చందోలు లో వెలుగుచూసిన శివ – కళ్యాణ సుందరమూర్తి శిల్పం
వెలుగుచూసిన క్రీస్తు శకం 12వ శతాబ్ది శివపార్వతుల పెళ్లి శిల్పం
ఒకప్పటి వెలనాటి చోళుల రాజధాని అయిన గుంటూరు జిల్లా, పిట్టలవానిపాలెం మండలం, చందోలు మంలో రాష్ట్రంలోనే అరుదైనదిగా భావించే శివుని కళ్యాణ సుందరమూర్తి శిల్పం బుధవారంనాడు వెలుగుచూసింది. వారసత్వ సంపదను గుర్తించి, కాపాడి భవిష్యత్ తరాలకు అందించటానికి, స్థానికుల కోసం, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి, చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా, పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి చందోలులోని లింగోద్భవ స్వామి దేవాలయం వెనుక ఈ శిల్పాన్ని గుర్తించారు. మూడు అడుగుల వెడల్పు, నాలుగున్నర అడుగుల ఎత్తున ఈ శిల్పంలో నిలబడిన శివుడు, పార్వతిల పాణిగ్రహణ (వివాహ) సందర్భంలో శివుడు, పార్వతి చెయ్యి పట్టుకున్నట్లుగాను, నిలబడిన విష్ణువు, పార్వతిని అప్ప చెబుతున్నట్లుగానూ, లక్ష్మీ, సరస్వతులు పార్వతికి తోడుగా ఉన్నట్లుగానూ, ఆసీనుడైన బ్రహ్మ, పెళ్లి సందర్భంగా హోమాన్ని చేస్తున్నట్లుగానూ, దేవతలందరూ, సర్వాభరణాలూ ధరించి, భంగిమలో ఉన్నట్లు చెక్కిన అలనాటి శిల్పుల పనితనానికి అద్దం పడుతుంది. వెలనాటి చోళుల రాజధానిగా విలసిల్లిన చందోలు లో క్రీ.శ. 1138, 1146 నాటి రాజేంద్ర చోడ గొంకరాజు, క్రీ.శ. 1170 నాటి కులోత్తుంగ గొంకరాజుల శాసనాలుండటాన, మరియు శిల్పకళాశైలి, ప్రతిమా లక్షణాన్ని బట్టి, ఈ శిల్పం క్రీ.శ. 12వ శతాబ్దికి చెందిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అరుదైన చారిత్రక ప్రాధాన్యత, శివరాం ఉత్సవానికి సంబంధం గల ఈ కల్యాణ సుందర శిల్పాన్ని పీఠంపై నిలబెట్టి, వివరాలను తెలిపే బోర్డును ఏర్పాటు చేస్తే సందర్శకుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.