చందమామ కథ… కమామీషూ

జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ “చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా” అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థం చేసుకోవచ్చును.అందరూ మెచ్చే చందమామ పత్రిక గురించి సమగ్రంగా తెలుసుకుందాం.
చందమామ అనేది చంద్రుణ్ణి ఆప్యాయంగా పిలుచుకునే పేరు. ప్రపంచానికి ఛందమామ ఒక్కడే వెలుగును పంచుతున్నాడు. కానీ భారతీయులైన మనకు మరో చందమామ విజ్ఞానాన్ని కూడా పంచుతున్నాడు. ఆ చందమామ తెలుగు వాడు కావడం మన అదృష్టం. ఆ చందమామే సుప్రసిద్ధ పిల్లల మాస పత్రిక. పేరుకి పిల్లల పత్రికే అయినా ఇంటిళ్ళపాదీ ఇష్టంగా చదివే పత్రిక చందమామ ఒక్కటే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు ఒక నెల ముందు విజయా పిక్చర్స్ చలనచిత్ర నిర్మాణ సారథులు బి. నాగిరెడ్డి, చక్రపాణి ల సారధ్యంలో తెలుగు, తమిళ భాషల్లో అలనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యపట్టణం నుండి వెలువడిన చందమామ క్రమంగా పదమూడు భాషల్లో వెలువడుతూ సింగపూరు, అమెరికా, కెనడా వంటి దేశాల్లోనూ అభిమాన పత్రికగా విరాజిల్లింది. మనకు వెలుగును పంచే చందమామ లో ‘దోసెలు పోసే అవ్వ’ కనిపిస్తూ వుంటే ఈ చందమామ లోగోలో ‘రాజా’ అనే కుందేలు దర్శనమిస్తుంది. తొలిరోజుల్లో ఆరువేల సర్కులేషన్ తో మొదలై రెండు లక్షల సర్కులేషన్ ను అధిగమించిన ఈ చందమామ గురించి మనం తెలుసుకోవాలి. కారణం… గ్రహణం పట్టిన ఈ చందమామ మనకు కనుమరుగైంది. ఈ చందమామ కథలు పిల్లల్లో సత్ప్రవర్తన, బాధ్యత, నిజాయితీ, లోకజ్ఞానం, కృతజ్ఞతాభావం, వినయం, ఆత్మాభిమానం, ధృడసంకల్పం, పౌరుషం వంటి మంచి లక్షణాలను అలవారచుకునేందుకు దోహదపడేవి. చందమామ పత్రికలు చదివిన అలనాటి బాలలు మంచి పౌరులుగా మసలారు.

చందమామ వెలువడే రోజుల్లో టెలివిజన్ వంటి వినోద సాధనాలు లేవు. ఈ విజ్ఞాన సాధనం పిల్లల చేతుల్లో నలిగి వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని, పెద్దలకు కాలక్షేపాన్ని పంచింది. ఈ పత్రిక ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు… పెద్దవారు కూడా నిరీక్షించేవారు. వ్యవస్థాపకులు నాగిరెడ్డి, చక్రపాణిలే… కానీ రథసారతి మాత్రం కొడవటిగంటి కుటుంబరావే! చందమామలో దయ్యాల కథలు కూడా ఉండేవి. కానీ అవి పిల్లల్లో మూఢనమ్మకాలు పెంచేవిగా వుండవు. సరదా పుట్టించేవిగా ఉండేవి. ఈ దయ్యాలు మంచివారికి సాయం చేస్తే. మరొక రకం దెయ్యాలు తమాషాలు చేస్తూ చిలిపనులతో అల్లరిపెట్టేవి. చందమామలో ధారావాహికలు అచ్చయ్యేవి. వాటికి ‘చిత్ర’, ‘శంకర్’ అనే చిత్రకారులు అద్భుతమైన బొమ్మలు వేసి ఆసక్తి కలిగించేవారు. భాష యెంతో సరళంగా వుండేది. ధారావాహికలు నడుస్తున్నకొద్దీ అందులోని పాత్రలకు వేసే బొమ్మలు మొదటిసారి ఎలావుండేవో చివరిదాకా అలాగే ఉండేవి. దాంతో బొమ్మల్ని చూడగానే పాత్రలను పిల్లలు పోల్చుకునేవారు. ఈ ధారావాహికల్లో కథానాయికలు తక్కువగా కనిపిస్తుంటారు. ఈ ధారావాహికలు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరినట్లే భ్రమ కలిగించేవి. రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క, దుర్గేశ నందిని, శిధిలాలయం వంటి ధారావాహికలను పుస్తకాలుగా బైండింగ్ చేయించి పెద్దవాళ్ళు ఇళ్లల్లో భావితరాలకోసం భద్రపరచేవాళ్ళు. ఉపనిషత్తుల్లోని కథా సరిత్సాగరం, జాతక కథలు, జైన పురాణ కథలు చందమామ పత్రికలో చోటుచేసుకునేవి. భాషా సాహిత్య రత్నాలైన మణిమేఖలై, శిలప్పదిగారం లాంటివి కూడా చందమామలో చోటు చేసుకునేవి. అందుకనే 1960-80 లలో పెరిగి పెద్దలైన చిన్నారులు ఈ ధారావాహికలను, కథలను మర్చిపోలేకున్నారు.
ఈ ధారావాహికల్లో పది, పన్నెండుకు మించి పాత్రలకు ఉండేవి కావు. ప్రతి సీరియల్లో ఇద్దరు నాయకులు వుండేవారు. వారికి కొడవటిగంటి విక్రమకేసరి-శిఖిముఖి; ధూమకుడు-సోమకుడు; ఖడ్గవర్మ-జీవదత్తుడు వంటి పేర్లు పెట్టేవారు. ఇవి కాకుండా పురాణ కథలు కూడా దారావాహికలుగా వచ్చేవి. రామాయణం, మహాభారతం, కృష్ణావతారం, శివపురాణం, విష్ణుకథలు, దేవీ భాగవతం, జగన్నాథ చరిత్ర పేర్లతో పురాణ కథలు వచ్చేవి. సీరియల్స్ అన్నిటికీ చిత్ర, శంకర్ బొమ్మలు వేస్తే అరణ్యపురాణం పేరుతో జంగిల్ బుక్ ధారావాహికకు మాత్రం వడ్డాది పాపయ్య బొమ్మలు గీసేవారు.

బేతాళ కథల విషానికి వస్తే ఇవి ఒక చిత్రమైన కథల ధారావాహికలు. ‘విక్రమార్కుడు శవాన్ని దించి భుజానవేసుకొని’ అంటూ మొదలయ్యీవి. ‘రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు’ అంటూ ముగింపు పలికేవి. బేతాళుడు చిక్కు ప్రశ్నలు సంధించి ‘ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల వేయి వ్రక్కలవుతుంది’ అని హెచ్చరించేవాడు. అసలు విక్రమార్కుడి కథలు పాతికకు మించి వుండవు. కానీ చందమామ పత్రిక పుణ్యమా అని వందలకొద్దీ కథలను అందులో బేతాళ కథలుగా మార్చి ప్రచురించారు. ప్రతినెలా ఒక చిక్కు ప్రశ్నను సంధించడం దానికి చక్కటి సమాధానం విక్రమార్కుడి ద్వారా చెప్పించడం ఈ కథల ప్రత్యేకత. ఇక కథా స్రవంతుల విషయానికొస్తే పరోపకారి పాపన్న, తాతయ్య కథలు, జాతక కథలు, ఇంద్రజాలిక కథలు (ఎ.సి. సర్కార్), బండ భీమన్న కథలు ప్రచురించేవారు. నాలుగైదు నెలలు సాగే చిన్న ధారావాహికల్లో సింద్ బాద్ సాహస యాత్రలు, భూతాలు చేసిన పెళ్లి, మాయదారి ముసలిది వంటివి చోటుచేసుకునేవి. చందమామ శైలి సరళమైన భాషలో, చక్కని నుడికారాలు, జాతీయాలు, సామెతల కలబోతగా వుంటుంది. చందమామ పత్రిక చదివితే పిల్లలకు చక్కని భాషా పరిజ్ఞానం పెంపొందుతుందని పెద్దలు భావించేవారు. చంద్రుడి మీద మానవుడు కాలుమోపిన సందర్భంగా 1969లో చందమామ ప్రత్యేక సంచికను వెలువరించింది. అలాగే మహాత్మా గాంధి శతజయంతికి కూడా చందమామ ప్రత్యేక సంచిక వెలువడింది.

కొడవటిగంటి కుటుంబరావు చందమామకు నిర్దేశకుడిగా 1952 నుంచి 1980లో చనిపోయేదాకా వ్యవహరించారు. ఎంతో వేగంగా కథలు రాసేవారు. ఇతర రచయితలల నుంచి వచ్చే కథలను మెరుగుపరచి చందమామ శైలిలో వాటికి రూపకల్పన చేసేవారు. అది ఎంతటి కథైనా పేజి చివరికి పూర్తి కావాల్సిందే. పేజీ తిప్పితే మరో కథ మొదలవ్వాలి అనేదే కొడవటిగంటి సూత్రం. ఆయన చనిపోయేనాటికి తన మేజా నిండా ఆరు నెలలకు సరిపడా కథలు రాసివున్నాయట! అదీ కొడవటిగంటి ప్రావీణ్యం. చందమాలో పంచతంత్ర కథలను రాసింది విద్వాన్ విశ్వం. ఈ కథలకు వడ్డాది పాపయ్య చిత్రాలు గీసేవారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఉత్పల సత్యనారాయణ గేయాలు రాసేవారు. దేవీభాగవతం సీరియల్ ను కొడవటిగంటి మరణానంతరం పూర్తి చేసింది వడ్డాది పాపయ్య. అలాగే విష్ణు కథ కూడా ఆయన రచనే. ఇక తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు, వంటి ధారావాహికలు రాసింది దాసరి సుబ్రహ్మణ్యం. ఎ.సి. సర్కార్ ఇంద్రజాలికుడి చేత ఆసక్తికరమైన కథలు రాయించి అమాయక ప్రజలను మోసగించే వారి గుట్టును బయటపెట్టే ప్రయత్నం చేశారు కొడవటిగంటి. బూర్లె నాగేశ్వరరావు ‘వసుంధర’ పేరుతో చక్కని కథలు రాశారు. మాచిరాజు కామేశ్వరరావు దయ్యాలు, పిశాచాల కథలకు రూపమిచ్చారు. ఇలా మరింకెందరో చందమామ పత్రికకు కథలు రాశారు. వడ్డాది పాపయ్య తోబాటు ఎం.టి.వి ఆచార్య మహాభారతం అట్టమీది, అట్టచివరి బొమ్మలకు చిత్రాలు గీశారు. ఆర్టిస్ట్ చిత్ర అసలు పేరు టి.వి. రాఘవన్. ఆయనే చందమామ పత్రికకు ప్రధాన చిత్రకారుడు. బేతాళకథలకు రూపం కలిపించింది శంకర్ అనే చిత్రకారుడు. ఆయన ఇప్పుడు సజీవుడే. ప్రస్తుతం బెంగుళూరులో వున్నారు. మన సభ్యులు, ప్రముఖ చిత్రకారుడు, అక్షరశిల్పి,మ సునాదవినోదిని లోగో రూపొందించిన పెమ్మరాజు రవికిషోర్ ప్రత్యేకించి బెంగుళూరుకు వెళ్లి శంకర్ ని కలిసి వచ్చారు. కొన్ని సంచికలకు బాపు కూడా బొమ్మలు గీశారు. చందమామ పత్రిక అంత అందంగా రూపు దిద్దుకోవడానికి ఆ సంచిక ముద్రణ ముఖ్యమైనది. నాగిరెడ్డి తమ్ముడు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ అయిన బి. ఎన్. కొండారెడ్డి ఆధ్వర్యంలో బి.ఎన్.కె ప్రెస్ లో చందమామలు అచ్చయ్యేవి. నూతన అచ్చు యంత్రాలను ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకొని చందమామను అత్యంత ఆకర్షణీయంగా ముద్రించేవారు.

చందమామ పత్రిక 1998 అక్టోబరు నెలలో అనివార్యకారణాలవలన ఆగిపోయింది. మరలా 1999 డిసెంబర్ లో తిరిగి ప్రారంభమైంది. తరవాత మోర్గాన్ స్టాన్లీ సంస్థకు…. ఆ తరవాత 2009లో జియోదేశిక్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ చేతుల్లోకి చందమామ వెళ్ళిపోయింది. దాంతో చందమామ మసకబారింది.

-షన్ముఖాచారి

1 thought on “చందమామ కథ… కమామీషూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap