చింతామణి కి చిక్కులు…

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చింతామణి నాటక శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా టీవీ9 లో ఒక వార్త పునరావృతం అవుతూ వస్తోంది…అదేమంటే చింతామణి నాటకాన్ని, శతజయంతి ఉత్సవాలను నిరసిస్తూ ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఉత్సవాలు నిర్వహించిన వద్దు అంటూ ప్రకటనలు చేస్తున్నారు.

ఒక కవి రచన నూరు సంవత్సరాలుగా బ్రతికి ఉంది.
నూరు సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ వేళ ఎందుకు ఈ నిరసన? ఆందోళన?
ఒక ఆలోచన….

చింతామణి నాటకంలో చిత్రను అంటగట్టి,వెర్రి వెంగళప్పనుచేసి సుబ్బిశెట్టి దగ్గర ధనం అంతా దోచుకొని వెళ్ళగొట్టారు. అని మాత్రమే కవి రచించారు. ఈ మాట చింతామణే స్వయంగా చెబుతుంది(నాటకరచనలో మాత్రమే)….

కన్యాశుల్కం నాటకంలోని, వస్తువు కానీ, చింతామణి నాటకంలో వస్తువు కానీ, ఈనాటి సమాజంలో లేని సమస్యలు. ఒక నాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలు.
ఈనాడు వేశ్యా కులం లేదు. వేశ్యవృత్తి లేనేలేదు. పడుపు వృత్తి చేసే ప్రత్యేకమైన కులాలు లేవు. అందరూ సాధారణ జన జీవన స్రవంతిలో కలిసి పోయారు. వేశ్యా వ్యామోహం పోయింది. ….
పర స్త్రీ వ్యామోహం నిలబడిపోయింది.

కాబట్టి ఉంపుడుకత్తెలు, వేశ్యలను ఉంచుకోవటం ఒక సాంఘిక హోదా, అనే భావనలు లేవు అటువంటి సమాజం ఈనాడు లేదు..

నాటకం ఒక కళా ప్రక్రియ.
కళాప్రక్రియలో ఎప్పటికప్పుడు సమస్యలు ఎత్తి చూపించటం రచయితల యొక్క సామాజిక బాధ్యత.

కాళ్ళకూరి నారాయణరావు గారు కూడా తాను జీవించి ఉన్న కాలంలో వున్న సాంఘిక సమస్య అయిన వేశ్య వృత్తిగురించి చింతామణి నాటకంలో, చాలా నిశితంగా, క్షుణ్ణంగా చిత్రించారు.
వేశ్యలు పడుతున్నా బాధలు, అంటే ఆ కుటుంబంలో పుట్టి ఆ వృత్తిలో కొనసాగడం ఇష్టం లేని వ్యక్తిత్వాలు చీకటి గదిలో ఎలానలిగిపోతుంటాయో….,ఇష్టం లేకపోయినా, బలవంతంగా ఆ కులపెద్దలు
కులవృత్తిని ఏలా నిర్వహించమంటారో, వేశ్యావృత్తిలోకి వచ్చే ఇతరకులాలస్త్రీలు, వారి విద్యలు, ఇంటికి వచ్చే విటులపట్ల వారి మర్యాదలు,….
వేశ్యలకు మరిగిన చదువుకున్న పండిత కుటుంబాలు, స్థితిమంతులైన ధనిక కుటుంబాలు, చక్కటి సంసార జీవనం సాగించే సంసారులు….ఇలా సమాజంలోని అన్నివర్గాల వారు వేశ్యలకు మరిగి ఎలా పతనమైపోతారో, సమాజంలోవారి స్థానం ఏమిటో… ఈ నాటకం ద్వారా తెలియజేశారు..
ఈ మహమ్మారి చెలరేగిపోతున్న కాలం నాటిది ఈ నాటకం.
ఆ సమస్య లేకపోయినా నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శిస్తూ నాలుగు రూపాయలు దానిమీద సంపాదించుకుంటూ జీవితాలు గడుపుకుంటుంన్నారు కళాకారులు.

సమస్య ఈనాడు లేనప్పుడు ఆ నాటకాన్ని నిలిపివేయండి అని కోరడంలో ఆందోళనకారుల ఉద్దేశ్యమేమిటో స్పష్టంగా తెలియాలి..
ఆర్యవైశ్యులు నిరసన ప్రకటించవలసింది సుబ్బిశెట్టి పాత్ర నిర్వహణ మీదేకాని, చింతామణి నాటకం మీద కాకూడదు…
ఈనాడు ఆర్యవైశ్యులు ఎవరు ఆ విధంగా నల్లగా (నలుపు ఆర్యవైశ్యులకే కాదు కదా అన్ని కులాలలో నలుపు రంగు వ్యక్తులు ఉంటారుగా) పంగనామాలు పెట్టుకుని, బొర్ర పంచె కట్టుకుని కనపడటం లేదు కదా….,
బాధ్యత కలిగిన కళాకారులు ఈ నాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా రంగు పేరు మార్చుకుని చింతామణి ఇంటికి వచ్చే పలురకాల విటులలో ఇతను ఒకడు అనే భావన కలిగేటట్లుగా నాటకప్రదర్శనలు నిర్వహించాలి….
-సుబ్బరాజు ఎన్.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap