వందేళ్ళ వయ్యారి ‘చింతామణి ‘

కాళ్ళకూరి నారాయణరావుగారి చింతామణి నాటకశతజయంతిసంవత్సరం (1920-2020). ఆ సందర్భాని పురస్కరించుకుని నా అక్షరాంజలి….. వందేళ్ల వయ్యారి చింతామణిిి

కాళ్ళకూరి నారాయణరావుగారు చింతామణి నాటకం రాసి సరిగ్గా 2020 కి వందేళ్ళు పూర్తయ్యాయి.  1920 లో ఈ నాటకం రాసారు…
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పరిశీలిస్తే, స్వాతంత్ర్యోద్యమానికి సమాంతరంగా, సంఘసంస్కరణఉద్యమాలు బయలుదేరాయి. వ్యక్తి సంస్కారం వల్లనే, సంఘ సంస్కరణజరిగి, అటువంటివారి వల్లనే ఉద్యమం స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్ళాలనేది ఈ ఉద్యమ ఆశయం. ఏ ఉద్యమానికైనా, ఊతమివ్వటంకోసం, కలాలను ఆయుధాలను చేసి, ముందువరుసలో నిలబడే కలంయోధులు కవులు.
కాళ్ళకూరి వారు సంఘసంస్కరణే ధ్యేయంగా, సమాజం మీదఎక్కుపెట్టిన అస్త్రాలు, వారి నాటకరచనలు. వరకట్న దురాచారనిర్మూలన కోసం వరవిక్రయం, మద్యపాన వ్యసనానికి వ్యతిరేకంగా, మధుసేవ, ఆనాటి సమాజంలో లోతుగా పాతుకుపోయిన వేశ్యావృత్తికి వ్యతిరేకంగా, చింతామణి నాటకం రచించారు. కవిగారు తన సమకాలీన సమాజంలో కుహనా సంస్కర్తల ప్రవర్తనను, వరవిక్రయం నాటకంలో …………
“లేకేమి, ఉన్నారు.
ఉండియేమిలాభము?
ఉపన్యాస వేదికపై ఉక్కిరిబిక్కిరి చేసుకొనుటయే కాని,
పని వచ్చినపుడు పట్టుదలపట్టుదలసున్న.
బాల్యవివాహములన
పటపట పండ్లుకొరుకు
బాపిరాజు గారు ఏమి చేసినారో విన్నావా ?
అభము శుభము ఎరుగని ఆరేళ్ల పిల్లనునలుబది ఏండ్లు గడచిన నాల్గవ పెండ్లి వానికి ముడిపెట్టి అదే మన అత్తగారి పట్టన్నారు.
స్త్రీ పునర్వివాహములకొరకు చిందులుత్రొక్కిన శివయ్య గారు, బంగారు బొమ్మ వంటి పదహారేళ్ల చెల్లెలికి భర్తచావగానే వంటలక్కను మానిపించి, వంట తప్పేలా చేతికిచ్చి, అదే మన మా అమ్మ చావనిమ్మనారు. శవవాహనముల గూర్చి శంఖమును పూరించు శరభయ్యగారు, పక్క ఇంటి ఇల్లాలు భర్త చచ్చి శవవాహకులకు డబ్బిచ్చుశక్తి లేక దేవుడా, గోడా అని దేవులాడుచుండ
వీధి తలుపు గొళ్లెం వైచి,
నైవేద్యము పెట్టి,
పెరటి త్రోవను పేకాటకు చక్క పోయి ,
అదే మన ఆమె వచ్చి అడుగు లేదన్నారు.
విన్నావా వీరే కాదు, ఈ ఊరి సంఘసంస్కర్తలు అందరూ ఇదే మాదిరి. ”
కాళ్లకూరి వారు సంఘ సంస్కరణ కోసం రాసిన 3 నాటకాల్లో ఒక ముఖ్యమైన పాత్ర బలి చేసి
ఆ పాత్ర మరణంలో నుంచి నాటక గమనాన్ని మలుపు తిప్పి సందేశాన్ని అందించటం
మూడు నాటకాలలో కనపడే ఏకసూత్రత. .
1. చింతామణి నాటకంలో రాధ మరణం.
2. మధుసేవ నాటకంలో జమీందారు భార్య మరణం.
3. వరవిక్రయం నాటకంలో కాళింది మరణం.

కేవలం రచనల్లోనే కాకుండా, తన నిజ జీవితంలో కూడా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సిద్ధాంత సార్ధక వ్యక్తిత్వం కాళ్ళకూరి నారాయణ రావు గారిది. తన తండ్రిని ఎదిరించి తన చెల్లెలుకు వితంతు పునర్వివాహం చేశారు. దాని ఫలితంగా తాను ఇంటికి దూరంగా ఉన్నాడు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు కాళ్లకూరి నారాయణరావు గారు.

రచనలు: (నాటకాలు)చిత్రాభ్యుదయం, పద్మవ్యూహం, చింతామణి, వరవిక్రయం, మధుసేవ, సంసారనటన, వ్యవహారంకాండ…. ఇంకా 13 ప్రహసనాలు, ప్రతాపరుద్రమదేవి నవల,
మూడు కథలు, విమర్శన గ్రంథాలు, 3 చరిత్ర గ్రంథాలు, వ్యాసాలు 11, గ్రంథ విమర్శలు, వివిధ రకాల సందర్భాలలో రాసిన కవితలు, బుద్ధిరాజులు, రాజసుందరి అనే చిత్ర కావ్యాలు….
వీరు  రాసిన పద్యాలలో కొప్పరపు కవుల ని ప్రశంసిస్తూ రాసిన పద్యాలు సంచలనం సృష్టించాయి. వీరేశలింగంగారి మరణానికి చింతిస్తూ రాసిన పద్యాలుకూడా విశేషమైనవి.
కాళ్ళకూరినారాయణ రావు గారి మునిమనవలు గుంటూరులో నివసిస్తున్నారు. వారు న్యాయమూర్తులుగా పదవీవిరమణ చేసారు.
కాళ్ళకూరి నారాయణరావు గారి జీవితం సాహిత్యంగురించి శ్రీ వేముల శ్రీనివాసమూర్తిగారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఫిల్. చేశారు.
కాళ్ళకూరి నారాయణరావుగారి జీవితం నాటకాల గురించి డాక్టర్ కొట్టే వెంకటాచారి గారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ….

కళాకారులకు జీవనోపాధి మాత్రమే కాకుండా, ఎనలేని కీర్తి ప్రతిష్టలు కల్పించిన నాటకం చింతామణి. పద్మనాభం, రేలంగి, మాడ, గంటి జోగినాధం, కన్నాంబ, సూర్యాకాంతం, ఋష్యేంద్రమణి, గిరిజ, భానుమతి, రంగపుష్పరంగ, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, రేబాల రమణ, షహీద, ఎమ్మార్ తిలకం, మాధవపెద్ది, వెంకట్రామయ్య, ఘంటసాల, నాగరాజు, పులిపాటి వెంకటేశ్వర్లు, గుమ్మడి జయరాజ్ ఏ.వి సుబ్బారావు, షణ్ముఖి ఆంజనేయరాజు, ఏ. వెంకటేశ్వరరావు, ఏ. కోటేశ్వరరావు, ఏ. ఆదినారాయణ, బి.సి. కృష్ణ ఈ ప్రకారంగా చింతామణి నాటకం లోని ఒక్కొక్క పాత్ర కు కనీసం వంద మంది నటులు ఉన్నారు. పరిస్థితులు చక్కబడినాక అయినా చింతామణి నాటక శతజయంతి జరుపుకోవాల్సిన కనీస బాధ్యత మనందరిపై ఉంది.

డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు

(9440466522)

SA: