పలుమార్లు అక్కినేని నాగేశ్వరరావు ఉదహరించేవారు. ఏ శుభముహూర్తంలో నాగిరెడ్డిగారితో చక్రపాణి గారికి పరిచయం కలిగిందో (1944 ప్రాంతం) గానీ అది నాగిరెడ్డిగారి బి. ఎన్.కె. ప్రెస్ అభివృద్దికి తెలుగు సాహిత్యంలో విప్లవాన్ని సృష్టించిన ‘చందమామ’ ఆవిర్భావానికి, తెలుగు సినీ అభిమానులు ముచ్చటపడి మురిసిపోయే మహత్తర దృశ్యకావ్యాన్ని అందించిన విజయా సంస్థ ప్రారంభానికి దారితీసింది..
1945 ప్రాంతాల్లో చక్రపాణిగారి నిర్వహణలో ‘ఆంధ్రజ్యోతి’ మాసపత్రిక చెన్నై వెలువడింది. ప్రముఖ రచనలతో ‘ఆంధ్రజ్యోతి’ సాహితీ లోకంలో సంచలనం సృష్టించింది. ‘యువ’ మానసత్రిక చక్రపాణిగారి మానసపుత్రిక. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. కొన్ని కారణాల వల్ల విజయవారి ‘మిస్సమ్మ’ చిత్రం నుంచి భానుమతిని నాయికగా నిర్మాత హెూదాలో చక్రపాణి తొలగించినా, సంపాదకుని హెూదాలో యువ మాసపత్రికకు దీపావళి వచ్చేసరికి వీరు ఆమెను ఆర్టికల్ అడగటం, ఆమె రాయటం వారిద్దరి విలక్షణ వ్యక్తిత్వానికి ఆత్మీయులకు సంబంధించిన ప్రత్యేక విశేషం. 1941లో పి. పుల్లయ్యగారి ‘ధర్మపత్ని’కి రచన చేసిన చక్రపాణి 1945లో వచ్చిన ‘స్వర్గసీమ’కు కథ రాయటం ద్వారా తన సత్తాను నిరూపించుకున్నారు. మిత్రుడు నాగిరెడ్డిగారితో కలసి విజయా ప్రొడక్షన్స్ ప్రారంభించారు. విజయ సంస్థ తొలి చిత్రం ‘షావుకారు’. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే చక్రపాణి మృదుల హాస్యప్రియుడు, ఇందుకు వారే ట్రీట్ మెంట్తో రచనతో రూపొందిన పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ చిత్రాలు చాలు ఉదహరించటానికి. ‘మాయాబజార్’ చిత్రంలో ఓ డైలాగ్ వుంది. ‘శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగా, కర్కశంగానూ చెబుతుంది. కానీ పారాంశాన్ని సౌమ్యంగానే తీసుకోవాలి.’ ఇది చక్రపాణిగారి వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవచ్చు. ఎవరైనా ఏమన్నా అనుకుంటా వేమోనన్న ఫీలింగ్ లేకుండా తన మనసులోని మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవారు.
ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్ళి మీ ఆశీస్సులు కావాలంటే “నువ్వు కష్టపడు. ఎవరి ఆశీస్సులు అక్కర్లేదు పైకొస్తావ్. అది లేనప్పుడు ఎందరు ఆశీర్వదించినా ఫలితం శూన్యం” అనేవారు. ఈ ఒక్కమాట చాలు ఆయన ఆంతర్యాన్ని అంచనా వేయటానికి. తన యూనిట్లో ఎవరింట్లో యే శుభకార్యం జరిగినా స్వయంగా వెళ్లి చేయగల సహాయాన్ని గుప్తంగా అందజేసీ సౌమ్యుడు చక్రపాణి
-యస్వీ రామారావు

1 thought on “విలక్షణ వ్యక్తి చక్రపాణి

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link