మన ‘చిత్రకళా వైభవం’

కళలకు కాణాచి మన భారత దేశం. 64 కళలు మన సొంతం. మన పూర్వీకులు ఈ కళలను సృష్టించి మనకు కానుకగా ఇచ్చారు. అందులో చిత్రకళ ఒకటి. తెలుగు నేలపై పుట్టిన ఈ కళ దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ కళకు కూడా వృద్ధాప్యం వస్తున్నదా అన్నట్లు ఆదరణ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ కళను స్వీకరించేవారు నేడు దాదాపు తగ్గిపోయారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ శకం ప్రారంభంకావడంతో అతి తక్కువ ధరకే క్షణాల్లో కోరుకున్న బొమ్మలు అందుబాటులో వుండడంతో చిత్రకళ తెరమరుగై పోతోందని విశాఖపట్టణానికి చెందిన సుంకర చలపతిరావు రాసిన చిత్రకళావైభవం అన్న చిరు పొత్తం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రతి తెలుగువాడు చదవవలసిన ఈ పుస్తకంలో అనేకమంది చిత్రకారుల గురించి, తెలుగు చిత్రకళకు వారు చేసిన ఎనలేని సేవల గురించి సవివరంగా చర్చించారు. చిత్రకళ పై తెలుగు లో వచ్చినవి అతి తక్కువ పుస్తకాలు. ఈ పుస్తకం ఆ లోటును తీరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గత కొన్నేళ్ళుగా వివిధ పత్రికలలో చలపతిరావు రాసిన 34 వ్యాసాల సంకలనమే ఈ ‘చిత్రకళా వైభవం ‘ పుస్తకం. చిత్రకారుల ఫోటొలు, చిత్రాలతో క్వాలిటీ గా ప్రచురించారు.

తెలుగు చిత్ర శిల్పుల పై మహాత్మ గాంధీ ప్రభావం గురించి సుదీర్ఘ వ్యాసం రాశారు. స్పెయిన్ కు చెందిన ఫికాసో ప్రపంచంలో ఒక ప్రముఖ చిత్రకారుడి లా తన స్థానాన్ని నిలబెట్టుకున్న తీరును వివరించారు. ఇతిహాసాలు, పురాణాలలోని ముఖ్య గాధలను చిత్రాలుగా మలిచి ప్రజల ఇంటికి తీసుకు వెళ్ళిన తొలి భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గురించి చదివి తీరాలి. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలైన కృష్ణ, గుంటూరు, మెహబూబ్ నగర్, నల్గొండ, విజయవాడ ప్రాంతాలకు చెందిన చిత్రకారుల గురించి తెలుసుకోవటానికి ఈ పుస్తకం చదివి తీరాలి. కార్టూనిస్టులు గా ప్రసిద్ధి చెందిన ఆర్కే లక్ష్మణ్ తెలుగులో తొలి రాజకీయ కార్టూనిస్ట్ గా పేరుపొందిన రాంభట్ల కృష్ణమూర్తి, ప్రతి రోజు ప్రతి ఇంటిలో గోడపై కనిపించే క్యాలెండర్ గురించి దాని వెనక ఇమిడి ఉన్న కళ గురించి తెలుసుకోవటానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. చందమామ పత్రికకు మూతపడేంత వరకు చిత్రకారులుగా పనిచేసిన శంకర్, వడ్డాది పాపయ్యల గురించి, విశాఖపట్టణానికి చెందిన అంట్వాకుల పైడి రాజు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చిత్రకారుడిగా పనిచేసిన అడవి బాపిరాజులపై సుదీర్ఘ వ్యాసాలున్నాయి. అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన జీవితం విషాదంగా ముగిసింది. మృత్యుంజయుడు అనే నీటి రంగుల చిత్రాన్ని ఆయన ఒక ఫార్మసీ కంపెనీకి గీసి పెట్టారు. ఆ సమయంలో ఆయన తండ్రి, ఆ తర్వాత భార్య, తర్వాత రెండు రోజులకు కూతురు రోగాలకు గురయ్యారు. ఆ తర్వాత నాలుగు రోజులకు కన్న కొడుకు చనిపోయాడు. వారం రోజులకు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ చిత్రం వేసిన తర్వాతే ఈ అనర్ధాలు జరిగాయని ఆయన మిత్రులు అభిప్రాయపడేవారు. వారి అభిప్రాయాలను మన్నించి ఆయన ఆ చిత్రపటాన్ని మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల చిత్ర మందిరానికి బహూకరించారు. తాను ఫికాసో కన్నా గొప్పవాడినని ప్రకటించుకున్న అమెరికాలో స్థిరపడిన ఎస్.వి. రామారావుకు ఈ పుస్తకంలో చురకలు పడ్డాయి.

కార్టూనిస్టులకు మార్గదర్శకం ఇచ్చిన బాపును మన మీడియా ఆయన మరణానంతరం ఒక సినిమా దర్శకుడిగానే ప్రచారం చేయటం అజ్ఞానానికి నిదర్శనం అని చలపతిరావు ఈ పుస్తకంలో మండిపడ్డారు. బాపు-రమణల జ్ఞాపకార్థం ఏవేవో చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం హామీలు హామీలుగానే మిగిలిపోయాయి అన్న ఆవేదనను ఈ పుస్తకంలో వ్యక్తం చేశారు. ఇంకా తొలి భారతీయ మహిళా చిత్రకారిణి అమృతా షేర్గిల్, తొలి తెలుగు మహిళా చిత్రకారిణి రాగతి పండరి గురించి… ఇంకా వరదా వెంకట రత్నం, గిరిధర్ గౌడ్, ఈశ్వర్, రోహిణి కుమార్, బాతిక్ బాలయ్య, వెల్లటూరి పూర్ణా నంద శర్మ, చిత్త ప్రసాద్ తదితరుల గురించి వ్యాసాలున్నాయి ఇందులో. ప్రతి ఒక్క తెలుగువాడు ఈ పుస్తకాన్ని తన ఇంట్లో పదిలపరచుకోవలసిన అవసరం ఉన్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

శ్రీధర్ ఎస్.టి.జి.
ప్రతులకు:
సుంకర చలపతిరావు,
విశాఖపట్నం, సెల్: 9154688223
వెల: రూ. 100/-

SA: