“మనిషి గుర్తుల్ని బతికించుకుందాం” కవితా సంపటి నూతన వరవడికి భాష్యం చెబుతూ ఆధునిక పోకడలకి దాసోహమై మాయమైపోతున్న మనిషి యొక్క ఆనవాళ్ళనైనా బతికించుకుందాం అంటూ ఎంతో ఆవేదనా భరితంగా ఈ నేలతల్లి సాక్షిగా చెప్పారు ఈ పుస్తక రచయిత చందలూరు నారాయణరావు గారు. సమాజంలోని పల్లె మట్టి పరిమళాల్ని, పైరగాలి విన్యాసాలు, పేదల దుర్భర జీవితం, చిన్నారుల ఆకలి కేకలు, విశ్వజనీయమైన అమ్మానాన్నల ప్రేమ, ఇరుకు జీవితాలతో పారే కన్నీరు, రైతన్నల శ్రమ యొక్క జీవనాన్ని, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, సృష్టి యొక్క గొప్పతనాన్ని, గట్టి మనిషి మనసుని దిటవు చేసుకొని ఎన్నో ఆటుపట్లను మోస్తున్న మనిషిలోని ఓర్పుకి అక్షర సొభగులద్ధి ఎంతో అందంగా మలిచి “మనిషి గుర్తులు బ్రతికించుకుందాం” అంటూ ఎంతో వినూత్నంగా మలచి మల్లెల గుభాలళింపులాగా సాహితీ ప్రియుల మనసు దోచుకున్నారు చందలూరి నారాయణరావు గారు.
ఈ పుస్తక రచయిత చందలూరి నారాయణరావు గారు ఉపాధ్యాయుడుగా సర్కారీ బడుల విద్యార్థుల వెతలను, వారి ఆవేదనాలను చూసి వాటిని రామబాణంలా సంధించి సాహితీ వనంలో ఎంతో అందంగా విరబోయించిన సాహితీ సమరాంగణుడు. వీరి కవితల్లో గొప్పతనం ఏమిటంటే ఒక్క కవిత చదివితే మిగతా కవితలని ఆటోమేటిగ్గా చదవాలనిపిస్తుంది, గ్రేట్ అండి.
ఆ కవితలు ఏంటో చూద్దామా.. మొదటగా “అమ్మ… నాన్న” కవితలో “తాత అనుభవానికి తర్జుమా నాన్న/ నాన్న ప్రతి మాటకు ముందుమాట అమ్మ…/” ఈ పాదాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అమ్మ- నాన్నకి ఆకాశమంత పీటవేశారు రచయిత. “నాన్న వేలుపట్టి నడిపిస్తు విజయ పదంవైపు చేర్పిస్తే ఆ కలలకి జీవం పోసేది అమ్మ” అంటూ అభివర్ణించారు. ‘వయసు మీద పడ్డా ఎవరికీ ఏ మాత్రం భారం కాకుండా సంతోషంగా ఉండే వీరిని ఎలా పిలవాలి’ అంటూనే దైవాంశ సంభూతులని చెప్పకనే చెప్పారు నారాయణరావుగారు. “మరణం లేదు” కవితలో నిజం ‘పిచ్చిది’, అబద్ధం ‘అలంకారం’ అయినా సరే నిర్భయంగా నిజాన్ని చెప్పాలని నిక్కచ్చిగా చెప్పారు. “శ్రమ సౌందర్యం” కవితలో చెమటోడ్చి పని చేస్తేనే మనిషి జీవనయానం సాఫీగా సాగుతుందని చాలా చక్కగా చెప్పారు నారాయణరావుగారు. భూమ్యాకాశాల మధ్య ఉన్న సౌందర్యమంతా శ్రామికుని శ్రమ ఫలితమే అంటూ శ్రమైక జీవం సౌందర్యానికి చక్కని భాష్యం చెప్పారు రచయిత.
“మహా (కవి) రచన” కవితలో శ్రీశ్రీ కలం నుండి జాలువారిన కవితా ఝరులకి నారాయణరావు గారు అక్షర నిరాజనాలు అర్పించారు. శ్రీశ్రీ ని కన్న ఈ భూమాత ఒళ్ళు పలకరించింది, సముద్రం ఉప్పొంగి ప్రవహించింది, ఈ సాహితీ కళామతల్లికి మునిగి తేలే విధంగా ‘మహా ప్రస్థానం’ మరో ప్రస్థానం అంటూ ఎలుగెత్తి చాటిన శ్రీశ్రీకి జాతి మొత్తం ప్రణామాలు అర్పించిన తీరిని అద్భుతంగా చెప్పారు నారాయణరావుగారు. “దారి తప్పిన ఋతురాగం” కవిత ఆధునిక మానవుడి పోకడల్లాగా కాలాలు అంటే ఋతువులు కూడా గతి తప్పుతున్న వైనాన్ని ఎంతో ఆవేదనంగా చెప్పారు రచయిత. ప్రచండ బానుడి వెలుగుల్ని అడ్డుకుంటే మేఘుడు గాలిలో తేమలేక మబ్బులు వర్షించక బీటలు వారిన నేల రైతు కష్టానికి ఫలితం దక్కలేదని ఎంతో ఆర్ద్రతగా చెప్పారు. అలాగే ప్రచండ బానుడు కంటతడి పెడుతుంటే కోపోద్రిక్తుడైన మేఘనాదుడి చర్యలతో పొలాలు కూడా పంట సాగుబడి లేని వైనాన్ని వీణ వాయిస్తుంటే శృతి తప్పితే ఎలా ఉంటుందో ఋతువులు కూడా దారి తప్పితే అలానే ఉంటుందని ఎంతో హృద్యంగా చెప్పారు.
“ప్రపంచాన్ని మోయలేమని” కవితలో మనిషి సెల్ ఫోన్ కి ఎలా దాసోహమైనాడో చక్కగా అక్షరీకరించి చెప్పారు. ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో బంధించుకొని సెల్ ఫోన్ పట్టుకొని, పట్టుకొని విసిగి వేసారిన చేతుల ఆవేదనని రచయిత కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మెదడు పడుతున్న బాధని ఇంకా వేర్లు భూమిలో పాతుకుపోయినట్లు ఈ సెల్ ఫోన్ వైరస్ మనిషి శరీరమంతా పాకి అందర్నీ త్యజించి ఆపై రూపురేఖలు మారిన తీరుని ఒకింత ఆవేదనగా చెప్పారు నారాయణరావుగారు. “విశాలంగా పారేదే కన్నీరు” వ్యాసంలో ఆధునిక పోకడలకి దాసోహమై పల్లెను వదిలి పట్టణానికి వచ్చి మానవుడు పడుతున్న ఇక్కట్లని అద్దంలో ప్రతిబింబంలా చక్కగా మలిచి చెప్పారు. చక్కని ప్రకృతి సోయగాలు, సుమిశాలమైన లోగిళ్ళు, చక్కని పొలం పనులు, సూర్యచంద్రుల ఆస్వాదనలు అన్నింటిని వదిలి పట్టణం మీద మోజుతో వచ్చి ఇరుకు అపార్ట్మెంట్ కల్చర్, అటు చూస్తే దోమలు, ఇటు చూస్తే ఈగలమోత, చాలీచాలని ఇరుకు ఇళ్ళు, ఇంకా చెప్పాలంటే జీవితమే ఇరుకుల మయంగా మారిన పట్టణ వాసుల ఇక్కట్లని చక్కగా చెప్పారు రచయిత.
“మనిషి అంటే” ఈ చిన్ని కవితలో రచయిత మనిషి అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. నేటి చదువులు ఆకాశాన్నంటితే కోరికలు శిఖరాగ్రాన్ని చేరితే మనిషి బుద్ధి మాత్రం రోజురోజుకు అధః పాతాళానికి చేరుతుందని ఒకింత ఆవేదనగా చెప్పారు. “ఏకాంత దీపంలా” కవితలో కుటుంబ బంధాల్ని వీడి ఏకాంతంగా జీవిస్తున్న మనసులేని మనిషిని వేస్తున్న ప్రశ్నలకు సిగ్గుతో తలదించుకున్న మరుగుజ్జు మనుషుల పోకడలని చక్కగా కవిత్వీకరించి చెప్పారు రచయిత. “నడిచే దేవుడు నాన్న” అంటూ 80 ఏళ్ళు మీద పడ్డా బిడ్డల కోసమే తపిస్తూ జీవితాన్ని త్యాగం చేసిన నాన్న పై ప్రేమమృతధారలు కురిపించారు చందలూరి నారాయణరావుగారు. “శ్రీ శ్రీ పదంతో నిరూపించుకుంటా” కవితలో శ్రీశ్రీ గారిలోని, వారి కవితల్లోని ఔన్నత్యాన్ని సరికొత్త రీతిలో చెప్తూనే వారిలా నేను కూడా పతాక శీర్షిక లక్కెక్కుతానంటూ శ్రీశ్రీ గారి కవితా ఝరులకి అక్షర నిరాజనాలర్పించారు.
“పచ్చని వెలుగే అమ్మ” అంటూ విశ్వాన్ని చదివిన అమ్మలోని మస్తిష్కాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. మానవ బంధాలకి ప్రాణం పంచే అమ్మ వృద్ధాప్యంలోనూ వెలుగు దివ్వె అంటూ అమ్మకి అక్షరాంజలి ఘటించారు నారాయణరావు గారు. చివరగా “మనిషి గుర్తుల్ని బతికించుకుందాం” కవితలో మన అమ్మమ్మ, బామ్మ, తాతలున్నప్పుడున్న బంధాలు అనుబంధాలకి అద్దం పడుతూ ఎంతో ఆశక్తిదాయకంగా సాగిపోయింది ఈ కవిత. ఊరి జనమంతా సర్వమత సమ్మేళనాన్ని పాటిస్తూ కలసిమెలసి సంబరాలు చేసుకుంటూ కళకళలాడుతుండేది వాతావరణం. కానీ ఇప్పుడు మనసులు ఇరుకై పెద్దరికాన్ని పక్కనపెట్టి టీవీ, సెల్ ఫోన్లలో మునిగి తేలుతూ ఏకాంతంల్లో ఒత్తిడికి లోనవుతున్నారని రచయిత ఆవేదనగా చెప్పారు. అందుకే మానవత్వంతో ఆలోచించి పెద్దల్ని గౌరవిస్తూ, పుస్తక పఠనంతో జ్ఞాన సమపార్థనతో మనుషులుగా జీవిస్తూ మనిషి గుర్తుల్ని బతికించుకుందాం అంటూ ఎలువెత్తి చాటి మానవత్వానికి పెద్ద పీట వేశారు రచయిత. ఇలా మానవతా విలువలతో కూడి చందలూరి నారాయణరావుగారి కవిత్వంలో ఆర్ద్రత, ఆహ్లాదం అనువణువునా తొణికిసలాడుతూ చదువరులను ఆసాంతం చదివింపజేస్తుంది ఈ పుస్తకం. ఇంకా ఈ పుస్తకంలో “ఉత్తరం ఓకల, ఓ చిన్న కథలా నేను…, రైతు బానిస, ఘోష తెలియనిదే జీవితం, స్వప్నాలన్నీ చెల్లని నిజాలే…”లాంటి కవితలతో మానవతా పరిమళాలు వెదజల్లిన ఈ కవితా సంపుటి ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంత చక్కటి కవితా సంపుటిని సాహితీ ప్రియులకు కానుకగా ఇచ్చిన చందలూరి నారాయణరావుగారికి అభినందన మందారమాలలు.
పుస్తక వివరాలకు చందలూరి నారాయణరావు,
పుస్తకం వెల 100 రూపాయలు.
పేజీలు 136. ఫోన్ నెంబర్.9704437247
–పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు