ఇగిరిపోని సాహిత్యచందన సుగంధం – చందు

సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మేధావి, కవి, కథకుడు, నవలాకారుడు
సాహిత్యలోకం చందు అని ప్రేమగా పిలుచుకునే చందు సుబ్బారావు ఇక లేరంటే ఆయనతోనూ, ఆయన సాహిత్యం తోనూ పరిచయమున్న ఎవరికైనా నమ్మబుద్ధి కాదు.
గంభీరమైన ఆయన రూపు
ఆయన వ్యక్తిత్వం, ఆయన స్నేహశీలత ఎవరికీ ఆయన్ని అంత తొందరగా మరిచిపోనివ్వవు. భౌతిక శాస్త్ర ఆచార్యుడుగా, అ.ర.సం బాధ్యుడుగా చందు సుబ్బారావు నిర్వహించిన పాత్ర అపూర్వం.

ఆచార్యుడుగా ఎంత విద్యార్థులకు ఆరాధ్యుడో. రచయితగా సాహిత్యాభిమానులకు అంత ఆత్మీయుడు. రచయితగా ఎంత నిబద్ధుడో ఆచార్యుడుగా, భూగర్భజలాల పరిశోధకుడిగా అంత ప్రసిద్ధుడు. ఆంధ్రాంగ్లభాషా సాహిత్యాల్ని ఆపోసనపట్టిన అపరవ్యాసుడనడం అదేమీ అతిశయోక్తి కానేకాదు. ప్రపంచ భూగర్భజలాల పరిశోధకులలో మొదటివరుసలో లెక్కించదగ్గ గొప్ప పరిశోధకుడు. ఏ విషయం గురించయినా అనర్గళంగా ప్రసంగించి శ్రోతల్ని ఉర్రూతలూగించగల గొప్పవక్త. అంతేనా…’కవికి విమర్శకుడు శతృవు కాదు’ అని నమ్మిన గొప్ప సహృదయ సద్వి మర్శకుడు. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు గలిగిన ఒక గొప్ప మేథావి చందు.

నవలారచయితగా ఆయన నవలల సంపుటి ‘హిమపుత్రి’ ఆయన ప్రతిభకు చక్కని ఉదాహరణ.
నవీన్ ‘అంపశయ్య’, చండీదాస్ ‘అనుక్షణికం’ నవలలు ఉస్మానియా కేంపస్ నేపధ్యాన్ని గుర్తు చేస్తే చందుగారి నవలలు ఆంధ్రవిశ్వవిద్యాలయం నేపథ్యంలో సాగుతాయి. ‘హిమపుత్రి’ నవలలో ప్రేమకు శృంగారం ముఖ్యమా.. కాదా అన్నది ఎందరిలోనో మెదిలే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధా నంగా శృంగారంతో కూడిన ప్రేమ మాత్రమే శక్తివంతం కాదని చర్చించడం లో ఆయన చూపిన నేర్పు ప్రశంసనీయం. ప్లేటోనిక్ లవ్ గురించి ఆలోచించ లేనన్న చలం, ప్రేమ కేవలం హృదయ సంబంధిగా భావించిన కృష్ణశాస్త్రి..ఈ రెండు పార్శ్వాలను అద్భుతంగా చిత్రిస్తారు చందు ఈ నవలలో. క్యాంపస్ జీవితంలోని ఎన్నో కోణాలను ఎంతో హృద్యంగా, అటూ ఇటూ కాకుండా, తొణక్కుండా చిత్రించడంలో రచయితగా తానేమిటో నిరూపించుకున్నాడీ నవలాచిత్రణతో.

ఎడిటర్, అచంచలం, అగ్గిపుల్లలు మొదలైన రచనలు కూడా చందు రచనా సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.
‘శిల్పదృష్టి’, ‘చందనచర్చ’ ‘కవికి విమర్శకుడు శతృవు కాదు’, వ్యాససంపుటాలు చందుకు విమర్శనా రంగంలో గల ప్రతిభకు, విమర్శపట్ల గల అభిరుచికి చక్కని ఉదాహరణలు. విమర్శకునికి అపరమైన జ్ఞానసంపదతో పాటు సహృదయత అవసరం. ఈ రెండింటి సమన్వయంగా నిలుస్తారు చందు.
తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ ప్రభావాన్ని హిందీ సాహిత్యాభిలాషులకు తెలియజేసే ” శ్రీశ్రీ కా ఆధునిక్ తెలుగుసాహిత్య ప్రభావ్ “రచన చెయ్యడంలో హిందీ పాఠకులకు మన శ్రీశ్రీ గొప్పతనం తెలియజెయ్యాలనే ఆయన తపన తెలుస్తుంది. ‘ఇండియన్ నవలికలు’ వంటి విశేషగ్రంధ రచనలో భారతీయ నవలల స్వరూపస్వభావాలను ప్రతిభావంతంగా విశ్లేషిస్తారాయన. ఎండ్లూరి సుధాకర్ ‘గోసంగి’ అనువాదం ఆయన అనువాదాభిరుచికి అద్దం పడుతుంది.

విశ్వవిద్యాలలో ‘జ్యోతిష్యం’ ఒక కోర్సుగా ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. విశ్వవిద్యాలయాలు విజ్ఞానాన్ని పంచడానికి బదులు అశాస్త్రీయమైన మూఢనమ్మకాలను బోధించాలనుకోవడం మూర్ఖత్వమని, దానికి శాస్త్రీయప్రాతిపదిక లేదని వాదించడం ఆయనలోని హేతువాద దృక్పథానికి నిదర్శనం.

రా.వి. శాస్త్రి వంటి మహారచయితల ప్రశంసలను ప్రేమను పొందిన చందు, అదృష్టదీపక్ వంటి అభ్యుదయ కవి మిత్రుల సాంగత్యంతో సాహితీలతకు కొత్తచిగురులద్దిన చందు మంతిని పార్వతీశం నాయుడు, కె.మదుసూదన్ (ఎ.ఐ.ర్)’ ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం వంటి మిత్రులతో చెలిమిని పంచుకున్న చందు, ఏ విషయంగురించైనా సాధికారికంకా ఉపన్యసించగల చందు ఇప్పుడు మన మధ్య లేరు’ అనుకోవడానికి ఏ సాహితీ మిత్రుడికైనా కష్టతరమైనదే. ఆ వాగ్ధాటి, ఆ స్నేహ ప్రియత్వము, ఆ సహృదయము, ఆ గాంభీర్యము ఒక ప్రేమ మూర్తిగా ఇక కనబడదనే వార్త ఆయన సహచర మిత్రులకు మింగుడుపడని వ్యవహారం.

ఆంధ్రాపారిస్ తెనాలి లో 1946, మే 18 నాడ రాజ్యలక్ష్మి, వెంకటకృష్ణయ్య దంపతులకు జన్మించిన చందు ఆంధ్రవిశ్వవిద్యాలయం లో భూ భౌతికశాస్త్ర విద్యార్థిగా, ఆపైన అక్కడే ఆచార్యునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, బోధించేది భూభౌతిక శాస్త్రమైనా తెలుగు శాఖాధిపతులు ఈర్ష్యపడేలా సాహిత్య,సామాజిక విమర్శకులుగా విశాఖపట్నం సాహితీవేత్తలలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న మేధావి చందు.
తాపీధర్మారావు స్మారక పురస్కారము, కొండేపూడి శ్రీనివాసరావు స్మారక పురస్కారము, ఆవంత్స సోమసుందర్ పురస్కారము, తుమ్మల స్మారక సాహిత్య పురస్కారము…వంటివి చందు ను వరించి వచ్చిన బహుమతులు అనడం కంటే వాటిని స్వీకరించి ఆ పురస్కారాలకే గౌరవాన్ని కలగజేసిన సాహితీవేత్త చందు సుబ్బారావు గారు అనడం సముచితమనుకుంటాను. తాను పురస్కారాలు పొందడం అటుంచి, స్వయంగా కవులకు, గాయకులకు, కళాకారులకు పురస్కారాలు అందించి వెన్నుతట్టి ప్రోత్సహించే సహృదయసౌజన్యమూర్తి చందు లేని లోటు పూడ్చలేనిది.

కనబడితే చాలు గంటేడా అని కౌగిలించుకునే ఆత్మీయత, ఎదురైతే చాలు ఎదకు హత్తుకునే
ఆ ఆప్యాయత ఇక విశాఖపట్నంలో దొరకవనే ఆలోచనే దుర్భరంగా ఉంది. సందేహాల దాహాలు తీర్చే జ్ఞానఝరి ఇప్పుడక్కడ లేదనే ఊహే బాధగా ఉంది. ఏంచేయగలం ఇప్పడాయన సంతకం చేసి ఇచ్చిన తన పుస్తకాన్ని ఆ ‘సంతకాన్ని’ స్పర్శిస్తూ అదే కరచాలనంగా భావించి, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకోవడం తప్ప, ఆయన చూపిన బాటలో నడవడం తప్ప.

మొన్న మిత్రుడు దేవిశ్రీ ఫేస్బుక్ లో పెట్టిన వీడియోలో చందు ను చూస్తే గొప్ప దుఃఖమొచ్చింది. ఎలాటి మనిషి ఎలా అయిపోయేడు అని కళ్ళు చెమరించేయి..ఇంతలోనే..
విశాఖసాగరంలో మరో జ్ఞానసముద్రం కలిసి కనుమరుగైపోయింది. అక్కడ విశాఖ సాగర తీరంలో నిలబడితే ఒక మహావక్త ప్రసంగంలా సాగరకెరటాల ఘోష వినిపిస్తుందిక.
ఎవడు బతికేడు మూడు యాభైలు అని సరిపెట్టు కుందా మన్నా మనసొప్పుకోదు, ఇలాటి సాహితీ మిత్రుడు ఎన్ని యాభైలైనా ఉండాలనే ఉంటుంది. మిత్రులు చందు సుబ్బారావు భౌతికంగా లేకపోవచ్చు ఆయన అక్షరాల్లోంచి తొంగి చూస్తూనే ఉంటాడు. కడలిఅలలసవ్వడిలో వక్తగా వినిపిస్తూనే ఉంటాడు.
ఇగిరిపోని సాహితీ సుగంధం చందు కాలంలో కరిగిపోని మైత్రీబంధం చందు.

(రాయడానికి చేతగాని ఇబ్బందిలో ఇలా ఆలస్యంగా నా అక్షరనివాళి)

-గంటేడ గౌరునాయుడు

Share via
Copy link
Powered by Social Snap