పిల్లలు – సృజనాత్మకత

135 కోట్లకు పైబడ్డ భారతదేశ జనాభాలో 30 కోట్లమంది చిన్నారులున్నారు. వీరే రేపటి తరాన్ని ముందుకు నడిపే నావికులు. వీరిలో దాగివున్న సృజనాత్మక శక్తి వెలికి తీసి శాస్త్ర, సాంకేతిక, కళారంగాలలో భావిభారతాన్ని తీర్చిదిద్దే సృజనశీలులుగా తీర్చిదిద్దాల్సిన భాధ్యత నేటితరం తల్లితండ్రులది. పిల్లలకు కరోన సందర్భంగా ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇది.
చిన్న పిల్లల చేతిలో బలపం వున్నా, రంగు చాక్ పీసులు వున్నా, స్కెచ్ పెన్నులు వున్నా, ఇంకా ఏమైనా వుంటే వారు అందుబాటులో వున్న పలక మీద గాని, పేవరుమీద గాని ఏమీలేకపోతే గోడమీదగాని ఏదో ఒక బొమ్మ గీస్తూ వుండడం, వారేదో పనికిరాని పని చేస్తున్నారని మనం మందలించడమూ మామూలే. ఐతే ఈ పిచ్చి గీతలే వారిలోని సృజనాత్మక శక్తికి పునాదులని పెద్దలు గ్రహించాలి.
భాషలకు లిపి కంటే ముందు చిత్రాల ద్వారా తమ భావాలను మానవుడు వ్యక్తీకరించేవాడు. కాలక్రమేణా ఆ చిత్రాలే మానవుని సృజనాత్మకతతో కళారూపాలుగా రూపొందాయి. ముందుగా గిరిజన కళ, తరువాత జానపదకళ, ఆపైన క్లాసికల్ మరియు రియలిస్టిక్ ఇప్పుడు ఆధునిక చిత్రాలు అనేక నూతన పోకడలు అందుకున్నాయి.
జాగ్రత్తగా పరిశీలిస్తే వ్యక్తులు ఏ వృత్తిలో వున్నప్పటికీ వారిలో కొంతమంది మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగల్గుతారు. వీరు ఈ ప్రగతికి మూలకారణం. వారిలోని సృజనాత్మక శక్తి, పరిశీలనా పటిమ, అకుంఠిత దీక్ష మరియు వారి విధులపై ఆసక్తి. ఆ బాలబాలికలలో పైన ఉదహరించిన బీజాలను నాటడం పెద్దల వంతు. దీనికి చిత్ర లేఖనం ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం మనం కొన్ని రంగులు, ఒక తెల్ల కాగితం ఇస్తే బాలలు ఆ కాగితం పై కొన్ని రూపాలు, కొన్ని రంగులు మేళవించి ఓ చిత్రాన్ని చేయగల్గుతారు. దాని అర్ధం ” The Child produces something out of nothing” ఏమంటే దానినే మనం సృజనాత్మకత అంటాం. అదే విధంగా ఒక కత్తెర, పేపర్లు ఇస్తే వివిధ రకాలైన ఆకారాలను, బొమ్మలను తయారు చేయడం బాలల చేతిలోని కళా నైపుణ్యానికి నిదర్శనం.

ఈ చిత్ర రచనా క్రమంలో పిల్లలలో ఓర్పు, నేర్పు, పరిశుభ్రతపై అవగాహన, శ్రద్ధ, తమ పటిమ పైన, నైపుణ్యం పైన సంపూర్ణ విశ్వాసం ఇంకా ముఖ్యంగా నిబ్బరమైన భావ ప్రకటనాశక్తి అలవడతాయి. బొమ్మలు వేయడం నేర్చుకొనేటప్పుడు కొన్ని చిత్రాలు గీయడం నేర్చుకొనగల్గుతాడు. కాని ఈ చిత్ర రచనా పరిక్రమ కార్యక్రమంలో పైన ఉదహరించిన సద్గుణాలన్నీ బాలల్లో వృద్ధి చెందుతాయి. వారిని సుసంపన్నులను చేస్తాయి. ఐతే స్కూలు స్థాయిలో చిత్రకళకు తగిన ప్రాముఖ్యత ఇవ్వక పోవడం, పరీక్షల ఉత్తీర్ణతకు చిత్రకళా పటిమను ప్రాతిపదికగా తీసుకొనకపోవడం వల్లను తల్లిదండ్రులు గాని, ఉపాధ్యాయులుగాని బాలలను ఈ దిశలో ప్రోత్సహించడం లేదు. దానివల్ల పిల్లలు తమ బాల్యంలో రంగుల ద్వారా, రూపాల ద్వారా చక్కని చిత్రరచన ద్వారా పొందాల్సిన ఆనందాన్ని, అనుభూతిని కోల్పోతున్నారు. ఈ ఆనందాన్ని హరింపజేసే పెద్దలు క్షమార్హులు కారు. పైగా వారిలోని సృజనాత్మక శక్తికి అడ్డుగా నిలబడుతున్నారు. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా వుంది. రోజురోజుకు పెరిగి పోతున్న ఈ పోటీ ప్రపంచంలో నూతనత్వానిదే పెద్దపీట, అంటే సృజనాత్మకత శక్తి వున్న వ్యక్తులే స్వయంగా అభివృద్ధి పొందగలరు. ఇలా ఒక చిత్రలేఖనంలోనే కాదు పిల్లలకు అభిరుచి, ఆసక్తి వున్న ఏ రంగంలోనైనా (ఆటలు, పాటలు) ప్రోత్సహిస్తే భవిష్య జీవితంలో వారే సమాజానికి తమ నూతన అన్వేషణ ఫలితాల ద్వారా దేశాభివృద్ధికి దోహదపడతారు.

-కళాసాగర్ యల్లపు

SA: