సాహిత్యంలో ప్రాంతీయ సాహిత్యానికి ప్రత్యేకత వుంది. అవి ఆయా ప్రాంతాల చరిత్రని, అప్పటి మనుషులను, కాలాన్ని రికార్డు చేస్తాయి. ఇందులో కథకుని అనుభవాలు ఉండొచ్చు, లేదా కథకుడు చూసిన మనుషుల కథలూ కావొచ్చు. ఎటొచ్చీ కథకుడు తాను ఎన్నుకున్న కథ బాగా చెప్పాడా? ఆసక్తిగా చెప్పాడా అనేదే ముఖ్యం.

ప్రపంచంలో పేరు పొందిన, నిలబడిన సాహిత్యం అంతా స్థానిక సాహిత్యమే. చాలామంది వీటిని నోస్టాల్జియాతో రాసారు. కానీ హరి వెంకట రమణ రాసిన చిక్కని పులి (పెందుర్తి) కథలు పెందుర్తి లో జరిగిన ఆశ్చర్యకరమైన విషయాలని ‘అలకాపురి గార్డెన్సులో ఢాం..’ కథలోనూ, నగర శివార్లలో దొంగలు పడే అంశాన్ని ‘దొంగలు పడ్డారు’ కథలోనూ రాసారు. సింహాచలం గిరిప్రదక్షిణ, తూరుపు కొండల అందం, ఇప్పడి గుంటలెలా వున్నారో రాసిన ‘ఒరేయ్ గుంటడా’ కథలోనూ, పెందుర్తి స్టేషన్ సౌందర్యం ‘స్టేషన్ చివర బెంచీ’కథలోనూ రాసేరు.
ఈ పుస్తకానికి టైటిల్ గా వున్న చిక్కనిపులి కథ చాలా ఆసక్తి గొలిపేదిగా వుంది, పులి ఒక కాలనీలోకి రావడం జనం భయపడటం, దానివెంట పడటం అనేది రాసి పులిని ఒక మెటాఫర్ గా వుపయోగించి కథని సమకాలీన పరిస్థితులకు లాక్కెళ్లారు రచయిత. ఈ కథ సామజిక కార్యక్షేత్రంలో యోధులుగా, పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వారి ఉనికిని, పెద్ద మనిషి తత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇక పాపయ్యరాజు పాలెం పొగమంచు దెయ్యాలు కథలో సమకాలీన అంశాలపై పూర్తి సెటైర్ వుంది. రచయిత వేసిన వ్యంగ్యాస్త్రాలు చాలా తీవ్రంగానూ వివాదాస్పదంగానూ వున్నాయి. ఈ కథలో ‘సంపెంగలు – విరిగిన గళాసులు’ అనే కథ పేరు బాగుంది. మిగతా కథల పేర్లన్నీ కూడా రచయిత ఆసక్తిగా ఉండేట్టు పెట్టారు.
గెడ్డలో స్వామి ‘ అనే కథలో ఒక స్పోర్ట్స్ షాపులో పనిచేసే వ్యక్తి, దేశాటనం చేసిన తరువాత ఒక ప్రాంతానికి వొచ్చాక ఏం చేసాడు, ఏం జరిగింది అతను రాజగురు గా ఎలా మారాడు అనేది చాలా ఉత్సుకత కలిగించే విధంగా రాసారు, ఇందులో డ్రైవర్ సంభాషణలు చాలా నవ్వు తెప్పించాయి. ఈ అంశంపై ధైర్యంగా రాయడంలో రచయితను అభినందించాలి.
ఈ కథలెందుకు రాసేను అనే ముందుమాట కూడా కథలంత అందంగా వుంది.‘ఆ వూర్లో’అనే కథ, వూరు, టీ, మంచి నీళ్లు అనే అంశంపై తిరిగిన ఒక చిన్న కథ. ముగింపు బాగుంది. ప్రపంచంలో పేరు పొందిన సాహిత్యం అంతా కూడా ఊరి సాహిత్యమే, ప్రపంచమే వూరిలో ఉంటుంది, ఆ వూరే ప్రపంచంలా ఉంటుంది. అయితే అలా వున్న వూరిలో జనాలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ తగువులు ఏంటి ? తమాషాలు ఏంటి అనేది తెలియాలంటే ఇలాంటి స్థానిక సాహిత్యం చదవాలి. సీరియస్ అంశాలని సులభమైన వాడుక భాషలో, మంచి కథా గమనంతో చెప్పడం బాగుంది. మరికొన్ని కథలు ఉంటే బాగుణ్ణు అనిపించేలా ఈ కథల సంపుటి వుంది.
మొత్తం పది కథలున్న ఈ పుస్తకం పర్స్పెక్టివ్స్ ప్రచురించింది. పుస్తకంలో ఎన్నుకున్న అంశాలు చాలా సీరియస్ వి అయినా వాటిని రచయిత చాలా హాస్యాస్పహారకం గాను, వ్యంగ్యం గానూ రాయడం, ఉత్తరాంధ్ర జీవ భాషను సంభాషణల్లో చూపించడం వలన పుస్తకం చక్కగా చదువుకోవొచ్చు. పెందుర్తిలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు విశాఖ వాసులు, అసలు పెందుర్తి ఎలా ఉండేదో తెలుసుకునేందుకు బయట ప్రాంత వాసులు ఈ కథలు చదువుకోవొచ్చు.
సమీక్ష: ఎస్. యామిని
చిక్కని పులి (పెందుర్తి కథలు)
రచయిత : హరి వెంకట రమణ
ప్రచురణ : PERSPECTIVES
పేజీలు : 80, వెల : రూ. 125/-
ప్రతులకు : నవోదయ బుక్ హౌస్, కాచిగూడ
లేదా ఫోన్ నంబర్ 79895 46568 లో సంప్రదించవొచ్చు
