తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 6

తెలుగు కవన సింహం చిలకమర్తి లక్ష్మీనరసింహం. తెలుగు కవనంలో కవితాలతల మధ్య కావ్యకుసుమాల సుగంధంలో విహరించిన కవి చిలక – చిలకమర్తి లక్ష్మీనరసింహం. తెల్లవాడికి మత్తు మద్యం – తెలుగు వాడికి మత్తు పద్యం అని తలచే ఆ రోజుల్లో చిలకమర్తి ఉషోదయం జరిగింది. అసలే తెలుగు భాష తీపి మయం – దానికి తోడు చిలకమర్తి కల్పనల వర్ణనలు నవరసమయం.

“నిటలాక్షుండిపుడెత్తి వచ్చినను రానీ”
“ముదితల్ నేర్వగ రాని విద్య కలదే”
“అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ”
ఇటువంటి అచ్చ తెలుగు పదాలకు ఈయన మారుపేరు. ఈయన నిజానికి సరస్వతీ సింహం. వీరి గయోపాఖ్యానం ఆ రోజుల్లోనే లక్ష కాపీలు
అమ్ముడు పోయిందట. కీచకవధ, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం, పారిజాతాపహరణం, నల చరిత్ర, సీతారామ కళ్యాణం వంటి వీరి నాటకాలు తెలుగునాట ఆబాల గోపాలానికి సుపరిచితాలు. తెలుగు సాహిత్యంలో అజరామరమైన హాస్య నవల గణపతి శ్రీ చిలకమర్తి వారి సృష్ట!

భరతఖండంబు చక్కని పాడి ఆవు .
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ కట్టి
అంటూ తెల్లవారి దురాగతాలను తేటతేట తెలుగులో చెప్పి తన దేశభక్తిని చాటుకున్నారు తెలుగు సారస్వత మహావృక్షపు పద్య, గద్య, నాటకాది శాఖోపశాఖలపై వాలి తేనె పలుకులు పలికిన తెలుగు కవి చిలక, కళాప్రపూర్ణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం నేటికీ మన ధృవతార!

(చిలకమర్తి లక్ష్మీనరసింహం జన్మదినం సెప్టెంబర్ 26, 1867)

1 thought on “తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap