చిరంజీవి ని స్టార్ హీరో ని చేసిన ‘ఛాలెంజ్ ‘

‘ ఖైదీ ‘ సినిమా మెగా స్టార్ కెరీర్ లోనే కాదు – తెలుగు సినిమా చరిత్ర లోనే ప్రత్యేకం అయిన సినిమా. హీరో చిరంజీవి ని కమర్షియల్ స్టార్ హీరో ని చేసి, ఆయన సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ‘ఖైదీ ‘ అయితే మెగా స్టార్ చిరంజీవి ని – యూత్ ఐకాన్ గా ఆరాదించేలా చేసిన సినిమా ” ఛాలెంజ్ ” , ఆ సినిమా లోని గాంధీ పాత్ర ఆ తరం ప్రేక్షకుల నే కాదు 2020 లో కూడా యువతరాన్ని ఇన్స్పెయిర్ చేస్తోంది. 80వ దశకంలో యండమూరి వీరేంద్రనాధ్ అక్షరాలే జ్యోతులుగా వెలిగే రోజుల్లో ఆయన జ్యోతి మాసపత్రికలో రాసిన ‘డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ‘ సీరియల్ నవల సాధించిన విజయం ఒక సంచలనం. కాశీ మజిలీ కథల్లో ఇద్దరు గురు శిష్యులు ప్రయాణిస్తు. మార్గమధ్యలో అక్కడక్కడా ఆగి కథలు చెప్పుకుంటుంటారు. అలాంటి శైలిలో యండమూరి ఈ నవల రాశారు. నిజానికి ఈ కథాంశాన్ని కమర్షియల్ గా తెరకి ఎక్కించడం కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే అప్పటికి ఇంకా హర్షద్ మెహతా స్కామ్ జరగలేదు కాబట్టి… స్టాక్ ఎక్సేంజ్ లు.. షేర్లు.. బిజినెస్ లావాదేవీల నేపథ్యంలో సినమా తీయడం.. సామాన్య జనానికి అర్థమయ్యేలా చెప్పడం మామూలు ఫీట్ కాదు. కాని అలాంటి ప్రయత్నాన్ని తలకి ఎత్తుకున్నారు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు. అంతకు ముందు చిరంజీవి.. కోదండరామిరెడ్డి… యండమూరి. ఇళయరాజాలాంటి అద్భుతమైన కాంబినేషన్ లో అభిలాష తీసి హిట్ కొట్టిన ఊపులో ఉన్నారు. అందుకే ఈ నవల సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ప్రముఖ రచయిత జి.సత్యమూర్తి (అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తండ్రి).. సాయినాధ్ తోటపల్లి సినిమాకి అనుగుణంగా నవలని మార్చి దిద్దారు.

సాయినాధ్ స్క్రీన్ ప్లే రాయగా.. సత్యమూర్తి సంభాషణలు రాశారు. వారితో పాటు కథా రచయిత యండమూరి కూడా పాలు పంచుకున్నారు. హీరో గాంధీ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి.. లక్ష్మీగా సుహాసిని.. హారికగా విజయశాంతి.. రాజారామ్మోహనరావుగా రావుగోపాలరావు, విద్యార్థిగా రాజేంద్రప్రసాద్..మార్చురీ వార్డ్ బోయ్ గా సాయికుమార్ నటించారు. సుహాసిని అన్నా వదినల పాత్రల్లో గొల్లపూడి.. సిల్క్ స్మిత చేశారు. పదిపైసల పెట్టుబడితో 50లక్షల రూపాయిలు సంపాదిస్తానని గాంధీ వేసిన పందెం..మాస్ ప్రేక్షకులని ఎంత విజిల్స్ వేయించిందో..యువతరం ప్రేక్షకులని అంత ఆలోచింపజేసేలా చేసింది. ఓ ఇన్ స్పిరేషన్ గా ఫీలయ్యారు. అంతెందుకు జులాయి సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర కూడా టివిలో ఛాలెంజ్ సీన్ కే ఇన్ స్పైర్ అవుతోంది. ఇద్దరు హీరోయిన్లతో ట్రయాంగిల్ లవ్ స్టోరీని వదిలేయకుండానే ఒకవైపు విద్యార్థి పాత్రతో చెప్పించిన డైలాగ్స్.. మరోవైపు సాయికుమార్ పాత్రలో వచ్చిన ఛేంజ్ ఓవర్ లు కథని నిలబెట్టాయి. గొల్లపూడి ప్రతి మాటకి ఆఫ్ ఇండియా అని చెప్పడం..సిల్క్ స్మితని ఏరా పిచ్చికన్నా అని పిలవడం బాగా ఎంటర్ టైన్ చేశాయి. నిరుద్యోగం గురించి బాధపడకుండా యువత తమ దారిలో ప్రయత్నం చేసి విజయం సాధించాలని ఇచ్చిన సందేశం బాక్సాఫీస్ దగ్గర ఛాలెంజ్ చేత విజయపతాకం పట్టించింది. ముఖ్యంగా ఇళయరాజా పాటలు ఓం శాంతి.. ఓం శాంతి వయ్యారి వాసంతి.. ఇందువదనా..మనసే మైకం..వయసే దాహం..సాయంకాలం సాగరతీరం.. భామా ఈ తిప్పలు తప్పవు సినిమా రేంజ్ ని పెంచాయి. రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేలా చేశాయి. వేటూరి పదాలకు తార మాస్టర్ కంపోజ్ చేసిన మూమెంట్స్ ఇప్పటికీ ఆ పాటలని ఆ సినిమాని ఎవర్ గ్రీన్ చేశాయి. దర్శకుడు కోదండరామిరెడ్డి టేకింగ్ లో సీన్స్ లో బ్రిలిటీ(క్లుప్తత ఉంటుంది. షాట్ కంపోజిషన్ లో ఎమోషన్స్ డీ టెలింగ్ ఉంటుంది. అవన్ని ఈ సినిమాని చిరస్థాయి క్లాసిక్ గా నిలబెట్టాయి. లోక్ సింగ్ ఫొటోగ్రఫీ.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్.. రాజు మాస్టర్ ఫైట్స్ ఇవన్ని సినిమాని జనాకర్షణీయంగా తీర్చి దిద్దాయి. 1984 ఆగస్ట్ 9న ఈ చిత్రం మరికొన్ని సినిమాల పోటీల మధ్య విడుదలయింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ ఏడాదికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1950..60ల్లో వచ్చినవి మాత్రమే క్లాసిక్స్ కాదు.. 1980.. 90దశకాల్లో వచ్చిన వాటిలో కూడా క్లాసిక్స్ ఉన్నాయి. అంత ఎందుకు.. 2020లో వచ్చిన సినిమాల్లో కూడా క్లాసిక్స్ గా నిలబడేవి ఉన్నాయి. ఒక జనరేషన్ ని దాటి బ్రతికిన ప్రతి సినిమా క్లాసిక్కే ఆ సినిమా పేరు కూడా వినని జనరేషన్ గూగుల్ లో.. యూ ట్యూబ్ లో వెదుక్కుని మరీ ఆ సినిమాని చూస్తే క్లాసిక్కే.. ఆ లెక్కన 36 సంవత్సరాలు దాటిన ఛాలెంజ్ చిత్రం మరికొన్ని జనరేషన్స్ కి ఎంటర్ టైనింగ్ గా.. ఇన్ స్పైరింగ్ గా నిలబడుతుందంటే దానికి కారణం ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ..

1 thought on “చిరంజీవి ని స్టార్ హీరో ని చేసిన ‘ఛాలెంజ్ ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap