(25 డిశంబర్ చాప్లిన్ వర్థంతి సందర్భంగా చాప్లిన్ గురించి మీకోసం….)
తను నటించిన చిత్రాల ద్వారా ప్రపంచాన్నంతటినీ నవ్వించి విశ్వవిఖ్యాతి గాంచిన నవ్వుల రేరాజు ఛార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. బ్రిటన్లో పుట్టి; అమెరికాలో చలనచిత్రాలు నిర్మించి; చివరికి కమ్యూనిస్ట్ గా ముద్రపడి అమెరికా నుండి వెలివేయబడిన చాప్లిన్ కి బెర్లిన్ లో ప్రపంచ శాంతి బహుమతి దక్కింది.
ఛార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ బ్రిటిష్ పౌరుడు. 1889 ఏప్రిల్ 16 న చార్లీ చాప్లిన్ కెన్సింగ్టన్ పట్టణంలో జన్మించిన నాలుగు రోజులకే జర్మనీ నియంత హిట్లర్ ఆస్ట్రియాలో జన్మించాడు. చాప్లిన్ జన్మించిన సంవత్సరంలోనే సినిమా కెమెరాను విలియం ఫ్రీజ్ గ్రీన్ కనుగొన్నాడు. తండ్రి సీనియర్ చాప్లిన్, తల్లి లిల్లీ హార్లీ. తల్లి మొదటి భర్త సంతానం సిడ్నీ కూడా చాప్లిన్ వెంటే పెరిగాడు. చాప్లిన్ తల్లిదండ్రులు చిన్న చిన్న వినోద ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో తల్లి పాత్ర పాటలు పాడి ప్రేక్షకుల్ని రంజింపజేయడం. తండ్రి మాత్రం మద్యానికి బానిస. సంపాదించిన డబ్బును తప్ప తాగి తగలేసేవాడు. తల్లిదండ్రుల వినోద ప్రదర్శనలకు చాప్లిన్ కూడా వెళ్ళేవాడు. ఒకసారి తల్లి అనారోగ్యంతో స్టేజి మీద పాడలేక పోతే, తండ్రి చాప్లిన్ ని ముందుకు తోసి పాడమన్నాడు. అప్పుడు చాప్లిన్ వయసు 5 సంవత్సరాలే! జాక్ జోన్స్ అనే పాట చాప్లిన్ పాడుతుంటే డబ్బుల వర్షం కురిసింది. తాగుడుకి బానిసై తండ్రి మరణించడంతో, చాప్లిన్ తల్లి పేదవాళ్లు నివసించే కాలనీకి మకాం మార్చింది. అందుకు కారణం ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిట్లర్ విమాన బాంబ్ లతో దాడి జరిపి కూల్చివేసిన వాటిల్లో చాప్లిన్ ఇల్లు కూడా ఒకటి కావడమే! తల్లి సలహాతో చాప్లిన్ హన్వేల్ స్కూల్ హాస్టల్ లో చేరాడు. అప్పుడు ఏడు ఏళ్ళ వయసులో వున్న చాప్లిన్ కి మ్యూజిక్ హాల్స్ లో ప్రదర్శించే డాన్సుల్లో పాల్గొనే అవకాశం దొరికింది. తరవాత చాప్లిన్ విద్యాభ్యాసం లండన్ కి సమీపంలోని హెర్న్ బాయ్స్ స్కూల్ లో కొనసాగింది.
కాలక్రమంలో అన్న సిడ్నీ ఆఫ్రికా వెళ్లిపోయాడు. తల్లి ఆసుపత్రి పాలయ్యింది. ఈ దుర్బర పరిస్థితుల్లో చాప్లిన్ వీధి నృత్యాలు చేసాడు; లుడ్ గేట్ సర్కస్ లో కాగితం పడవలు అమ్మాడు. క్షురశాలలో పనిచేసాడు. పార్కుల్లో పడుకున్నాడు. ఈ అనుభవాలన్నీ తన ‘కిడ్’ చిత్రంలో చూపించాడు చాప్లిన్. అలా కష్టపడుతూ చాప్లిన్ తన పదో ఏట మొదటి స్టేజి నాటకాన్ని లండన్ హిపో డ్రోమ్ థియేటర్ లో ప్రదర్శించాడు. ఆ నాటకం పేరు ‘గిడీ ఓస్టేండ్’. మంచి నటుడిగా చాప్లిన్ కి పేరొచ్చింది. చేతుల్లో డబ్బూ చేరింది. కానోన్ డోయల్ నవల ‘షెర్లాక్ హొమ్స్’ ని నాటకంగా ప్రదర్శిస్తే అందులో బిల్లి అనే ఆఫీస్ బాయ్ పాత్రను చాప్లిన్ పోషించేవాడు. ఈ ప్రదర్శనలెన్నిసార్లు ఇచ్చారో చెప్పలేం. అమెరికాకు చెందిన విలియం గిల్లెట్ బృందం లండన్ లో ఇదే నాటక ప్రదర్శనలు ఇచ్చినప్పుడు కూడా చాప్లినే బిల్లి పాత్ర పోషించాడు., ఇలా వుండగా ‘కేసీజ్ కోర్ట్ సర్కస్’ అనే హాస్య నాటికలో చాప్లిన్ కు నటించే అవకాశం వచ్చింది. ఈ నాటకం తరవాతే చాప్లిన్ హాస్య నటుడిగా రూపాంతరం చెందాడు. ఛానల్ దీవుల్లో ఒకసారి చాప్లిన్ నటిస్తున్నాడు. అతని హాస్య సంభాషణలకు జనం నవ్వడం లేదు. కారణం అక్కడి ప్రేక్షకులకు ఇంగ్లీష్ భాష రాదు. అప్పుడే చాప్లిన్ కి ఓ ఐడియా వచ్చి మూకాభినయం (పాంటో మైమ్) తో వారిని నవ్వించాడు. ఆ తరవాత మూకాభినయమే చాప్లిన్ కి ఒక వరమయ్యింది.
ఆఫ్రికాకు వెళ్ళిన అన్న సిడ్నీ చాప్లిన్ (సిడ్) కూడా స్టేజి నటుడై ఫ్రెడ్ కార్నో కంపెనీలో పనిచేస్తూ తమ్ముడు చార్లీ చాప్లిన్ కి అవకాశాలు ఇప్పించాడు. ఈ కంపెనీ వారు ‘జియో, ది ఫియర్లెస్’ అనే నాటకంలో ప్రధాన పాత్రకు చార్లీ చాప్లిన్ ను ప్రతిపాదిస్తే చాప్లిన్ కి ధైర్యం చాలక వదులుకున్నాడు. లారెల్ హార్డీ జంటలో ఒకరికి ఈ పాత్ర ధరించే అదృష్టం కలిగింది. మళ్లీ కష్టపడి ఎలాగో ఆ పాత్రని చార్లీ చాప్లిన్ రాబట్టుకున్నాడు. ఈ సమయంలోనే చార్లీ చాప్లిన్ హెటీ కెల్లీ అనే నటితో ప్రేమలో పడ్డాడు. అప్పుడు చాప్లిన్ కి పట్టుమని పందొమ్మిదేళ్ళు. కానీ హెటీ కెల్లీ చాప్లిన్ ని కాదని ఓ ధనవంతుణ్ణి పెళ్ళాడింది. ఈ సంఘటన జరిగినప్పుడు చాప్లిన్ అమెరికాలో వున్నాడు. చాప్లిన్ ఈ విషయం గురించి చింతించలేదు. తన భవిష్యత్తుపై దృష్టి నిమగ్నం చేసాడు. లాస్ ఏంజెలెస్ లో ప్రదర్శన ఇస్తున్నప్పుడు మాక్ సెనేట్ అనే కెనడాకు చెందిన చిత్ర నిర్మాత చాప్లిన్ నటనను చూసాడు. ఆతను నడిపే కీ స్టోన్ కంపెనీ లో ఫోర్డ్ స్టెర్లింగ్ అనే అగ్ర నటుడు తనకు పెద్ద జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో అతని స్థానంలో చాప్లిన్ ని మాక్ సెనేట్ తీసుకున్నాడు. అప్పటిదాకా చాప్లిన్ స్టేజి జీతం వారానికి 12 పౌనులు. సినిమాల్లో అతని జీతం 38 పౌనులకు పెరిగింది. అంత చిన్న వయసులో చాప్లిన్ జీతం 38 పౌన్లకు పెరగడం కొంతమంది సహనటులకు రుచించలేదు. ముఖ్యంగా మేబెల్ నార్మండ్ అనే నటీమణి అసూయతో చాప్లిన్ మొదటి చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదు. చార్లీ చాప్లిన్ మొదటి చలన చిత్రం ‘మేకింగ్ ఎ లివింగ్’ అనే ఒక రీల్ చిత్రం. 1914 లో ఈ చిత్రం విడుదలై విజయాన్ని సాధించింది. తన రెండో చిత్రం ‘కిడ్ ఆటో రేసెస్ ఎట్ వెనిస్’ లో చాప్లిన్ ఆర్బకిల్ ప్యాంటు, చాలీ చాలని కోటు, బౌలర్ టోపీ, లూజు బూట్లు, గొంగళి పురుగు మీసాలు, చేతిలో కర్ర తో నటించాడు. ఇది ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. ఇదే ఆహార్యంతో దాదాపు 70 చిత్రాల్లో చాప్లిన్ తదనంతర కాలంలో నటించడం జరిగింది. మూడో చిత్రం ‘మేబెల్స్ స్ట్రేంజ్ ఫ్రెడి కామెంట్’ లో పరిగెత్తుతూ మలుపు తిరిగినప్పుడు, టోపీ చేతిలో పట్టుకుని, ఒక కాలు పైకెత్తి రెండో కాలు మీద జారుతూ నటించాడు. ఈ విద్యకు చాప్లిన్ ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. ఇతర చిత్ర నిర్మాతలు చాప్లిన్ ని ఎగరేసుకు వెళ్ళాలని ప్రయత్నించారు. ఈ సంగతి తెలిసి కీ స్టోన్ స్టూడియో బయట పహారా ఏర్పాటు చేసాడు నిర్మాత మాక్ సెనేట్. ఎలాగైతేనేం ఒక గూఢచారి సహకారంతో చాప్లిన్ బయటపడి ఎసేనే కంపెనీ లో చేరాడు. ఆ కంపెనీ చాప్లిన్ కి వారానికి 310 పౌనులు జీతం ఇచ్చింది. మాక్ సెనేట్ వద్ద చాప్లిన్ 35 లఘు చిత్రాలు, ఒక పెద్ద చిత్రంలో నటించాడు. చాలావరకు ఆ చిత్రాలను చాప్లిన్ స్వయంగా డైరెక్ట్ చేసాడు. ఎసేనే కంపెనీ కి 14 చిత్రాలు చేసాడు. కీ స్టోన్ స్టూడియోలో తనతో పని చేసిన కొందరు నటులను, టెక్నీషియన్లను చేరదీసి తనతో జీవితాంతం వుంచుకున్నాడు. ఎసేనే కంపెనీకి తీసిన చిత్రాల్లో కొత్త అంశాలు జొప్పించడమే కాకుండా కరుణ రసం, వ్యంగ్యం, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రవేశపెట్టి చిత్రాలు విజయవంతంగా నడిచేందుకు శ్రమించాడు చాప్లిన్. ‘ఎ వుమన్’, ‘కార్మెన్’ ‘ది బ్యాంక్’ చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. ‘ది ట్రాంప్’ చిత్రం చాప్లిన్ నటించిన గొప్ప క్లాసిక్ గా నిలిచింది. చార్లీ ఇందులో తిరుగుబోతు పాత్రను ధరించాడు. ఇందులో చార్లీ ఒక అమ్మాయిని దొంగలబారినుండి రక్షిస్తాడు. ప్రతిగా ఆ పిల్ల తండ్రి చార్లీ కి ఉద్యోగం ఇస్తాడు. ఆ పిల్ల ప్రేమలో పడిన చార్లీ కి ఆమె ప్రియుడు ప్రవేశంతో ఉద్వేగానికి గురై దూరంగా వెళ్ళిపోతాడు. అలా చిత్రం ఫేడ్ అవుట్ అవుతుంది. ప్రేక్షకుల్ని ఈ చిత్రం విశేషంగా ఆకర్షించింది.
చాప్లిన్ కోసం చాల సినిమా కంపెనీలు పోటీ పడ్డాయి. ఎసేనే కంపెనీ వాళ్లు 1915 లోనే చాప్లిన్ కి 125000 పౌనులు పారితోషికం చెల్లించడమే కాకుండా లాభాల్లో వాటా కూడా ప్రకటించారు. కానీ అన్న సిడ్ ఈ ఒప్పందానికి అడ్డు పడి చార్లీ చేత మ్యూచువల్ కంపెనీకి అగ్రిమెంట్ రాయించాడు. ఆ కంపెనీలో చార్లీ జీతం వారానికి 2500 పౌనులు; సంవత్సరాంతంలో 38000 పౌనుల బోనస్! ఇంత సంపాదించినా లాస్ ఏంజెలిస్ నగరంలో స్తోవెల్ హోటల్ గదికే చార్లీ పరిమితమయ్యాడు. మ్యూచువల్ కంపెనీ కి చార్లీ 12 హాస్య చిత్రాలు అందించాడు. చార్లీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. దీనికి ఒక ఉదాహరణ…. 1916 లో నిజిన్ స్కీ బాలే బృందం లాస్ ఏంజెలెస్ లో ఇచ్చిన ప్రదర్శన కి చార్లీ హాజరయ్యాడు. చార్లీ ని చూసిన నాట్యబృందం సభ్యులు బాలే ఆపివేసి చార్లీ ని తెర వెనుకకు ఆహ్వానించి ఆయనతో ముచ్చట్లాడారు. అరగంట తరవాత గానీ మరలా బాలే మొదలవలేదు. ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ అనే కంపెనీ వాళ్లు తమ స్టూడియో చాప్లిన్ కి అప్పగించి అతడే నిర్మాతగా 8 చిత్రాలు నిర్మింపజేశారు. అప్పుడే హాలీవుడ్ లో 5 ఎకరాల స్థలాన్ని చాప్లిన్ సోదరులు కొని స్టూడియో నిర్మించారు. 1918 తరవాత చాప్లిన్ సినిమాలన్నీ ఆ స్టూడియో లోనే నిర్మించారు. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. యుద్ధంలో చేరమని చాప్లిన్ పై ఒత్తిడి పెరిగింది. నిజానికి చార్లీ సైన్యంలో చేరడానికి తగిన అంగసౌష్టవం లేదు. అతని ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. బరువు 100 పౌన్ల లోపే. కేవలం అసూయతోనే కొందరు పనిగట్టుకొని ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. చాప్లిన్ డిఫెన్స్ బాండ్స్ అమ్మక ప్రచారంలో రెండు నెలలు పాల్గొన్నాడు. అతని వెంట సినీ తారలు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, మేరీ పిక్ ఫోర్డ్ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బలశాలి అయిన డగ్లస్ చాప్లీ ని భుజాలపైకి ఎత్తుకొని ప్రేక్షకులకు పరిచయం చేసేవాడు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ శ్వేత సౌధంలో చాప్లిన్ కి స్వాగతం పలికాడు. చార్లీ పుణ్యమాఅని డిఫెన్సు బాండ్స్ చురుగ్గా అమ్ముడు పోయాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం చాప్లిన్ ‘షోల్డర్ అర్మ్స్’ చిత్రం నిర్మించాడు. ఆ చిత్రంలో యుద్ధ ప్రక్రియను తూర్పారబట్టాడు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక తీసిన చిత్రం ‘మేస్యూవర్డూ’ విడుదల చేసినప్పుడు చాప్లిన్ ని “నువ్వు కమ్యూనిస్ట్ వా?” అని ఎద్దేవా చేసారు. చార్లీ “నేను కమ్యూనిస్ట్ ని కాదు- శాంతి ఉన్మాదిని” అని సమాధానం చెప్పాడు.
1950 ప్రాంతంలో చార్లీ ని కమ్యూనిస్ట్ గా ముద్ర వేసి అమెరికా ప్రభుత్వం చాలా బాధలు పెట్టింది. దాంతో మనస్తాపం చెందిన చాప్లిన్ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రఖ్యాత నటీమణి సోఫియా లోరెన్ తో నిర్మించిన ‘కౌన్టేస్ ఫ్రం హాంకాంగ్’ చాప్లిన్ నిర్మించిన చివరి చిత్రం. చాప్లిన్ వైవాహిక జీవితం విషయానికొస్తే అతనికి నాలుగు వివాహాలు. నాలుగో భార్య ప్రసిద్ధ అమెరికన్ రచయిత యూజీన్ ఓనెల్ కూతురు ఊనా. చలన చిత్ర రంగంలో అతనిని మించిన నటుడు లేడని విమర్శకులు అంటూ వుంటారు. ప్రఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా చాప్లిన్ గురించి “ఛార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ సినిమాలలో తయారైన ఏకైక మేధావి” అని ప్రస్తుతించారు.
-ఆచారం షణ్ముఖాచారి