పద్య రాగాల సామ్రాట్ ‘చీమకుర్తి నాగేశ్వరరావు’

చీమకుర్తి భార్య ‘వెంకాయమ్మ’కు గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ 25 వేల ఆర్ధిక సాయం.

నెల్లూరు టౌన్ హాలులో ఆయనకు అదే చివరి పద్యం. “కాబోలు ఇది బ్రహ్మ రాక్షస సమూహము…”. ఆయన అందుకుని పాడలేక అలసి చేతులెత్తి దండం పెట్టి స్టేజి దిగి మేకప్ రూమ్ లోకి వెళ్లి భోరున ఏడ్చేశారు. అదే ఆయన చివరి ప్రదర్శన అని చెబుతుంటారు. అప్పటికే సారా కు బానిసై చిక్కి ఎముకల గూడు చర్మం కనిపిస్తున్న దుస్థితి. ఆయనే “రాగాల సామ్రాట్” చీమకుర్తి నాగేశ్వరరావు. ఆ పేరు పద్య నాటకానికి ఒక బ్రాండ్. ఆయన పద్యానికి చెవులు కోసుకునే అభిమానులు వేలాది మంది ఉన్నారు.

ఆయనిప్పుడు లేరు. ఆయన భార్య వెంకాయమ్మ వుంది. ఆయన తెగ సంపాదించాడు కానీ, తాగుడుకే తుడిచిపెట్టుకు పోయాయి. కుమారుడు వున్నాడు. కూలీ పనికి పోతుంటాడు. చీమకుర్తిలో నడిబొడ్డున నాగేశ్వరరావు విగ్రహం వుంది. కొన్నాళ్ళ క్రితం వరకు ఆ విగ్రహం దగ్గరే వెంకాయమ్మ జామకాయలు, రేగుపండ్లు అమ్ముకుంటూ ఉండేది. ఇప్పుడామెలో ఆ ఓపిక కూడా లేదు. మంచానికే పరిమితం అయ్యింది!
తెలుగు పద్య నాటకాన్ని ముఖ్యంగా హరిశ్చంద్ర పద్యాలతో రెండు తరాలను ఒక ఊపు ఊపిన చీమకుర్తి నాగేశ్వరరావు భార్య అనారోగ్య ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్, రంగస్థల మెగాస్టార్ గుమ్మడి గోపాలకృష్ణ స్పందించారు. నిన్న ఒంగోలుకు ఆమెను ఆహ్వానించి గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ నుంచి పాతిక వేల రూపాయలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ కళా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, అన్నమనేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది జిజికె ఫౌండేషన్ సలహాదారులు డా. కృష్ణయ్య సహృదయత అని, పద్య నాటకానికి ప్రాణం పోసిన చీమకుర్తి నాగేశ్వరరావు అద్భుత నట గాయకుడు అని గుమ్మడి గోపాలకృష్ణ అభివర్ణించారు.

ఒక బండారు రామారావు, ఒక డి.వి. సుబ్బారావు, ఒక చీమకుర్తి నాగేశ్వరరావు… వాళ్ళ స్థానాన్ని రీప్లేస్ చేసే శక్తి తెలుగునాట మరొకరికి లేదు! వారి నాటకం అంటే ఎడ్ల బళ్ళు కట్టుకుని, సైకిళ్లు మోటార్ బైకులు వేసుకుని, ట్రాక్టర్లు కట్టుకుని ఎంత దూరమైనా వచ్చే జనం. ఏ స్టేజ్ కిందనో ఏ మారుమూలనో తువ్వాలు పరచుకుని తాగి పడుకునే ఆ మహా నటులు! కానీ, వారి సీను వస్తోంది అనగానే పది నిముషాల ముందు లేచి మేకప్ వేసుకుని రంగస్థలం పై అడుగు పెడితే ఈలల హోరు, చప్పట్ల జోరు అంతా ఇంతా కాదు! పాడిన పద్యాన్నే మళ్ళీ మళ్ళీ వన్స్ మోర్ కొట్టించుకుంటూ పాడి పాడి జనం గుండెల్లో నిలిచిపోయిన మహా నటులు. వారు అలా జాషువా పద్యాలు పాడుతూ డైలాగులు చెబుతుంటే పద్య ప్రేమికులు స్టేజ్ పైకి వెళ్లి కళాకారుల దుస్తులకు డబ్బు నోట్లు గుచ్చేవారు! నోట్ల దండలు వేసేవారు! తెల్లారినా ఆ నాటకం అలా సాగుతూనే వుండే రోజులు. ఆ రోజులు స్వర్ణయుగం… మళ్ళీ రావు.

బండారు సుబ్బారావు గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, వేటపాలెంలో వున్నప్పుడు డి.వి. సుబ్బారావును దగ్గరగా చూశాను. చాలాసార్లు మాట్లాడాను. గడియారం స్తంభం దగ్గర రాత్రి పదింటికి అడవి సీను మొదలైతే తెల్లారి తొమ్మిదింటికి కాటి సీను ముగిసేది. నాకు పద్యం పిచ్చి పట్టించింది సుబ్బారావు గారే. ఇప్పుడు వారి మనవడు జూనియర్ డి.వి. సుబ్బారావు ఒక ఊపు ఊపుతున్నాడనుకోండి. బండారు అయినా, డివి అయినా, చీమకుర్తి అయినా నోట్ల కట్టలు సంపాదించారు! అక్కడే వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టేశారు! పెద్దగా దాచింది, సంపాదించింది ఏమీ లేదు! చీమకుర్తిలో నాగేశ్వరరావు విగ్రహం దగ్గర ఆయన భార్య జామకాయలు అమ్ముకునే దుస్థితి! ఓహో పద్యమా! ఒక ఊర్లో నాటకం ఉందంటే చుట్టు పక్కల ఊర్ల నుంచి వచ్చి ఆ మహానటుల స్వర సముద్రంలో మునిగి తేలి వెళ్లే అభిమాన సంద్రం. కానీ, స్థిరమై సంపదలెళ్ల వెంటరావని జాషువా ఏనాడో చెప్పేశాడు! ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు! అదే స్థిరం! అదే శాశ్వతం!

డా. మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap