కమల్ విజయానికి చిరంజీవి స్పందన

అలుపెరగని ప్రయాణం.. అంకితభావం.. ఈ రెండిటికి కలిపి ఓ పేరు పెడితే బాగుంటుందని అనుకుంటే ఆ పేరే కమల హాసన్ అవుతుంది. ఎన్నో వైవిధ్యభరితమైన కథలు.. మరెన్నో విభిన్నమైన పాత్రలలో కమల్ చేసిన సాహసాలు.. ప్రయోగాలు అన్నీ ఇన్నీ కాదు. కమల్ సినిమాలపై పరోశోధన అనేది మొదలు పెడితే ఆయన ఏం చేయలేదు అనే వైపు నుంచి మొదలుపెట్టవలసి ఉంటుంది. అంతగా ఆయన తన కెరియర్లో కొత్తదనం వైపు దూసుకుని వెళ్లారు. అలాంటి కమల్ తాజాగా ‘విక్రమ్’ సినిమాతో హిట్ కొట్టడంతో ఆయనను అభినందిస్తూ చిరంజీవి సత్కరించారు.

కమల్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ‘విక్రమ్’ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కమల్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి ఆయనను సత్కరించారు. ఆ సమయంలో అక్కడే సల్మాన్ కూడా ఉండటం విశేషం.

ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. అలాగే మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ వేడుకకు విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ సన్మానం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘స్వాతిముత్యం’ సినిమా 1986లో వచ్చింది. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. కమల్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి సంబంధించిన షీల్డ్ ను అప్పట్లో చిరంజీవి చేతుల మీదుగా కమల్ అందుకున్నారు. ఆ సందర్భంలో ఆ వేదికపై బాలీవుడ్ సీనియర్ స్టార్ రాజ్ కపూర్ ఉన్నారు. ఇప్పుడు ‘విక్రమ్’ హిట్ కారణంగా కమల్ ను చిరూ సత్కరిస్తున్నప్పుడు సల్మాన్ ఉన్నారు.

ఇక ఇటీవల కమల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి తమిళ సినిమాలపై దృష్టి పెట్టలేదుగానీ లేదంటే అక్కడ కూడా ఆయన దూసుకుపోయేవారు అనడం విశేషం. నవరసాల అంతు చూసిన కమల్ ఆ మాట అనడం నిజంగా విశేషమే.. అది ఆయన గొప్పతనమే. ఇక తనకి హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ ను ఒకేసారి చిరంజీవి – సల్మాన్ లకు పరిచయం చేసిన కమల్ ఆల్రెడీ రజనీకి కూడా ఆయనను పరిచయం చేశారు. రేపో మాపో వీళ్ల కాంబినేషన్లో ప్రాజెక్టులు మొదలైనా ఆశ్చర్యం లేదు.

SA: