నగర దిష్టి (కథా సంపుటి)

ప్రముఖ బాలల కథా రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు అయిన మద్దిరాల శ్రీనివాసులు గారి కలం నుండి వెలువడిన బాలల కథా సంపుటి “నగర దిష్టి. ఇందులో బాలలలో విద్యపట్ల ఆసక్తి,ఉన్నత విలువలు, సాంకేతక దృక్పధం ఏర్పడేలా రచించిన 12 కథలు వున్నాయి, తెలివైన వాడైనప్పటికీ బద్దకంతో క్లాసునందలి మార్కులు పోగొట్టుకుంటున్న విజయ్ అనే విద్యార్థిలో దేవుడి మీద వాడికి గల అపార నమ్మకం ఆధారంగానే వాడికి చదువు పట్లా పాఠాల పట్ల ఆసక్తి కలిగేలా చేసి తరగతిలో మొదటి రాంక్ సాధించే విధ్యార్ధిగా ఉపాద్యాయుడు తీర్చి దిద్దిన వైనం చాలా ఆసక్తి దాయకంగా చెప్తాడు రచయిత ఈ “దేవుడి మహిమ” అన్న మొదటి కథలో  గొప్ప భవిష్యత్ నిర్మాణానికి గొప్ప గొప్ప చదువులే చదవనవసరంలేదు. మనిషిలో సరైన క్రమశిక్షణ, తెలివి తేటలు భవిష్యత్తు పై నమ్మకం ఉంటే ఇంటర్ లాంటి కొద్దిపాటి చదువు తోనే మంచి గమ్యానికి చేరుకోవచ్చు అలా ఆ కొద్దిపాటి చదువుతోనే తన జీవన గమ్యానికి అందమైన పునాది వేసుకుంటూ తాను మాత్రమే గాక తనతో పాటు పదిమందికి కూడా ఉపాధి చూపించే స్థాయికి చేరిన సందీప్ జీవన ఉదంతాన్ని “ఆధునిక ఎంపిక” అనే కథలో చక్కగా వివరిస్తాడు రచయిత ఇక ఈ పుస్తకము యొక్క మకుటంతో వున్న మూడవ కథ నగర దిష్టి. దేశ ఆర్థికవృద్ధికి పట్టుగొమ్మలు పల్లెటూర్లు. అలాంటి వాటిలో ఒకటైన వేంకటేశ్వర కాలనీలో ప్రజలంతా వ్యావసాయాధారితమై చదువు సంధ్యల పట్ల ఏమాత్రం లక్ష్యం లేని ఆ ఊరికి ఒక ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయుడిగా వొచ్చి ఆ ఊరి గతినే ఆదర్శంగా మార్చిన వైనాన్ని చెబుతూనే ఆ ఉపాధ్యాయుడు వూరు విడిచిన తన సొంత వూరికి వెళ్లిన క్రమంలో ఆధునికత పేరుతో మరల తిరోగమన బాట పట్టిన ఆ ఊరి ప్రజలకు విజ్ఞుడైన లక్ష్మణరావు అనే ఉపాధ్యాయుడు గుర్తు రావడం అతని ద్వారా మరలా ఆ గ్రామంలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దశాబ్దాల పరిణామాన్ని వివరిస్తాడు నగరదిష్ఠి అన్న చిన్న కథలో పాత తరం వాళ్ళు పెట్టిన కొన్ని ఆచారాలలో ఇమిడి యున్న మర్మాన్ని వివరించి వాటి పట్ల అతి నిష్ఠగా వుండే తన బామ్మధోరణిలో తన మనమడు తీసుకొచ్చిన మార్పుని వివరించె కథ “మారిన బామ్మ ” మార్కులు సాధించడం మాత్రమే విద్యకాదు, సహజమైన మనిషి లోని శక్తులను వెలికి తీసి వాటిని ప్రోత్సహిస్తే మనిషి మంచి వృద్ధి సాధిస్తాడు అన్న భావనతో చెప్పిన కథ యద్భావం తద్భవతి, ఇక మనిషి మనసులో తన సహజమైన భయం తాలూకు ఊహించుకున్న భావాలకు ప్రతిగా యెర్పడ్డ రూపాలే దయ్యాలు భూతాలూ తప్ప ఈ ఆధునిక కాలంలో అలాంటివి ఏమీ లోకంలో లేవని చెప్పే కథ “దయ్యం ”
హేతురహితమైన శకునాలను మూఢంగా నమ్మితే మనిషి జీవితం చివరకు ఎలా ఛిద్రం అవుతుందో తెలియజెప్పే కథ శకునాల గోపయ్య.

అలాగే పరిణతి చెందని వయసులో పెళ్లి జరిగి గర్భం దాలిస్తే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసిన తెలివైన రాజి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకుందో తెలియజెప్పిన కథ “దయ్యం పట్టింది” డబ్బై ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా విద్య వైద్యం రహదారులు లేని ఒక మారు మూల వెనుకబడిన దుమ్ముగూడెం అనే గ్రామంలో నిరక్షరాస్యత వలన జనాలలో పెరిగిన మూఢనమ్మకాలు అమాయకత్వం ఆపరిశుబ్రత ఫలితంగా అక్కడ పెరిగిన అంటురోగాల ను తగ్గించి ఆ ఊరిని శుభ్రంగా ఆరోగ్యకరంగా మార్చిన డాక్టర్ శ్రీవిసరావు కృషిని మా వూళ్ళమ్మ జాతర కథలో వివరిస్తాడు రచయిత మితిమీరిన గారాభంతో తల్లిదండ్రులు పరిమితి లేకుండా ఇచ్చిన డబ్బులతో నూడుల్స్, పానీ పూరీ,బజ్జి,పిజ్జా లాంటి చెడు చిరు తిళ్ళకు అలవాటు పడిన చిన్నారుల ఆరోగ్యంలో వొచ్చే అనర్ధాలను” తాయత్తుకు తల ఒగ్గని దయ్యం ” కథ ద్వారా చెప్తాడు రచయిత గౌరవం అనేది పదవివల్ల కాకుండా మనము చేసే పనుల పనులబట్టే దక్కాలి అనే చెప్పే కదా “నిజమైన గౌరవం “, ఇతరులకు సహాయం చేస్తే భగవంతుడు కూడా మనకు మేలు చేస్తాడని నీతిని చెప్పే కథ “మంచి కాకి “, ఇంకా చెట్ల ఆవశ్యకతను పిల్లకు తెలియజేసె “కొత్తపల్లి ” కథ…. ఇలా మొత్తం పన్నెండు కథలలో జనాలలో పాతుకుపోయిన దయ్యాలు, తాయెత్తులు శకునాలు లాంటివి మూఢనమ్మకాల మర్మాలను బాలలకు వివరిస్థాయి,పెద్దలపట్ల, గురువులపట్ల గౌరవభావాన్ని, కలిగిస్తాయి చెట్ల పెంపకం పర్యావరణం గురించి అవగాహన కలిగిస్తాయి. ఒక లక్ష్యం కోసం ఇష్టపడి కష్టపడే ప్రయత్నిచే స్వభావాన్ని అలవారుస్తాయి. ఆధునిక. విజ్ఞాన ఆవశ్యకతను తెలియజేస్తాయి. మంచికథలకు తోడు ఆ కథలకు వెంకట్ వేసిన చిత్రాలు కూడా బాగున్నాయి. ఆకర్షణీయమైన ముఖ చిత్రంతో వెలువడిన ఈ చిరు గ్రంధాన్ని విశాలాంధ్ర పబ్లిషర్స్ వారు ప్రచురించడం గొప్ప విశేషం.

విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో దొరికే ఈ పుస్తకం వెల 60/- రూపాయలు. పాఠశాల విధ్యార్ధులందరూ చదవదగ్గ చిరు గ్రంధం ఈ నగరదిష్ఠి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

-వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

SA: